play schools
-
కేంద్రం తీపికబురు.. సమగ్ర శిక్షా పథకం 2026 వరకు పొడిగింపు..
న్యూఢిల్లీ: సమగ్ర శిక్షా పథకాన్ని 2026 వరకు పొడిగించినట్టు కేంద్రం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బుధవారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్య, నైపుణ్యం అందించడంపైనే తమ దృష్టి ఉంటుందని అన్నారు. అదే విధంగా, సమగ్ర శిక్షా పథకానికి గాను.. రూ.1,85,398 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇకనుంచి ప్రభుత్వ పాఠశాలలో ప్లేస్లూల్స్ కూడా ఉండాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. డీబీటీ ద్వారా నేరుగా విద్యార్థులకు ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాగా, 2023 వరకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల కేంద్ర ప్రాయోజిత పథకాన్ని పొడిగించామని పేర్కొన్నారు. అదే విధంగా.. 1023 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను మరో రెండేళ్లు పొడిగిస్తున్నట్లు తెలిపారు. భారత్‌లో లైంగిక పరమైన నేరాలలో సత్వర న్యాయం అందించడం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేశామని అన్నారు. కాగా, నిర్భయ నిధి నుంచి నిధులను అందిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. -
'పే' స్కూల్స్..!
సాక్షి, అమరావతి : ‘నలుగురిలో ఎలా మాట్లాడాలో, ఎలా ఉండాలో పిల్లలకు చిన్నప్పుడే నేర్పాలి. ప్లే స్కూల్లో వెయ్యాలి. పిల్లల బుర్రలు ఐదేళ్లలోపు చురుగ్గా ఉంటాయి కాబట్టి ఆ టైంలో వాళ్లకు బాగా నేర్పిస్తే తర్వాత చదువుల్లో బాగా ఎదుగుతారు’.. అంటోంది లలితమ్మ. నాలుగిళ్లల్లో పనిచేస్తేనే ఆమె కుటుంబం గడుస్తుంది. ఆయినప్పటికీ అప్పుచేసి మరీ తన కొడుకును ప్లే స్కూల్లో చేర్పించింది. ‘నా కూతురి ప్లే స్కూలుకు చెల్లించిన ఫీజు నేను ఒకటవ తరగతి నుంచి పీజీ వరకు చెల్లించిన ఫీజుకు రెట్టింపుగా ఉంది. మారిన కాలానికి అనుగుణంగా నా బిడ్డ ఎదగాలనే కోరికతో అప్పుచేసి మరీ చేర్పించా’నంటున్నారు విజయవాడకు చెందిన ప్రైవేటు ఉద్యోగి శ్రీరామ్. ..ప్లేస్కూళ్ల యజమానులు సాగించే ప్రచారం ఏ స్థాయిలో ఉందో.. కిందిస్థాయి వర్గాలను సైతం అది ఏ విధంగా ప్రభావితం చేస్తోందో గ్రహించడానికి ఇదో ఉదాహరణ. ప్రధానంగా పై తరహా ఆలోచన విధానమే ప్లే స్కూళ్ల మార్కెట్ ఏటా 32 శాతం వృద్ధితో దూసుకుపోయేందుకు కారణమవుతోంది. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడం.. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేసే ఇళ్లల్లో పిల్లల బాగోగుల గురించి పట్టించుకునే వారే లేకపోవడం.. పిల్లల భవిష్యత్తు గురించి పెద్దలు భారీగా కలలు కనడం, పోటీ ప్రపంచంలో తమ పిల్లలు వెనుకబడిపోతారేమోనని భావిస్తుండటం వంటి అంశాలు.. ప్లే స్కూళ్ల విస్తరణకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. జీవన ప్రమాణాలు, ఆదాయాలు పెరగడం వంటివి కూడా ప్లే స్కూల్ మార్కెట్ పెరగడానికి దోహదం చేస్తున్నాయని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. పిల్లలకు 21వ శతాబ్దపు నైపుణ్యాలు అందిస్తామంటూ కొన్ని కార్పొరేట్ సంస్థలు సాగిస్తున్న భారీ ప్రచారం కూడా పెద్దల్ని కొంతమేర ప్రభావితం చేస్తోంది. అయితే, పెద్దలు ఈ తరహా ప్రచారంలో కొట్టుకుపోరాదంటున్నారు హైదరాబాద్‌కు చెందిన చైల్డ్ సైకాలజిస్ట్ సి.వీరేందర్. ‘హాయిగా ఆడుతూ పాడుతూ గడపాల్సిన బాల్యాన్ని భవిష్యత్తు పేరుతో ఒత్తిడికి గురిచేయొద్దు. వాళ్లను కుటుంబంతో, తాతయ్య అమ్మమ్మలతో గడపనివ్వండి’ అని సలహా ఇస్తున్నారు. వేల నుంచి లక్షల్లో ఫీజులు.. నిన్నమొన్నటి వరకు కేవలం నగరాలకే పరిమితమైన ప్లే స్కూళ్ల సంస్కృతి ఇప్పుడు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు కూడా విస్తరించింది. ‘సాక్షి’ పరిశీలన ప్రకారం.. నగరాల్లో పేరున్న స్కూళ్లు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. విశాఖ, తిరుపతిలోని ప్లే స్కూళ్లలో లక్ష, లక్షన్నర రూపాయల ఫీజు కడితేనే సీటు. విజయవాడలో సీటు కావాలంటే పాతిక వేల నుంచి లక్ష వరకూ చెల్లించాల్సిందే. హైదరాబాద్ నగరంలోని టాప్ ప్లే స్కూళ్లు రూ.1.50 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఫీజు కట్టించుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా ఫ్రాంచైజీలు కలిగిన కంగారు, యూరో కిడ్స్, బచ్పన్, కిడ్జస్ వంటి సంస్థలు నగరాన్ని బట్టి ఫీజుల్ని నిర్దేశిస్తున్నాయి. అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటించిన అనంతరం.. విజయవాడలో ఏర్పాటుచేసిన ప్లే స్కూళ్లల్లో ఆశించిన రీతిలో పిల్లలు చేరలేదు. సచివాలయం వచ్చినప్పటికీ, చాలామంది ఉద్యోగులు తమ కుటుంబాల్ని ఇక్కడకు తీసుకురాకపోవడంతో అనుకున్న స్థాయిలో వ్యాపారం జరగడం లేదంటున్నారు విజయవాడలోని బచ్పన్ ఫ్రాంఛైజ్ నిర్వాహకులు కాళేశ్వరరావు. ఒంటరిగా ఉంచలేక.. ఐదేళ్లు వచ్చే వరకు మా అబ్బాయిని బడికి పంపకూడదనుకున్నాం. కానీ, ఇంతలో తిరుపతికి బదిలీ అయ్యింది. మూడు గదుల ఇంటిలో నేనూ, మా వారూ, బాబు మాత్రమే ఉంటున్నాం. అదే మా ఊళ్లో అయితే ఆడుకోవడానికి విశాలమైన స్థలం ఉంటుంది. ఇక్కడ బయటకు వెళ్లే అవకాశమే లేదు. అందుకే ఇష్టం లేకపోయినా ప్లే స్కూల్‌కు పంపుతున్నాను. – బి.వీణ, తిరుపతి పిల్లలతో కలసి ఉంటారని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇద్దరమూ ఉద్యోగానికి వెళ్తేనే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అందుకే ఇద్దరం ఉద్యోగం చేస్తున్నాం. పిల్లాణ్ణి ఇంటి దగ్గరుంచితే వీడియో గేమ్స్, మొబైల్ ఫోన్ వదలడు. ఫిజికల్ గేమ్స్ ఆడేందుకు ఎవరూ అందుబాటులో లేరు. అందుకే ప్లే స్కూలుకి పంపుతున్నాం. అక్కడ ఉల్లాసంగా గడిచిపోతుంది. పైగా నాలెడ్జ్ కూడా అందుతుంది. – మాధురి, తల్లి, విశాఖపట్నం నిరుడు ఇద్దరే.. ఇప్పుడు 45 మంది ఉద్యోగస్తులైన తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్లే స్కూల్లో చేర్పించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి వారి సంఖ్య ఇటీవల బాగా పెరిగింది. అందుకు మా స్కూలే ఉదాహరణ. ఏడాది కిందట ఇద్దరు పిల్లలతో స్కూల్ ప్రారంభించాం. ఇప్పుడు పిల్లల సంఖ్య 45కి చేరింది. ప్లే స్కూల్లో పిల్లలపట్ల తగిన కేర్ తీసుకుంటాం. అవసరమయ్యే శిక్షణను అందిస్తాం. వీటి నిర్వహణ చాలా కష్టం. – మల్లిక, ప్రిన్సిపల్, లిటిల్ డాక్లింగ్ స్కూల్, విశాఖపట్నం కేంద్రం ఏం చెబుతోంది? కేంద్రం ప్రవేశపెట్టిన ‘ఎర్లీ చైల్డ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ పాలసీ’ (ఈసీసీఈ–2013) ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్న పిల్లలకు విద్య, ఆటపాటలు నేర్పాలి. ప్రైవేటు సంస్థలు కూడా ఈ పాలసీ తాలూకు విధివిధానాలకు కట్టుబడి నడుచుకోవాలి. - ప్రతీ 20 మంది పిల్లలకు ఒక టీచరు, ఒక ఆయా తప్పనిసరిగా ఉండాలి. - ప్లేస్కూల్ వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచాలి. - పిల్లలకు ఎటువంటి ప్రమాదాలు జరగడానికి వీల్లేకుండా పూర్తి రక్షణ చర్యలు తీసుకోవాలి. - పిల్లలకు అనుకూలమైన బాత్రూంల ఏర్పాటు, సీసీటీవీ, అగ్నిమాపక రక్షణ పరికరాలు, ఫస్ట్ ఎయిడ్ కిట్ కలిగి ఉండాలి. - ప్రతీ మూడు నెలలకు ఒకసారి చిన్నారులకు వైద్య పరీక్షలు చేయించాలి. - ముఖ్యంగా రోజుకు 3–4 గంటలకు మించి ప్లే స్కూల్ నిర్వహించకూడదు. - చిన్న పిల్లలకు ఏం నేర్పించాలనే దానిపై కూడా కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ బోధన ప్రణాళిక రూపొందించింది. ప్రతీ ప్లే స్కూల్ నిర్వాహకులు దీన్ని విధిగా పాటించాల్సి వుంది. ఈ దిశగా.. శిశు సంక్షేమ శాఖ తనిఖీలు జరపాల్సిన అవసరముందనే అభిప్రాయం బలంగా వినబడుతోంది. -
అంగన్వాడీలకు కొత్తరూపు
ప్లే స్కూళ్లుగా మారుతున్న పాఠశాలలు శంషాబాద్‌లో తొలిసారిగా ఏడు కేంద్రాలు రాజేంద్రనగర్‌లోని మూడు కేంద్రాల్లో ఇక డిజిటల్ క్లాసులు శంషాబాద్: అంగన్వాడీ కేంద్రాలు సరికొత్త రూపు దాల్చుకుంటున్నాయి. ప్రైవేటు ప్లే స్కూళ్లకు దీటుగా తయారవుతున్నాయి. మెదక్ జిల్లాలోనే తొలిసారిగా రాజేంద్రనగర్ ఐసీడీఎస్ పరిధిలో పదికేంద్రాలు ఆదర్శ అంగన్వాడీలుగా అవతరిస్తున్నాయి. ఐసీడీఎస్ ఆయా కేంద్రాలను ఎంపిక చేయడంతో పాటు అందులో దశలవారీగా సౌకర్యాలు సమకూర్చే పనిలో అధికారులు పడ్డారు. ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఏడాదిగా శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడలోని ఓ కేంద్రంలో నిర్వహిస్తున్న డిజిటల్ తరగతులు విజయవంతం కావడంతో ప్రభుత్వ అనుమతితో మరో పది కేంద్రాలను ఆదర్శ అంగన్వాడీలుగా మార్చాలని నిర్ణయించారు. ఇవి జూన్‌లోనే అందుబాటులోకి రానున్నాయి. జిల్లాలో ఆదర్శ అంగన్వాడీలుగా మారుస్తున్న కేంద్రాల్లో ఇకనుంచి చిన్నారులకు ఐప్యాడ్‌పై డిజిటల్ తరగతులు నిర్వహించనున్నారు. ఏబీసీడీలు, రైమ్స్ నేర్పించనున్నారు. ఇందుకోసం ఎంపిక చేసిన కేంద్రాల టీచర్లకు ప్రత్యేక శిక్షణ తరగతులను కూడా ఇప్పిస్తున్నారు. ఎంపిక చేసిన అంగన్వాడీ కేంద్రాల్లో ఇప్పటికే విద్యుత్‌తో పాటు తాగునీటి సౌకర్యం, ఇతర మౌలిక వసతులన్నింటినీ ప్రభుత్వ అనుమతితో రాజేంద్రనగర్ ఐసీడీఎస్ పరిధిలోకి పదికేంద్రాలను ఆదర్శ అంగన్వాడీలుగా తీర్చిదిద్దుతున్నాం. ఇ ప్పటికే కొన్ని చోట్ల ఏర్పాట్లు చేశాం, శంషాబాద్‌లో ఏడు, రాజేంద్రనగర్‌లో మూడు కేంద్రాలు ఏర్పాటు చేశాం. ప్రైవేటు ప్లే స్కూళ్లకు దీటుగా ఐ పాడ్‌తో డిజిటల్ తరగతులు ఇందులో ప్రారంభించనున్నాం. ఇతరత్రా సౌకర్యాలు కూడా సమకూర్చుతున్నాం. - నిర్మల, రాజేంద్రనగర్ సీడీపీఓ పూర్తి చేస్తున్నారు. ఆదర్శ అంగన్వాడీ భవనాలను ప్లే స్కూళ్ల మాదిరిగా సరికొత్త పెయింటింగ్‌లు వేయించారు. గోడలపై బొమ్మలతో పాటు ఏబీసీడీలు ఇతరత్రా ఆక ర్షణీయమైన బొమ్మలతో అలరించేలా మార్చుతున్నా రు. చిన్నారులు ఆడుకోడానికి గతంలో కన్నా మెరుగైన విధంగా చెక్కబొమ్మలు, జంతువుల బొమ్మలు ఇతరత్రా సామాగ్రిని కూడా ఈ కేంద్రాలకు ఇప్పటికే సరఫరా చేశారు. శంషాబాద్‌లో ఏడు కేంద్రాలు జిల్లాలోనే మొదటిసారిగా ప్రయోగాత్మకంగా శంషాబాద్‌లో వీక రసెక్షన్ కాలనీ, సిద్ధంతి, ఇందిరానగర్ దొడ్డి, కుమ్మరిబస్తీ, అహ్మద్‌నగర్, ఎయిర్‌పోర్టు కాలనీ, కొత్వాల్‌గూడ వీటితో పాటు రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో పద్మశాలిపురం బస్తీలో మూడు అంగన్వాడీ కేంద్రాలు ఆదర్శ కేంద్రాలుగా మారాయి. చిన్నారులు ఇంగ్లీష్ మీడియం పాఠశాలలకు తరలిపోకుండా ఐసీడీఎస్ అధికారులు ఆయా ఆదర్శ అంగన్వాడీ కేంద్రాల సమీపం లో ఉన్న తల్లులకు వారం రోజులుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్లే స్కూళ్లకు ఏమాత్రం తక్కువ కాకుండా చిన్నారులకు పోషకాహారంతో పాటు మంచి విద్య ఇక్కడ లభిస్తుందని చెబుతున్నారు. మెదక్ జిల్లాలోనే తొలిసారిగా శంషాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న ఆదర్శ అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులను చేర్పించాలని తల్లులకు అవగాహన కల్పిస్తున్నాం. శంషాబాద్ సెక్టార్ పరిధిలోని కొత్వాల్‌గూడలో ఏడాది కాలంగా ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్న కేంద్రం విజయవంతంగా కొనసాగిస్తుండడంతో మరో పది కేంద్రాలకు అనుమతి ఇచ్చారు. - కళావతి, ఐసీడీఎస్ సెక్టార్ సూపర్వైజర్ -
ప్లే స్కూళ్లపై నియంత్రణాధికారం ఎవరిది?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్లే స్కూళ్లపై నియంత్రణాధికారం ఎవరిదన్న చర్చ ఇప్పుడు తెరపైకి వచ్చింది. వాటిని నియంత్రించాలన్న అంశాన్ని తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. మలక్‌పేటలోని ఓ ప్రైవేటు ప్లే స్కూల్ లిఫ్టులో ఇరుక్కుని సైదా జైనాబ్ ఫాతిమా జాఫ్రీ అనే నాలుగేళ్ల చిన్నారి మృతిచెందడంతో ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించింది. ఇన్నాళ్లు ప్లే స్కూళ్లను విద్యాశాఖ కానీ, మహిళా, శిశు సంక్షేమ శాఖగానీ పట్టించుకోలేదు. ప్లే స్కూళ్లను ఎవరు నియంత్రించాలన్న విషయంలో ప్రభుత్వ శాఖలకే స్పష్టత లేకుండాపోయింది. ఐదేళ్ల వయసు నిండిన పిల్లలనే విద్యాశాఖ నిబంధనల ప్రకారం పాఠశాలల్లో చేర్చుకోవాలి. పైగా విద్యాశాఖ ప్రైవేటు పాఠశాలల ఏర్పాటుకు అనుమతి ఇస్తున్నది 1వ తరగతి నుంచి పదో తరగతి వరకే. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీకి ఎలాంటి అనుమతులు ఇవ్వడం లేదు. కాబట్టి తమకు సంబంధం లేదని పట్టించుకోవడం లేదు. అటు మహిళా, శిశు సంక్షేమ శాఖ కూడా వాటిని పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని అంగన్వాడీ కేంద్రాలను తప్ప.. ప్రైవేటు రంగంలోని క్రష్‌లు, ప్లే స్కూళ్లు, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వంటి వాటిపై దృష్టి పెట్టడం లేదు. దీంతో ప్లే స్కూళ్లలో ఇలాంటి ప్రమాదాలు జరిగినపుడు విద్యా శాఖ అధికారులు స్పందించి ఆ తర్వాత వదిలేస్తున్నారు. వాస్తవానికి ప్రీప్రైమరీ విద్య గురించి విద్యా హక్కు చట్టంలోనూ ఉంది. అంతేకాదు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి కొత్తగా తీసుకువచ్చిన ఉపాధ్యాయ విద్యా కోర్సుల్లో ప్రీపైమరీ ఉపాధ్యాయ విద్య కోర్సును ప్రవేశపెట్టింది. అయినా విద్యా శాఖ ఆ దిశగా దృష్టి సారించలేదు. పాఠశాల యాజమాన్యాల నుంచి విద్యా శాఖ అధికారులు అమ్యామ్యాలు పుచ్చుకుని కనీసం ఒకటో తరగతి నుంచి వర్తించే నిబంధనల మేరకైనా ప్రీప్రైమరీ సెక్షన్లను నిర్వహిస్తున్నారా? లేదా? అన్నది పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మలక్‌పేట స్కూల్లో జరిగిన ఘటనలో చిన్నారి మృత్యువాత పడటంతో ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆలోచనలో పడ్డారు. ప్లే స్కూళ్ల వ్యవహారాన్ని తేల్చాలంటూ ప్రభుత్వం ఆదేశించడంతో విద్యా శాఖ ప్లే స్కూళ్ల వ్యవహారంపై దృష్టి పెట్టింది. పాఠశాల విద్యా డెరైక్టర్ జి.కిషన్ విద్యా శాఖ ఉన్నతాధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ప్లే స్కూళ్ల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఈ విషయంలో శిశు సంక్షేమ శాఖ అధికారులతోనూ సమావేశమై చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. రెండు శాఖల సమన్వయంతో ప్లే స్కూళ్ల నియంత్రణను విద్యా శాఖ గానీ, శిశు సంక్షేమ శాఖ గానీ చేపట్టేలా విధానం తేవాలని విద్యా శాఖ భావిస్తోంది. దీనిపై త్వరలోనే శిశు సంక్షేమ శాఖతో సమావేశం నిర్వహించి ప్రభుత్వానికి ప్లే స్కూళ్ల నియంత్రణకు ప్రతిపాదనలు పంపించేందుకు సిద్ధమవుతోంది. -
డే కేర్లతో డేంజర్
‘డే కేర్’లలో బంధాలకు దూరమవుతున్న రేపటి తరం ఆయాల పాలనలో బాల్యం చిన్నారులను నిద్రపుచ్చేందుకు ‘కాఫ్ సిరప్’ వాడకం పసిమొగ్గల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఐదేళ్ల వరకు ఆటపాటల్లో గడపాల్సిన బాల్యం.. ఐదు నెలలకే డే కేర్ పరం అవుతోంది. అమ్మ ఒడి వెచ్చదనాన్ని మనసారా ఆస్వాదించాల్సిన చిన్నారులు.. ఏడాది కూడా దాటకుండానే ప్లే స్కూల్స్‌లో ఆయమ్మల దగ్గరకు చేరుతున్నారు. మారుతున్న జీవనశైలి, దంపతులిద్దరూ ఉద్యోగాలు చేయాల్సి రావడంతో చిన్నారులు ఇంట్లో ఆహ్లాదకరమైన జీవనాన్ని పొందలేకపోతున్నారు. ఇదిలా ఉంటే డే కేర్ సెంటర్లకు సంబంధించిన మరికొన్ని ఆందోళనకరమైన అంశాలు ‘డే కేర్’ సెంటర్లను ‘డేంజర్’ సెంటర్లగా మార్చేస్తున్నాయి. డే కేర్ సెంటర్లలోని చిన్నారులు త్వరగా నిద్రపోయేందుకు గాను అక్కడి సిబ్బంది వారికి ‘కాఫ్ సిరప్’ను అలవాటు చేస్తున్నారని ఇటీవలి కాలంలో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో చిన్నారుల ఆలనా, పాలనా విషయంలో డే కేర్ సెంటర్లు ఎంతవరకు సురక్షితమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ‘చిల్డ్రన్ పార్లమెంట్’లో చర్చ.... ఇక అమ్మ ఒడిలో హాయిగా సాగాల్సిన బాల్యం డేకేర్ సెంటర్లలో నలిగిపోతుండడంపై ఇటీవల నగరంలో నిర్వహించిన ‘చిల్డ్రన్ పార్లమెంట్’లో చర్చ జరిగింది. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన చిన్నారులతో ముఖ్యమంత్రి సమావేశమైన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ‘డే కేర్’ సెంటర్ల పనితీరుపై విద్యార్థులు ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. నగరంలోని అనేక డే కేర్ సెంటర్లలో చిన్నారులను త్వరగా నిద్రపుచ్చేందుకు ‘కాఫ్ సిరప్’లను వినియోగిస్తున్నారని, తద్వారా చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర దుష్పరిణామాలు కనిపిస్తున్నాయని వారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అదే వేదికపై ఉన్న రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉమాశ్రీ ఈ విషయం పై స్పందిస్తూ...‘ఇలాంటి విషయాలు మా దృష్టికి కూడా వచ్చాయి. అందుకే ఇక నుంచి డే కేర్ సెంటర్ల ఏర్పాటుకు సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నాం’ అని ప్రకటించారు. భద్రం ఎంత? నగరంలో ప్రస్తుతం వీధికొక డే కేర్ సెంటర్ కనిపిస్తోంది. తమ ఇంటికి దగ్గరగా ఉందనే కారణంతో చాలా మంది తల్లిదండ్రులు ఆ డే కేర్ సెంటర్ లేదా ప్లేస్కూల్ తమ బిడ్డలకు ఎంత వరకు సురక్షితం అనే అంశంపై తక్కువగా శ్రద్ధ పెడుతున్నారు. అయితే ఇది ఎంత మాత్రం సరైంది కాదని నిపుణులు పేర్కొంటున్నారు. చిన్నారులను