Female constables
-
ప్రాణం నిలిపి.. ప్రాణాలకు తెగించి
మన్షిదా బాను మంగుళూరులోని కద్రి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్. ఈమధ్యే కొత్తగా ఉద్యోగంలో చేరారు. అక్టోబర్ 23 తెల్లవారు జామున 3.40 కి ఆ స్టేషన్ కి కాల్ వచ్చింది. అక్కడికి దగ్గర్లోని పాలిటెక్నిక్ కాలేజీ సెంటర్లో పెద్ద ఆక్సిడెంట్ అయింది. పికప్ వెహికల్, కంటైనర్ ట్రక్కు డీ కొట్టుకున్నాయి. ఇదీ ఆ కాల్. వెంటనే మన్షిదా తన స్కూటీ పై ప్రమాద ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆమె వెళ్ళేటప్పటికి ఆ వాహనాలు తుక్కు తుక్కు అయి ఉన్నాయి. ఒక వ్యక్తి రక్తపు మడుగులో చావు బతుకుల మధ్య కొట్టుకుంటున్నాడు. ఆ రెండు వాహనాలలో ఒకదాని క్లీనర్ అతను. మన్షిదా అతడి పరిస్థితిని గమనించారు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే అతడిని అతి కష్టమ్మీద లేపి, తన స్కూటర్ పై నేరుగా ఆ దగ్గర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి మోసుకెళ్లారు. అతడి ప్రాణాలని నిలబెట్టగలిగారు.ఆమె టైమ్ సైన్స్ ఆమె వేగం, ఆమె ధైర్యం, ఆమెలోని కారుణ్యం, ఆమె యూనిఫామ్.. అన్నీ పంచభూతాల్లా ఒకటై ఆ వ్యక్తి ్రపాణాలను కాపాడాయనే అనుకోవాలి. అదే కనుక.. పోలీస్ కాకుండా ఒక మామూలు వ్యక్తి ఎవరైనా అంతలా గాయపడిన వారిని తీసుకెళితే ప్రైవేటు హాస్పిటల్స్ చేర్చుకుని ఉండేవా?! ‘మేం అడ్మిట్ చేసుకోడానికి లేదు. ఇది పోలీస్ కేస్..‘ అని ఉండేవి.‘వాయు వేగంగా స్పందించి ఒకరి ప్రాణాన్ని నిలబెట్టిన కద్రి స్టేషన్ మహిళా పోలీస్ కానిస్టేబుల్ మన్షిదా బానుకు‘ అభినందనలు అంటూ తెల్లారగానే మంగుళూరు సిటీ పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్ ట్వీట్ పెట్టారు. మంగుళూరు ఈస్ట్ పోలీస్ స్టేషన్ నుంచి కూడా మన్షిదాకు ప్రశంసలు అందాయి.డ్యూటీ మైండెడ్ మాత్రమే అయి ఉంటే ఘటనా స్థలానికి వెళ్ళగానే ఫార్మాలిటీస్ లో పడి ఉండేవారు మన్షిదా. కానీ ఆమె అలా చేయలేకపోయారు. ఆమెలోని మానవతా హృదయం.. ఉద్యోగ విధి విధానాలను దాటి మరీ స్పందించింది. అందుకు ‘తగిన శిక్ష‘ ఏదైనా ఉందంటే.. అది ప్రమోషనో, ప్రశంసాపత్రమో తప్ప మరొకటి అవుతుందా?! మన్షిదా మాత్రం.. ‘నేను చేసింది ఏముందీ..!‘ అని చిరునవ్వుతో అంటున్నారు.. తనపై కురుస్తున్న అభినందనల జల్లులలో తడిసి ముద్ద అవుతూ.సాహసాన్ని వెన్నెముకగా ధరించే వాళ్లకు అసాధ్యం ఉండదు. హై–రిస్క్ అనేది ఉండదు. ఈ విషయాన్ని మరోసారి అక్షరాలా నిరూపించింది పైలట్ రీనా వర్గీస్. అడవిలో, అత్యంత ప్రతికూల పరిస్థితులలో ప్రాణాపాయంలో ఉన్న జవాన్‌ను ఆస్పత్రికి తరలించింది. రీనా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన కొత్తలో... 2009లో సీనియర్ పోలీసు అధికారులను తీసుకు వెళుతున్న హెలికాప్టర్‌ను మావోయిస్ట్‌లు కూల్చివేశారు. తాను చేస్తున్న ఉద్యోగం ఎంత రిస్క్ అనేది అర్థం చేసుకోవడానికి ఆ సంఘటన రీనాకు ఉపయోగపడింది.తాజా విషయానికి వస్తే...మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో కమాండోలు, మావోయిస్ట్‌లకు మధ్య ఎనిమిది గంటల పాటు జరిగిన భీకరమైన ఎదురుకాల్పుల్లో ఒక కమాండో తీవ్రంగా గాయపడ్డాడు. మావోయిస్ట్‌ల రాకెట్ దాడులకు అవకాశం ఉన్న ఆ ప్రమాదకరమైన పరిస్థితుల్లో గాయపడిన కమాండోను అక్కడి నుంచి తరలించడం అంటే ్రపాణాలను పణంగా పెట్టడమే. ఉన్నతాధికారుల నుంచి సమాచారాన్ని అందుకున్న రీనా వర్గీస్ తన ప్రాణాన్ని లెక్క చేయకుండా హన్స్ హెలికాప్టర్‌తో రంగంలోకి దిగింది. కో–పైలట్‌కు కమాండ్స్ అందజేసి ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో హెలికాప్టర్‌ను వీలైనంత వరకు దించి కిందికి దూకింది.తాడు సహాయంతో గాయపడిన కమాండోను హెలికాప్టర్లోకి తీసుకువచ్చింది. 30 నిమిషాలలో గడ్చిరోలికి అక్కడి నుండి నాగ్‌పూర్ తరలించింది. మూడు బుల్లెట్లు తగిలిన కమాండోకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో బి.టెక్ చేసిన రీనా వర్గీస్ గతంలో ఎన్నో ముఖ్యమైన రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొంది. కోవిడ్ మహమ్మారి సమయంలో బాధితులను లక్షద్వీప్ నుంచి కొచ్చికి తరలించే రెస్క్యూ ఆపరేషన్లలో చురుగ్గా పాల్గొని ప్రశంసలు అందుకుంది. -
తుపాకీతో కాల్చుకుని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
రాయచోటి: అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆదివారం సెంట్రీ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ వేదవతి (26) గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా తేలిందని, ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారిస్తామని డీఎస్పీ రామచంద్రరావు, అర్బన్ సీఐ సుధాకర్‌రెడ్డి చెప్పారు. వారు తెలిపిన వివరాల మేరకు.. పుంగనూరు సమీపంలోని బింగానిపల్లెకు చెందిన వేదవతి, మదనపల్లెకు చెందిన దస్తగిరి 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఐదేళ్ల పాప ఉంది. దస్తగిరి పుంగనూరులోని ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో ఫ్యాకలీ్టగా పనిచేస్తున్నారు. వేదవతి చిత్తూరు నుంచి ఏడాది కిందట అన్నమయ్య జిల్లాకు బదిలీపై వచ్చారు. రాయచోటిలోనే కాపురం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం సెంట్రీ డ్యూటీలో ఉన్న వేదవతి చేతిలో ఉన్న గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహాన్ని రాయచోటి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
లేడీ కానిస్టేబుల్ సాహసం.. చిరుతలా పరుగెత్తి బాధితురాలిని..
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని బైకులా రైల్వేస్టేషన్లో లోకల్ రైలు ఎక్కే ప్రయత్నంలో ఓ నలబై ఏళ్ల మహిళ అదుపుతప్పి డోర్లో పడిపోయింది. దీంతో రైలుకు, ప్లాట్‌ఫామ్‌కు మధ్య ఉన్న సందులోకి ఆమె జారిపోతున్న సమయంలో అక్కడే ఉన్న ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ గోల్కర్ గమనించి వెంటనే స్పందించింది. చిరుతలా పరుగెత్తి బాధితురాలిని ప్లాట్‌ఫామ్‌పైకి లాగేసింది. ఈ ఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. కాగా, గత రెండు నెలల వ్యవధిలో సదరు మహిళా కానిస్టేబుల్ ఇలాంటి సాహసం చేయటం ఇది రెండోసారని అధికారులు పేర్కొన్నారు. రెండు నెలల క్రితం కూడా ఓ మహిళా ఇలాగే రైలు ఎక్కబోయి పడిపోతుండగా ఆమె చాకచక్యంగా స్పందించి ప్రాణాలు కాపాడిన విషయం తెలిసిందే. కాగా, ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ చూపిన ధైర్యానికి ఉన్నతాధికారులు అభినందనలతో ముంచెత్తుతున్నారు. మహిళా కానిస్టేబుల్ గోల్కర్ సదరు మహిళను కాపాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానిస్టేబుల్ తెగువపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. -
మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య!
కడెం (ఖానాపూర్): కట్నం వేధింపులు తాళలేక ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడింది. నిర్మల్ జిల్లా కడెం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న గుగ్లావత్ మధురేఖ (26) ఆదివారం స్టేషన్ క్వార్టర్స్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గ్రామానికి చెందిన మదన్, లక్ష్మీ దంపతుల కుమార్తె మధురేఖకు, నిర్మల్ జిల్లా పెంబి మండలానికి చెందిన గుగ్లావత్ శ్రీనివాస్‌తో 3 నెలల క్రితం వివాహమైంది. మధురేఖ తొలుత లక్సెట్టిపేట్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేసి నెలన్నర క్రితం ఇక్కడికి బదిలీపై వచ్చింది. ఆదివారం ఉదయం విధులకు హాజరుకావాల్సిన మధురేఖ స్టేషన్‌కు రాకపోవడంతో హోంగార్డు శాంత ఆమె క్వార్టర్స్‌కు వెళ్లి చూడగా అపస్మారక స్థితిలో కిందపడిపోయి ఉంది. దీంతో ఎస్సైకి సమాచారం అందించి ఖానాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. అల్లుడి వేధింపులు భరించలేక తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ముజాహిద్ తెలిపారు. -
మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
హొసూరు: జిల్లా కేంద్రం క్రిష్ణగిరిలో ఓ మహిళా పోలీస్ కానిస్టేబుల్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. క్రిష్ణగిరి జక్కప్పనగర్‌లోని ప్రభుత్వ పోలీస్ గృహవసతి కాలనీలో నివసిస్తున్న గాంధిమతి క్రిష్ణగిరి మహిళా పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. ఈమెకు భర్త, ఇద్దరు పిల్లలున్నారు. శనివారం ఉదయం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోగా, పట్టణ పోలీసులు కణ్ణన్, సెల్వరాజ్‌లు సంఘటనా స్థలానికి చేరుకొని కానిస్టేబుల్ శవాన్ని క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని పని ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకొందా? లేక వేరే కారణాలున్నాయా? అని విచారణ జరుపుతున్నారు. -
కుప్పం స్టేషన్లో ఏం జరుగుతోంది..?
