Protection of Child Rights
-
సమాజాన్ని చూసే తీరును నా కూతుళ్లు మార్చేశారు
న్యూఢిల్లీ: దివ్యాంగుల పట్ల, ముఖ్యంగా దివ్యాంగ బాలల పట్ల సమాజం వ్యవహరించే తీరులో మార్పు రావాల్సిన అవసరముందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. దివ్యాంగ బాలలు లైంగిక హింసకు సులువైన లక్ష్యాలుగా మారుతున్నారంటూ ఆవేదన వెలిబుచ్చారు. ఈ దారుణాల నుంచి కాపాడుకోవడం, వాటి బారిన పడేవారి పట్ల సహానుభూతితో వ్యవహరించడం మనందరి బాధ్యత అన్నారు. శనివారం ఆయన దివ్యాంగ బాలల హక్కుల పరిరక్షణపై 9వ జాతీయ సదస్సులో పాల్గొన్నారు. దివ్యాంగుల హక్కులపై సుప్రీంకోర్టు హాండ్‌బుక్‌ను విడుదల చేశారు. అనంతరం ప్రారంభోపన్యాసం చేశారు. ‘‘దివ్యాంగ బాలల భద్రత, సంక్షేమానికి నా హృదయంలో ప్రత్యేక స్థానముంది. నేను దివ్యాంగులైన ఇద్దరు ఆడపిల్లల తండ్రిని. సమాజం పట్ల నా దృక్కోణాన్ని నా కూతుళ్లు పూర్తిగా మార్చేశారు’’ అని చెప్పారు. నైపుణ్యం, సామర్థ్యాలతో నిమిత్తం లేకుండా బాలల హక్కులను పరిపూర్ణంగా పరిరక్షించే ఆదర్శ సమాజమే మనందరి లక్ష్యం కావాలని సూచించారు. ఇందుకోసం పలు కీలకాంశాలపై దృష్టి సారించాల్సిన అవసరముందన్నారు. ‘‘దివ్యాంగ బాలల సమస్యలను గుర్తించాలి. లైంగిక దాడుల వంటి హేయమైన నేరాల బారిన పడే దివ్యాంగ బాలికలను అక్కున చేర్చుకుని వారిలో ధైర్యం నింపాలి. పూర్తిగా కోలుకునేందుకు అన్నివిధాలా దన్నుగా నిలవాలి. పోలీస్‌స్టేషన్ మొదలుకుని కోర్టు దాకా ప్రతి దశలోనూ వారి పట్ల అత్యంత సున్నితంగా, సహానుభూతితో వ్యవహరించాలి. ఇందుకు అవసరమైన మేరకు బాలల న్యాయ వ్యవస్థకు, దివ్యాంగుల హక్కుల చట్టానికి మార్పులు చేయాలి. ఇందుకు అంతర్జాతీయ చట్టాల నుంచి స్ఫూర్తి పొందాలి. వారిపై అకృత్యాలను నివారించడంపై ప్రధానంగా దృష్టి సారించాలి. ఆ బాలలకు నాణ్యతతో కూడిన విద్య, అనంతరం మెరుగైన ఉపాధి తదితర అవకాశాలు కల్పించాలి. తద్వారా అడుగడుగునా అండగా నిలవాలి. ఈ విషయమై వారి తల్లిదండ్రులతో పాటు పోలీసులకు, లాయర్లకు, న్యాయమూర్తులకు కూడా మరింత అవగాహన కల్పించాలి’’ అని సీజేఐ పిలుపునిచ్చారు. -
కోలుకుంటున్న ‘ఉజ్జయిని’ బాలిక
ఉజ్జయిని: మధ్యప్రదేశ్‌లో అత్యాచారానికి గురై అర్ధనగ్నంగా, రక్తమోడుతూ ఉజ్జయిని వీధుల్లో సాయం కోరుతూ తిరుగాడిన బాలిక కోలుకుంటోంది. ఇండోర్‌లోని మహారాజా టుకోజీరావ్ హోల్కార్ మహిళా ఆస్పత్రిలో వైద్య నిపుణుల బృందం ఆమెకు వైద్య చికిత్సలు అందిస్తోంది. పేరు, వయస్సు, చిరునామా వంటి వివరాలను చెప్పలేకపోతోందని, అయితే ఆమెది సత్నా జిల్లా అని తెలుస్తోందని కౌన్సిలింగ్ నిపుణులు గురువారం తెలిపారు. బాధిత బాలిక పరిస్థితి కొద్దికొద్దిగా మెరుగవుతోందని బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ సభ్యురాలు డాక్టర్ దివ్యా గుప్తా తెలిపారు. ఈ అంశంపై రాజకీయ పార్టీల నేతలు సున్నితత్వం ప్రదర్శించాలని, బాధిత బాలిక చికిత్స పొందే ఆస్పత్రి వద్ద గుమికూడడం వంటివి చేయరాదని బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ చైర్పర్సన్ ప్రియాంక్ కనూంగో కోరారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి భరత్ సోని అనే రిక్షావాలాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్రైమ్ సీన్ రిక్రియేషన్ కోసం జీవన్ ఖేది ప్రాంతానికి గురువారం పోలీసులు తీసుకెళ్లగా పారిపోయే ప్రయత్నంలో గాయపడ్డాడు. పన్నెండేళ్ల బాలిక అర్ధనగ్నంగా, రక్తమోడుతూ ఉజ్జయిని వీధుల్లో రెండున్నర గంటలపాటు సాయం కోరుతూ ఇల్లిల్లూ తిరిగినా పట్టించుకోకపోవడం అమానవీయమని ఎస్పీ సచిన్ శర్మ అన్నారు. ‘నా వెనుక ఎవరో వస్తున్నారు. నేను ప్రమాదంలో ఉన్నాను’అని ప్రాధేయపడిందే తప్ప ఆమె డబ్బులు అడగలేదన్నారు. ‘కొందరు ఛీత్కరించినా, కొందరు రూ.50, రూ.100 వరకు ఇచ్చారు. అదేదారిలో ఉన్న టోల్‌ప్లాజా సిబ్బంది కొంత డబ్బు, బట్టలు ఇచ్చారు. చివరికి ఆశ్రమంలో ఆశ్రయం పొందింది. వారామెను దగ్గరకు తీసి, మాకు సమాచారం అందించారు’అని ఎస్పీ వివరించారు.. -
బంగారు బాల్యంలో నేర ప్రవృత్తి
18 ఏళ్ల వయస్సు నిండని నేరం ఆరోపింపబడ్డ ప్రతి బాలుడు, బాలిక 2015 నాటి ‘బాల నేరస్థుల పరిరక్షణ చట్టం’ ప్రకారం జువెనైల్ జస్టిస్ బోర్డు (జేజే బోర్డు) ముందు విచారణ ఎదుర్కోవలసి ఉంటుంది. నేరం చేసిన తేదీ నాటి వయస్సు ప్రామాణికం అవుతుంది. అధికారిక జనన ధ్రువీకరణ పత్రం అందుబాటులో లేనట్లయితే మెడికల్ బోర్డుచే ధ్రువీకరీంపబడ్డ వయస్సు ఆధారంగా కోర్టు విచారణ పరిధి నిర్ణయమవుతుంది. అరెస్టు చేసిన రోజు నుండి తుది తీర్పు దాకా జేజే బోర్డు విచారిస్తుంది. ఈ బోర్డులో మొదటి శ్రేణి జ్యుడీషియల్ న్యాయాధికారి, రాష్ట్ర ప్రభుత్వం చేత నియమింపబడే ఇరువురు సామాజిక కార్యకర్తలు సభ్యులుగా ఉంటారు. ఇరువురిలో ఒకరు మహిళ, మరొకరు చైల్డ్ సైకాలజిస్ట్ ఉంటారు. బెయిలుపై విడుదలయ్యేంత వరకు లేదా తుది తీర్పు దాకా నిందితులను ప్రభుత్వ సంక్షేమ అధికారుల పర్యవేక్షణలోని అబ్జర్వేషన్ హోమ్‌లో ఉంచుతారు. నేరం రుజువయితే నిందితులకు కారాగార శిక్ష బదులుగా జేజే బోర్డు సభ్యులు మందలించి విడుదల చేయటం లేదా మూడు సంవత్సరాలు మించకుండా సంస్కరణ గృహానికి పంపించటం లేదా విడుదల చేసి కొన్నాళ్ల పాటు మంచి ప్రవర్తనకై జిల్లా ప్రొబేషనరీ అధికారి పర్యవేక్షణలో ఉంచటం లేదా సామాజిక సేవ చేసే ఉత్తర్వులు లేదా జరిమానా చెల్లింపుకు ఆదేశాలివ్వటం జరుగుతుంది. ఇందుకై జిల్లా ప్రొబేషనరీ అధికారి ఇచ్చే సామాజిక దర్యాప్తు నివేదికను పరిగణనలోకి తీసుకుంటారు. ఇరువురు సభ్యుల తీర్పులో ఏకాభిప్రాయం రానట్లయితే జ్యుడీషియల్ అధికారి తీర్పు చలామణి అవుతుంది. నేరం రుజువు కాలేదని జేజే బోర్డు తీర్పిస్తే దానిపై అప్పీలు లేదు. 16 ఏళ్లు పైబడిన నిందితుల కేసుల్లో లేదా అతి హేయమైన నేరం చేసిన కేసుల్లో మాత్రమే అప్పీలు ఉంటుంది. విచారణ ప్రక్రియ మధ్యలో నిందితులు 18 ఏళ్ల వయస్సు దాటినా, జేజే బోర్డు మాత్రమే కేసు కొనసాగిస్తుంది. నేరం రుజువై ప్రభుత్వ సంస్కరణ గృహానికి పంపబడిన వారిని మంచి పౌరులుగా పరివర్తన తేవటానికి వృత్తి విద్య, కౌన్సెలింగ్ లాంటివి చేపడతారు. హత్య, మానభంగం, లైంగిక అత్యాచారం లాంటి అతి హేయమైన నేరం గురించి 16–18 ఏళ్ల వయసున్న నిందితుడు మానసికంగా, భౌతికంగా తను చేస్తున్న నేరం పరిణామాల గురించి అర్థం చేసుకునే పరిపక్వత ఉండీ నేరం చేసినాడని జేజే బోర్డు ప్రాథమిక అంచనాకు వస్తే ఆ కేసును బాలల కోర్టుకు నిందితుడిని పెద్ద వాడిగా భావించి ఇతర కేసుల్లాగే విచారణ జరిపే నిమిత్తం బదిలీ చేసే విచక్షణాధికారం ఉంది. ఇదిలా ఉండగా 16–18 ఏళ్ల వయసున్న నిందితులు చేసిన అతి హేయమైన నేరంపై జేజే బోర్డు ఒక నిర్ణాయిక ప్రాథమిక అంచనాకు రావడానికి మార్గదర్శకాలు జారీ చేయాల్సిందిగా ‘బరున్ చంద్ర ఠాకూర్ వర్సెస్ మాస్టర్ భోలు’ అనే కేసు విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం 2022 జూలై 13న ఉత్తర్వులు జారీ చేసింది. వాటికి అనుగుణంగా జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంస్థ ముసాయిదా మార్గదర్శకాలు తయారు చేసి, తగిన సలహాలు, సూచనలు 2023 జనవరి 20 లోగా ఇవ్వాల్సిందిగా బహిరంగంగా ప్రజలను, నిపుణులను కోరింది. ఒకసారి మార్గదర్శకాలకు తుది రూపు వస్తే, అన్ని జేజే బోర్డులు నిందితులు చేసిన అతి హేయమైన నేరంపై ఏకరూప ప్రాథమిక అంచనా తీర్పు వెలువరించే అవకాశముంది. తద్వారా హత్య, లైంగిక దాడి లాంటి అతి హేయమైన కేసులకు పాల్పడిన16 ఏళ్లు నిండిన నిందితులను బాలల కోర్టులో విచారణ జరిపే అవకాశముంది. అయినా కూడా 18 సంవత్సరాల వయస్సులోపు వారికి మరణ శిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష విధించరాదని చట్టం చెప్తోంది. కొద్ది మాసాల క్రితం జూబ్లీహిల్స్ లోని అమ్నీసియా పబ్ వద్ద ఇన్నోవా వాహనంలో బాలికపై సామూహిక అత్యాచార ఆరోపణ కేసులో 16 ఏళ్లు నిండిన నలుగురు బాలురను మామూలు నిందితుల మాదిరే విచారణ జరపాలని జేజే బోర్డు పోక్సో కోర్టుకు పంపించటం మనందరికీ విదితమే. జాతీయ నేర గణాంకాల నమోదు సంస్థ 2021 వార్షిక నివేదిక ప్రకారం మన దేశంలో బాలబాలికల మీద 2019లో 32,269 కేసులు, 2020లో 29,768 కేసులు, 2021లో 31,170 కేసులు నమోదైనాయి. దీన్ని బట్టి బాల బాలికల్లో హింసాత్మక, నేర ప్రవృత్తి స్థాయి మనకు అవగతమవుతుంది. దీనికి తల్లిదండ్రుల నిరాదరణ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు కొన్ని కారణాలు. వీటిని పరిహరించడం ద్వారానే రేపటి పౌరులను నేర ప్రపంచంలోకి వెళ్లకుండా ఆపగలం. (క్లిక్ చేయండి: మహిళలు రోడ్డెక్కాలంటే భయం.. అదే పెద్ద సమస్య!) - తడకమళ్ళ మురళీధర్ విశ్రాంత జిల్లా జడ్జి -
వయసు 10.. ఫేస్బుక్, ఇన్‌స్టా ఖాతాలు.. రోజుకు 4 గంటలు
న్యూఢిల్లీ: మైనర్లలో స్మార్ట్‌ఫోన్ వాడకంపై జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) చేసిన పరిశోధనలో విస్తుపోయే నిజాలు బయట పడ్డాయి. 10 ఏళ్ల వయసు పిల్లల్లో 37.8శాతం మందికి ఫేస్బుక్ ఖాతాలు, 24.3శాతం మందికి ఇన్స్టాగ్రామ్ ఖాతాలు ఉన్నట్లు వెల్లడైంది. వాస్తవానికి ఈ ఖాతాలను వాడేందుకు కనీస వయసు 13 ఏళ్లు. ఈ పరిశోధనలో మొత్తం 5,811 మంది నుంచి స్పందనలు తీసుకున్నారు. 3,491 మంది పాళశాలపిల్లలు, 1,534 మంది తల్లిదండ్రులు, 786 మంది టీచర్లు, 60 స్కూళ్ల స్పందనలు తీసుకున్నారు. 6 రాష్ట్రాల్లో పరిశోధన సాగింది. 8–18 ఏళ్ల వారిలో 30.2 శాతం మంది సొంత ఫోన్లు ఉన్నాయని తేలింది. స్మార్ట్ ఫోన్లు ఉపయోగిస్తున్న మొత్తం బాలల్లో 94.8శాతం మంది ఆన్లైన్ క్లాసుల కోసం వాడుతున్నారు. 40 శాతం మంది మెసెంజర్లు, 31 శాతం మంది మెటీరియల్స్, 31.30 శాతం మంది మ్యూజిక్, 20.80 శాతం మంది గేమ్స్ కోసం వాడుతున్నారు. 52.9శాతం మంది చాటింగ్‌ను, 10.1శాతం మంది ఆన్లైన్లో నేర్చుకోవడాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లు తెలిపారు. 15.80శాతం మంది రోజుకు 4 గంటలు, 5.30శాతం మంది రోజుకు 4 గంటల కంటే ఎక్కువ సమయం ఫోన్ వాడుతున్నారు. నిద్రపోయే ముందు ఫోన్లు వాడే వారు 76.20శాతం ఉండటం గమనార్హం. 23.80శాతం మంది పడుకోవడానికి బెడ్ ఎక్కాకా ఫోన్ వాడుతున్నారు. నిద్రపోవడానికి ముందు ఫోన్ వాడితే పిల్లల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ పరిశోధన ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. -
DCPCR: థియరీ ఫార్ములా ప్రాక్టికల్స్‌కు వద్దు
సాక్షి, న్యూఢిల్లీ: 12వ తరగతి ఫలితాల వెల్లడిలో థియరీ ఫార్ములా ప్రాక్టికల్స్‌కు వర్తింపజేయొద్దని సీబీఎస్ఈకి ఢిల్లీ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఫర్ చైల్డ్ రైట్స్ (డీసీపీసీఆర్) సూచించింది. ఆ విధంగా చేయడం సీబీఎస్ఈ సొంత పాలసీకి విరుద్ధమని పేర్కొంది. 12వ తరగతి విద్యార్థి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుపై డీసీపీసీఆర్ ఈ మేరకు స్పందించింది. పరీక్ష కేంద్రం పొరపాటు వల్ల తన కుమారుడు 2019–20లో గణితం ప్రాక్టికల్ పరీక్షకు హాజరు కానట్లు నమోదయిందని, అసెస్మెంట్లో 20కుగానూ 17 మార్కులు వచ్చాయని విద్యార్థి తండ్రి పేర్కొన్నారు. అయితే ప్రొ–రాటా (నిష్పత్తి) ప్రకారం 20కు నాలుగు మార్కులు మాత్రమే ఇస్తున్నట్లు సీబీఎస్ఈ రీజినల్ డైరెక్టర్ చెప్పారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘‘పరీక్షలు నిర్వహించడం, ఫలితాలు వెల్లడించడం సీబీఎస్ఈ పాత్ర. పరిధికి మించి అధికారాలు ఉపయోగించడం రాజ్యాంగ విరుద్ధం’’అని డీసీపీసీఆర్ ఛైర్పర్సన్ అనురాగ్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. డీసీపీసీఆర్–2005 చట్టం ప్రకారం.. విద్యార్థి పరీక్షకు హాజరైనప్పటికీ అబ్సెంట్‌గా నమోదు చేయడం వల్ల విద్యార్థి నష్టపోవడమే కాదు అతడి రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించినట్లేనని పేర్కొన్నారు. ఇంటర్నల్ గ్రేడ్లు ఒకసారి అప్లోడ్ చేసిన తర్వాత మార్చడం కుదరదని, విద్యార్థి భవిష్యత్తుపై ప్రభావం పడకుండా హాజరు సరిదిద్దే క్రమంలోనే ప్రొ–రాటా విధానం ప్రకారం ప్రాక్టికల్ మార్కులు లెక్కించి 20కు నాలుగు మార్కులు ఇచ్చినట్లు కమిషన్‌కు సీబీఎస్ఈ వివరించింది. విద్యార్థి ఎన్ని మార్కులు సాధించాడో అన్ని మార్కులు ఇవ్వాలని, ప్రొ–రాటా విధానం ప్రకారం ఇవ్వరాదని డీసీపీసీఆర్ స్పష్టం చేసింది. మార్కులు తగిన విధంగా ఇవ్వడానికి సీబీఎస్ఈ పాలసీని సవరించాలని పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా విద్యాశాఖ చర్యలు చేపట్టాలని సూచించింది. సర్వీసు రూల్స్ ప్రకారం బాధ్యులైన వారిపై చర్యలు తీసుకొని విద్యార్థికి రూ.50వేల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. చదవండి: కోవిడ్‌తో 77 మంది లాయర్ల మృతి.. సుప్రీంకోర్టు నివాళి -
పేద పిల్లల చదువుకు వెలుగు.. అమ్మఒడి
సాక్షి, అమరావతి: పేదపిల్లలు బడిలో ఉండేలా చూసేందుకు ఉద్దేశించిన ‘అమ్మఒడి’ పథకం వంటివి గతంలో దేశంలో ఎక్కడా అమలుచేయలేదని, పేద కుటుంబాల్లోని పిల్లల విద్యకు ఆర్థికంగా ఏ సాయం చేసినా మంచిదేనని బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ మాజీ చైర్పర్సన్ శాంతాసిన్హా అన్నారు. అదే సమయంలో.. నగదు బదిలీ చేసి వదిలేయకుండా పథకం లక్ష్యం నెరవేరేలా పటిష్ట కార్యాచరణ ఉండాలని అభిప్రాయపడ్డారు. ఇందుకు అధికారులతో పాటు తల్లిదండ్రుల కమిటీలు, పంచాయతీల్ని విద్యావ్యవస్థలో బాధ్యుల్ని చేయాలని సూచించారు. ‘జగనన్న అమ్మఒడి’ పథకంపై సోమవారం ఆమె సాక్షితో సంభాషించారు. విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యమిస్తే.. సామాజికంగా మనం ఆశించే మార్పులు సాధ్యమవుతాయని, అయితే ఇది ఏ ఒక్క రోజులోనో సాధ్యం కాదని.. నిరంతరాయంగా 20 ఏళ్లపాటు కొనసాగాలన్నారు. ‘అమ్మఒడి’ సహా విద్యా వ్యవస్థపై ఎంవీ ఫౌండేషన్ వ్యస్థాపకురాలిగా కూడా వ్యవహరిస్తున్న శాంతాసిన్హా పలు అభిప్రాయాలు పంచుకున్నారు. అవి ఆమె మాటల్లోనే.. బడికెళ్లేలా చూడాల్సిన బాధ్యత అందరిదీ.. ‘అమ్మఒడి’ పథకంపై తల్లుల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రభుత్వం చేస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలి. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు ఈ బాధ్యత అప్పగించాలి. అప్పుడు అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. ఏదో డబ్బులిచ్చారు? ఖర్చు చేద్దాంలే.. అనేలా ఉండకూడదు. పిల్లలు బడికెళ్లేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. స్కూళ్లు బాగా నడిస్తే పిల్లలు వారంతట వారే వస్తారు. విద్యావ్యవస్థపై ప్రతి ఒక్కరికీ బాధ్యత ఉండేలా చూడాలి. పైనుంచి కిందివరకు అందరినీ భాగస్వాముల్ని చేయాలి. పనిచేయకపోతే చర్యలు తీసుకోవాలి. ఎంఈవోలు, ఎంఆర్సీలు, సీఆర్సీలు, హెచ్ఎంలు, సబ్జెక్టు టీచర్లు ఇలా అందరూ పూర్థి స్థాయిలో ఉండి విద్యావ్యవస్థలో వారి విధుల్ని సక్రమంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలి. ఇవన్నీ ఉన్నా.. పిల్లలు రాకపోతే అప్పుడు పిల్లల తల్లిదండ్రులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. స్కూళ్ల అభివృద్ధికి ‘నాడు–నేడు’ దోహదం స్కూళ్ల అభివృద్ధికి నాడు–నేడు కార్యక్రమం ఎంతో ప్రయోజనకరం. తల్లిదండ్రుల కమిటీలు, గ్రామ పంచాయతీల్ని ఈ కార్యక్రమంలో భాగస్వాముల్ని చేయాలి. బడి బయట ఏ ఒక్క చిన్నారి ఉండడానికి వీల్లేదు. ప్రభుత్వ లక్ష్యం అదే కావాలి. పేరెంట్స్ కమిటీలు, గ్రామ పంచాయతీలకు కూడా బాధ్యత అప్పగించాలి. అవకాశం కల్పిస్తే పేద పిల్లలు బాగా చదవగలరన్నది సాధ్యం చేసి చూపించాలి. కార్పొరేట్ సంస్థల్ని రద్దు చేయాలి విద్యను వ్యాపారంగా మార్చిన ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల్ని పూర్తిగా రద్దుచేయాలి. కార్పొరేట్ యాజమాన్యాలకు సొంత ప్రయోజనాలే తప్ప సామాజిక, సేవా దృక్పథం ఉండదు. అమెరికా, యూరోప్‌లో విద్య పబ్లిక్ సర్వీస్‌గానే ఉంది. విద్య ప్రభుత్వ బాధ్యత. ప్రైవేట్‌లో ఉండడం వల్లే అసమానతలు ఏర్పడుతున్నాయి. పిల్లలందరికీ చదువు చెప్పించేందుకు ప్రభుత్వం సిద్ధమవ్వాలి. తగినన్ని సెకండరీ, హయ్యర్ సెకండరీ స్కూళ్లను పెట్టాలి. నాణ్యమైన విద్యను అందించాలి. ఈ కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల్ని బంద్ చేయిస్తే ప్రజలపై చదువు కోసం ఆర్థిక భారం ఉండదు. లాభాపేక్ష లేని ప్రైవేట్ సంస్థలకు పాఠశాలలు నడిపించే బాధ్యత అప్పగించాలి. ఫిర్యాదుల్ని పరిష్కరించేలా కమిషన్లు విద్యారంగంలో ప్రమాణాల కోసం కమిషన్ల ఏర్పాటు మంచి నిర్ణయమే. వాటిలో ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం ఉండాలి. ఎవరైనా తమకు సమస్య ఎదురైతే కమిషన్‌కు చెప్పుకుని పరిష్కారం పొందేలా చూడాలి. పంచాయతీలకు బాధ్యతలు అప్పగించాలి ప్రభుత్వ విద్యా విధానంలో పంచాయతీలు, ఇతర స్థానిక సంస్థల పర్యవేక్షణ బాధ్యత చాలా ముఖ్యం. కేరళలో ఈ వ్యవస్థ బాగా పనిచేస్తోంది. అక్కడి ప్రభుత్వం పంచాయతీలకు పెద్ద పాత్ర ఇచ్చింది. అక్కడి నిపుణులను రప్పించి ఇక్కడ మార్పులు చేసినా మంచిదే. -
ప్రతి జిల్లాలో బాలల సంరక్షణ కేంద్రాలు
- పిల్లల్ని వేధిస్తే 1098కి ఫోన్ చేయాలి - మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ - సంచాలకులు విజయేందిర బోరుు సాక్షి, హైదరాబాద్: ‘బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత. వారి సంరక్షణకు ప్రతి జిల్లాలో బాలల సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, జిల్లా సంక్షేమాధికారి కన్వీనర్‌గా, సంబంధిత శాఖ అధికారులు సభ్యులుగా ఉంటారు. రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లో ఈ కేంద్రా లు పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నాం. పిల్లల్ని వేధించినట్లు తెలిస్తే వెంటనే 1098కి ఫోన్ చేయం డి. ఈ కమిటీ చర్యలకు ఉపక్రమిస్తుంది’ అని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర సంచాలకులు విజయేందిర బోరుు పేర్కొన్నారు. రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరులతో ఆమె మాట్లాడారు. ఈ నెల 14న బాలల దినోత్సవం సందర్భంగా రవీంద్రభారతిలో రాష్ట్రస్థారుు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆ రోజు ఉదయం 8.30కి గన్‌పార్క్ నుంచి రవీంద్రభారతి వరకు చిన్నారులతో ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. పిల్లల హక్కులు, సంరక్షణ చట్టంపై అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేపట్టనున్నామన్నారు. బాల సదనాల ను పెంచేందుకు ప్రభుత్వానికి నివేదించామన్నారు. పిల్లల దత్తతను ఆన్లైన్లో చేపడుతున్నామని, గతేడాది 215 మంది పిల్లల్ని దత్తతిచ్చామన్నారు. పట్టణాల్లో పిల్లల భిక్షా టనపై ఫిర్యాదులు వస్తున్నాయని, ఈ నెలాఖర్లో నగరంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. శాఖ పరంగా వసతి పొందుతున్న బాల, బా లికలకు గురుకులాలు, కేజీబీవీల్లో చేర్పించనున్న ట్లు వివరించారు. సమావేశంలో ఆ శాఖ సంయుక్త సంచాలకులు లక్ష్మి, రాములు పాల్గొన్నారు. -
పెళ్లి కోసం బాలికపై ఒత్తిడి
► కుటుంబసభ్యులు నిర్భందించారంటూ బాలల హక్కుల ► పరిరక్షణ కమిషన్‌కు మొర ► పోలీసుల సహకారంతోబాలికను విడిపించిన కమిషన్ ► సంరక్షణ కోసం శిశుసంక్షేమ శాఖకు అప్పగింత హైదరాబాద్: ‘‘పెళ్లి చేసుకోవాలంటూ మా తల్లిదండ్రులు, తాతలు, అన్న నన్ను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారు... నాకు చదువు కోవాలని ఉంది... ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు... ప్లీజ్ నన్ను రక్షించండి’’ అంటూ ఓ మైనర్ బాలిక బాలల హక్కుల సంఘానికి మొరపెట్టుకుంది. బాలిక వినతికి స్పందించిన బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ పోలీసుల సహకారంతో మైనర్ బాలికను తల్లిదండ్రుల చెర విడిపించి ఆమెను బాలల సదన్‌కు తరలించారు. ఈ ఘటన బుధవారం హైదరాబాద్ హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు అచ్యుతరావు, పోలీసులు వివరాలను వెల్లడించారు. నల్లగొండ జిల్లా బీబీనగర్ మండలం ముగ్ధంపల్లికి చెందిన నువ్వుల రమేష్ కూతురు(17) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమెకు వివాహం చేసేందుకు కుటుంబ సభ్యులు సంబంధం చూశారు. బాలిక పెళ్లికి నిరాకరించడంతో తల్లిదండ్రులు, అన్న, తాతయ్యలు బాలికను మానసికంగా, శారీరకంగా హింసించసాగారు. దీంతో బాలిక గత నెల 20న అచ్యుతరావును కలసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. దీనిపై విచారించి నివేదిక ఇవ్వాలని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ నల్లగొండ ఎస్పీని కోరింది. దీంతో భువనగిరి పోలీసులు బాలిక కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం హయత్‌నగర్ మండలం బలిజగూడలో బంధువుల వివాహం ఉందని బాలికను మేనమామ డప్పు రమేష్ ఇంటికి తీసుకొచ్చారు. పోలీసుల అనుమతి లేకుండా బాలికను తీసుకొచ్చిన తల్లిదండ్రులు పెళ్లి జరిగి మూడు రోజులైనా తిరిగి ఇంటికి తీసుకుపోలేదు. దీంతో తనను ఇక్కడే నిర్బంధిస్తారని భావించిన బాలిక అచ్యుతరావుకు ఫోన్ ద్వారా ఎస్ఎంఎస్ పంపించింది. దీంతో స్పందించిన ఆయన స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ శ్రీనివాస్ సిబ్బందితో కలసి బలిజగూడలోని బాలిక ఇంటికి చేరుకున్న అచ్యుతరావు బాలిక కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. బాలిక కోరిక మేరకు పోలీసులు ఆమెను శిశు సంక్షేమ శాఖ వారికి అప్పగించగా వారు బాలికను నింబోలి అడ్డాలోని బాల సదన్‌కు తరలించారు. తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మైనర్లను హింసిస్తే చర్యలు తప్పవు... మైనర్లపై మానసికంగా, శారీరకంగా హింసకు పాల్పడితే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులైనా సరే చర్యలు తప్పవని బాలల హక్కుల సంరక్షణ కమిషన్ సభ్యులు అచ్యుతరావు హెచ్చరించారు. మైనర్లకు పెళ్లి చట్టవిరుద్ధమని దానికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన అన్నారు. తల్లిదండ్రులపై కేసు నమోదు... బాలిక ఫిర్యాదు మేరకు ఆమె తల్లి ఇందిర, తండ్రి రమేష్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. బాలికను నిర్బంధించినట్లు విచారణలో తేలితే అందుకు కారణమైన వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని ఆయన పేర్కొన్నారు. -
ఎవరికి ఫిర్యాదు చేయాలి..!
బాలల హక్కుల కమిషన్‌కు కష్టకాలం ♦ ఆఫీసులో వసతులు కరువు.. సిబ్బంది అసలే లేరు ♦ పది నెలలుగా సభ్యుల జీతాలు, నిధులు నిలిపివేత ♦ ఇప్పటికే ముగ్గురు సభ్యుల రాజీనామా ♦ కొత్త కమిషన్ ఏర్పాటుకు ‘టీ’ సర్కారు నోటిఫికేషన్ ♦ చెల్లదంటున్న ప్రస్తుత సభ్యులు సాక్షి,సిటీబ్యూరో : సమాజంలోని చిన్నారుల హక్కులకు అన్యాయం జరిగితే బాలల హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తారు. కానీ అదే కమిషన్‌కు వచ్చిన కష్టాలను మాత్రం పట్టించుకున్నవారు లేరు. బాలల హక్కుల పరిరక్షణ కోసం 2014లో ఏర్పాటైన కమిషన్ నిధుల కొరత, అధికార యంత్రాంగం సహాయ నిరాకరణతో విలవిల్లాడుతోంది. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ పునర్విభజన చట్టంలోని 10వ షెడ్యూల్లో ఉమ్మడిగా ఉంటుందని పేర్కొన్నప్పటికీ ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు సిబ్బంది, నిధుల కేటాయింపు విషయంలో మొండికేశాయి. దీతో కమిషన్‌లోని మమతా రఘువీర్, రియాజుద్దీన్ ఇప్పటికే తమ పదవుల నుంచి తప్పుకున్నారు. మిగిలిన సభ్యుల్లో సుమిత్ర, బాలరాజు చాలా కాలంగా విధులకు దూరంగా ఉండగా చివరకు ఇద్దరు సభ్యులే మిగిలారు. జీఓ ఎంఎస్ నెంబర్ 11 (19.2.2014) మేరకు రిటైర్డ్ ఐఏఎస్ సుజాతారావు చైర్‌పర్సన్‌గా ఆయా రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న మరో ఆరుగురు సభ్యులతో బాలల కమిషన్ ఏర్పాటు చేశారు. అయితే, కార్యాలయం, ఇతర వసతుల పరిస్థితి చూశాక సుజాతారావు విధుల్లోనే చేరలేదు. బాధ్యతలు తీసుకున్న ఆరుగురు సభ్యులు ఇక్కడి పరిస్థితిపై పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తే కేవలం ఆర్నెల్లు మాత్రమే అరకొర నిధులు విదిల్చారు. 2014 నవంబర్ నుంచి ఒక్క పైసా విడుదల చేయకపోవటంతో సభ్యులు సొంత ఖర్చులతో కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బాబోయ్.. ఆ పదవులు వద్దు.. ఈ కమిషన్‌లో ఏడుగురు సభ్యుల్లో ప్రస్తుతానికి సీరియస్‌గా పనిచేస్తున్నది కేవలం ఇద్దరే. మిగిలినవారు మనస్థాపంతో పదువులకు రాజీనామా చేయగా, కొందరు కార్యాలయం మెట్లెక్కడానికి ఇష్టపడడం లేదు. ఇప్పటికే సామాజిక కార్యకర్త, కమిషన్ సభ్యురాలు మమతా రఘువీర్ జూలైలో రాజీనామా చేశారు. అంతకు ముందే మరో సభ్యులు రహీమొద్దీన్ కూడా పదవిని వదులుకున్నారు. మిగిలిన సభ్యులు మొక్కపాటి సుమిత్ర, బాలరాజు కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. సొంత ఖర్చులతో పోచంపల్లి అచ్యుతరావు, ఎస్.మురళీధర్‌రెడ్డి మాత్రమే విధుల్లో పాల్గొంటున్నారు. ఈ విషయమై మురళీధర్‌రెడ్డి స్పందిస్తూ ‘సొంత ఖర్చులతో పనిచేస్తున్నాం..ప్రభుత్వం సహకరించకపోయినా మా కర్తవ్యం మే నిర్వహిస్తాం’ అని పేర్కొన్నారు. వివాదాస్పదం అవుతోన్న ‘టీ’ నోటిఫికేషన్ తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు కొత్త కమిటీని ఏర్పాటు చేసేందుకు ఈనెల 17న టీ- ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేస్తూ దరఖాస్తులను ఆహ్వానించింది. అయితే 10వ షెడ్యూల్లో పేర్కొన్న మేరకు.. ఈ కమిషన్ పదేళ్ల వరకు ఉమ్మడిగా నిర్వహించాలని నిర్ణయించడంతో పాటు, ప్రస్తుత కమిటీ సభ్యుల మూడేళ్ల పదవీ కాలం ముగిసేంత వరకు కొత్త కమిటీని నియమించడానికి వీల్లేదని చట్టం చెబుతోంది. ఖాళీ అయిన పోస్టులను మాత్రమే భర్తీ చేయాల్సి ఉంటుంది. కానీ తాజా నోటిఫికేషన్లో చైర్పర్సన్ సహా అన్ని పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వటం న్యాయపరమైన చిక్కులు తలెత్తేందుకు ఆస్కారముంది. వేచి చూసి విసిగిపోయాం.. బాలల హక్కుల పరిరక్షణ కోసం ఉత్సాహంగా పనిచేశాం. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందలేదు. ఐఏఎస్ మొదలుకుని ముఖ్యమంత్రి వరకు ముప్పై విజ్ఞాపన పత్రాలు అందజేశా. కానీ ఎలాంటి స్పందనా లేదు. అందుకే రాజీనామా చేసి, సొంతంగా బాలల హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తున్నా. - మమతా రఘువీర్, మాజీ సభ్యురాలు ఈ నోటిఫికేషన్ చెల్లదు.. 10వ షెడ్యూల్లో ఉన్న కమిషన్‌ను విభజించడం చెల్లదు. అంతే కాకుండా ప్రస్తుత సభ్యుల పదవీ కాలం మూడేళ్లుగా నిర్ధారించారు. ఇంకా మాకు ఒకటిన్నర సంవత్సర కాలం మిగిలే ఉంది. గడువు పూర్తి కాకుండానే రాజీనామా చేస్తే తప్ప, మమ్మల్ని తొలగించే అధికారం లేదు. అధికారులు సీఎంను తప్పుదోవ పట్టిస్తున్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తాం. - అచ్యుతరావు, బాలల హక్కుల కమిషన్ సభ్యుడు