డే కేర్ సెంటర్లలో చేర్చడానికి ముందు అక్కడ నిపుణులైన సిబ్బంది ఉన్నారా లేదా అనే విషయాన్ని పరిశీలించాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం నగరంలోని చాలా డే కేర్ సెంటర్లలో పిల్లల పెంపకంపై ఏ మాత్రం అవగాహన లేని వారిని సైతం నియమిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాదు నగరంలోని చాలా వరకు డే కేర్ సెంటర్లలో సరైన శుభ్రత కూడా కనిపించడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. చిన్నారుల శరీరం చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి, ఏ మాత్రం అపరిశుభ్ర వాతావరణం వారి దరికి చేరినా వెంటనే అనారోగ్యం బారిన పడతారు. అందుకే డే కేర్‌లోని పరిసరాలతో పాటు అక్కడి సిబ్బంది కూడా తప్పని సరిగా శుభ్రతను పాటించాల్సి ఉంటుంది. డే కేర్లలో పిల్లలను చేర్చే ముందు పై విషయాలన్నింటిని ఓ సారి పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. చిన్న కుటుంబాలు కావడంతోనే... ప్రస్తుతం బెంగళూరు లాంటి మెట్రో నగరాల్లో దంపతులిద్దరూ తప్పక పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోజు రోజుకు పెరుగుతున్న ఖర్చులతో ఇంటిని నడపాలంటే దంపతులిద్దరూ ఉద్యోగాలు చేయాల్సి వస్తోంది. దీంతో పాటు నగరంలో దాదాపు అన్నీ చిన్న కుటుంబాలే కనిపిస్తున్నాయి. ఎక్కడో స్వగ్రామంలో పెద్దలు ఉంటున్నారు. దీంతో ఇంట్లోని చిన్నారుల పెంపకం పెద్ద సవాల్‌గానే మారిందని చెప్పవచ్చు. ఈ పరిస్థితుల్లో తమ చిన్నారిని కేవలం ఐదారు నెలల్లోనే డే కేర్ లేదా ప్లే స్కూల్లలో తల్లిదండ్రులు చేర్పిస్తున్నారు. ఉదయం దంపతులిద్దరూ ఆఫీసుకు వెళ్లే సమయంలో పాపాయిని డే కేర్సెంటర్లో వదిలి వెళ్లి, తిరిగి సాయంత్రం ఆఫీసు నుండి వచ్చేటపుడు తమతో పాటు తీసుకొస్తున్నారు. ఇల్లే మొట్టమొదటి పాఠశాల... చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలకు తల్లిదండ్రుల ఆత్మీయ స్పర్శ అత్యంత ఆవశ్యకమని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లల్లో పెరుగుదల బాగా కనిపించే ఐదేళ్ల వయసు వరకు వారికి ఇల్లే పాఠశాల కావాలని చెబుతున్నారు. చిన్నారులు తమ భావోద్వేగాలను తల్లిదండ్రులతో పంచుకున్నట్లుగా మరెవరితోనూ పంచుకోలేరని మానసిక నిపుణురాలు డైసీ చెబుతున్నారు. ఇంట్లో పిల్లలు పెరుగుతుంటే వారికి ఆత్మీయతలు, అనుబంధాలు, వరుసలు తెలుస్తాయని అంటున్నారు. ‘ఇంట్లో తల్లిదండ్రులు అందించే ప్రేమాభిమానాలు చిన్నారుల ఎదుగుదలలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. మూడేళ్ల వరకు తల్లి ఒడిలో పెరిగిన చిన్నారులు ఆరోగ్యంగా ఎదుగుతారని సర్వేలు కూడా చెబుతున్నాయి. ఒక వేళ తల్లిదండ్రులిద్దరూ తప్పక ఉద్యోగానికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటే పెద్దలైన నాయనమ్మ-తాతయ్య లేదా అమ్మమ్మ-తాతయ్యల సహాయం తీసుకోండి. వారిని ఊరి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి పిల్లల సంరక్షణా భారాన్ని పెద్దల చేతికి అందివ్వండి’ అని నగరానికి చెందిన ప్రముఖ మానసిక నిపుణురాలు డైసీ తెలిపారు. -
ప్లే స్కూల్స్ ఆటకట్టు
చెన్నై, సాక్షి ప్రతినిధి: అనధికారికంగా వెలసిన ప్లేస్కూల్స్ ఆటకట్టించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్లేస్కూల్స్ పేరుతో పెద్దమొత్తంలో సొమ్ము చేసుకుంటున్న అనుమతిలేని పాఠశాలలను జనవరిలోగా మూయిస్తామని మద్రాసు హైకోర్టుకు గురువారం ప్రభుత్వం హామీ ఇచ్చింది. అధికారిక చర్యల్లో భాగంగా వాటికి వెంటనే సంజాయిషీ నోటీసులు జారీచేస్తామని చెప్పింది. ప్రస్తుత సమాజంలో విద్య ఒక వ్యాపారంగా మారిపోయింది. రెండు గదులుంటే చాలు అదో పాఠశాలగా మార్చివేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వేలాది ప్లేస్కూళ్లు వెలిశాయి. వాటిల్లో అనేకం అనధికార స్కూల్స్‌గా ఆరోపణలు వచ్చాయి. ప్లేస్కూల్ ఉన్న ప్రాంతాన్ని బట్టి ఒక్కో విద్యార్థి నుంచి రూ.30వేలు మొదలుకుని రూ.50వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈ ఫీజులకు తగినట్లుగా పాఠశాలల్లో ప్రాథమిక, మౌళిక సదుపాయాలు లేవ ంటూ సీనియర్ న్యాయవాది సుబ్రమణియన్ రెండు నెలల క్రితం మద్రాసు హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ వాజ్యం గత నెలలో విచారణకు వచ్చింది. నెలరోజుల్లోగా బదులివ్వాల్సిందిగా హైకోర్టు అదేశించింది. ఇందులో భాగంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి ఎమ్.సత్యనారాయణన్ వద్దకు గురువారం విచారణకు వచ్చింది. ప్రాథమిక విద్య డెప్యూటీ డైరక్టర్ సెల్వరాజ్ పిల్లో చేసిన ఆరోపణలకు బదులిచ్చారు. ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా వెలసిన ప్లే స్కూల్స్‌పై అన్నిరకాల చర్యలను తీసుకోవాలని కింది స్థాయి అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. సెప్టెంబర్ 14వ తేదీలోగా వారందరికీ సంజాయిషీ నోటీసులు జారీచేయాలని, అక్టోబర్ 15వ తేదీలోగా బదులిచ్చేలా చూడాలని ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. నవంబర్ 30వ తేదీలోగా ఆయా పాఠశాలల నిర్వాహకులను హాజరుపరిచి తమ అధికారులు విచారిస్తారని చెప్పారు. వచ్చే ఏడాది జనవరి 31వ తేదీలోగా అనధికార ప్లేస్కూల్స్‌పై ఏమి చర్యలు తీసుకోవాలో నిర్ణయించుకుంటామని ఆయన కోర్టుకు విన్నవించుకున్నారు. 2011-12 విద్యా సంవత్సరంలో 1459 అనధికార ప్లేస్కూల్స్ ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. డెప్యూటీ డైరక్టర్ వాదనను కోర్టు రికార్డు చేసింది. అక్రమంగా వెలసిన ప్లేస్కూల్స్‌పై చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం ప్రకటించిన కారణంగా ఈ కేసుకు ముగింపు పలుకుతున్నట్లు న్యాయమూర్తులు ప్రకటించారు.