యశవంతపుర: కర్ణాటక– కేరళ సరిహద్దుల్లో నిఫా వైరస్ కారణంగా ఇద్దరు మృతి చెందారు. దీంతో కేరళను ఆనుకుని ఉండే దక్షిణ కన్నడ జిల్లా సుళ్య తాలూకాలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కేరళ కల్లికోట ప్రాంతంలో నిఫా వల్ల మరణాలు సంభవించడంతో అక్కడ కంటైన్‌మెంట్ చేపట్టారు. ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలపై నియంత్రణ ఉంది. అక్కడి మలప్పురం, కణ్ణూరు, వయనాడు, కాసరగోడు జిల్లాల పరిధిలో నివారణ చర్యలు చేపట్టారు.
కాసరగోడు జిల్లాకు– దక్షిణ కన్నడ మధ్య నిత్యం ప్రజలు వస్తూ పోతూ ఉంటారు. అలాగే కేరళ నుంచి మడికెరి, మైసూరు, మంగళూరుకు పనుల మీద వస్తుంటారు. దీంతో నిఫా వైరస్ వ్యాప్తిపై ఆందోళన నెలకొంది. గబ్బిలం కరిచిన పండ్లను తినరాదని అధికారులు ప్రకటించారు. సుళ్య తాలూకాలో ఆరోగ్య కేంద్రాలు, ప్రైవేట్ ఆస్పత్రులకు జ్వరంతో వస్తున్న వ్యక్తులకు చికిత్సలు చేసి వివరాలను సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు నిఫా కేసులు దక్షిణ కన్నడ జిల్లాలో నమోదు కాలేదు.
నిఫా వైరస్ కలిగిన గబ్బిలాలు కొరికిన పండ్లు, ఆహారాన్ని తిన్నవారికి ఆ వైరస్ సోకే అవకాశముంది. తీవ్రమైన జ్వరం, తలనొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, ఒంటి నొప్పులు, వాంతులు దీని లక్షణాలు. బాధితులు వెంటనే వైద్యులను కలిసి చికిత్స తీసుకోవాలి. ఈ గబ్బిలాలు కొరకడం వల్ల పందుల్లోనూ నిఫా వైరస్ కనిపించింది. ఈ రెండు జంతువులకు దూరంగా ఉండడం ఉత్తమం. బాధితుల దగ్గు, తుమ్ము, లాలాజలం నుంచి ఇతరులకు సులభంగా వ్యాప్తి చెందుతుంది.
Comments
Please login to add a commentAdd a comment