యాచక బాలలకు డీఎన్‌ఏ పరీక్షలు | beggar children to DNA tests | Sakshi
Sakshi News home page

యాచక బాలలకు డీఎన్‌ఏ పరీక్షలు

Published Sun, Jan 25 2015 10:52 PM | Last Updated on Fri, Sep 28 2018 8:12 PM

beggar children to DNA tests

రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ నిర్ణయం
సాక్షి, ముంబై: నగరంలో యాచకులవద్ద కనిపిస్తున్న చిన్న పిల్లలకు డిఎన్‌ఏ పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షల్లో దోషులుగా తేలిన యాచకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆస్పత్రులు, రైల్వే స్టేషన్ల నుంచి చిన్న పిల్లలు ఆపహరణకు గురవుతున్న సంఘటనలు తరుచూ వెలుగులోకి వస్తున్నాయి.

ఇలాంటి సంఘటనలు నిర్మూలించడంలో దర్యాప్తు బృందాలు విఫలమవుతున్నాయి. దీంతో యాచకులవద్ద కనిపించే పిల్లల్లో అపహరణకు గురైనవారు ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో వారికి డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తే అసలు విషయం బయటపడుతుందని మహిళ, శిశు సంక్షేమ శాఖ భావిస్తోంది. ముంబైలో కూడళ్లవద్ద, లోకల్ రైళ్లలో, స్టేషన్లలో, బస్టాపుల్లో.. ఇలా ఎక్కడ చూసినా యాచకులవద్ద పిల్లలు కనిపిస్తున్నారు. చిన్న పిల్లలుంటే ఎవరైన జాలీ, కరుణ చూపించి డబ్బులు వేస్తార ని యాచకులు తమ వద్ద పసికందులను కచ్చితంగా ఉంచుకుంటారు.

యాచకులకు పిల్లలను అద్దెకు ఇచ్చే ముఠాలు కూడా  ఉన్నాయి. వారికి పాలు, ఆహారం ఇవ్వడంతోపాటు సాయంత్రం పిల్లల యజమానికి కొంత డబ్బు అప్పజెప్పాల్సి ఉంటుంది. దీంతో వారు డబ్బుకు ఆశపడి పిల్లలను నిద్రపోకుండా చేస్తారు. ఒకవేళ ఏడ్వకుంటే వారిని గిల్లి బలవంతంగా మరీ ఏడిపిస్తారు. ఇలాచేస్తే డబ్బులు కచ్చితంగా ఇస్తారని వారు భావిస్తారు. కాని వారివెంటే ఉండే పిల్లలు నిజానికి వారి బిడ్డలేనా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో కొందరు ఇతర రాష్ట్రాల నుంచి అపహరించిన పిల్లలు కూడా ఉండవచ్చనే అనుమానాలున్నాయి.

అందుకు ప్రత్యేకంగా కొన్ని ముఠాలు పనిచేస్తున్నాయని గతంలో పట్టుబడ్డ నిందితుల ద్వారా వెల్లడైంది. దీంతో డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుందని మహిళ, శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి విద్యా ఠాకూర్ చెప్పారు. అందుకు రైల్వే పోలీసు, రాష్ట్ర పోలీసు, మహిళ శిశు హక్కుల కమిటీతో చర్చలు జరుపుతున్నామన్నారు. ఈ చర్చల్లో తుది నిర్ణయం కాగానే  నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు ఠాకూర్ చెప్పారు. పరీక్షల్లో వారి పిల్లలు కాదని తేలితే పిల్లలను బాలల సంరక్షణాలయాలకు పంపించి, దోషులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement