డే కేర్లతో డేంజర్
‘డే కేర్’లలో బంధాలకు దూరమవుతున్న రేపటి తరం
ఆయాల పాలనలో బాల్యం
చిన్నారులను నిద్రపుచ్చేందుకు ‘కాఫ్ సిరప్’ వాడకం
పసిమొగ్గల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
ఐదేళ్ల వరకు ఆటపాటల్లో గడపాల్సిన బాల్యం.. ఐదు నెలలకే డే కేర్ పరం అవుతోంది. అమ్మ ఒడి వెచ్చదనాన్ని మనసారా ఆస్వాదించాల్సిన చిన్నారులు.. ఏడాది కూడా దాటకుండానే ప్లే స్కూల్స్‌లో ఆయమ్మల దగ్గరకు చేరుతున్నారు. మారుతున్న జీవనశైలి, దంపతులిద్దరూ ఉద్యోగాలు చేయాల్సి రావడంతో చిన్నారులు ఇంట్లో ఆహ్లాదకరమైన జీవనాన్ని పొందలేకపోతున్నారు. ఇదిలా ఉంటే డే కేర్ సెంటర్లకు సంబంధించిన మరికొన్ని ఆందోళనకరమైన అంశాలు ‘డే కేర్’ సెంటర్లను ‘డేంజర్’ సెంటర్లగా మార్చేస్తున్నాయి. డే కేర్ సెంటర్‌లలోని చిన్నారులు త్వరగా నిద్రపోయేందుకు గాను అక్కడి సిబ్బంది వారికి ‘కాఫ్ సిరప్’ను అలవాటు చేస్తున్నారని ఇటీవలి కాలంలో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో చిన్నారుల ఆలనా, పాలనా విషయంలో డే కేర్ సెంటర్‌లు
ఎంతవరకు సురక్షితమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
‘చిల్డ్రన్ పార్లమెంట్’లో చర్చ....
ఇక అమ్మ ఒడిలో హాయిగా సాగాల్సిన బాల్యం డేకేర్ సెంటర్‌లలో నలిగిపోతుండడంపై ఇటీవల నగరంలో నిర్వహించిన ‘చిల్డ్రన్ పార్లమెంట్’లో చర్చ జరిగింది. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన చిన్నారులతో ముఖ్యమంత్రి సమావేశమైన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ‘డే కేర్’ సెంటర్ల పనితీరుపై విద్యార్థులు ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. నగరంలోని అనేక డే కేర్ సెంటర్‌లలో చిన్నారులను త్వరగా నిద్రపుచ్చేందుకు ‘కాఫ్ సిరప్’లను వినియోగిస్తున్నారని, తద్వారా చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర దుష్పరిణామాలు కనిపిస్తున్నాయని వారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అదే వేదికపై ఉన్న రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉమాశ్రీ ఈ విషయం పై స్పందిస్తూ...‘ఇలాంటి విషయాలు మా దృష్టికి కూడా వచ్చాయి. అందుకే ఇక నుంచి డే కేర్ సెంటర్‌ల ఏర్పాటుకు సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నాం’ అని ప్రకటించారు.
భద్రం ఎంత?