►గతంలో రైలు కింద పడబోయిన ఓ మహిళా కానిస్టేబుల్ ►ఇప్పుడు నిద్రమాత్రలు మింగిన మరో మహిళ ►సెలవుపై వెళ్లిపోయిన ముగ్గురు ఎస్ఐలు ►అన్నీ తెలిసినా ఉన్నతాధికారుల మౌనముద్ర ►డీజీపీకి విన్నవించినా జరగని న్యాయం కుప్పం/చిత్తూరు (అర్బన్): క్రమశిక్షణకు మారుపేరైన పోలీసుశాఖలో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు తమకు జరిగిన అన్యాయంపై ధైర్యం చేసి గళం విప్పారు. రాష్ట్ర పోలీస్ బాస్ చూసేలా తమ కష్టాన్ని చెప్పుకున్నారు. అయినా సరే స్పందించలేదు. అంతిమంగా ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనుకాడలేదు. మహిళా పోలీసు విభాగం (షీ టీమ్) చేస్తున్న సేవలకు రాష్ట్ర ఉత్తమ షీ టీమ్ అవార్డును, రూ.లక్ష రివార్డును గెలుచుకున్న చిత్తూరు విభాగంలో తాజా పరిణామం కలకలం సృష్టిస్తోంది. జిల్లా పోలీసు యంత్రాంగంలో మహిళలపై జరుగుతున్న వేధింపులకు అద్దం పడుతోంది. బాధితుల మాట.. కుప్పం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నిర్మల, రేణుక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారు. ఇంటర్, డిగ్రీ విద్యార్హతతో పోలీస్ శాఖలోని కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు. చిత్తూరులో పనిచేస్తున్న వీరు షీ టీమ్‌లో రెండేళ్లుగా కుప్పం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నారు. తాము విధుల్లో చేరినప్పటి నుంచి సీఐ రాజశేఖర్ తమను అసభ్య పదజాలం తో దూషిస్తూ.. స్టేషన్లో అందరి ముందే అవమానకరంగా మాట్లాడుతున్నారన్నారు. దీనిపై 20 రోజుల క్రితం షీ టీమ్ వాట్సప్ గ్రూప్‌లో తమతో పాటు నలుగురు మహిళా కానిస్టేబుళ్లు మెసేజ్ పెట్టామన్నారు. సీఐ బూతులు తిడుతున్నారని, తమకు వేధింపులు ఎక్కువగా ఉన్నాయని అందులో పేర్కొన్నారు. గ్రూప్‌లో డీజీపీ సైతం ఉండటంతో ఆయన చూసి విచారించాలని ఎస్పీని ఆదేశించడం.. ఎస్పీ నుంచి మహిళా స్టేషన్ డీఎస్పీకి విచారణ చేయాలని ఆదేశాలు అందాయి. గతనెల 24న నిర్మల, రేణుక చిత్తూరుకు వచ్చి మహిళా స్టేషన్ డీఎస్పీని కలిసి తాము పడుతున్న ఇబ్బందులు వివరించారు. అయితే ఏం జరిగిందని అడగకుండా.. అసలు వాట్సప్‌లో ఏది పడితే అది పెట్టమని మీకు ఎవరు చెప్పారు..? అంటూ గద్దించడంతో భయపడ్డారు. రెండు రోజుల తరవాత వస్తే విచారిస్తామని చెప్పడంతో మళ్లీ చిత్తూరుకు వచ్చారు. ఇలా ఏడు సార్లు కుప్పం నుంచి చిత్తూరుకు తిరిగి విసిగి వేసారిపోయిన ఇద్దరు మంగళవారం డీఎస్పీని కలవడానికి వచ్చి ఆయన మళ్లీ రేపు రమ్మని చెప్పడంతో కుమిలిపోయారు. రేణుక నీరు తాగడానికి బయటకు వెళ్లగా నిర్మల తన వద్ద ఉన్న 12 నిద్ర మాత్రలు, బాటిల్లో ఉన్న విషం తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. వెంటనే గుర్తించిన రేణుక, నిర్మలను చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో చేర్పిండంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఇలా ఎన్నో... కుప్పం సీఐ రాజశేఖర్‌పై చాలా ఆరోపణలున్నాయి. ఆర్నెళ్ల క్రితం సీఐ వేధింపులు తట్టుకోలేక ఓ మహిళా కానిస్టేబుల్ రైలు కింద పడి ఆత్మహత్యాయత్నం చేసుకోపోయారు. స్థానికులు ఈమెను అడ్డుకుని రక్షించారు. విషయం బయటకు రాకుండా అధికారులు తొక్కి పెట్టారు. కుప్పం సర్కిల్‌లోకి వచ్చే రాళ్లబుదుగూరు ఎస్ఐ గోపీ, రామకుప్పం ఎస్ఐ పరశురామ్, కుప్పం ఎస్ఐ వెంకటచిన్నలు సీఐ వేధింపులు తట్టులేక మెడికల్ లీవుపై వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ స్టేషన్లలో కొత్త ఎస్ఐలు పనిచేస్తున్నారు. అయినా సరే ఉన్నతాధికారులు మౌనం వహిస్తున్నారే తప్ప సీఐపై ఎలాంటి విచారణకు ఆదేశించకపోవడం గమనార్హం. ఇందుకు రాజకీయ ఒత్తిళ్లే కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ‘‘ మేమేం తప్పు చేశాం..? మాకు జరిగినఅవమానాన్ని మా పోలీసులకు చెప్పుకోవడమే తప్పా..? జరిగిన అవమానాన్ని డీఎస్పీ చెబితే నోరు ముసుకుని ఉండమంటున్నారు. ఇదే ఓఆఫీసర్కు జరిగుం టే గమ్మున ఉండేవాళ్లా..? ఆత్మగౌరవాన్ని చంపుకుని బతకలేను. అందుకే చచ్చిపోతున్నా. అమ్మా తమ్ముడ్ని బాగా చదివించు. కానీ పోలీస్ మాత్రం చేయకు..’’అని నిర్మల సూసైట్ నోట్ రాశారు. -
కాబోయే భర్తే హంతకుడా ?
సాక్షి, న్యూఢిల్లీ: ట్రాఫిక్ పోలీసు విభాగంలో పనిచేసే మహిళా కానిస్టేబుల్ మృతదేహం సాగర్‌పుర్‌లోని ఓ గెస్ట్‌హౌస్‌లో లభించడం సంచలనం సృష్టించింది. మృతురాలిని ప్రియాంక కుమారిగా (23) గుర్తించారు. ఈమెను గొంతు నులిమి చంపారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రియాంకకు కాబోయే భర్త మోహిత్ ఆమెను చంపి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మోహిత్ భారతీయ నౌకాదళంలో పని చేస్తున్నాడు. మోహిత్, ప్రియాంక సోమవారం పశ్చిమఢిల్లీలోని సాగర్పూర్ గెస్ట్‌హౌస్‌లో గది అద్దెకు తీసుకున్నారు. భార్యభర్తలుగా చెప్పుకుని అతిథి గృహంలోకి ప్రవేశించిన వారు గుర్తింపుకార్డులు కూడా చూపారని సిబ్బంది చెప్పారు. వీరి కథనం ప్రకారం.. భోజనం తీసుకువస్తానంటూ బయటకు వెళ్లిన మోహిత్ తిరిగి రాలేదు. మంగళవారం ఉదయం గదిలో ఎలాంటి అలికిడీ లేకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తలుపులు విరగ్గొట్టి గదిలోకి ప్రవేశించారు. గదిలో ప్రియాంక మృతదేహం కనిపించింది. బాధితురాలి మెడపై ఉన్న గుర్తుల ఆధారంగా ఆమెను గొంతు నులిమి చంపి ఉంటారని అనుమానిస్తున్నారు. ప్రియాంక, మోహిత్‌కు కొన్ని నెలల కిందట నిశ్చితార్థం జరిగింది. మోహిత్ గోవాలో పనిచేస్తాడని ప్రియాంక కుటుంబ సభ్యులు చెప్పారు. మోహిత్ తాగుబోతని తెలియడంతో నిశ్చితార్థం రద్దు చేసున్నామని ప్రియాంక తల్లిదండ్రులు అంటున్నారు. నిశ్చితార్థం రద్దయిన తరువాత కూడా వీళ్లిద్దరు కలుసుకునేవారని పోలీసులు పేర్కొన్నారు. మోహిత్ ప్రియాంకపై అత్యాచారం జరిపి హత్య చేశాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. ప్రియాంక ఇద్దరు సోదరిలు కూడా ఢిల్లీ పోలీసుశాఖలోనే పనిచేస్తున్నారు. నిందితుడు మోహిత్‌ను అరెస్టు చేశామని పశ్చిమ ఢిల్లీ డీసీపీ సుమన్ అగర్వాల్ మీడియా సమావేశంలో ప్రకటించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించామన్నారు.