Day Care
-
మరో కోవిడ్.. అడినో వైరస్
కర్ణాటక: వాతావరణంలో మార్పులు.. తీవ్రమైన ఎండలు, మబ్బులతో కూడుకున్న పరిస్థితి, అప్పుడప్పుడు వర్షం రావడం అనేవి బాలల ఆరోగ్యానికి తీవ్ర ఇబ్బందిగా మారాయి. దీంతో రాష్ట్రంలో అంటురోగాల భయం నెలకొంది. ప్రధానంగా అడినో వైరస్ చిన్నపిల్లలను బాధపెడుతోంది. రాష్ట్రంలో వివిధ ఆసుపత్రుల్లో ఈ జబ్బుతో చికిత్స పొందుతున్న చిన్నపిల్లల సంఖ్య ఎక్కువగా ఉంది. బెంగళూరు ఇందిరాగాంధీ చిన్నపిల్లల ఆసుపత్రిలో వివిధ రకాల జబ్బులతో చికిత్స పొందుతున్న పిల్లల్లో 20 శాతం మంది అడినో వైరస్ బాధితులు ఉన్నారు. బాలలకే అధిక ముప్పు: వైద్యులు ► అడినో వైరస్‌తో పాటు శ్వాసకోశ సమస్యలు, డెంగీ కేసులు నమోదు అవుతున్నాయి. రోగ తీవ్రత ఎక్కువగా ఉన్న పిల్లలను చేర్చుకుని చికిత్స అందిస్తున్నామని ఇందిరాగాంధీ చిన్నపిల్లలు ఆసుపత్రి డాక్టర్ నిజగుణ తెలిపారు. ► అడినోవైరస్ జబ్బుకు కచ్చితమైన చికిత్స లేదు, దీంతో రోగ లక్షణాలు ఆధారంగా వైద్యం అందిస్తున్నాం, పెద్దవారి కంటే బాలలు ఎక్కువగా వైరస్‌కు గురవుతున్నట్లు కేసీ.జనరల్ ఆసుపత్రి చిన్నపిల్లల వైద్యుడు డాక్టర్ లక్ష్మీపతి తెలిపారు. అడినో వైరస్ రోగ లక్షణాలు ► అడినో వైరస్ కళ్లు, శ్వాసకోశ, మూత్రనాళం, నాడీ వ్యవస్థలోకి చొరబడుతుంది. ► జలుబు లేదా జ్వరం ప్రారంభ లక్షణాలు. గొంతు గరగర, నొప్పి, తరువాత తీవ్రమైన శ్వాసకోశ సమస్యలైన బ్రాంకై టిస్, న్యూమోనియాకు దారితీయవచ్చు. ► అలాగే కడుపులో నొప్పి, వాంతులు, విరేచనాలు మొదలవుతాయి. సరైన చికిత్స అందకపోతే మెదడు, వెన్నుముక దెబ్బతినే ప్రమాదముంది. ► అడినోవైరస్ రోగుల్లో వాంతులు, విరేచనాల వల్ల దేహం నిర్జలీకరణమౌతుంది. దీంతో ద్రవ ఆహారం, పండ్ల రసం, నీరు అందించాలి. ► డాక్టర్ల సూచనతో ముక్కు స్ప్రే, చుక్కలు వాడితే శ్వాస బాగా ఆడుతుంది. వేడి, తాజా ఆహారం అందించాలి, రోగితో పాటు కుటుంబ సభ్యులు పరిశుభ్రత పాటించాలి. కోవిడ్ తరహా నియంత్రణ చర్యలు ► కోవిడ్ నియంత్రణ చర్యలనే అడినో వైరస్ విషయంలోనూ పాటించాలి ► రోగ లక్షణాలు కనబడిన వెంటనే ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలి ► వైరస్ నుంచి కాపాడుకోవడానికి మాస్కు ధరించాలి ► చేతులను తరచూ సబ్బు లేదా శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి ► తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వస్త్రం అడ్డు పెట్టుకోవాలి ఈ వైరస్.. ఇట్టే వ్యాపిస్తుంది ► అడినో వైరస్ అనేది నెమ్మదిగా తీవ్ర దశకు చేరుకుని ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే రోగం. అంటే అచ్చం కరోనా వైరస్ మాదిరిగానే ఉంటుంది. రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారు అస్తమాతో పాటు శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారి మీద అడినో వైరస్ తీవ్ర ప్రభావం చూపుతుంది. ► డే కేర్ సెంటర్లు, పాఠశాలల్లో పిల్లలు గుంపులుగా చేరే చోట్ల ఈ వైరస్ అధికంగా ప్రబలుతుందని వైద్యనిపుణులు తెలిపారు. బాధితుడు దగ్గినప్పుడు, లేదా చీదినప్పుడు వైరస్ గాలిలో చేరి ఇతరులకు సోకుతుంది. ► తుమ్మిన తుంపర ప్రదేశాలలో పడినప్పుడు వాటిని తాకిన వ్యక్తులు చేతుల ద్వారా కళ్లు, ముక్కు, నోటిలోకి వైరస్ చేరుతుంది. -
వృద్ధుల డే కేర్..
