
వేతనాల పెంపు, ఉద్యోగ భద్రతపై ప్రభుత్వం మొండిచేయి
సాక్షి, అమరావతి: ఏళ్ల తరబడి అంకితభావంతో పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలన్న ‘ఆశా’ సిబ్బందికి కూటమి ప్రభుత్వం మొండిచేయి చూపించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేసి, ప్రసూతి సెలవులు, ఉద్యోగ విరమణ ప్రోత్సాహంతో సరిపెట్టింది. ఆశాలను ఉద్ధరించింది తామేనని, దేశంలోనే అత్యధికంగా వేతనాలు చెల్లిస్తున్న రాష్ట్రం ఏపీ అని చంద్రబాబు ప్రభుత్వం గొప్పలు చెబుతోంది.
వాస్తవానికి వేతనాలు పెంచి ఆశా కార్యకర్తలను ఆదుకున్నది వైఎస్ జగన్ ప్రభుత్వం. 2019కి ముందు వరకు చాలీచాలని వేతనాలతో ఆశాలు అగచాట్లు పడుతున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. కనీసం వారి కష్టాలను విన్నది కూడా లేదు. ఈ నేపథ్యంలో తమ వేతనాలు పెంచి ఆదుకోవాలని పాదయాత్రలో వైఎస్ జగన్‌ను ఆశా సిబ్బంది కోరారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక 2019 ఆగస్టులో ఆశాల వేతనాలను రూ.10 వేలకు పెంచారు.
అయితే, పెరిగిన జీవన వ్యయాలు, కుటుంబ అవసరాలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని గత ఏడాది డిసెంబరులో రాష్ట్రవ్యాప్తంగా ఆశా సిబ్బంది ధర్నాకు దిగారు. మరోపక్క కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక స్థానిక నాయకులు వీరిపై దాడులు మొదలుపెట్టారు. గ్రామాల్లో పనిచేస్తున్న ఆశాలను రాజకీయ కారణాలతో తొలగించి, వారి పొట్టగొట్టే పన్నాగానికి తెర తీశారు. ఏళ్లుగా సేవలందిస్తున్న వారిని సైతం ఉన్నతాధికారులకు తప్పుడు ఫిర్యాదులు చేసి బలవంతంగా తొలగించారు.
ఈ క్రమంలో తమకు ఉద్యోగ భద్రత కల్పించి రూ.20 వేల వేతనం ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్‌తో ఏపీ ఆశా వర్కర్ల యూనియన్ వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శికి విజ్ఞప్తి చేసింది. కానీ, ఈ ప్రధాన డిమాండ్‌తో పాటు ఉద్యోగ భద్రత, ఏఎన్‌ఎం కోర్సు పూర్తి చేసిన వారికి పదోన్నతి కల్పనను ప్రభుత్వం పట్టించుకోలేదు. ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంపు, 180 రోజుల ప్రసూతి సెలవులు, 30 ఏళ్ల సర్వీసు పూర్తిచేసిన వారికి గ్రాట్యుటీ కింద రూ.1.50 లక్షల చెల్లింపునకు అంగీకరించారు.
30 ఏళ్ల సర్వీసు ఉంటేనే గ్రాట్యుటీ!
‘ఆశా’లను ఆదేకునేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఓ ప్రకటనలో తెలిపారు. వారి ప్రయోజనాలను అమలు చేసేందుకు సీఎం ఆమోదం తెలిపారన్నారు. ఆశాల ఉద్యోగ విరమణ వయసును 62 ఏళ్లకు పెంపు, 30 ఏళ్ల సర్వీసు ఉన్నవారికి రూ.1.50 లక్షల గ్రాట్యుటీ, 180 రోజుల ప్రసూతి సెలవులు అమలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. దీనిద్వారా రాష్ట్రంలో 42,752 మంది ఆశా వర్కర్లకు లబ్ధి చేకూరుతుందని మంత్రి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment