హోమియో కౌన్సెలింగ్
మా పాపకు ఐదేళ్లు. తరచు జలుబు, ముక్కుదిబ్బడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటోంది. డాక్టర్‌గారు అడినాయిడ్స్ వాచాయని, వాటిని ఆపరేషన్ ద్వారా తొలగించాలనీ చెప్పారు. హోమియో చికిత్స ద్వారా మా పాప సమస్యకు పరిష్కారం చూపించగలరు. - రజని, హైదరాబాద్
మీరు ఆందోళన పడకండి. మీ పాపకు శస్త్రచికిత్స అవసరం లేకుండా అడినాయిడ్స్ సమస్యను హోమియో చికిత్స ద్వారా శాశ్వతంగా పరిష్కరించవచ్చు. నాసికా కుహరానికి వెనుక భాగంలో ఉండే మృదువైన లింఫాయిడ్ కణజాల సమూహాన్ని అడినాయిడ్స్ అంటారు. ఇవి శిశువులలో, చిన్నపిల్లల్లో ఇన్ఫెక్షన్‌ను కలిగించే బ్యాక్టీరియాను నశింపజేసి, వాటిని ఎదుర్కోవడంలో సాయం చేస్తాయి. ఇవి ఐదేళ్ల వయసు దాటిన తర్వాత కుంచించుకుపోతూ, యుక్తవయస్సు వచ్చేసరికి పూర్తిగా అదృశ్యమైపోతాయి.
అయితే కొన్ని సందర్భాలలో అవి కొంతవాపునకు గురై, అవి కూడా ఇన్ఫెక్షన్‌కు గురికావడం వల్ల వాచి, శ్వాస ద్వారాలకు అడ్డుగా నిలుస్తాయి. దాంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుంది. దీనివల్ల నోటిదుర్వాసన, పెదాల పగుళ్లు, ముక్కుకారడం, ముక్కుదిబ్బడ, నోరు ఎండిపోయినట్లుగా అనిపించడం వంటి సమస్యలు తలెత్తుతాయి. దీనితోబాటు గొంతు భాగంలోని గ్రంథులలో కూడా వాపు, చెవి సమస్యలు కూడా ఎదురు కావచ్చు.
నిర్ధారణ: వీటిని ప్రత్యేకంగా రూపొందించిన అద్దం ద్వారా ముక్కునుండి లోపలికి ప్రవేశపెట్టే ఎండోస్కోప్ ద్వారా, గొంతు ఎక్స్‌రే ద్వారా నిర్ధారించవచ్చు.
చికిత్స: అధునాతనమైన జెనెటిక్ కాన్‌స్టిట్యూషనల్ చికిత్స విధానంలో చికిత్స చేయడం ద్వారా అడినాయిడ్స్ సమస్యను పూర్తిగా నయం చేయవచ్చు. అంతేకాకుండా శరీర రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడం ద్వారా వ్యాధి శాశ్వతంగా, శస్త్రచికిత్సతో పని లేకుండా నయం అవుతుంది.
డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్
సిఎండి హోమియోకేర్ ఇంటర్నేషనల్
హైదరాబాద్
అదే పనిగా నిలబడే ఉంటే...లైఫ్‌స్టైల్ కౌన్సెలింగ్
నేను ఒక సంస్థలో సేల్స్‌మేన్‌గా పనిచేస్తున్నాను. చాలాసేపు నిలబడే ఉండాలి. ఇటీవల నాకు కాళ్ల నొప్పులు ఎక్కువగా వస్తున్నాయి. ఇలా నిలబడే ఉండటం వల్ల నాకు ఇతరత్రా ఏమైనా సమస్యలు వస్తాయా? దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. - సతీశ్, హైదరాబాద్
మీలా చాలాసేపు కదలకుండా నిలబడి వృత్తుల్లో ఉన్న వారిలో (పోలీస్ మెన్, మెషిన్ ఆపరేటర్లు, సేల్స్ పర్సన్స్‌లో) కండరాలకు సంబంధించిన కొన్ని సమస్యలు వస్తుంటాయి. ఇలా శరీరాన్ని నిటారుగా ఉంచడంతో పాటు కొన్ని అవయవాలను కదలకుండా ఉంచడం వల్ల కొన్ని శరీర భాగాలకు సరైన రక్తప్రసరణ తగ్గిపోతుంది. దాంతో అవి తీవ్రమైన అలసటకు గురవుతాయి. ఇలా అదేపనిగా నిలబడేవారికి కాళ్లు, వెన్ను, మెడ సమస్యలు వస్తాయి.
