Adenoids
-
మరో కోవిడ్.. అడినో వైరస్
కర్ణాటక: వాతావరణంలో మార్పులు.. తీవ్రమైన ఎండలు, మబ్బులతో కూడుకున్న పరిస్థితి, అప్పుడప్పుడు వర్షం రావడం అనేవి బాలల ఆరోగ్యానికి తీవ్ర ఇబ్బందిగా మారాయి. దీంతో రాష్ట్రంలో అంటురోగాల భయం నెలకొంది. ప్రధానంగా అడినో వైరస్ చిన్నపిల్లలను బాధపెడుతోంది. రాష్ట్రంలో వివిధ ఆసుపత్రుల్లో ఈ జబ్బుతో చికిత్స పొందుతున్న చిన్నపిల్లల సంఖ్య ఎక్కువగా ఉంది. బెంగళూరు ఇందిరాగాంధీ చిన్నపిల్లల ఆసుపత్రిలో వివిధ రకాల జబ్బులతో చికిత్స పొందుతున్న పిల్లల్లో 20 శాతం మంది అడినో వైరస్ బాధితులు ఉన్నారు. బాలలకే అధిక ముప్పు: వైద్యులు ► అడినో వైరస్‌తో పాటు శ్వాసకోశ సమస్యలు, డెంగీ కేసులు నమోదు అవుతున్నాయి. రోగ తీవ్రత ఎక్కువగా ఉన్న పిల్లలను చేర్చుకుని చికిత్స అందిస్తున్నామని ఇందిరాగాంధీ చిన్నపిల్లలు ఆసుపత్రి డాక్టర్ నిజగుణ తెలిపారు. ► అడినోవైరస్ జబ్బుకు కచ్చితమైన చికిత్స లేదు, దీంతో రోగ లక్షణాలు ఆధారంగా వైద్యం అందిస్తున్నాం, పెద్దవారి కంటే బాలలు ఎక్కువగా వైరస్‌కు గురవుతున్నట్లు కేసీ.జనరల్ ఆసుపత్రి చిన్నపిల్లల వైద్యుడు డాక్టర్ లక్ష్మీపతి తెలిపారు. అడినో వైరస్ రోగ లక్షణాలు ► అడినో వైరస్ కళ్లు, శ్వాసకోశ, మూత్రనాళం, నాడీ వ్యవస్థలోకి చొరబడుతుంది. ► జలుబు లేదా జ్వరం ప్రారంభ లక్షణాలు. గొంతు గరగర, నొప్పి, తరువాత తీవ్రమైన శ్వాసకోశ సమస్యలైన బ్రాంకై టిస్, న్యూమోనియాకు దారితీయవచ్చు. ► అలాగే కడుపులో నొప్పి, వాంతులు, విరేచనాలు మొదలవుతాయి. సరైన చికిత్స అందకపోతే మెదడు, వెన్నుముక దెబ్బతినే ప్రమాదముంది. ► అడినోవైరస్ రోగుల్లో వాంతులు, విరేచనాల వల్ల దేహం నిర్జలీకరణమౌతుంది. దీంతో ద్రవ ఆహారం, పండ్ల రసం, నీరు అందించాలి. ► డాక్టర్ల సూచనతో ముక్కు స్ప్రే, చుక్కలు వాడితే శ్వాస బాగా ఆడుతుంది. వేడి, తాజా ఆహారం అందించాలి, రోగితో పాటు కుటుంబ సభ్యులు పరిశుభ్రత పాటించాలి. కోవిడ్ తరహా నియంత్రణ చర్యలు ► కోవిడ్ నియంత్రణ చర్యలనే అడినో వైరస్ విషయంలోనూ పాటించాలి ► రోగ లక్షణాలు కనబడిన వెంటనే ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలి ► వైరస్ నుంచి కాపాడుకోవడానికి మాస్కు ధరించాలి ► చేతులను తరచూ సబ్బు లేదా శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి ► తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వస్త్రం అడ్డు పెట్టుకోవాలి ఈ వైరస్.. ఇట్టే వ్యాపిస్తుంది ► అడినో వైరస్ అనేది నెమ్మదిగా తీవ్ర దశకు చేరుకుని ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే రోగం. అంటే అచ్చం కరోనా వైరస్ మాదిరిగానే ఉంటుంది. రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారు అస్తమాతో పాటు శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారి మీద అడినో వైరస్ తీవ్ర ప్రభావం చూపుతుంది. ► డే కేర్ సెంటర్లు, పాఠశాలల్లో పిల్లలు గుంపులుగా చేరే చోట్ల ఈ వైరస్ అధికంగా ప్రబలుతుందని వైద్యనిపుణులు తెలిపారు. బాధితుడు దగ్గినప్పుడు, లేదా చీదినప్పుడు వైరస్ గాలిలో చేరి ఇతరులకు సోకుతుంది. ► తుమ్మిన తుంపర ప్రదేశాలలో పడినప్పుడు వాటిని తాకిన వ్యక్తులు చేతుల ద్వారా కళ్లు, ముక్కు, నోటిలోకి వైరస్ చేరుతుంది. -
అడినాయిడ్స్, టాన్సిల్స్ రెండు ఒక్కటేనా..?
చాలా మంది అడినాయిడ్స్, టాన్సిల్స్... ఈ రెండింటినీ ఒకటే అనుకుని పొరబడుతుంటారు. అడినాయిడ్స్‌లో సమస్య వస్తే టాన్సిల్స్ వాచాయని అనుకుంటుంటారు. కానీ అవి రెండూ వేర్వేరు. అసలు అడినాయిడ్స్ అంటే ఏమిటి, ఎక్కడ ఉంటాయి... అన్న విషయాలు తెలుసుకుందాం. అడినాయిడ్స్ ముక్కు లోపలి భాగానికి ఒకింత వెనకగా, నోటిలోపల అంగిటి పైభాగాన ఉంటాయి. అవి స్పాంజి కణజాలంతో తయారై మెత్తగా, గుంపులుగా అంటే ద్రాక్షగుత్తిలా ఉంటాయి. నోరు తెరవగానే టాన్సిల్స్ కనిపిస్తాయిగానీ, అడినాయిడ్స్ కనిపించవు. వీటిని చూడటానికి ఎండోస్కోప్ అనే పరికరాన్ని ఉపయోగిస్తారు. అదేగాకుండా తల ఎక్స్–రే తీసినప్పుడు కూడా వాటి పరిమాణం వంటివి తెలుస్తాయి. అడినాయిడ్స్ పనేంటి? ఇవి పిల్లలను ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుంటాయి. టాన్సిల్స్ లాగానే అడినాయిడ్స్ కూడా మనం గాలి పీల్చేటప్పుడు, తినేటప్పుడు ఎలాంటి హానికరమైన బ్యాక్టీరియాగాని, వైరస్‌గాని లోపలికి ప్రవేశించకుండా కాపాడతాయి. హానికరమైన బ్యాక్టీరియా తాలూకు యాంటీబాడీస్‌తో అడినాయిడ్స్‌లో ఉండే యాంటీబాడీస్ మనలోనికి శత్రుకణాలు ప్రవేశించినప్పుడు వాటితో పోరాడి మనల్ని ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి. అంటే... రక్షకభటుల్లా పనిచేసే ఇవి చిన్నపిల్లల్లోనే ఎక్కువగా కనిపిస్తాయి. చిన్నపిల్లల్లో వ్యాధినిరోధకశక్తి తక్కువగా ఉండి, వయసు పెరుగుతున్న కొద్దీ ఇమ్యూనిటీ పెరుగుతూ ఉంటుంది. అందుకే పిల్లలు పెద్దవుతున్న కొద్దీ అడినాయిడ్స్ సైజ్ తగ్గుతూ, అవి క్రమంగా కృశించిపోతూ ఉంటాయి. ఐదేళ్ల వయసులో అడినాయిడ్స్ కృశించిపోతాయి. యుక్తవయసుకు రాగానే అడినాయిడ్స్ ఉండవు. కొందరు పిల్లల్లో అడినాయిడ్స్ వాపు ఎందుకు? బ్యాక్టీరియాగాని, వైరస్‌గాని లోనికి ప్రవేశించినప్పుడు అడినాయిడ్స్ కణజాలంలో వాపు వస్తుంది. కణజాలంలో వాపు రావడం వల్ల అవి ఇన్ఫెక్షన్ నుంచి కాపాడలేవు. అవి క్రమంగా బ్యాక్టీరియా, వైరస్‌లతో నిండిపోతున్న కొద్దీ వాటిలో వాపు పెరుగుతూ పోతుంది. అలాంటి సమయాల్లో కొన్నిసార్లు టాన్సిల్స్ కూడా ఇన్ఫెక్షన్కూ, వాపునకు గురవుతాయి. ఇలా వాపు పెరగడంతో గాలి పీల్చుకోవడమూ కష్టమవుతుంది. దాంతో కొన్ని ఇబ్బందులూ వస్తాయి అవి... చిన్నపిల్లల్లో ముక్కురంధ్రాలు మూసుకుని పోయి గాలి పీల్చడం కష్టమై, నోటితో గాలి పీల్చుకుంటారు. కొంతమంది పిల్లలకు నిద్ర చక్కగా పట్టకపోవడం, తరచూ నిద్రాభంగం కావడం జరుగుతుంటుంది. నిద్రపోయేటప్పుడు పిల్లలో గురక వస్తుంది. గొంతునొప్పిగా ఉండి, మింగడం కష్టమవుతుంది. మెడప్రాంతంలో ఉన్న గ్రంథులు వాపునకు గురవుతాయి. వినికిడి సమస్యలూ తలెత్తవచ్చు. దాంతోపాటు దంతసమస్యలూ తలెత్తవచ్చు. చికిత్స: అడినాయిడ్స్ వాపు ఉన్న పిల్లలు తరచూ జ్వరాలతో, అస్వస్థతో బాధపడుతుంటారు. అడినాయిడ్స్‌లో వాపు ఉన్నప్పుడు యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేస్తారు. అడినాయిడ్స్కు వచ్చిన వాపు వంటి సమస్యలకు సకాలంలో చికిత్స పొందకపోతే వ్యాధి తీవ్రత పెరిగి మందులకు నయం కాకపోవచ్చు. దాని వల్ల అడినాయిడ్స్ తొలగించాల్సి పరిస్థితి రావచ్చు. వాటిని తొలగించాల్సిన ప్రక్రియను అడినాయిడెక్టమీ అంటారు. -
అడినాయిడ్స్కు ఆపరేషన్ అవసరం లేదు
హోమియో కౌన్సెలింగ్ మా పాపకు ఐదేళ్లు. తరచు జలుబు, ముక్కుదిబ్బడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటోంది. డాక్టర్‌గారు అడినాయిడ్స్ వాచాయని, వాటిని ఆపరేషన్ ద్వారా తొలగించాలనీ చెప్పారు. హోమియో చికిత్స ద్వారా మా పాప సమస్యకు పరిష్కారం చూపించగలరు. - రజని, హైదరాబాద్ మీరు ఆందోళన పడకండి. మీ పాపకు శస్త్రచికిత్స అవసరం లేకుండా అడినాయిడ్స్ సమస్యను హోమియో చికిత్స ద్వారా శాశ్వతంగా పరిష్కరించవచ్చు. నాసికా కుహరానికి వెనుక భాగంలో ఉండే మృదువైన లింఫాయిడ్ కణజాల సమూహాన్ని అడినాయిడ్స్ అంటారు. ఇవి శిశువులలో, చిన్నపిల్లల్లో ఇన్ఫెక్షన్ను కలిగించే బ్యాక్టీరియాను నశింపజేసి, వాటిని ఎదుర్కోవడంలో సాయం చేస్తాయి. ఇవి ఐదేళ్ల వయసు దాటిన తర్వాత కుంచించుకుపోతూ, యుక్తవయస్సు వచ్చేసరికి పూర్తిగా అదృశ్యమైపోతాయి. అయితే కొన్ని సందర్భాలలో అవి కొంతవాపునకు గురై, అవి కూడా ఇన్ఫెక్షన్కు గురికావడం వల్ల వాచి, శ్వాస ద్వారాలకు అడ్డుగా నిలుస్తాయి. దాంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుంది. దీనివల్ల నోటిదుర్వాసన, పెదాల పగుళ్లు, ముక్కుకారడం, ముక్కుదిబ్బడ, నోరు ఎండిపోయినట్లుగా అనిపించడం వంటి సమస్యలు తలెత్తుతాయి. దీనితోబాటు గొంతు భాగంలోని గ్రంథులలో కూడా వాపు, చెవి సమస్యలు కూడా ఎదురు కావచ్చు. నిర్ధారణ: వీటిని ప్రత్యేకంగా రూపొందించిన అద్దం ద్వారా ముక్కునుండి లోపలికి ప్రవేశపెట్టే ఎండోస్కోప్ ద్వారా, గొంతు ఎక్స్‌రే ద్వారా నిర్ధారించవచ్చు. చికిత్స: అధునాతనమైన జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ చికిత్స విధానంలో చికిత్స చేయడం ద్వారా అడినాయిడ్స్ సమస్యను పూర్తిగా నయం చేయవచ్చు. అంతేకాకుండా శరీర రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడం ద్వారా వ్యాధి శాశ్వతంగా, శస్త్రచికిత్సతో పని లేకుండా నయం అవుతుంది. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సిఎండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ అదే పనిగా నిలబడే ఉంటే...లైఫ్‌స్టైల్ కౌన్సెలింగ్ నేను ఒక సంస్థలో సేల్స్‌మేన్‌గా పనిచేస్తున్నాను. చాలాసేపు నిలబడే ఉండాలి. ఇటీవల నాకు కాళ్ల నొప్పులు ఎక్కువగా వస్తున్నాయి. ఇలా నిలబడే ఉండటం వల్ల నాకు ఇతరత్రా ఏమైనా సమస్యలు వస్తాయా? దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. - సతీశ్, హైదరాబాద్ మీలా చాలాసేపు కదలకుండా నిలబడి వృత్తుల్లో ఉన్న వారిలో (పోలీస్ మెన్, మెషిన్ ఆపరేటర్లు, సేల్స్ పర్సన్స్‌లో) కండరాలకు సంబంధించిన కొన్ని సమస్యలు వస్తుంటాయి. ఇలా శరీరాన్ని నిటారుగా ఉంచడంతో పాటు కొన్ని అవయవాలను కదలకుండా ఉంచడం వల్ల కొన్ని శరీర భాగాలకు సరైన రక్తప్రసరణ తగ్గిపోతుంది. దాంతో అవి తీవ్రమైన అలసటకు గురవుతాయి. ఇలా అదేపనిగా నిలబడేవారికి కాళ్లు, వెన్ను, మెడ సమస్యలు వస్తాయి. ఇలా సుదీర్ఘకాలం నిలబడే వృత్తుల్లో ఉన్నవారికి కండరాలకు సంబంధించిన సమస్యలేగాక కొన్ని ఇతర ఇబ్బందులూ ఉంటాయి. ఇలాంటివారు కాస్త నడవడం వల్ల కాళ్లకు, పాదాలకు రక్తప్రసరణ బాగా అవుతుంది. దాంతో వారికి కాస్త ఉపశమనం కలుగుతుంది. సుదీర్ఘంగా నిలబడి ఉండేవారిలో రక్తనాళల్లో ఇన్ఫ్లమేషన్ వస్తుంది. దీర్ఘకాలంపాటు కొనసాగితే అది వేరికోస్ వెయిన్స్ సమస్యగా మారవచ్చు. ఇలా చాలాసేపు నిలబడే ఉండటం వల్ల వెన్ను, తుంటి, మోకాళ్ల, పాదాల సమస్యలు రావచ్చు. కొన్నిసార్లు కీళ్లు బిగుసుకుపోయి, అచేతనంగా మారవచ్చు. ఇలా కీళ్లు బిగుసుకుపోవడం వల్ల కణాలు క్షీణించడం, టెండన్లు, లిగమెంట్ల నిర్మాణాలలో మార్పుల వంటి కండరాల సమస్యలు రావచ్చు. కొన్ని సూచనలు... మీ ఎత్తుకు తగినట్లుగా మీరు నిలబడి ఉండే బల్లల ఎత్తును సరిచేసుకోవాలి. మీ శరీరాకృతిని మరీ నిటారుగా కాకుండా, మరీ ఒంగిపోయి ఉనట్లుగా కాకుండా, సమతౌల్యంతో (వెల్ బ్యాలెన్స్డ్గా) ఉండేలా చూసుకోవాలి. ఉన్నచోటే నిలబడిపోకుండా అక్కడికక్కడే కాస్త అటు-ఇటు నడుస్తుండాలి. మీరు నిలబడే ప్రదేశం, మీ ఒంటి కదలికలకూ ఆస్కారమిచ్చేలా చూసుకోవాలి. మీ చేతిలో ఉన్న ఉపకరణాల కదలికలకూ తగిన స్థలం ఉండేలా చూసుకోవాలి. మీరు నిలబడి పనిచేసే చోట కాస్త కూర్చునే ప్రదేశం ఉంటే అక్కడ కాసేపు కూర్చోండి. అయితే ఆ కూర్చునే ప్రదేశం మరీ కిందికి కాకుండా, మరీ ఎత్తుగా కాకుండా, మీ ఎత్తుకు తగినట్లుగా ఉండాలి. ఇలా అదేపనిగా నిలబడేవారు మధ్య మధ్య కూర్చుంటూ ఉండటం, లేదా ఒకే చోట కూర్చొని ఉండేవారు మధ్య మధ్య నిలబడటం... ఇలా మీ పొజిషన్స్‌ను కొద్ది కొద్ది సేపటికి మార్పులు చేసుకుంటూ ఉంటే మరింత ఎక్కువగా పనిచేయగలరు.మరీ ఎక్కువగా ఒంగడం, మరీ ఎక్కువగా సాగడం, అకస్మాత్తుగా పక్కలకు తిరగడం చేయవద్దు.మీ కండరాలు అలసిపోయి, బిగుతుగా అయినప్పుడు శరీరానికీ తగినంత విశ్రాంతి ఇస్తూ కాసేపు రిలాక్స్ అవ్వండి. మీరు చాలాసేపు ఉన్న భంగిమను (పోశ్చర్‌ను) మార్చుకోండి. మీ పాదాలకు అనువైన పాదరక్షలను ధరించండి. ఎక్కువ ఎత్తు ఉండే ఎత్తుమడమల చెప్పులు (హైహీల్స్) ధరించకండి. మీ సౌకర్యంగా ఉండే పాదరక్షలనే తొడుక్కోండి. మీ కాలివేళ్లను మడిచేలా మీ పాదరక్ష ఉండకూడదు. మీ పాదరక్షలోని కింది భాగం (సోల్) కాస్తంత సాగేగుణం కలిగినదై ఉండాలి. మీరు లోహంతో తయారైన లేదా సిమెంట్ చేసిన గట్టి ఫ్లోర్‌పై నడుస్తున్నప్పుడు మీ కాలిజోళ్లకు ఉన్న ఆ సోల్ మీ పాదాలకు తగిలే షాక్‌ను తాను తీసుకుంటుంది. ఈ జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా మీకు ఇబ్బందిగా ఉంటే, ఒకసారి మీకు దగ్గర్లోని డాక్టర్‌ను సంప్రదించండి. డాక్టర్ సుధీంద్ర ఊటూరి కన్సల్టెంట్, లైఫ్‌స్టైల్ అండ్ రీహ్యాబిలిటేషన్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్