బనశంకరి: రాష్ట్రంలో కళ్లకలక (మద్రాస్ ఐ వైరస్) జబ్బు కలకలం సృష్టిస్తోంది. ఆస్పత్రుల్లో ఈ జబ్బు బాధితులతో కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ముందు జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్యశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. కంజక్టివైటీస్ అని పిలిచే మద్రాస్–ఐ, లేదా కంటి వైరస్ వ్యాధులు ఎంతో చికాకు కలిగిస్తాయి. వాతావరణంలో తేమ అధికంగా ఉండటం, లేదా చలి వాతావరణంలో పుట్టుకు వచ్చే వైరస్‌లు కంటిపై ప్రభావం చూపిస్తాయి.
దీనికి తోడు నగరంలో విపరీతమైన రద్దీలో నలుగురైదుగురు బాధితులు సంచరించినా వైరస్ సులభంగా ఇతరులకు వ్యాపిస్తోంది. కొన్నిరోజులుగా వానలు, తడి వాతావరణం వైరస్‌కు దోహదం చేసింది. కేసులు రోజురోజుకు హెచ్చుమీరుతున్నందున జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్యశాఖ హెచ్చరించింది.
ముందుజాగ్రత్త చర్యలు
► స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇవ్వాలి
► ఆరోగ్యవంతమైన వ్యక్తి వైరస్ సోకిన వ్యక్తి కంటిని నేరుగా చూడరాదు, బాధితులకు దూరంగా ఉండాలి.
► వైరస్ సోకిన వ్యక్తి వినియోగించిన టవల్, ఇతరవస్తువులను వాడరాదు
► అప్పుడప్పుడు సబ్బు నీటితో చేతులు శుభ్రం చేసుకోవాలి
► వైరస్ సోకిన వ్యక్తులకు జలుబు, జ్వరం, దగ్గు ఉంటే తక్షణం చికిత్స తీసుకోవాలి
కళ్లకలక లక్షణాలు
♦ కళ్లు ఎర్రగా మారడం, నీరుకారడం
♦ కంటి నొప్పి – వెలుతురు చూడలేకపోవడం దృష్టి మందగించడం
♦ కంటి రెండురెప్పలు వాచిపోయి ఉబ్బెత్తుగా మారడం
వైద్యులను సంప్రదించండి
♦ బాధితులు వెంటనే వైద్యున్ని సంప్రదించాలి
♦ స్వచ్ఛమైన నీటితో కళ్లను శుభ్రం చేసుకోవాలి
♦ పౌష్టికాహారం తీసుకోవాలి
♦ వీలైనంతగా ఇంట్లో విశ్రాంతిగా ఉండాలి
బెంగళూరు మల్లేశ్వరం మార్కెట్లో జనరద్దీ, దీనివల్ల వైరస్ సులభంగా వ్యాప్తి చెందుతుంది
Comments
Please login to add a commentAdd a comment