కాబోయే భర్తే హంతకుడా ?
కాబోయే భర్తే హంతకుడా ?
Published Tue, Mar 18 2014 10:46 PM | Last Updated on Sat, Sep 2 2017 4:52 AM
సాక్షి, న్యూఢిల్లీ: ట్రాఫిక్ పోలీసు విభాగంలో పనిచేసే మహిళా కానిస్టేబుల్ మృతదేహం సాగర్‌పుర్‌లోని ఓ గెస్ట్‌హౌస్‌లో లభించడం సంచలనం సృష్టించింది. మృతురాలిని ప్రియాంక కుమారిగా (23) గుర్తించారు. ఈమెను గొంతు నులిమి చంపారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రియాంకకు కాబోయే భర్త మోహిత్ ఆమెను చంపి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మోహిత్ భారతీయ నౌకాదళంలో పని చేస్తున్నాడు. మోహిత్, ప్రియాంక సోమవారం పశ్చిమఢిల్లీలోని సాగర్‌పూర్ గెస్ట్‌హౌస్‌లో గది అద్దెకు తీసుకున్నారు. భార్యభర్తలుగా చెప్పుకుని అతిథి గృహంలోకి ప్రవేశించిన వారు గుర్తింపుకార్డులు కూడా చూపారని సిబ్బంది చెప్పారు. వీరి కథనం ప్రకారం.. భోజనం తీసుకువస్తానంటూ బయటకు వెళ్లిన మోహిత్ తిరిగి రాలేదు. మంగళవారం ఉదయం గదిలో ఎలాంటి అలికిడీ లేకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు తలుపులు విరగ్గొట్టి గదిలోకి ప్రవేశించారు. గదిలో ప్రియాంక మృతదేహం కనిపించింది. బాధితురాలి మెడపై ఉన్న గుర్తుల ఆధారంగా ఆమెను గొంతు నులిమి చంపి ఉంటారని అనుమానిస్తున్నారు. ప్రియాంక, మోహిత్‌కు కొన్ని నెలల కిందట నిశ్చితార్థం జరిగింది. మోహిత్ గోవాలో పనిచేస్తాడని ప్రియాంక కుటుంబ సభ్యులు చెప్పారు. మోహిత్ తాగుబోతని తెలియడంతో నిశ్చితార్థం రద్దు చేసున్నామని ప్రియాంక తల్లిదండ్రులు అంటున్నారు. నిశ్చితార్థం రద్దయిన తరువాత కూడా వీళ్లిద్దరు కలుసుకునేవారని పోలీసులు పేర్కొన్నారు. మోహిత్ ప్రియాంకపై అత్యాచారం జరిపి హత్య చేశాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. ప్రియాంక ఇద్దరు సోదరిలు కూడా ఢిల్లీ పోలీసుశాఖలోనే పనిచేస్తున్నారు. నిందితుడు మోహిత్‌ను అరెస్టు చేశామని పశ్చిమ ఢిల్లీ డీసీపీ సుమన్ అగర్వాల్ మీడియా సమావేశంలో ప్రకటించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించామన్నారు.
Advertisement
Advertisement