ఇలా సుదీర్ఘకాలం నిలబడే వృత్తుల్లో ఉన్నవారికి కండరాలకు సంబంధించిన సమస్యలేగాక కొన్ని ఇతర ఇబ్బందులూ ఉంటాయి. ఇలాంటివారు కాస్త నడవడం వల్ల కాళ్లకు, పాదాలకు రక్తప్రసరణ బాగా అవుతుంది. దాంతో వారికి కాస్త ఉపశమనం కలుగుతుంది. సుదీర్ఘంగా నిలబడి ఉండేవారిలో రక్తనాళల్లో ఇన్‌ఫ్లమేషన్ వస్తుంది. దీర్ఘకాలంపాటు కొనసాగితే అది వేరికోస్ వెయిన్స్ సమస్యగా మారవచ్చు. ఇలా చాలాసేపు నిలబడే ఉండటం వల్ల వెన్ను, తుంటి, మోకాళ్ల, పాదాల సమస్యలు రావచ్చు. కొన్నిసార్లు కీళ్లు బిగుసుకుపోయి, అచేతనంగా మారవచ్చు. ఇలా కీళ్లు బిగుసుకుపోవడం వల్ల కణాలు క్షీణించడం, టెండన్లు, లిగమెంట్ల నిర్మాణాలలో మార్పుల వంటి కండరాల సమస్యలు రావచ్చు.
కొన్ని సూచనలు...
మీ ఎత్తుకు తగినట్లుగా మీరు నిలబడి ఉండే బల్లల ఎత్తును సరిచేసుకోవాలి. మీ శరీరాకృతిని మరీ నిటారుగా కాకుండా, మరీ ఒంగిపోయి ఉనట్లుగా కాకుండా, సమతౌల్యంతో (వెల్ బ్యాలెన్స్‌డ్‌గా) ఉండేలా చూసుకోవాలి. ఉన్నచోటే నిలబడిపోకుండా అక్కడికక్కడే కాస్త అటు-ఇటు నడుస్తుండాలి. మీరు నిలబడే ప్రదేశం, మీ ఒంటి కదలికలకూ ఆస్కారమిచ్చేలా చూసుకోవాలి. మీ చేతిలో ఉన్న ఉపకరణాల కదలికలకూ తగిన స్థలం ఉండేలా చూసుకోవాలి. మీరు నిలబడి పనిచేసే చోట కాస్త కూర్చునే ప్రదేశం ఉంటే అక్కడ కాసేపు కూర్చోండి. అయితే ఆ కూర్చునే ప్రదేశం మరీ కిందికి కాకుండా, మరీ ఎత్తుగా కాకుండా, మీ ఎత్తుకు తగినట్లుగా ఉండాలి.
ఇలా అదేపనిగా నిలబడేవారు మధ్య మధ్య కూర్చుంటూ ఉండటం, లేదా ఒకే చోట కూర్చొని ఉండేవారు మధ్య మధ్య నిలబడటం... ఇలా మీ పొజిషన్స్‌ను కొద్ది కొద్ది సేపటికి మార్పులు చేసుకుంటూ ఉంటే మరింత ఎక్కువగా పనిచేయగలరు.మరీ ఎక్కువగా ఒంగడం, మరీ ఎక్కువగా సాగడం, అకస్మాత్తుగా పక్కలకు తిరగడం చేయవద్దు.మీ కండరాలు అలసిపోయి, బిగుతుగా అయినప్పుడు శరీరానికీ తగినంత విశ్రాంతి ఇస్తూ కాసేపు రిలాక్స్ అవ్వండి. మీరు చాలాసేపు ఉన్న భంగిమను (పోశ్చర్‌ను) మార్చుకోండి.
మీ పాదాలకు అనువైన పాదరక్షలను ధరించండి. ఎక్కువ ఎత్తు ఉండే ఎత్తుమడమల చెప్పులు (హైహీల్స్) ధరించకండి. మీ సౌకర్యంగా ఉండే పాదరక్షలనే తొడుక్కోండి. మీ కాలివేళ్లను మడిచేలా మీ పాదరక్ష ఉండకూడదు. మీ పాదరక్షలోని కింది భాగం (సోల్) కాస్తంత సాగేగుణం కలిగినదై ఉండాలి. మీరు లోహంతో తయారైన లేదా సిమెంట్ చేసిన గట్టి ఫ్లోర్‌పై నడుస్తున్నప్పుడు మీ కాలిజోళ్లకు ఉన్న ఆ సోల్ మీ పాదాలకు తగిలే షాక్‌ను తాను తీసుకుంటుంది. ఈ జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా మీకు ఇబ్బందిగా ఉంటే, ఒకసారి మీకు దగ్గర్లోని డాక్టర్‌ను సంప్రదించండి.
డాక్టర్ సుధీంద్ర ఊటూరి
కన్సల్టెంట్, లైఫ్‌స్టైల్ అండ్ రీహ్యాబిలిటేషన్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్