మంచిర్యాల నుంచి బన్నా ఉపేందర్ : వారంతా జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నవారే. ఒకరు ప్రభుత్వ ఉద్యోగం, మరొకరు ప్రైవేటు, మరొకరు వ్యవసాయం, వ్యాపారం.. ఇలా రకరకాలుగా అలుపెరగని జీవిత పోరాటం చేసి నేడు అలసిసొలసిన వృద్ధులు. ప్రస్తుతం ఏమీ చేయలేని పరిస్థితి. ఇంట్లో ఉంటే ఏం తోచదు. బయటకు వెళ్లాలంటే ఎక్కడికి వెళ్లాలో తెలియదు. ఇక తమ కష్టసుఖాలను నలుగురితో పంచుకుందామంటే, ఎవరు అందుబాటులో ఉన్నారో తెలియదు. అలాంటి స్థితిలో ఉన్న వృద్ధులకోసం ఏర్పాటైందే వృద్ధుల డే కేర్ సెంటర్. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఈ చక్కటి ఆలోచనకు శ్రీకారం చుట్టారు మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్. మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ సహకారం తీసుకుని స్థానిక కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లే దారిలోని కాలేజీరోడ్డులో ఉన్న ఓ పాత భవనాన్ని రూ. 20 లక్షలు వెచ్చించి మరమ్మతులు చేయించి ఈ కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. భవన ఆవరణను అందమైన మొక్కలతో ముస్తాబు చేయించారు. గదిలో టీవీ, ఆడుకునేందుకు వస్తువులు, కూర్చునేందుకు కుర్చీలు, బల్లలు, ఫిజియోథెరపీ పరికరాలు ఇలా అనేకం సమకూర్చారు. ఈ డే కేర్ సెంటర్‌కు మహిళలు, పురుషులు ఎవరైనా ప్రతి రోజూ వచ్చి వెళ్లొచ్చు. ఎలాంటి ప్రవేశ రుసుమూ లేదు. అన్ని రకాల సేవలను ఉచితంగా పొందొచ్చు. ఈ సెంటర్ చుట్టూ ఖాళీ స్థలం ఎక్కువగా ఉండడంతో, పచ్చని గార్డెనింగ్‌ను ఏర్పాటు చేసి, కేంద్రానికి వచ్చే వృద్ధులకు మరింత ఆహ్లాదాన్ని పంచుతున్నారు. రాష్ట్రంలోనే మొదటిది.. తెలంగాణలోనే మొట్ట మొదటిసారిగా వృద్ధు లకు కాలక్షేపంతోపాటు, ఆరోగ్యాన్ని అందిం చేలా వైద్య పరీక్షలు, ఉల్లాసం, ఉత్సాహం నింపే లా ఆట వస్తువులు, వినోదం అందించేందుకు టీవీ, దినపత్రికలతో మంచిర్యాలలో వృద్ధుల డే కేర్ సెంటర్ ఏర్పాటైంది. జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ చొరవతో ఏర్పాటైన దీనికి ‘సన్‌షైన్ వృద్ధుల డేకేర్ సెంటర్’ అని పేరు పెట్టారు. డే కేర్ సెంటర్ ఉద్దేశం.. వృద్ధుల్లో మనోధైర్యాన్ని నింపుతూ, వారి హక్కుల గురించి గానీ, వారికి ప్రభుత్వం అందించే సదుపాయాలు, పథకాల గురించి తెలుసుకునేందుకు, కష్టసుఖాలు పంచుకుంటూ రోజంతా ఉల్లాసంగా గడిపేందుకు ఏర్పాటు చేసిందే ఈ కేంద్రం. అనారోగ్యంతో బాధపడే వృద్ధులకు ప్రతీ మంగళవారం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తారు. ఫిజియో థెరపీ అవసరం ఉన్న వారికి సైతం ప్రత్యేకంగా ఒక బెడ్డు, సైక్లింగ్ వంటివి ఏర్పాటు చేశారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ కేంద్రం తెరిచి ఉంటుంది. ఇక్కడ అన్ని రకాల దిన పత్రికలు, వినోదాన్ని పంచేందుకు టీవీ, ఇండోర్ గేమ్స్‌తో కాలక్షేపం చేసేందుకు చెస్, క్యారంబోర్డు ఉన్నాయి. షటిల్‌కోర్టు సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఇది మంచి వేదిక అన్ని హంగులతో రూపొందించిన డే కేర్ సెంటర్ ఏర్పాటు చేయ డం గొప్ప వరం. ఎక్కడా లేనివిధంగా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఈ ఏర్పాటు చేశారు. వారికి