Sri vaishnavi
-
బయట కాపుకాసి.. కాళ్లు, చేతులు కట్టేసి..
సంచలనం సృష్టించిన పిల్లల విక్రయం కేసు వెనుక ముగ్గురు ధీర వనితల పోరాటం దాగి ఉంది. అక్షర జ్యోతి ఫౌండేషన్‌ను నిర్వహించే అక్కాచెల్లెళ్లు ధైర్య సాహసాలతో ఈ మానవ అక్రమ రవాణా బాగోతాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. పీర్జాదిగూడలో ఆర్ఎంపీ శోభారాణితో పాటు స్వప్న, షేక్ సలీంలను పట్టుకున్నారు. ఈ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించిన తీరును అక్కాచెల్లెళ్లు అనూష, శ్రీవైష్ణవి, ప్రత్యూషలు ‘సాక్షి’తో పంచుకున్నారు. మహిళ ఇచ్చిన సమాచారంతో.. అక్షర జ్యోతి ఫౌండేషన్ తరఫున కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్రమంలో ఓ మహిళ అనూషను సంప్రదించింది. తనకు పిల్లల్లేరని, శోభారాణి పిల్లలను విక్రయిస్తున్నట్టుగా తెలిసిందని, ఈ విషయంలో తనకు సహాయం చేయాలంటూ శోభారాణి ఫోన్ నంబర్ ఇచ్చింది. షాక్‌కు గురైన అక్కాచెల్లెళ్లు శోభారాణి కార్యకలాపాలపై స్టింగ్ ఆపరేషన్ చేయాలని నిర్ణయించుకున్నారు. వీరికి యూట్యూబ్ చానల్ విలేకరి సాయికుమార్ సహకరించారు. సీక్రెట్ కెమెరాలతో క్లినిక్‌లోకి..: ఈనెల 21న శ్రీవైష్ణవి పిల్లల్లేని తల్లిగా నటిస్తూ తనకో బిడ్డ కావాలని శోభారాణిని కలిసింది. దీంతో ఆమె వాట్సాప్‌లో అబ్బాయి, అమ్మాయి ఫొటోలను పంపించింది. బాబును కొనేందుకంటూ రూ.4.50 లక్షలకు డీల్ కుదుర్చుకున్నారు. అడ్వాన్స్‌గా కొంత మొత్తాన్ని చెల్లించారు. ఆ మరుసటి రోజు ఉదయమే పీర్జాదిగూడలోని క్లినిక్‌కు వచ్చి బాబును తీసుకెళ్లాలని శోభ సూచించింది.దీంతో ముగ్గురు అక్కాచెల్లెళ్లు, సాయికుమార్‌తో శివ, శ్రీనివాస్ అనేవారు బృందంగా ఏర్పడి, సీక్రెట్ కెమెరాలను ధరించి క్లినిక్ లోపలికి వెళ్లారు. ఒకవేళ నిందితులు అనుమానంతో తమపై దాడి చేసినా, పారిపోయేందుకు ప్రయత్నించినా పట్టుకునేందుకు వీలుగా క్లినిక్‌కు వెళ్లే రెండు మార్గాలలో మరో 10 మందిని కూడా ఏర్పాటు చేసుకున్నారు. క్లినిక్ లోపల నిందితులు శోభారాణి, స్వప్నలతో జరిగే సంభాషణలు, వారి కదలికలను ఎప్పటికప్పుడు బయట ఉన్న బృందానికి వాట్సాప్ మెసేజ్‌లలో చేరవేస్తూ ఏమాత్రం తేడా వచి్చనా వారు సహాయపడేలా రంగం సిద్ధం చేసుకున్నారు. ఆల్టో కారులో బాబును తెచ్చి.. వారు క్లినిక్‌లోకి వెళ్లిన అరగంటలో మరో నిందితుడు షేక్ సలీం తెలుపు రంగు ఆల్టో కారులో బాబును తీసుకొచ్చాడు. క్లినిక్ ఫస్ట్ ఫ్లోర్లో ఉండే భవనం యజమాని ఇంట్లోకి వెళ్లాడు. కాసేపటి తర్వాత శోభరాణి వెళ్లి బాబును తీసుకుని క్లినిక్ లోపలికి వచ్చింది. రెండు నకిలీ ఆధార్ కార్డులను ఇస్తూ వీళ్లే బాబు తల్లిదండ్రులు అని చెప్పింది. ఇంకో రూ.20 వేలు అదనంగా ఇస్తే బాబు బర్త్ సరి్టఫికెట్ కూడా ఇస్తానని, దీంతో మీరే సొంత తల్లి అయిపోతారని శ్రీవైష్ణవికి శోభ సూచించింది. ఒప్పందం మేరకు మిగతా డబ్బును అందించాలని కోరింది. దీంతో బయటికెళ్లి తీసుకొస్తానని శ్రీవైష్ణవి తలుపులు తెరవడంతో అప్పటికే బయట ఉన్న వారిని చూసిన శోభ, ఇతర నిందితులు ఇదంతా ట్రాప్ అని గ్రహించారు. చున్నీతో కాళ్లు, చేతులు కట్టేసి.. శోభారాణి, స్వప్న, సలీంలు క్లినిక్ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. కానీ బయట ఉన్న బృందం కాపు కాస్తుండటంతో వారికి చాన్స్ లేకుండా పోయింది. సలీం గోడ దూకి పారిపోయేందుకు ప్రయత్నించగా.. ప్రత్యూష బలంగా అతన్ని పట్టుకొని, చున్నీతో అతని కాళ్లు, చేతులు కట్టేసింది. అతన్ని పక్కన ఉన్న పిల్లర్‌కు కట్టిపడేసింది. ఇదంతా స్టింగ్ ఆపరేషన్ తెలిసిపోవడంతో శోభారాణి ఏడుపు మొదలుపెట్టింది.పోలీసులకు ఫోన్ చేయవద్దని సెటిల్మెంట్ చేసుకుందామంటూ ఆఫర్ ఇచ్చింది. ఈలోగా డయల్ 100కు ఫోన్ చేయడంతో మేడిపల్లి పోలీసులు వచ్చారు. నిందితులను ఠాణాకు తరలించి, బాబును చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధికారులకు అప్పగించారు. నిందితులను పోలీసులు విచారించగా.. ఢిల్లీకి చెందిన కిరణ్, ప్రీతి, పుణేకు చెందిన కన్నయ్యల నుంచి పసికందులను కొనుగోలు చేసి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విక్రయిస్తున్న అంశం వెలుగులోకి వచ్చింది. లింగ నిర్ధారణ, గర్భస్రావాలు కూడా.. శోభారాణి 20 ఏళ్లుగా పీర్జాదిగూడలో ఫస్ట్ ఎయిర్ సెంటర్ పేరుతో క్లినిక్‌ను నిర్వహిస్తోంది. ఇందులో ముందు గదిలో క్లినిక్ ఉండగా.. వెనుక గది అంతా చీకటిగా ఉంది. ఇందులో శస్త్ర చికిత్సల కత్తెర్లు, క్లాంప్స్, బోన్ కట్టర్స్, సూదులు వంటి సర్జికల్ పరికరాలున్నాయి. డస్ట్ బిన్లో కనిపించకుండా దాచిపెట్టారు. శోభారాణి అక్రమంగా గర్భస్రావాలు, లింగ నిర్ధారణ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నట్లు అక్షర ఫౌండేషన్ విచారణలో తేలింది. (ఆడెపు శ్రీనాథ్) -
శ్రీవైష్ణవి ఆస్పత్రి ఎండీ ఆత్మహత్య
నాగోలు: భవనం ఖాళీ చేయాలని యజమానితోపాటు మరికొందరు వేధించడంతో మనస్తాపం చెందిన ఓ ఆస్పత్రి ఎండీ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. వనపర్తి జిల్లా శాఖాపూర్(వై) గ్రామానికి చెందిన అజయ్‌కుమార్(38).. భార్య శ్వేత, కుమారులు వర్షిత్, హర్షిత్‌తో కలసి బీఎన్ రెడ్డి నగర్లో ఉంటున్నాడు. సాగర్ రింగ్ రోడ్డు సరస్వతి నగర్ కాలనీలో ఉండే కరుణరెడ్డి ఓ బిల్డింగ్ నిర్మిస్తోన్న క్రమంలో అందులో ఆస్పత్రి ఏర్పాటుకు అజయ్ రూ.10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడు. అయినా నిర్మాణం పూర్తి చేయకపోవడంతో అజయ్ మరికొంత డబ్బుతో పూర్తిచేసి శ్రీవైష్ణవి హాస్పిటల్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. తను మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉంటూ డాక్టర్లతో ఆస్పత్రిని నడిపిస్తున్నాడు. కొంతకాలంగా ఆస్పత్రి సరిగా నడవక అద్దె ఆలస్యం కావడంతో బిల్డింగ్ ఖాళీ చేయాలని కరుణరెడ్డి చెప్పాడు. కొంత సమయం ఇవ్వాలని కోరినా కరుణరెడ్డి నిరాకరించి కోర్టులో కేసు వేశాడు. తాడుతో ఉరి వేసుకుని..: కొద్దిరోజులు ఆస్పత్రిని మూసివేసి మూడ్రోజుల క్రితమే అజయ్ మళ్లీ ప్రారంభించాడు. బిల్డింగ్ ఖాళీ చేయాలని కరుణరెడ్డి, అతని బావమరిది కొండల్‌రెడ్డితోపాటు మరికొందరు అజయ్‌కుమార్‌పై ఒత్తిడి తెచ్చారు. వేధింపులు ఎక్కువ కావడంతో అజయ్‌కుమార్ మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం రాత్రి 2 గంటల వరకు ఆస్పత్రిలో ఉన్న అజయ్‌కుమార్ సెల్లార్లో ఉన్న తన గదికి వెళ్లి తా డుతో ఫ్యానుకు ఉరివేసుకున్నాడు. మంగళవారం ఉదయం ఆస్పత్రిలో పనిచేసే స్వా మి వచ్చి.. అజయ్ ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించి ఎల్బీనగర్ పోలీసులకు సమాచారమిచ్చాడు. ఘటనా స్థలంలో పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. తన చావుకు కరుణరెడ్డి, కొండల్‌రెడ్డి, తుర్కయంజాల్‌కు చెందిన మాజీ సర్పంచ్ కొత్తకురుమ్మ శివకుమార్, సరస్వతినగర్ కాలనీ అధ్యక్షుడు మేఘారెడ్డి, యాదగిరిరెడ్డి, శివారెడ్డితో పాటు ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ రమేష్ కారణమని అందులో ఉంది. పిల్లలను మంచిగా చూసుకోవాలని భార్యకు రాసిన మరో లేఖ లభించింది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రాంజల, శ్రీవైష్ణవి ముందంజ
ఐటీఎఫ్ టోర్నమెంట్ డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్): అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టోర్నమెంట్లో తెలుగమ్మాయిలు యడ్లపల్లి ప్రాంజల, శ్రీవైష్ణవి పెద్దిరెడ్డి శుభారంభం చేశారు. ఇక్కడి శాంతి టెన్నిస్ అకాడమీలో జరుగుతున్న ఈ టోర్నీలో ప్రాంజల జోడి డబుల్స్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన సింగిల్స్ తొలి రౌండ్లో ప్రాంజల 3-6, 6-3, 6-3తో స్నేహాదేవి రెడ్డి (భారత్)పై, ఎనిమిదో సీడ్ శ్రీవైష్ణవి 6-1, 6-1తో సారాహ్ పాంగ్ (సింగపూర్)పై గెలిచారు. నాలుగో సీడ్ రిషిక సుంకర 6-3, 6-3తో వాసంతి షిండే (భారత్)పై నెగ్గగా, హైదరాబాద్ అమ్మాయి, ఐదో సీడ్ నిధి చిలుముల 7-5, 3-3తో రియా భాటియా (భారత్)పై అధిక్యంలో ఉన్న దశలో ప్రత్యర్థి వైదొలగింది. హైదరాబాద్‌కే చెందిన ఇస్కా అక్షర 3-6, 3-6తో నందిని శర్మ చేతిలో ఓడిపోగా... స్నేహ పడమట 3-6, 0-6తో ప్రేరణ బాంబ్రీ చేతిలో పరాజయం చవిచూశారు. శివిక బర్మన్ 6-2, 6-0 సాచి బెల్వాల్ (అమెరికా)పై నెగ్గింది. డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రాంజల-వన్షిక సాహ్ని (భారత్) 6-0, 2-6, 10-8తో అరంటా అండ్రడీ (భారత్)- కెరెన్ ష్లోమో (ఇజ్రాయెల్)పై గెలుపొందగా, సౌజన్య భవిషెట్టి-నిధి చిలుముల (హైదరాబాద్) 6-1, 2-6, 7-10తో ఇతీ మెహతా-రష్మీ (భారత్) చేతిలో ఓడింది. శ్వేత రాణా-వాసంతి షిండే 6-4, 3-3తో వరుణ్య-మౌళిక రామ్ (రిటైర్డ్‌హర్ట్)పై, రియా భాటియా-షరోన్ 6-0, 6-3తో శ్రీవైష్ణవి-తనీషా రోహిరాపై గెలిచారు. -
ఐటీఎఫ్ టోర్నీ క్వార్టర్ ఫైనల్లో నిధి, వైష్ణవి
బెంగళూరు: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్ సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయిలు నిధి చిలుముల, శ్రీ వైష్ణవి పెద్దిరెడ్డి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. బుధవారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో నిధి 6-2, 7-5తో కర్మాన్ కౌర్ (భారత్)పై నెగ్గగా... వైష్ణవి 7-6 (7/2), 5-2తో ఆధిక్యంలో ఉన్న దశలో ఆమె ప్రత్యర్థి జి యావో వాంగ్ (చైనా) గాయం కారణంగా వైదొలిగింది. మరో తెలుగు అమ్మాయి రిషిక సుంకర 6-3, 1-6, 6-2తో రష్మీ చక్రవర్తి (భారత్)ని ఓడించింది. డబుల్స్ క్వార్టర్స్‌లో నిధి-రుతుజా ద్వయం 6-0, 6-4తో రష్మీ చక్రవర్తి-కాల్వ భువన జోడిపై నెగ్గి సెమీఫైనల్లోకి చేరింది. గురువారం జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో రిషికతో వైష్ణవి; ఫాతిమా (ఒమన్)తో నిధి తలపడతారు.