సాక్షి, అమరావతి: హైకోర్టు ముందుకు ఓ ఆసక్తికరమైన కేసు విచారణకు వచ్చింది. ఇలాంటి కేసు హైకోర్టు ముందుకు రావడం ఇదే తొలిసారి. విజయవాడలో మూడో తరగతి చదువుతున్న చిన్నారిని తల్లి కొట్టింది.. దీనిపై ఇరుగుపొరుగు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. దీంతో పోలీసులు ఆ చిన్నారిని శిశు సంక్షేమ అధికారుల సంరక్షణలో ఉంచారు.. దీంతో షాకైన తల్లిదండ్రులు తమ కుమార్తెను తమకు అప్పగించాలని హైకోర్టును ఆశ్రయించారు. చివరకు హైకోర్టు ఆ చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించింది.
సంచలనం సృష్టించిన ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. విజయవాడకు చెందిన శ్రీనివాసరావు, సంధ్యారాణికి మూడో తరగతి చదువుతున్న కుమార్తె లీలా కృష్ణశ్రీ ఉంది. బట్టలు లేకుండా మేడపై తిరుగుతోందని ఆ చిన్నారిని తల్లి కొట్టింది. చిన్నారి ఏడుపులు విన్న ఇరుగుపొరుగు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు చిన్నారిని శిశు సంక్షేమ శాఖ అధికారుల సంరక్షణలో ఉంచారు. దీంతో సంధ్యారాణి, శ్రీనివాసరావులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ బీవీఎల్‌ఎన్ చక్రవర్తి ధర్మాసనం విచారణ జరిపింది. న్యాయమూర్తులు ఆ చిన్నారితోపాటు శిశు సంక్షేమ కమిటీ చైర్మన్‌తో విడివిడిగా మాట్లాడారు. తల్లిదండ్రులు తమ చిన్నారి కోసం పరితపించారు. కుమార్తె పట్ల తాను వ్యవహరించిన తీరుపై తల్లి సంధ్యారాణి పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. చిన్నారి సైతం తల్లిదండ్రులతో వెళ్లేందుకు ఇష్టపడింది.
ఇకపై చిన్నారిని ప్రేమగా, జాగ్రత్తగా చూసుకుంటామని హామీ ఇస్తూ ప్రమాణపూర్వక అఫిడవిట్ దాఖలు చేయాలని తల్లిదండ్రులను ధర్మాసనం ఆదేశించింది. దీంతో వారు అఫిడవిట్ దాఖలు చేశారు. దీంతో చిన్నారి లీలా కృష్ణశ్రీని వెంటనే తల్లిదండ్రులకు అప్పగించాలని శిశు సంక్షేమ అధికారులను ధర్మాసనం ఆదేశించింది. కోర్టుకు చెప్పినట్లు ఆ చిన్నారి పేరు మీద రూ.50 వేలను ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి, దాని కాపీని హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడిషియల్) ముందుంచాలని తల్లిదండ్రులకు విస్పష్ట ఆదేశాలు ఇచ్చింది.
ఏ వ్యక్తికైనా తల్లే ప్రథమ దైవం, గురువు..
ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. ‘ఈ కేసులో తల్లి సంధ్యారాణి చర్యలు చట్టపరంగా నేరంగా కనిపించొచ్చు. అయితే మన సంస్కృతి ప్రకారం ప్రతి వ్యక్తికీ తల్లే మొదటి దైవం, గురువు. ఏ తల్లీ తన బిడ్డను శిక్షించే సమయంలో హాని చేయాలన్న దురుద్దేశంతో వ్యవహరిస్తుందని మేం అనుకోవడం లేదు.
ఈ కేసులో చిన్నారి పట్ల తల్లి ప్రవర్తన దురదృష్టకరం. ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తగా చూసుకుంటామని తల్లిదండ్రులిద్దరూ హామీ ఇచ్చారు’ అని స్పష్టం చేసింది. కాగా చిన్నారులను ఉంచే శిశు సంరక్షణ కేంద్రాల్లో తగిన సదుపాయాలు ఉండేలా చూడాలని శిశు సంక్షేమ శాఖను ఆదేశించింది. రాష్ట్రంలోని ప్రైవేటు అనాథ శరణాలయాలు, శిశు సంక్షేమ కేంద్రాలు, అందులోని సౌకర్యాల వివరాలను తమ ముందుంచాలని కోరింది. వాటన్నింటినీ పరిశీలించి శిశు సంక్షేమం నిమిత్తం తగిన ఆదేశాలు జారీ చేస్తామని తెలిపింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 8కి వాయిదా వేసింది.
ఆ చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించండి
Published Wed, Aug 31 2022 4:41 AM | Last Updated on Wed, Aug 31 2022 4:41 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment