ఉజ్జయిని: మధ్యప్రదేశ్‌లో అత్యాచారానికి గురై అర్ధనగ్నంగా, రక్తమోడుతూ ఉజ్జయిని వీధుల్లో సాయం కోరుతూ తిరుగాడిన బాలిక కోలుకుంటోంది. ఇండోర్‌లోని మహారాజా టుకోజీరావ్ హోల్కార్ మహిళా ఆస్పత్రిలో వైద్య నిపుణుల బృందం ఆమెకు వైద్య చికిత్సలు అందిస్తోంది. పేరు, వయస్సు, చిరునామా వంటి వివరాలను చెప్పలేకపోతోందని, అయితే ఆమెది సత్నా జిల్లా అని తెలుస్తోందని కౌన్సిలింగ్ నిపుణులు గురువారం తెలిపారు.
బాధిత బాలిక పరిస్థితి కొద్దికొద్దిగా మెరుగవుతోందని బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ సభ్యురాలు డాక్టర్ దివ్యా గుప్తా తెలిపారు. ఈ అంశంపై రాజకీయ పార్టీల నేతలు సున్నితత్వం ప్రదర్శించాలని, బాధిత బాలిక చికిత్స పొందే ఆస్పత్రి వద్ద గుమికూడడం వంటివి చేయరాదని బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ చైర్‌పర్సన్ ప్రియాంక్ కనూంగో కోరారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి భరత్ సోని అనే రిక్షావాలాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
క్రైమ్ సీన్ రిక్రియేషన్ కోసం జీవన్ ఖేది ప్రాంతానికి గురువారం పోలీసులు తీసుకెళ్లగా పారిపోయే ప్రయత్నంలో గాయపడ్డాడు. పన్నెండేళ్ల బాలిక అర్ధనగ్నంగా, రక్తమోడుతూ ఉజ్జయిని వీధుల్లో రెండున్నర గంటలపాటు సాయం కోరుతూ ఇల్లిల్లూ తిరిగినా పట్టించుకోకపోవడం అమానవీయమని ఎస్‌పీ సచిన్ శర్మ అన్నారు. ‘నా వెనుక ఎవరో వస్తున్నారు. నేను ప్రమాదంలో ఉన్నాను’అని ప్రాధేయపడిందే తప్ప ఆమె డబ్బులు అడగలేదన్నారు. ‘కొందరు ఛీత్కరించినా, కొందరు రూ.50, రూ.100 వరకు ఇచ్చారు. అదేదారిలో ఉన్న టోల్‌ప్లాజా సిబ్బంది కొంత డబ్బు, బట్టలు ఇచ్చారు. చివరికి ఆశ్రమంలో ఆశ్రయం పొందింది. వారామెను దగ్గరకు తీసి, మాకు సమాచారం అందించారు’అని ఎస్‌పీ వివరించారు..
Comments
Please login to add a commentAdd a comment