కృతజ్ఞతలు. వృద్ధులు అనేక విషయాలు పంచుకునేందుకు ఇదో వేదిక. 2007లో ఏర్పాటు చేసిన మెయిం టెనెన్సు సీనియర్ సిటిజన్స్ చట్టంపై అవగాహన కల్పిస్తాం. – బొలిశెట్టి రాజలింగు, జిల్లా సీనియర్ సిటిజన్ సంఘం అధ్యక్షుడు మరో పదేళ్లు బతకొచ్చు.. వృద్ధులైన తర్వాత ఏం తోచక సమయాన్ని వృథా చేసుకుంటూ, ఆరోగ్యపరంగా, మానసికంగా బాధపడుతూ ఉంటారు. ఈ డే కేర్ సెంటర్‌కు రావడం వల్ల కొత్త పరిచయాలు, కొత్త విషయాలను తెలుసుకోవడం, రోజంతా నవ్వుతూ, బాధలు, సంతోషాలను పంచుకుంటుండడం వల్ల మరో పదేళ్ల ఆయుష్షు పెరుగుతుంది. – ఎన్. వెంకటేశ్వర్రావు, సీనియర్ సిటిజన్ అసోసియేట్ అధ్యక్షుడు -
డే కేర్లతో డేంజర్
‘డే కేర్’లలో బంధాలకు దూరమవుతున్న రేపటి తరం ఆయాల పాలనలో బాల్యం చిన్నారులను నిద్రపుచ్చేందుకు ‘కాఫ్ సిరప్’ వాడకం పసిమొగ్గల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఐదేళ్ల వరకు ఆటపాటల్లో గడపాల్సిన బాల్యం.. ఐదు నెలలకే డే కేర్ పరం అవుతోంది. అమ్మ ఒడి వెచ్చదనాన్ని మనసారా ఆస్వాదించాల్సిన చిన్నారులు.. ఏడాది కూడా దాటకుండానే ప్లే స్కూల్స్‌లో ఆయమ్మల దగ్గరకు చేరుతున్నారు. మారుతున్న జీవనశైలి, దంపతులిద్దరూ ఉద్యోగాలు చేయాల్సి రావడంతో చిన్నారులు ఇంట్లో ఆహ్లాదకరమైన జీవనాన్ని పొందలేకపోతున్నారు. ఇదిలా ఉంటే డే కేర్ సెంటర్లకు సంబంధించిన మరికొన్ని ఆందోళనకరమైన అంశాలు ‘డే కేర్’ సెంటర్లను ‘డేంజర్’ సెంటర్లగా మార్చేస్తున్నాయి. డే కేర్ సెంటర్లలోని చిన్నారులు త్వరగా నిద్రపోయేందుకు గాను అక్కడి సిబ్బంది వారికి ‘కాఫ్ సిరప్’ను అలవాటు చేస్తున్నారని ఇటీవలి కాలంలో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో చిన్నారుల ఆలనా, పాలనా విషయంలో డే కేర్ సెంటర్లు ఎంతవరకు సురక్షితమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ‘చిల్డ్రన్ పార్లమెంట్’లో చర్చ.... ఇక అమ్మ ఒడిలో హాయిగా సాగాల్సిన బాల్యం డేకేర్ సెంటర్లలో నలిగిపోతుండడంపై ఇటీవల నగరంలో నిర్వహించిన ‘చిల్డ్రన్ పార్లమెంట్’లో చర్చ జరిగింది. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన చిన్నారులతో ముఖ్యమంత్రి సమావేశమైన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ‘డే కేర్’ సెంటర్ల పనితీరుపై విద్యార్థులు ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. నగరంలోని అనేక డే కేర్ సెంటర్లలో చిన్నారులను త్వరగా నిద్రపుచ్చేందుకు ‘కాఫ్ సిరప్’లను వినియోగిస్తున్నారని, తద్వారా చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర దుష్పరిణామాలు కనిపిస్తున్నాయని వారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అదే వేదికపై ఉన్న రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉమాశ్రీ ఈ విషయం పై స్పందిస్తూ...