నేత్రదానం, రక్తదానం గురించి అందరికీ తెలుసు కానీ చర్మదానం గురించి తెలిసింది తక్కువే. కానీ నానాటికీ విస్తరిస్తున్న వైద్యరంగంలో చర్మం ప్రాధాన్యత ఎనలేనిది. మంచి చర్మం ఆరోగ్యానికి సూచిక. అలాగే కాలిన గాయాలు, ప్రమాదాలు, జబ్బుల వల్ల అనేకమంది రోగులకు కొత్త చర్మం అవసరమవుతూ ఉంటుంది. అలాంటప్పుడు రాజధానిలోని విక్టోరియా ఆస్పత్రిలోని స్కిన్‌బ్యాంకు కొంతమేర ఆదుకుంటోంది.
కర్ణాటక: రాష్ట్రంలో ప్రప్రథమంగా చర్మ నిధి (స్కిన్ బ్యాంక్) ప్రారంభమైన ఏడేళ్లలో దాతల సంఖ్య 200 కు చేరుకుంది. అయినప్పటికీ చర్మదానం గురించి సమాజంలో అవగాహన లోపించినందున దాతల సంఖ్య పెరగడం లేదు. బెంగళూరు వైద్య పరిశోధనా సంస్థ (బీఎంసీఆర్‌ఐ) ఆధ్వర్యంలోని విక్టోరియా ఆసుపత్రిలో రోటరీ ఆశీర్వాద్ సంయుక్త ఆధ్వర్యంలో 2016లో చర్మనిధి ఏర్పాటైంది. అప్పటినుంచి ఇప్పటివరకు 197 మంది దాతలనుంచి త్వచాన్ని సేకరించారు. ప్రమాదాలు, జబ్బులకు గురైనవారికి చికిత్సకోసం చర్మానికి అధిక డిమాండ్ ఉంది.
ఇతర రాష్ట్రాల నుంచి వినతులు
కర్ణాటక మాత్రమే కాదు తెలుగు రాష్ట్రాలు, ఒడిశా, ఇంకా పలు రాష్ట్రాల నుంచి చర్మం కావాలని ఈ కేంద్రానికి వినతులు వస్తుంటాయి. కానీ అందులో 60 శాతం మాత్రమే సరఫరా సాధ్యమైందని తెలిపారు. కాలిన ప్రమాదాలలో గాయపడినవారికి స్కిన్ గ్రాఫ్టింగ్ చికిత్సకు చర్మం అవసరమని బీఎంసీఆర్‌ఐ ప్లాస్టిక్ సర్జరీ విభాగం చీఫ్ కేటీ.రమేశ్ తెలిపారు. ప్రస్తుతం చర్మ నిధిలో 12 వేల చదరపు సెంటీమీటర్ల చర్మం నిల్వలు ఉన్నాయి. చర్మదానం గురించి ప్రజల్లో జాగృతం చేయడానికి సోషల్ మీడియా ప్రచారం సహా విద్యాసంస్థలు, వృద్ధాశ్రమాలను సందర్శించి వివరిస్తున్నామని తెలిపారు.
చర్మదానానికి ఎందుకు వెనుకంజ
ప్రజలు నేత్రదానం, ఇతర అవయవ దానం చేయడానికి ప్రమాణపత్రం ఇస్తారు. ఉత్సాహంగా రక్తదానం చేస్తారు. కానీ చర్మదానం చేయడం లేదని వైద్యులు తెలిపారు. చర్మం తీయడం బాధాకరంగా ఉంటుంది, శస్త్రచికిత్స చేస్తారు వంటి అపోహలే ఇందుకు కారణమన్నారు. చర్మదానం అంటే శరీర భాగమంతా చర్మం తీసుకోరు. తొడలు, కాళ్ల నుంచి కొన్ని సెంటీమీటర్ల చర్మం పొరను మాత్రమే తీసుకుంటారు. ఏర్పడిన చిన్నపాటి కోత త్వరలోనే మానిపోతుంది.
కాలిన బాధితులకు కావాలి
విక్టోరియా ఆసుపత్రిలో మహాబోధి కాలిన గాయాల వార్డులో అనేకమంది రోగులకు చర్మం అవసరం పడుతూ ఉంటుంది. ప్రతి నెల ఇక్కడ 220 మంది కాలిన గాయాలతో చేరుతుండగా వారిలో 70 శాతం కేసులు తీవ్రంగా ఉంటాయి. దీంతో ఎక్కువశాతం వీరి అవసరాలకే చాలడం లేదు. ఆరోగ్యవంతులు ఎవరైనా చర్మాన్ని ధారపోయవచ్చు. విరివిగా చర్మదానం చేయడం వల్ల ఎంతోమంది క్షతగాత్రుల జీవితాలకు సాయం చేసినట్లు అవుతుంది.
దాతల్లో హెచ్చుతగ్గులు
చర్మనిధికి 2016లో 18 మంది దాతలు రాగా, 2017లో 40 కి పెరిగింది. కానీ మళ్లీ తగ్గిపోయింది.
2018లో 33 మంది దాతలు ఉండగా ఆపై 17కు పడిపోయింది.
2020లో కోవిడ్ మహమ్మారి సమయంలో 9 మంది మాత్రమే చర్మదానం చేశారు. 2021 నాటికి 18కి, 2022లో 40 కి పెరిగింది.
ఈ ఏడాదిలో 22 మంది నుంచి చర్మం స్వీకరించారు. అలాగే 44 మంది రోగుల కోసం చర్మాన్ని పంపారు.
ఇప్పటివరకు 310 మంది నుంచి వినతి వస్తే 194 మందికి మాత్రం సరఫరా చేశారు. వీరిలో నాలుగేళ్ల బాలుర నుంచి 85 ఏళ్లు వృద్ధుల వరకూ ఉన్నారు.
అలాగే దాతల్లో 17 ఏళ్లు యువకుని నుంచి 98 ఏళ్లు వృద్ధుని వరకు 197 మంది దానం చేశారని చర్మనిధి పర్యవేక్షకుడు బీఎన్.నాగరాజ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment