సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆధార్ నమోదు మరింత సులభతరం కానుంది. ఇకపై ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలన్నీ ఆధార్ నమోదు సెంటర్లుగా మారనున్నాయి. ప్రస్తుతం మీసేవ కేంద్రాల ద్వారా ఆధార్ నమోదు చేస్తున్నప్పటికీ... గ్రామ స్థాయిలో ఈ కేంద్రాలు లేకపోవడంతో పల్లె ప్రజలంతా మండల కేంద్రాలు, సమీప టౌన్‌లకు వెళ్లి ఆధార్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తోంది. అలాగే చంటిపిల్లల ఆధార్ నమోదు తల్లిదండ్రులకు ఇబ్బందికరంగా మారుతోంది. మరోపక్క ఆధార్ నమోదు కోసం రుసుము, రవాణా ఖర్చులు సామాన్యులకు భారంగా మారాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అంగన్‌వాడీ కేంద్రాల నిర్వాహకులకే ఆధార్ నమోదు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు ఆధార్ రిజిస్ట్రార్‌గా అధికారాలు ఇవ్వాలని భావిస్తోంది. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో ఉన్న ఐసీడీఎస్ (సమగ్ర శిశు అభివృద్ధి ప్రాజెక్టు)లను ఆధార్ నమోదు ఏజెన్సీలుగా అభివృద్ధి చేయనుంది. ఈ ఏజెన్సీల పర్యవేక్షణలో ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలు ఆధార్ నమోదు బాధ్యతలు నిర్వహిస్తాయి.
ప్రస్తుతం గ్రామానికి ఒకటి..
రాష్ట్రంలో 149 ఐసీడీఎస్ ప్రాజెక్టులున్నాయి. ఇందులో 99 ప్రాజెక్టులు గ్రామీణ ప్రాంతాల్లో ఉండగా, 25 ప్రాజెక్టులు పట్టణాల్లో, మరో 25 ప్రాజెక్టులు ఐటీడీఏ పరిధిలో ఉన్నాయి. వీటిæ పరిధిలో 35,700 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. గ్రామ విస్తీర్ణం, జనాభా సంఖ్యకు అనుగుణంగా వీటిని ఏర్పాటు చేశారు. మేజర్ పంచాయతీల్లో 8 నుంచి 10 కేంద్రాలుండగా... చిన్న గ్రామాల్లో ఒక్కో కేంద్రం చొప్పున కొనసాగుతున్నాయి. తాజాగా ఐసీడీఎస్ పరిధిలోని సీడీపీవో(శిశు అభివృద్ధి ప్రాజెక్టు అధికారి)కు ఆధార్ ఏజెన్సీ బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో రాష్ట్ర వ్యాప్తంగా 149 ఆధార్ ఏజెన్సీలు కొత్తగా ఏర్పాటు కానున్నాయి. ఒక్కో ఏజెన్సీ పరిధిలో ఎంత సంఖ్యలో ఆపరేటర్లను ఏర్పాటు చేయాలనే అంశంపైన ఆ శాఖ సమాలోచనలు చేస్తోంది. ప్రస్తుతానికి ప్రతి గ్రామానికి ఒక కేంద్రం నిర్వహిస్తే సరిపోతుందని భావిస్తున్న ఆ శాఖ... ఆమేరకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రతి కేంద్రానికి ఒక ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ కిట్ ఇవ్వనున్నారు.
పథకాల అమలులో పారదర్శకత..
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ఆధార్ కీలకంగా మారింది. వృద్ధులకు ఇచ్చే ఆసరా పింఛన్లు మొదలు శిశువుల కోసం అమలు చేస్తున్న బాలామృతం పథకానికి కూడా ఆధార్‌ను తప్పనిసరి చేసింది. శిశువుల పౌష్టికాహార పథకాల్లో ఆధార్ సంఖ్య తప్పనిసరిగా కావాల్సి ఉన్నప్పటికీ చిన్నపిల్లలకు కార్డుల జారీలో ఎదురవుతున్న సమస్యల దృష్ట్యా వాటికి మినహాయింపు ఇస్తోంది. తాజాగా అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలోనే ఆధార్ కార్డుల జారీ ప్రక్రియ మొదలుపెడితే ఇలాంటి ఇబ్బందులుండవని అధికారులు భావిస్తున్నారు. దీంతో కేంద్రానికి వచ్చే పిల్లలకు వెనువెంటనే ఆధార్ నమోదు చేపట్టి కార్డులు జారీ చేస్తే పథకాల అమలు పారదర్శంగా ఉంటుందని చెబుతున్నారు.
ఆధార్ నమోదు ఇక సులువు!
Published Tue, Feb 6 2018 3:59 AM | Last Updated on Sat, Jun 2 2018 8:36 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment