‘ఆశ’ నిరాశేనా? | There is no net salary for Asha Workers | Sakshi
Sakshi News home page

‘ఆశ’ నిరాశేనా?

Published Mon, Dec 10 2018 3:03 AM | Last Updated on Mon, Dec 10 2018 3:03 AM

There is no net salary for Asha Workers - Sakshi

ఆశ వర్కర్ల పాత్ర రోజురోజుకూ విస్తరిస్తోంది.కేవలం ఆరోగ్యపరమైన అంశాలకే కాకుండా ఎన్నికలు,మహిళా శిశు సంక్షేమ కార్యక్రమాలు, జనాభా లెక్కల వంటి వాటిల్లోనూ వారిని ఉపయోగించుకుంటున్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేస్తున్నా, వారికి పని ఒత్తిడి తప్ప ఎలాంటి ఆర్థిక ప్రయోజనం దక్కడంలేదు. కేవలం బానిసల మాదిరిగా వారితో పనిచేయించుకుంటున్నారు. 
– ఇండిపెండెంట్‌ కమిషన్‌ 

సాక్షి, హైదరాబాద్‌: గ్రామీణ వైద్య సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్న ‘ఆశ’వర్కర్లకు తీరని అన్యాయం జరుగుతున్నదని పలు జాతీయ సంస్థలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో మినహా వారికి కేవలం ప్రోత్సాహకాలే దక్కుతున్నాయని, నికరంగా నెలనెలా వేతనం మాత్రం దక్కడం లేదని చెబుతున్నాయి. నర్సింగ్‌ వంటి కోర్సుల్లో వారికి వెయిటేజీ ఇచ్చి ఆదుకోవాలని, తద్వారా వారి అనుభవాన్ని ఉపయోగించుకోవాలని ‘ఇండిపెండెంట్‌ కమిషన్‌ ఆన్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ హెల్త్‌ ఇన్‌ ఇండియా’సిఫార్సు చేస్తూ రోడ్‌ మ్యాప్‌ టూ ఇండియాస్‌ హెల్త్‌ అనే నివేదికను ఇటీవల కేంద్రానికి అందజేసింది. కొన్ని ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు కూడా సకాలంలో ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నాయని వెల్లడించింది. 

దేశవ్యాప్తంగా 9.5 లక్షలు,రాష్ట్రంలో 28,000
కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు, పోలియో తదితర టీకాలు, బీపీ, షుగర్‌లాంటి వ్యాధుల గుర్తింపు, చెకప్‌లు వంటి కార్యక్రమాలను గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేసేది ఆశ వర్కర్లే. ఒకరకంగా చెప్పాలంటే గ్రామాల్లో ఆరోగ్య కార్యక్రమాలన్నీ కూడా వీరి ఆధ్వర్యంలోనే జరుగుతాయి. గ్రామాల్లో ఆరోగ్య కార్యక్రమాలను జయప్రదం చేయాలన్న లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం 2006లో జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) కింద ‘ఆశ’వర్కర్ల వ్యవస్థను ప్రారంభించింది. ఇప్పుడు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ ఆశ వర్కర్లు పనిచేస్తున్నారు. దేశవ్యాప్తంగా 9.5 లక్షల మంది ఆశ వర్కర్లు ఉన్నారు. తెలంగాణలో 28 వేల మంది పనిచేస్తున్నారు. ఆశ వర్కర్ల వ్యవస్థ రాగానే దేశంలో మాతాశిశు మరణాలు గణనీయంగా తగ్గాయి. అందుకోసం నిధులను కేంద్రం సమకూర్చింది. శిక్షణ, కిట్లు తదితర అవసరాలకోసం ఒక్కో ఆశ వర్కర్‌కోసం రూ.10 వేల నుంచి రూ.16 వేల వరకు ఖర్చు చేస్తున్నది.  

వేతనం లేని జీవితం
ఎన్‌హెచ్‌ఎం నిర్దేశించిన కార్యక్ర మాలకే పరిమితం చేయకుండా ఆయా రాష్ట్రాలు తమ ప్రాధాన్య అంశాల అమలుకోసం ఆశ వర్కర్లను ఉపయోగించుకుంటున్నాయి. కానీ వారికి నిర్దేశిత వేతనాలు ఇవ్వ డానికి ముందుకు రావడంలేదు. అనేక రాష్ట్రాలు కేవలం వారికి ప్రోత్సాహకాలు మాత్రమే ఇస్తున్నాయి తప్ప కనీస వేతనాలు అమలు చేయడం లేదు. సిక్కిం, కేరళ, రాజస్తాన్, హరియాణా, కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌ వంటి రాష్ట్రాల్లో మాత్రమే గౌరవ వేతనం ఇస్తున్నారు. మిగిలిన రాష్ట్రాల్లో ఆ పరిస్థితి లేదు. తెలంగాణలోనూ ఆశ వర్కర్లను కేవలం ప్రోత్సాహకానికే పరిమితం చేశారు. వేతనం ఇవ్వాలంటూ సమ్మె చేసినా వారి గోడు పట్టించుకోలేదు. అయితే సమ్మె ఫలితంగా ప్రోత్సాహకం నెలకు రూ.3,500 నుంచి రూ.6 వేల వరకు వస్తోందని తెలంగాణ ఆశ వాలంటరీ, కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్ల సంఘం అధ్యక్షురాలు జయలక్ష్మి ‘సాక్షి’కి తెలిపారు.

తాము రూ.18 వేల కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. ఇక కొన్ని రాష్ట్రాలు వారి చదువును బట్టి స్థాయిని పెంచేలా ఏర్పాట్లు చేశాయి. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్, మహారాష్ట్ర, అరుణాచల్‌ప్రదేశ్, అస్సాం, త్రిపుర వంటి రాష్ట్రాలు నర్సింగ్‌ కోర్సుల్లో ఆశ వర్కర్లకు వెయిటేజీ ఇస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో బీఎస్సీ నర్సింగ్‌లోనూ వెయిటేజీ కల్పించారు. ఢిల్లీలోనూ చదువులో వెయిటేజీ ఇస్తున్నారు. కేరళ, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, అస్సాం, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఒడిశా, పశ్చిమబెంగాల్లో ఆశ వర్కర్లకు మెడికల్, జీవిత బీమా వంటి సౌకర్యాలు ఇస్తున్నారు. అయితే మొత్తమ్మీద ఆశ వర్కర్లకు దేశవ్యాప్తంగా తగినంత వేతనం, గౌరవం దక్కడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement