మానసిక సమస్యలకు వైద్యం తీసుకోవడం ఉత్తమం
శివాజీనగర: శరీరానికి వచ్చినట్లే మనసుకూ అనారోగ్యాలు వస్తుంటాయి. అయితే వీటిపై ప్రజలలో మూఢనమ్మకాలు ఉన్నాయి. మానసిక అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స తీసుకుంటుంటే సమాజం వారిని పిచ్చివారిగా, వీరికి చికిత్స చేసే వారిని పిచ్చి డాక్టర్లుగా పరిహసిస్తూ సమస్యను మరింత జటిలం చేస్తోంది. ఇది చాలా తప్పుడు పద్ధతి అని చెప్పనవసరం లేదు. మానసిక అనారోగ్యానికి చికిత్స కల్పించే బాధ్యత కుటుంబం, సమాజంపై ఉంది. ఈ దిశగా మానసిక రోగాలను తెలుసుకోండి–మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోండి అనే నినాదంతో ప్రపంచవ్యాప్తంగా మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని ప్రతి ఏటా అక్టోబర్ 10న జరుపుతుంటారు. ఈసారి ప్రపంచ ఆరోగ్య సంస్థ మానసిక ఆరోగ్యం ప్రతి ఒక్కరి మానవ హక్కు అనే నినాదం ఇచ్చింది.
తీవ్రమైన పోటీ, దురలవాట్లతో సమస్య
ప్రస్తుతం సమాజంలో చదువులు, ఉద్యోగం, వ్యాపారం, ఆస్తుల సంపాదన సహా అనేక రంగాలలో తీవ్రమైన పోటీ నెలకొంది. మద్యం, డ్రగ్స్ వంటి దురలవాట్లు వ్యాపించాయి. అవి సులభంగా మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తున్నాయి. దీంతో డిప్రెషన్‌కు గురవుతున్న వారి సంఖ్య పెరిగింది. ఇందులో పీయూసీ విద్యార్థుల నుంచి డైబ్భె ఏళ్ల వృద్ధుల వరకూ ఉంటున్నారు. సమర్థతకు మించి పెట్టుకుంటున్న లక్ష్యాలు కూడా గాయపరుస్తాయి. షిప్ట్ ఉద్యోగాల వల్ల జీవితంలో సమతుల్యత లోపిస్తుంది. ఇక భార్యాభర్తలు సర్దుకుపోయే మనస్తత్వం తగ్గి, ప్రతిచిన్న అంశాన్ని పెద్దది చేసుకుని విడాకుల వైపు అడుగులు తీస్తున్నారు. ఇది కూడా ఒక రకమైన మానసిక అనారోగ్యమే అని డాక్టర్లు అంటున్నారు.
10 శాతం మందే చికిత్స తీసుకుంటున్నారు
మానసిక అనారోగ్యంపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలి. విపరీతమైన జ్వరం, కోపం, నిద్రలేమి ఇలాంటివి ఉన్నపుడు తక్షణమే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. మానసిక అనారోగ్యం చికిత్స కోసం సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్లడంలో సిగ్గు పడాల్సిన అవసరం లేదు. సమస్యలు వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు, స్నేహితులతో చెప్పుకోవాలి. ప్రస్తుతం 13 శాతం మంది ఏదో ఒక మానసిక అనార్యోగానికి గురవుతుంటే, అందులో 10 శాతం మందికి మాత్రమే చికిత్స అందుతోంది. మిగతావారు అలాగే బాధపడుతున్నారు. నిర్లక్ష్యం చేయడం అనేది తీవ్ర పర్యవసానాలకు దారితీస్తుంది. కాబట్టి వైద్యచికిత్సలు తీసుకోవాలి. సమాజంతో సంబంధాలు పెంపొందించుకుని ఒంటరి జీవితానికి దూరంగా ఉండాలి.
–డాక్టర్ హెచ్.చంద్రశేఖర్, విక్టోరియా ఆస్పత్రి
ఉన్నంతలో సర్దుకుపోవాలి
డిప్రెషన్‌కు లోనుకాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా ఆలోచిస్తూ స్థాయికి మించి పనులు చేయడం వల్ల కూడా మానసిక ఆరోగ్యం భంగపడే అవకాశముంది. ఉన్నదాంట్లో సర్దుకుపోవడం అలవాటు చేసుకోవాలి. రోజూ యోగా, వ్యాయామంతో పాటు మనస్సు ప్రశాంతంగా ఉండేందుకు ధ్యానం తప్పనిసరిగా చేయాలి. బెంగళూరు నగర వ్యాప్తిలో 2016 నుంచి అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా మానసిక అనార్యోగానికి చికిత్స ఇస్తున్నారు.
–డాక్టర్ విక్రమ్, మానసిక వైద్య నిపుణుడు, బీబీఎంపీ
Comments
Please login to add a commentAdd a comment