
విజయవాడలో ఆశా వర్కర్ల భారీ ధర్నా
ఎన్నికల హామీలపై జీవోలు ఇవ్వాల్సిందేనని డిమాండ్
అన్ని జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన ఆశా వర్కర్లు
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలైనా హామీలు అమలు చేయకపోవడంపై ఆశా వర్కర్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. కనీస వేతనం నెలకు రూ.26 వేలు ఇవ్వాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేలా రెండు నెలల్లో జీవోలు జారీ చేయాలని, లేకపోతే సమ్మె చేస్తామని హెచ్చరించారు. తమ డిమాండ్ల సాధన కోసం ఆశా వర్కర్లు గురువారం విజయవాడలో భారీ ధర్నా నిర్వహించారు.
ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యాన నిర్వహించిన ఈ ధర్నాకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఆశాలు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు కె.పోశమ్మ, ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు, కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు గడిచినా అశా వర్కర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తోందని ధ్వజమెత్తారు.
పని ఒత్తిడితో ఆశా వర్కర్లు అనారోగ్యం పాలవుతున్నా సెలవులు ఇవ్వడం లేదన్నారు. మెటర్నిటీ లీవులు కూడా ఇవ్వకుండా వెట్టిచాకిరీ చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పని ఒత్తిడి, వెట్టిచాకిరీ వల్ల ఆనారోగ్యం బారినపడి ఇటీవల కాలంలో అనేక మంది ఆశా వర్కర్లు ప్రాణాలు కోల్పోయారన్నారు. బీమా కంపెనీలకు ప్రభుత్వం ప్రీమియం చెల్లించకపోవడంతో క్లెయిమ్‌లు నిలిచిపోయాయని, బాధిత కుటుంబాలకు ఎటువంటి ఆర్థిక సాయం అందక రోడ్డునపడుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.
ఆశా వర్కర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఒక్క పైసా కూడా ఇప్పటివరకు చెల్లించడం లేదన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఆశ వర్కర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సంఘ రాష్ట్ర నాయకులు ఎ.కమల, ఎ.వెంకటేశ్వరరావు, పద్మ, రాఘవమ్మ, ధనశ్రీ, లక్ష్మి, సౌభాగ్య, సుభాషిణి, అమర, సుధారాణి, పార్వతి, రమణకుమారి, గంగా, జ్యోతి, వెంకటలక్ష్మి, వెంకటేశ్వరమ్మ, వాణిశ్రీ, తదితరులు మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment