ప్లే స్కూళ్లపై నియంత్రణాధికారం ఎవరిది?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్లే స్కూళ్లపై నియంత్రణాధికారం ఎవరిదన్న చర్చ ఇప్పుడు తెరపైకి వచ్చింది. వాటిని నియంత్రించాలన్న అంశాన్ని తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. మలక్‌పేటలోని ఓ ప్రైవేటు ప్లే స్కూల్ లిఫ్టులో ఇరుక్కుని సైదా జైనాబ్ ఫాతిమా జాఫ్రీ అనే నాలుగేళ్ల చిన్నారి మృతిచెందడంతో ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించింది. ఇన్నాళ్లు ప్లే స్కూళ్లను విద్యాశాఖ కానీ, మహిళా, శిశు సంక్షేమ శాఖగానీ పట్టించుకోలేదు. ప్లే స్కూళ్లను ఎవరు నియంత్రించాలన్న విషయంలో ప్రభుత్వ శాఖలకే స్పష్టత లేకుండాపోయింది. ఐదేళ్ల వయసు నిండిన పిల్లలనే విద్యాశాఖ నిబంధనల ప్రకారం పాఠశాలల్లో చేర్చుకోవాలి. పైగా విద్యాశాఖ ప్రైవేటు పాఠశాలల ఏర్పాటుకు అనుమతి ఇస్తున్నది 1వ తరగతి నుంచి పదో తరగతి వరకే. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీకి ఎలాంటి అనుమతులు ఇవ్వడం లేదు. కాబట్టి తమకు సంబంధం లేదని పట్టించుకోవడం లేదు.
అటు మహిళా, శిశు సంక్షేమ శాఖ కూడా వాటిని పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని అంగన్‌వాడీ కేంద్రాలను తప్ప.. ప్రైవేటు రంగంలోని క్రష్‌లు, ప్లే స్కూళ్లు, నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ వంటి వాటిపై దృష్టి పెట్టడం లేదు. దీంతో ప్లే స్కూళ్లలో ఇలాంటి ప్రమాదాలు జరిగినపుడు విద్యా శాఖ అధికారులు స్పందించి ఆ తర్వాత వదిలేస్తున్నారు. వాస్తవానికి ప్రీప్రైమరీ విద్య గురించి విద్యా హక్కు చట్టంలోనూ ఉంది. అంతేకాదు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి కొత్తగా తీసుకువచ్చిన ఉపాధ్యాయ విద్యా కోర్సుల్లో ప్రీపైమరీ ఉపాధ్యాయ విద్య కోర్సును ప్రవేశపెట్టింది. అయినా విద్యా శాఖ ఆ దిశగా దృష్టి సారించలేదు.
పాఠశాల యాజమాన్యాల నుంచి విద్యా శాఖ అధికారులు అమ్యామ్యాలు పుచ్చుకుని కనీసం ఒకటో తరగతి నుంచి వర్తించే నిబంధనల మేరకైనా ప్రీప్రైమరీ సెక్షన్లను నిర్వహిస్తున్నారా? లేదా? అన్నది పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మలక్‌పేట స్కూల్లో జరిగిన ఘటనలో చిన్నారి మృత్యువాత పడటంతో ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆలోచనలో పడ్డారు. ప్లే స్కూళ్ల వ్యవహారాన్ని తేల్చాలంటూ ప్రభుత్వం ఆదేశించడంతో విద్యా శాఖ ప్లే స్కూళ్ల వ్యవహారంపై దృష్టి పెట్టింది. పాఠశాల విద్యా డెరైక్టర్ జి.కిషన్ విద్యా శాఖ ఉన్నతాధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు.
ప్లే స్కూళ్ల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఈ విషయంలో శిశు సంక్షేమ శాఖ అధికారులతోనూ సమావేశమై చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. రెండు శాఖల సమన్వయంతో ప్లే స్కూళ్ల నియంత్రణను విద్యా శాఖ గానీ, శిశు సంక్షేమ శాఖ గానీ చేపట్టేలా విధానం తేవాలని విద్యా శాఖ భావిస్తోంది. దీనిపై త్వరలోనే శిశు సంక్షేమ శాఖతో సమావేశం నిర్వహించి ప్రభుత్వానికి ప్లే స్కూళ్ల నియంత్రణకు ప్రతిపాదనలు పంపించేందుకు సిద్ధమవుతోంది.