మరో కోవిడ్‌.. అడినో వైరస్‌ | - | Sakshi
Sakshi News home page

మరో కోవిడ్‌.. అడినో వైరస్‌

Published Sun, Sep 10 2023 2:06 AM | Last Updated on Sun, Sep 10 2023 8:04 AM

- - Sakshi

కర్ణాటక: వాతావరణంలో మార్పులు.. తీవ్రమైన ఎండలు, మబ్బులతో కూడుకున్న పరిస్థితి, అప్పుడప్పుడు వర్షం రావడం అనేవి బాలల ఆరోగ్యానికి తీవ్ర ఇబ్బందిగా మారాయి. దీంతో రాష్ట్రంలో అంటురోగాల భయం నెలకొంది. ప్రధానంగా అడినో వైరస్‌ చిన్నపిల్లలను బాధపెడుతోంది. రాష్ట్రంలో వివిధ ఆసుపత్రుల్లో ఈ జబ్బుతో చికిత్స పొందుతున్న చిన్నపిల్లల సంఖ్య ఎక్కువగా ఉంది. బెంగళూరు ఇందిరాగాంధీ చిన్నపిల్లల ఆసుపత్రిలో వివిధ రకాల జబ్బులతో చికిత్స పొందుతున్న పిల్లల్లో 20 శాతం మంది అడినో వైరస్‌ బాధితులు ఉన్నారు.

బాలలకే అధిక ముప్పు: వైద్యులు
అడినో వైరస్‌తో పాటు శ్వాసకోశ సమస్యలు, డెంగీ కేసులు నమోదు అవుతున్నాయి. రోగ తీవ్రత ఎక్కువగా ఉన్న పిల్లలను చేర్చుకుని చికిత్స అందిస్తున్నామని ఇందిరాగాంధీ చిన్నపిల్లలు ఆసుపత్రి డాక్టర్‌ నిజగుణ తెలిపారు.

అడినోవైరస్‌ జబ్బుకు కచ్చితమైన చికిత్స లేదు, దీంతో రోగ లక్షణాలు ఆధారంగా వైద్యం అందిస్తున్నాం, పెద్దవారి కంటే బాలలు ఎక్కువగా వైరస్‌కు గురవుతున్నట్లు కేసీ.జనరల్‌ ఆసుపత్రి చిన్నపిల్లల వైద్యుడు డాక్టర్‌ లక్ష్మీపతి తెలిపారు.

అడినో వైరస్‌ రోగ లక్షణాలు

అడినో వైరస్‌ కళ్లు, శ్వాసకోశ, మూత్రనాళం, నాడీ వ్యవస్థలోకి చొరబడుతుంది.

జలుబు లేదా జ్వరం ప్రారంభ లక్షణాలు. గొంతు గరగర, నొప్పి, తరువాత తీవ్రమైన శ్వాసకోశ సమస్యలైన బ్రాంకై టిస్‌, న్యూమోనియాకు దారితీయవచ్చు.

► అలాగే కడుపులో నొప్పి, వాంతులు, విరేచనాలు మొదలవుతాయి. సరైన చికిత్స అందకపోతే మెదడు, వెన్నుముక దెబ్బతినే ప్రమాదముంది.

అడినోవైరస్‌ రోగుల్లో వాంతులు, విరేచనాల వల్ల దేహం నిర్జలీకరణమౌతుంది. దీంతో ద్రవ ఆహారం, పండ్ల రసం, నీరు అందించాలి.

డాక్టర్ల సూచనతో ముక్కు స్ప్రే, చుక్కలు వాడితే శ్వాస బాగా ఆడుతుంది. వేడి, తాజా ఆహారం అందించాలి, రోగితో పాటు కుటుంబ సభ్యులు పరిశుభ్రత పాటించాలి.

కోవిడ్‌ తరహా నియంత్రణ చర్యలు

కోవిడ్‌ నియంత్రణ చర్యలనే అడినో వైరస్‌ విషయంలోనూ పాటించాలి

రోగ లక్షణాలు కనబడిన వెంటనే ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలి

వైరస్‌ నుంచి కాపాడుకోవడానికి మాస్కు ధరించాలి

చేతులను తరచూ సబ్బు లేదా శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి

తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వస్త్రం అడ్డు పెట్టుకోవాలి

ఈ వైరస్‌.. ఇట్టే వ్యాపిస్తుంది
అడినో వైరస్‌ అనేది నెమ్మదిగా తీవ్ర దశకు చేరుకుని ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే రోగం. అంటే అచ్చం కరోనా వైరస్‌ మాదిరిగానే ఉంటుంది. రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారు అస్తమాతో పాటు శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారి మీద అడినో వైరస్‌ తీవ్ర ప్రభావం చూపుతుంది.

డే కేర్‌ సెంటర్లు, పాఠశాలల్లో పిల్లలు గుంపులుగా చేరే చోట్ల ఈ వైరస్‌ అధికంగా ప్రబలుతుందని వైద్యనిపుణులు తెలిపారు. బాధితుడు దగ్గినప్పుడు, లేదా చీదినప్పుడు వైరస్‌ గాలిలో చేరి ఇతరులకు సోకుతుంది.

తుమ్మిన తుంపర ప్రదేశాలలో పడినప్పుడు వాటిని తాకిన వ్యక్తులు చేతుల ద్వారా కళ్లు, ముక్కు, నోటిలోకి వైరస్‌ చేరుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement