తండ్రి గణేశ్‌తో చిన్నారులు శ్రీగాయత్రి, హన్సిక
షాద్‌నగర్ రూరల్: పేదరికం ఓడిపోయింది.. మమకారమే గెలిచింది.. పిల్లలపై ఉన్న ప్రేమ, వాత్సల్యం, అనురాగం, ఆప్యాయతను కాదనుకోలేక ఆ తండ్రి మనసు మార్చుకున్నాడు. శిశువిహార్‌కు తరలించిన చిన్నారులను తిరిగి ఇంటికి తీసుకొచ్చాడు. తల్లిని కోల్పోయి, తండ్రికి దూరమై అనాథలుగా శిశువిహార్‌కు వెళ్లిన చిన్నారులపై కథనం ‘సాక్షి’లో శనివారం ప్రచురితమైన విషయం తెలిసిందే. (సీఎం ఆఫీసులో కరోనా కలకలం)
మమకారమే గెలిచింది
షాద్‌నగర్ పట్టణంలో ఉండే గణేశ్, శ్రీలత దంపతులకు పిల్లలు శ్రీగాయత్రి(4), హన్సిక (17 నెలలు) ఉన్నారు. శ్రీలత కొన్నిరోజుల క్రితం అనారోగ్యంతో కన్నుమూయడంతో పిల్లల బాగోగులు చేసుకునేందుకు గణేశ్‌కు భారంగా మారింది. నిరుపేద కుటుంబానికి చెందిన అతడు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. చిన్నారుల ఆలనాపాలనా చూసేవారు లేకపోవడంతో శుక్రవారం వారిని ఐసీడీఎస్ అధికారులకు అప్పగించడంతో శిశువిహార్‌కు తరలించిన విషయం తెలిసిందే. హాస్టల్‌కు వెళ్లేటప్పుడు చిన్నారుల పరిస్థితి అందరి మనసులను కదిలించిన విషయం విదితమే. (మహిళల రక్షణ కోసం ‘స్త్రీ’)
‘నాన్న నేను మళ్లీ వస్తా.. అమ్మ బిస్కెట్లు, చాక్లెట్లు ఇస్తుండె.. ఆమె గుండెనొప్పితో చనిపోయింది.. అందుకే నేను మా చెల్లి హాస్టల్‌కు వెళ్తున్నాం’ అని చిన్నారి శ్రీగాయత్రి చెప్పడంతో స్థానికులు, అధికారులు భావోద్వేగానికి గురైన విషయం తెలిసిందే. అయితే, భార్య మృతిచెందడం, పిల్లలు శిశువిహార్‌కు తరలివెళ్లడంతో ఒంటరిగా ఉన్న గణేశ్ మనసు చలించిపోయింది. పేదరికంలో ఉన్నా చిన్నారులను పోషించుకుంటానని భావించాడు. ఈనేపథ్యంలో మనసు మార్చుకున్న అతడు తన పిల్లలను తిరిగి అప్పగించాలని కోరుతూ శనివారం శిశువిహార్‌కు వెళ్లి అధికారులకు విజ్ఞప్తి చేశాడు. చిన్నారులను తాను జాగ్రత్తగా చూసుకుంటానని హామీ ఇచ్చి తిరిగి ఇంటికి తీసుకొచ్చాడు. దీంతో పేదరికం ముందు తండ్రికి పిల్లలపై ఉన్న మమకారమే గెలిచింది.
స్పందింపజేసిన కథనం
‘అమ్మలేదు..నాన్న పోషించ లేడు’ అని సాక్షి దినపత్రికలో వచ్చిన కథనం ప్రజలను స్పందింపచేసింది. హాస్టల్‌కు వెళ్లేటప్పుడు చిన్నారి శ్రీగాయత్రి చెప్పిన మాటలు అందరి హృదయాలను ద్రవింపజేశాయి. దీంతో గణేశ్ మనసు మార్చుకొని శనివారం శిశువిహార్‌కు వెళ్లి తన కూతుళ్లు శ్రీగాయత్రి, హన్సికను తిరిగి ఇంటికి తీసురావడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.
నా పిల్లలను బాగా చూసుకుంటాను..
‘అనారోగ్యంతో నా భార్య కన్నుమూయటం, ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో పిల్లల పోషణ భారంగా మారింది. చిన్నారుల ఆలనాపాలనా చూసుకునేవారు లేకపోవడంతోనే వారిని శిశువిహార్‌కు అప్పగించాను. భార్య చనిపోవడం, పిల్లలు లేకపోవడంతో ఒంటరి వాడినయ్యాను. నా పిల్లలపై ఉన్న మమకారం, ప్రేమే వారిని తిరిగి ఇంటికి తీసుకొచ్చేలా చేసింది. నా పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటాన’ని చిన్నారుల తండ్రి గణేశ్ వివరించాడు.
Comments
Please login to add a commentAdd a comment