మన్షిదా బాను మంగుళూరులోని కద్రి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్. ఈమధ్యే కొత్తగా ఉద్యోగంలో చేరారు. అక్టోబర్ 23 తెల్లవారు జామున 3.40 కి ఆ స్టేషన్ కి కాల్ వచ్చింది. అక్కడికి దగ్గర్లోని పాలిటెక్నిక్ కాలేజీ సెంటర్లో పెద్ద ఆక్సిడెంట్ అయింది. పికప్ వెహికల్, కంటైనర్ ట్రక్కు డీ కొట్టుకున్నాయి.
ఇదీ ఆ కాల్. వెంటనే మన్షిదా తన స్కూటీ పై ప్రమాద ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆమె వెళ్ళేటప్పటికి ఆ వాహనాలు తుక్కు తుక్కు అయి ఉన్నాయి. ఒక వ్యక్తి రక్తపు మడుగులో చావు బతుకుల మధ్య కొట్టుకుంటున్నాడు. ఆ రెండు వాహనాలలో ఒకదాని క్లీనర్ అతను. మన్షిదా అతడి పరిస్థితిని గమనించారు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే అతడిని అతి కష్టమ్మీద లేపి, తన స్కూటర్ పై నేరుగా ఆ దగ్గర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి మోసుకెళ్లారు. అతడి ప్రాణాలని నిలబెట్టగలిగారు.
ఆమె టైమ్ సైన్స్ ఆమె వేగం, ఆమె ధైర్యం, ఆమెలోని కారుణ్యం, ఆమె యూనిఫామ్.. అన్నీ పంచభూతాల్లా ఒకటై ఆ వ్యక్తి ్రపాణాలను కాపాడాయనే అనుకోవాలి. అదే కనుక.. పోలీస్ కాకుండా ఒక మామూలు వ్యక్తి ఎవరైనా అంతలా గాయపడిన వారిని తీసుకెళితే ప్రైవేటు హాస్పిటల్స్ చేర్చుకుని ఉండేవా?! ‘మేం అడ్మిట్ చేసుకోడానికి లేదు. ఇది పోలీస్ కేస్..‘ అని ఉండేవి.
‘వాయు వేగంగా స్పందించి ఒకరి ప్రాణాన్ని నిలబెట్టిన కద్రి స్టేషన్ మహిళా పోలీస్ కానిస్టేబుల్ మన్షిదా బానుకు‘ అభినందనలు అంటూ తెల్లారగానే మంగుళూరు సిటీ పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్ ట్వీట్ పెట్టారు. మంగుళూరు ఈస్ట్ పోలీస్ స్టేషన్ నుంచి కూడా మన్షిదాకు ప్రశంసలు అందాయి.
డ్యూటీ మైండెడ్ మాత్రమే అయి ఉంటే ఘటనా స్థలానికి వెళ్ళగానే ఫార్మాలిటీస్ లో పడి ఉండేవారు మన్షిదా. కానీ ఆమె అలా చేయలేకపోయారు. ఆమెలోని మానవతా హృదయం.. ఉద్యోగ విధి విధానాలను దాటి మరీ స్పందించింది. అందుకు ‘తగిన శిక్ష‘ ఏదైనా ఉందంటే.. అది ప్రమోషనో, ప్రశంసాపత్రమో తప్ప మరొకటి అవుతుందా?! మన్షిదా మాత్రం.. ‘నేను చేసింది ఏముందీ..!‘ అని చిరునవ్వుతో అంటున్నారు.. తనపై కురుస్తున్న అభినందనల జల్లులలో తడిసి ముద్ద అవుతూ.
సాహసాన్ని వెన్నెముకగా ధరించే వాళ్లకు అసాధ్యం ఉండదు. హై–రిస్క్ అనేది ఉండదు. ఈ విషయాన్ని మరోసారి అక్షరాలా నిరూపించింది పైలట్ రీనా వర్గీస్. అడవిలో, అత్యంత ప్రతికూల పరిస్థితులలో ప్రాణాపాయంలో ఉన్న జవాన్‌ను ఆస్పత్రికి తరలించింది.
రీనా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన కొత్తలో... 2009లో సీనియర్ పోలీసు అధికారులను తీసుకు వెళుతున్న హెలికాప్టర్‌ను మావోయిస్ట్‌లు కూల్చివేశారు. తాను చేస్తున్న ఉద్యోగం ఎంత రిస్క్ అనేది అర్థం చేసుకోవడానికి ఆ సంఘటన రీనాకు ఉపయోగపడింది.
తాజా విషయానికి వస్తే...
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో కమాండోలు, మావోయిస్ట్‌లకు మధ్య ఎనిమిది గంటల పాటు జరిగిన భీకరమైన ఎదురుకాల్పుల్లో ఒక కమాండో తీవ్రంగా గాయపడ్డాడు. మావోయిస్ట్‌ల రాకెట్ దాడులకు అవకాశం ఉన్న ఆ ప్రమాదకరమైన పరిస్థితుల్లో గాయపడిన కమాండోను అక్కడి నుంచి తరలించడం అంటే ్రపాణాలను పణంగా పెట్టడమే.
ఉన్నతాధికారుల నుంచి సమాచారాన్ని అందుకున్న రీనా వర్గీస్ తన ప్రాణాన్ని లెక్క చేయకుండా హన్స్ హెలికాప్టర్‌తో రంగంలోకి దిగింది. కో–పైలట్‌కు కమాండ్స్ అందజేసి ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశంలో హెలికాప్టర్‌ను వీలైనంత వరకు దించి కిందికి దూకింది.
తాడు సహాయంతో గాయపడిన కమాండోను హెలికాప్టర్‌లోకి తీసుకువచ్చింది. 30 నిమిషాలలో గడ్చిరోలికి అక్కడి నుండి నాగ్‌పూర్ తరలించింది. మూడు బుల్లెట్లు తగిలిన కమాండోకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో బి.టెక్ చేసిన రీనా వర్గీస్ గతంలో ఎన్నో ముఖ్యమైన రెస్క్యూ ఆపరేషన్‌లలో పాల్గొంది. కోవిడ్ మహమ్మారి సమయంలో బాధితులను లక్షద్వీప్ నుంచి కొచ్చికి తరలించే రెస్క్యూ ఆపరేషన్‌లలో చురుగ్గా పాల్గొని ప్రశంసలు అందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment