పెళ్లి కోసం బాలికపై ఒత్తిడి
► కుటుంబసభ్యులు నిర్భందించారంటూ బాలల హక్కుల
► పరిరక్షణ కమిషన్‌కు మొర
► పోలీసుల సహకారంతోబాలికను విడిపించిన కమిషన్
► సంరక్షణ కోసం శిశుసంక్షేమ శాఖకు అప్పగింత
హైదరాబాద్: ‘‘పెళ్లి చేసుకోవాలంటూ మా తల్లిదండ్రులు, తాతలు, అన్న నన్ను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారు... నాకు చదువు కోవాలని ఉంది... ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు... ప్లీజ్ నన్ను రక్షించండి’’ అంటూ ఓ మైనర్ బాలిక బాలల హక్కుల సంఘానికి మొరపెట్టుకుంది. బాలిక వినతికి స్పందించిన బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ పోలీసుల సహకారంతో మైనర్ బాలికను తల్లిదండ్రుల చెర విడిపించి ఆమెను బాలల సదన్‌కు తరలించారు. ఈ ఘటన బుధవారం హైదరాబాద్ హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు అచ్యుతరావు, పోలీసులు వివరాలను వెల్లడించారు.
నల్లగొండ జిల్లా బీబీనగర్ మండలం ముగ్ధంపల్లికి చెందిన నువ్వుల రమేష్ కూతురు(17) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమెకు వివాహం చేసేందుకు కుటుంబ సభ్యులు సంబంధం చూశారు. బాలిక పెళ్లికి నిరాకరించడంతో తల్లిదండ్రులు, అన్న, తాతయ్యలు బాలికను మానసికంగా, శారీరకంగా హింసించసాగారు. దీంతో బాలిక గత నెల 20న అచ్యుతరావును కలసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. దీనిపై విచారించి నివేదిక ఇవ్వాలని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ నల్లగొండ ఎస్పీని కోరింది. దీంతో భువనగిరి పోలీసులు బాలిక కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు.
అనంతరం హయత్‌నగర్ మండలం బలిజగూడలో బంధువుల వివాహం ఉందని బాలికను మేనమామ డప్పు రమేష్ ఇంటికి తీసుకొచ్చారు. పోలీసుల అనుమతి లేకుండా బాలికను తీసుకొచ్చిన తల్లిదండ్రులు పెళ్లి జరిగి మూడు రోజులైనా తిరిగి ఇంటికి తీసుకుపోలేదు. దీంతో తనను ఇక్కడే నిర్బంధిస్తారని భావించిన బాలిక అచ్యుతరావుకు ఫోన్ ద్వారా ఎస్‌ఎంఎస్ పంపించింది. దీంతో స్పందించిన ఆయన స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ శ్రీనివాస్ సిబ్బందితో కలసి బలిజగూడలోని బాలిక ఇంటికి చేరుకున్న అచ్యుతరావు బాలిక కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. బాలిక కోరిక మేరకు పోలీసులు ఆమెను శిశు సంక్షేమ శాఖ వారికి అప్పగించగా వారు బాలికను నింబోలి అడ్డాలోని బాల సదన్‌కు తరలించారు. తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మైనర్లను హింసిస్తే చర్యలు తప్పవు...
మైనర్లపై మానసికంగా, శారీరకంగా హింసకు పాల్పడితే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులైనా సరే చర్యలు తప్పవని బాలల హక్కుల సంరక్షణ కమిషన్ సభ్యులు అచ్యుతరావు హెచ్చరించారు. మైనర్లకు పెళ్లి చట్టవిరుద్ధమని దానికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన అన్నారు.
తల్లిదండ్రులపై కేసు నమోదు...
బాలిక ఫిర్యాదు మేరకు ఆమె తల్లి ఇందిర, తండ్రి రమేష్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. బాలికను నిర్బంధించినట్లు విచారణలో తేలితే అందుకు కారణమైన వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని ఆయన పేర్కొన్నారు.