‘బేబీ ఫ్యాక్టరీ’ కథనంపై హైకోర్టుకు కలెక్టర్ నివేదిక
సాక్షి, హైదరాబాద్: విశాఖపట్నంలోని అన్ని సంతాన సాఫల్య కేంద్రాల(ఐవీఎఫ్)పై నిరంతరం నిఘా ఉంచామని ఆ జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్ ఉమ్మడి హైకోర్టుకు నివేదించారు. సృష్టి టెస్ట్‌ట్యూబ్ బేబీ సెంటర్ ఒక్క రికార్డును కూడా సక్రమంగా నిర్వహించడం లేదని, ఈ సెంటర్‌లో నిపుణులైన యంబ్రియోలాజిస్ట్ కూడా లేరని తెలిపారు. విశాఖపట్నంలో పసిపిల్లలపై ‘బేబీ ఫ్యాక్టరీ’ పేరుతో ‘సాక్షి’ గతేడాది డిసెంబర్ 31న సంచలన కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ కథనంపై న్యాయవాది పి.అరుణ్‌కుమార్ రాసిన లేఖను హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)గా మార్చి విచారణ చేపట్టింది.
ఈ బేబీ ఫ్యాక్టరీలపై రహస్య విచారణకు ఆదేశించింది. విచారణ జరిపి రూపొందించిన నివేదికను కలెక్టర్ యువరాజ్ ఇటీవల కోర్టుకు సమర్పించారు. నోవోటెల్ హోటల్ సమీపంలో ఉన్న భాగ్యసాయి అపార్ట్‌మెంట్‌లో పసిపిల్లల విక్రయాలు జరుగుతున్నాయంటూ సాక్షి కథనం ప్రచురించిన తరువాత దీనిపై విచారణ జరపాలని వైద్య, శిశు సంక్షేమశాఖల అధికారులను ఆదేశించానన్నారు. విజయలక్ష్మి, మూర్తి దంపతులకు ఈ అపార్ట్‌మెంట్‌లోని 101 నంబర్ ఫ్లాట్ ఉందని, అదే అపార్టుమెంట్‌లో 403 ఫ్లాట్ కూడా అద్దెకు తీసుకుని ఐవీఎఫ్ చికిత్స కోసం వచ్చే వారికి అద్దెకు ఇచ్చే వారన్నారు. సమీపంలోని ఇండిపెండెంట్ ఇళ్లను, ఫ్లాట్లను అద్దెకు తీసుకుని ఐవీఎఫ్ చికిత్సకు వచ్చే వారికి అద్దెకి ఇచ్చే వారని విచారణలో తేలిందన్నారు. కలెక్టర్ నివేదికను పరిశీలించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది.
‘ఐవీఎఫ్’ కేంద్రాలపై నిరంతర నిఘా
Published Wed, Apr 6 2016 3:46 AM | Last Updated on Thu, Mar 21 2019 8:30 PM
Advertisement
Advertisement