
‘దత్తత’లో అమ్మాయిలే ఫస్ట్!
న్యూఢిల్లీ: పిల్లల దత్తత విషయంలో అబ్బాయిల కంటే అమ్మాయిలే ముందున్నారు. అబ్బాయి కన్నా అమ్మాయిలను దత్తత తీసుకునేవారి సంఖ్య పెరుగుతోంది. కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ లెక్కల ప్రకారం గత మూడేళ్లలో 7,439 మంది అమ్మాయిలను దత్తత తీసుకుంటే.. మగ పిల్లల్ని 5,167 మంది దత్తత తీసుకున్నారు. సంవత్సరాల వారీగా చూస్తే 2012-13లో 2,846 అమ్మాయిలను, 1,848 మంది అబ్బాయిలను దత్తత తీసుకున్నారు. 2013-14లో 2,293 మంది అమ్మాయిలు, 1,631 మంది అబ్బాయిలను, 2014-15లో 2,300 మంది అమ్మాయిలు, 1,688 మంది అబ్బాయిలను దత్తత తీసుకున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
‘అమ్మాయిలను దత్తత తీసుకోవడం క్రమంగా పెరుగుతోంది. ఇది చాలా మంచి పరిణామం’ అని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దత్తత ప్రక్రియలో తీసుకువచ్చిన మార్పులు, మార్గదర్శకాల నుంచి ప్రజలు, దత్తత ఏజెన్సీలు, అధికార వర్గాల నుంచి మంచి స్పందన వచ్చిందని ఆయన వివరించారు. వికలాంగ పిల్లల్ని దత్తత తీసుకునేందుకు కాస్త వెనుకంజ వేస్తున్నారు. ఇలాంటి పిల్లల్ని 2012-13లో 170 మందిని, 2013-14లో 242 మంది, 2014-15లో 214 మందిని దత్తత తీసుకున్నారు.