దత్తతకు పిల్లలు కావలెను..!
లైఫ్ ఛేంజ్ ఎఫెక్ట్
సిటీలో పెరుగుతున్న సంతానలేమి జంటలు
దత్తత కోసం శిశువిహార్‌కు దరఖాస్తుల వెల్లువ
ఎదురు చూపుల్లో వెయ్యికి పైగా జంటలు
ఆలస్యపు పెళ్లిళ్లు.. మారిన జీవనశైలి.. రోజంతా పని ఒత్తిడి.. ఆపై అధిక బరువు.. వెరసి నవ దంపతుల సంతానోత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఎన్ని మందులు వాడినా సంతానం కలగక పోవడంతో తోడు కోసం అనాథ పిల్లలపై ఆసక్తి పెంచుకుంటున్నారు. దత్తతకు పిల్లలు కావాలని కోరుతూ ఇప్పటికే అనేక మంది శిశువిహార్‌కు దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే, వారికి పిల్లలు మాత్రం దొరకడం లేదు. ఏడాది లోపు బిడ్డ కావాలంటే సుమారు ఆరేళ్లు ఆగాల్సి వస్తోంది. దీంతో చాలామంది దంపతులు
ఆందోళన చెందుతున్నారు.
- సాక్షి, సిటీబ్యూరో
కప్పుడు పాతికేళ్లకే పెళ్లి చేసుకుని, ఏడాదిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చేవారు. ప్రస్తుతం చాలా మంది ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాల వేటలో పడి 30 ఏళ్లు దాటిన తర్వాతే పెళ్లికి సిద్ధపడుతున్నారు. అధిక పని ఒత్తిడితో పాటు ఉష్ణోగ్రతలకు హార్మోన్లలో సమతుల్యత లోపిస్తుంది. ఆకలి తీర్చుకునేందుకు పిజ్జాలు, బర్గర్లతో కడుపు నింపుకోవడంతో స్త్రీ, పురుషుల హార్మోన్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీనికి తోడు భార్య ఒక షిఫ్ట్.. భర్త మరో షిఫ్ట్‌లో ఆఫీసుకు వెళ్తుండడం వల్ల వారు కనీస దాంపత్యానికి నోచుకోలేకపోతున్నారు.
వీకెండ్‌లో పార్టీల పేరుతో మద్యం తీసుకోవడం వల్ల శృంగార సమస్యలు తలెత్తుతున్నాయి. పెళ్లై నాలుగైదేళ్లు దాటినా పిల్లలు పుట్టకపోవడంతో చివరకు సంతాన సాఫల్య కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్ అండ్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ (ఐవీఎఫ్), ఇంట్రాసైటో ప్లాస్మి క్ స్పెర్మ్ ఇంజెక్షన్ (ఐసీఎస్‌ఐ) చికిత్సలు సైతం ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇదే అంశంపై 2013లో నగరానికి చెందిన ఇద్దరు దంపతులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తను ఆశ్రయించడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒంటిరిగా జీవించలేక, పిల్లలపై మమకారం చంపుకోలేక అనాథలను దత్తత తీసుకునేందుకు దంపతులు ముందుకు వస్తున్నా, పిల్లలు దొరకని పరిస్థితి తలెత్తింది.
దత్తతకు ఆరేళ్లు ఆగాల్సిందే..
గతంతో పోలిస్తే దంపతుల వైఖరిలో చాలా మార్పులు వచ్చాయి. ఆడపిల్లలు భారమని భావించే రోజులు పోయాయి. శిశు విహార్‌లో పిల్లలను దత్తత తీసుకుంటున్న దంపతుల జాబితాను పరిశీలిస్తే ఇది స్పష్టమవుతోంది. ప్రస్తుతం పిల్లల కోసం 1100 మందికిపైగా ఎదురు చూస్తున్నారంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఆడశిశువు కావాలంటే కనీసం మూడేళ్లు సమయం పడుతుండగా, మగ శిశువుకు ఐదు నుంచి ఆరే ళ్లు పడుతోంది. పిల్లల దత్తత కోసం దరఖాస్తు చేసుకున్నా.. అది కూడా గ్యారంటీ లేదు. ఇదిలా ఉంటే గత పదమూడేళ్లలో శిశువిహార్ ద్వారా మొత్తం 2047 మందిని దత్తత ఇవ్వడం గమనార్హం.
ఐటీ అనుబంధ ఉద్యోగుల్లో అధికం
నగరంలో 30కి పైగా ఫెర్టిలిటీ సెంటర్లు ఉండగా, మా ఆస్పత్రికి ప్రతి రోజూ సగటున 30 కేసులు వస్తున్నాయి. వీరిలో అధిక శాతం ఐటీ, కాల్ సెంటర్స్, మీడియా అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న దంపతులే. ముందు వీరికి పరీక్షలు చేసి లోపాన్ని గుర్తిస్తాం. తొలుత మందులతో ప్రయత్నిస్తాం. అయినా ఫలితం లేకపోతే ఐవీఎఫ్, ఐసీఎస్‌ఐ వంటి కృత్రిమ పద్ధతుల్లో టెస్ట్‌ట్యూబ్ బేబీకి సిఫారసు చేస్తాం. చిన్న వయసులోనే మోనోపాజ్ వస్తుండటం వల్ల నగరంలో చాలా మంది రెండో సారి గర్భధారణకు నోచుకోవడంలేదు. - డాక్టర్ చందన, నోవా ఇన్‌ఫెర్టిలిటీ సెంటర్