కర్ణాటక: యువతపై ప్రమాదకరమైన క్యాన్సర్ మహమ్మారి పంజా విసురుతోంది. ఉరకలు వేసే వయసులో కుటుంబానికి ఆసరాగా ఉండాల్సిన యువత క్యాన్సర్‌తో నిర్వీర్యమవుతోంది. 2010–2019 మధ్యకాలలో 50 ఏళ్లలోపు వయసువారిలో ప్రతి లక్ష మందిలో 103 మంది క్యాన్సర్ జబ్బుకు గురవుతున్నట్లు ఒక ప్రపంచస్థాయి అధ్యయనంలో వెల్లడైంది. ఇది ప్రపంచంలోని అన్ని మెట్రో నగరాలే కాదు.. బెంగళూరులో కూడా సమస్యాత్మకంగా ఉంది.
క్యాన్సర్ రోగాల్లో రొమ్ము క్యాన్సర్ చిన్నవయసువారిలో సర్వసాధారణం కావడం విషాదకరం. పెద్ద పేగు, జీర్ణకోశ క్యాన్సర్‌తో పాటు గొంతు క్యాన్సర్ సమస్యలు 15 శాతం పెరిగాయి. పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ జబ్బుల ముప్పునకు ఎక్కువ అవకాశం కనిపించింది. 50 ఏళ్లలోపు కంటే తక్కువ వయసు పురుషుల్లో క్యాన్సర్ ప్రమాణం 5 శాతాని కంటే తక్కువగా ఉంది. ఏషియా నివాసులు, పసిఫిక్ ద్వీపవాసులు, లాటిన్ అమెరికా, దక్షిణ అమెరికన్లు, అలాస్కాలో క్యాన్సర్ రోగాలు పెరిగాయి.
క్యాన్సర్ కు కారణాలు..
30 నుంచి 39 ఏళ్ల వయసువారిలో క్యాన్సర్ ప్రమాదం ఎక్కువగా ఉంది. దీనికి కారణం ఏమిటనేది అస్పష్టంగా ఉంది. ప్రధాన కారణాలు అతిగా ఆహారం తినడం, ఊబకాయం, మద్యపానం, ధూమపానం, నిద్రలేమి, కాలుష్యం, విశ్రాంతి లేని జీవనశైలి తదితరాల వల్ల క్యాన్సర్ లక్షణాలు త్వరగా పాగా వేస్తున్నాయి.
మారిన ఆహార అలవాట్లతో గొంతు క్యాన్సర్
మారిన ఆహార అలవాట్లతో గొంతు క్యాన్సర్ సంబంధిత క్యాన్సర్లు పెరగ్గా అందులో ఎక్కువగా ఫ్యాటిఫుడ్, జింక్‌ఫుడ్, హైషుగర్ వినియోగంతో శరీరం లోపల చేరిన కొవ్వు అంశాలు క్యాన్సర్‌కు కారణాలు. దీంతో గతంలో మన ఆహార అలవాట్లను అంటే.. ఇంట్లో తయారుచేసిన తాజా, పరిశుద్ధమైన ఆహారసేవనం అలవరచుకోవడం మంచిదని క్యాన్సర్ రోగ నిపుణుడు డాక్టర్. విశాల్‌రావ్ తెలిపారు.
పొగాకు కారణం
ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో క్యాన్సర్ కేసులు పెరగడానికి పొగాకు ప్రధానకారణం. ప్రజలు బీడీ, సిగరెట్, గుట్కా లాంటి పొగాకును అతిగా వినియోగించడంతో నోరు, గొంతు క్యాన్సర్ బారినపడుతున్నారు. అంతేగాక 18 వేర్వేరు క్యాన్సర్లకు పొగాకు ప్రత్యక్ష, పరోక్షకారణమని వైద్యనిపుణులు తెలిపారు.
జాగ్గత్త చర్యలు..
►సమయానికి నిద్రపోవడం చాలా ముఖ్యం
►ఉత్తమ ఆహార అలవాట్లు అలవరచుకోవాలి
►బార్బెక్యూ పేరుతో మాడిపోయిన మాంసం తినడం, కారం, జంక్ ఫుడ్ సేవనానికి దూరంగా ఉండాలి
►పొగాకు, మద్యపానసేవనం నుంచి దూరంగా ఉండాలి
►టెక్ సిటీ బెంగళూరులో క్యాన్సర్ ముప్పు ఏటేటా పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. ఆధునిక వైద్య సౌకర్యాలు పెరిగేకొద్దీ దాని తీవ్రత కూడా అధికం కావడం గమనార్హం. ప్రత్యేకించి 19 ఏళ్లలోపు బాలలు, యువత ఎక్కవ మంది పలురకాల క్యాన్సర్లకు గురవుతున్నట్లు పలు అధ్యయనాలు తేల్చాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్లు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి వంద క్యాన్సర్ కేసుల్లో ఇవే 10 శాతం ఉండగా, తరువాత కడుపు క్యాన్సర్లు 6 శాతం, ప్రొస్టేట్.. 6 శాతం, అన్నవాహిక 5 శాతం, కాలేయం 4 శాతం కనిపించాయి. ఇక యువతులు, మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో 27 శాతం రొమ్ము, సర్విక్స్ క్యాన్సర్ 17 శాతంగా ఉన్నాయి. బెంగళూరులో క్యాన్సర్ జబ్బులు ఏటేటా 11 శాతం పెరుగుతున్నాయని, ఇది ఆందోళనకరమని కిద్వాయ్ వైద్యనిపుణులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment