
సాక్షి, విజయవాడ: ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకొనేందుకు ఆశావర్కర్లు సిద్ధమవుతున్నారు. కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. గత సమ్మె కాలంలో ప్రభుత్వంతో జరిగిన ఒప్పందాలపై జీవోలు విడుదల చేయాలని ఆశావర్కర్లు కోరుతున్నారు. ఇప్పటికే రెండు రోజుల పాటు ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కాగా, రాష్ట్ర వ్యాప్తంగా ఆశా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.
గురువారం.. అన్ని జిల్లాల నుంచి ధర్నా చౌక్‌కు భారీగా చేరుకున్న ఆశా వర్కర్లు.. రోడ్లపై సైతం కార్పెట్లు వేసుకుని ఎండలో ధర్నాకు దిగారు. ఆశా వర్కర్ల కదలికలపై డ్రోన్లు, ఇంటిలిజెన్స్ బృందాల ద్వారా పోలీసులు నిఘా పెట్టారు. ధర్నాచౌక్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు.
దాదాపు 10 వేల మంది హాజరయ్యే అవకాశం ఉంటుందని యూనియన్ నాయకులు అంటున్నారు. ఆర్ముడ్ రిజర్వ్, సివిల్, ర్యాపిడ్ యాక్షన్ టీంలను పోలీసులు సిద్ధం చేశారు. ఏడీసీపీ, ఏఎస్పీ, ముగ్గురు డిఎస్పీలు, నలుగురు సీఐలు, ఇతర సిబ్బందితో భారీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై స్వష్టమైన ప్రకటన చేస్తే వరకు పోరాటం ఆపే ప్రసక్తే లేదని ఆశా వర్కర్లు చెబుతున్నారు.

Comments
Please login to add a commentAdd a comment