‘ఇలాంటి విషయాలు మా దృష్టికి కూడా వచ్చాయి. అందుకే ఇక నుంచి డే కేర్ సెంటర్ల ఏర్పాటుకు సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నాం’ అని ప్రకటించారు. భద్రం ఎంత? నగరంలో ప్రస్తుతం వీధికొక డే కేర్ సెంటర్ కనిపిస్తోంది. తమ ఇంటికి దగ్గరగా ఉందనే కారణంతో చాలా మంది తల్లిదండ్రులు ఆ డే కేర్ సెంటర్ లేదా ప్లేస్కూల్ తమ బిడ్డలకు ఎంత వరకు సురక్షితం అనే అంశంపై తక్కువగా శ్రద్ధ పెడుతున్నారు. అయితే ఇది ఎంత మాత్రం సరైంది కాదని నిపుణులు పేర్కొంటున్నారు. చిన్నారులను డే కేర్ సెంటర్లలో చేర్చడానికి ముందు అక్కడ నిపుణులైన సిబ్బంది ఉన్నారా లేదా అనే విషయాన్ని పరిశీలించాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం నగరంలోని చాలా డే కేర్ సెంటర్లలో పిల్లల పెంపకంపై ఏ మాత్రం అవగాహన లేని వారిని సైతం నియమిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాదు నగరంలోని చాలా వరకు డే కేర్ సెంటర్లలో సరైన శుభ్రత కూడా కనిపించడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. చిన్నారుల శరీరం చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి, ఏ మాత్రం అపరిశుభ్ర వాతావరణం వారి దరికి చేరినా వెంటనే అనారోగ్యం బారిన పడతారు. అందుకే డే కేర్‌లోని పరిసరాలతో పాటు అక్కడి సిబ్బంది కూడా తప్పని సరిగా శుభ్రతను పాటించాల్సి ఉంటుంది. డే కేర్లలో పిల్లలను చేర్చే ముందు పై విషయాలన్నింటిని ఓ సారి పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. చిన్న కుటుంబాలు కావడంతోనే... ప్రస్తుతం బెంగళూరు లాంటి మెట్రో నగరాల్లో దంపతులిద్దరూ తప్పక పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోజు రోజుకు పెరుగుతున్న ఖర్చులతో ఇంటిని నడపాలంటే దంపతులిద్దరూ ఉద్యోగాలు చేయాల్సి వస్తోంది. దీంతో పాటు నగరంలో దాదాపు అన్నీ చిన్న కుటుంబాలే కనిపిస్తున్నాయి. ఎక్కడో స్వగ్రామంలో పెద్దలు ఉంటున్నారు. దీంతో ఇంట్లోని చిన్నారుల పెంపకం పెద్ద సవాల్‌గానే మారిందని చెప్పవచ్చు. ఈ పరిస్థితుల్లో తమ చిన్నారిని కేవలం ఐదారు నెలల్లోనే డే కేర్ లేదా ప్లే స్కూల్లలో తల్లిదండ్రులు చేర్పిస్తున్నారు. ఉదయం దంపతులిద్దరూ ఆఫీసుకు వెళ్లే సమయంలో పాపాయిని డే కేర్సెంటర్లో వదిలి వెళ్లి, తిరిగి సాయంత్రం ఆఫీసు నుండి వచ్చేటపుడు తమతో పాటు తీసుకొస్తున్నారు. ఇల్లే మొట్టమొదటి పాఠశాల... చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలకు తల్లిదండ్రుల ఆత్మీయ స్పర్శ అత్యంత ఆవశ్యకమని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లల్లో పెరుగుదల బాగా కనిపించే ఐదేళ్ల వయసు వరకు వారికి ఇల్లే పాఠశాల కావాలని చెబుతున్నారు. చిన్నారులు తమ భావోద్వేగాలను తల్లిదండ్రులతో పంచుకున్నట్లుగా మరెవరితోనూ పంచుకోలేరని మానసిక నిపుణురాలు డైసీ చెబుతున్నారు. ఇంట్లో పిల్లలు పెరుగుతుంటే వారికి ఆత్మీయతలు, అనుబంధాలు, వరుసలు తెలుస్తాయని అంటున్నారు. ‘ఇంట్లో తల్లిదండ్రులు అందించే ప్రేమాభిమానాలు చిన్నారుల ఎదుగుదలలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. మూడేళ్ల వరకు తల్లి ఒడిలో పెరిగిన చిన్నారులు ఆరోగ్యంగా ఎదుగుతారని సర్వేలు కూడా చెబుతున్నాయి. ఒక వేళ తల్లిదండ్రులిద్దరూ తప్పక ఉద్యోగానికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటే పెద్దలైన నాయనమ్మ-తాతయ్య లేదా అమ్మమ్మ-తాతయ్యల సహాయం తీసుకోండి. వారిని ఊరి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి పిల్లల సంరక్షణా భారాన్ని పెద్దల చేతికి అందివ్వండి’ అని నగరానికి చెందిన ప్రముఖ మానసిక నిపుణురాలు డైసీ తెలిపారు.