నగరంలో ప్రస్తుతం వీధికొక డే కేర్ సెంటర్ కనిపిస్తోంది. తమ ఇంటికి దగ్గరగా ఉందనే కారణంతో చాలా మంది తల్లిదండ్రులు ఆ డే కేర్ సెంటర్ లేదా ప్లేస్కూల్ తమ బిడ్డలకు ఎంత వరకు సురక్షితం అనే అంశంపై తక్కువగా శ్రద్ధ పెడుతున్నారు. అయితే ఇది ఎంత మాత్రం సరైంది కాదని నిపుణులు పేర్కొంటున్నారు. చిన్నారులను డే కేర్ సెంటర్‌లలో చేర్చడానికి ముందు అక్కడ నిపుణులైన సిబ్బంది ఉన్నారా లేదా అనే విషయాన్ని పరిశీలించాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం నగరంలోని చాలా డే కేర్ సెంటర్‌లలో పిల్లల పెంపకంపై ఏ మాత్రం అవగాహన లేని వారిని సైతం నియమిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాదు నగరంలోని చాలా వరకు డే కేర్ సెంటర్లలో సరైన శుభ్రత కూడా కనిపించడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. చిన్నారుల శరీరం చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి, ఏ మాత్రం అపరిశుభ్ర వాతావరణం వారి దరికి చేరినా వెంటనే అనారోగ్యం బారిన పడతారు. అందుకే డే కేర్‌లోని పరిసరాలతో పాటు అక్కడి సిబ్బంది కూడా తప్పని సరిగా శుభ్రతను పాటించాల్సి ఉంటుంది. డే కేర్‌లలో పిల్లలను చేర్చే ముందు పై విషయాలన్నింటిని ఓ సారి పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.
చిన్న కుటుంబాలు కావడంతోనే...
ప్రస్తుతం బెంగళూరు లాంటి మెట్రో నగరాల్లో దంపతులిద్దరూ తప్పక పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోజు రోజుకు పెరుగుతున్న ఖర్చులతో ఇంటిని నడపాలంటే దంపతులిద్దరూ ఉద్యోగాలు చేయాల్సి వస్తోంది. దీంతో పాటు నగరంలో దాదాపు అన్నీ చిన్న కుటుంబాలే కనిపిస్తున్నాయి. ఎక్కడో స్వగ్రామంలో పెద్దలు ఉంటున్నారు. దీంతో ఇంట్లోని చిన్నారుల పెంపకం పెద్ద సవాల్‌గానే మారిందని చెప్పవచ్చు. ఈ పరిస్థితుల్లో తమ చిన్నారిని కేవలం ఐదారు నెలల్లోనే డే కేర్ లేదా ప్లే స్కూల్‌లలో తల్లిదండ్రులు చేర్పిస్తున్నారు. ఉదయం దంపతులిద్దరూ ఆఫీసుకు వెళ్లే సమయంలో పాపాయిని డే కేర్‌సెంటర్‌లో వదిలి వెళ్లి, తిరిగి సాయంత్రం ఆఫీసు నుండి వచ్చేటపుడు తమతో పాటు తీసుకొస్తున్నారు.
ఇల్లే మొట్టమొదటి పాఠశాల...
చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలకు తల్లిదండ్రుల ఆత్మీయ స్పర్శ అత్యంత ఆవశ్యకమని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లల్లో పెరుగుదల బాగా కనిపించే ఐదేళ్ల వయసు వరకు వారికి ఇల్లే పాఠశాల కావాలని చెబుతున్నారు. చిన్నారులు తమ భావోద్వేగాలను తల్లిదండ్రులతో పంచుకున్నట్లుగా మరెవరితోనూ పంచుకోలేరని మానసిక నిపుణురాలు డైసీ చెబుతున్నారు. ఇంట్లో పిల్లలు పెరుగుతుంటే వారికి ఆత్మీయతలు, అనుబంధాలు, వరుసలు తెలుస్తాయని అంటున్నారు. ‘ఇంట్లో తల్లిదండ్రులు అందించే ప్రేమాభిమానాలు చిన్నారుల ఎదుగుదలలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. మూడేళ్ల వరకు తల్లి ఒడిలో పెరిగిన చిన్నారులు ఆరోగ్యంగా ఎదుగుతారని సర్వేలు కూడా చెబుతున్నాయి. ఒక వేళ తల్లిదండ్రులిద్దరూ తప్పక ఉద్యోగానికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటే పెద్దలైన నాయనమ్మ-తాతయ్య లేదా అమ్మమ్మ-తాతయ్యల సహాయం తీసుకోండి. వారిని ఊరి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి పిల్లల సంరక్షణా భారాన్ని పెద్దల చేతికి అందివ్వండి’ అని నగరానికి చెందిన ప్రముఖ మానసిక నిపుణురాలు డైసీ తెలిపారు.