Treatment continues
-
కోలుకుంటున్న ‘ఉజ్జయిని’ బాలిక
ఉజ్జయిని: మధ్యప్రదేశ్‌లో అత్యాచారానికి గురై అర్ధనగ్నంగా, రక్తమోడుతూ ఉజ్జయిని వీధుల్లో సాయం కోరుతూ తిరుగాడిన బాలిక కోలుకుంటోంది. ఇండోర్‌లోని మహారాజా టుకోజీరావ్ హోల్కార్ మహిళా ఆస్పత్రిలో వైద్య నిపుణుల బృందం ఆమెకు వైద్య చికిత్సలు అందిస్తోంది. పేరు, వయస్సు, చిరునామా వంటి వివరాలను చెప్పలేకపోతోందని, అయితే ఆమెది సత్నా జిల్లా అని తెలుస్తోందని కౌన్సిలింగ్ నిపుణులు గురువారం తెలిపారు. బాధిత బాలిక పరిస్థితి కొద్దికొద్దిగా మెరుగవుతోందని బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ సభ్యురాలు డాక్టర్ దివ్యా గుప్తా తెలిపారు. ఈ అంశంపై రాజకీయ పార్టీల నేతలు సున్నితత్వం ప్రదర్శించాలని, బాధిత బాలిక చికిత్స పొందే ఆస్పత్రి వద్ద గుమికూడడం వంటివి చేయరాదని బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ చైర్పర్సన్ ప్రియాంక్ కనూంగో కోరారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి భరత్ సోని అనే రిక్షావాలాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్రైమ్ సీన్ రిక్రియేషన్ కోసం జీవన్ ఖేది ప్రాంతానికి గురువారం పోలీసులు తీసుకెళ్లగా పారిపోయే ప్రయత్నంలో గాయపడ్డాడు. పన్నెండేళ్ల బాలిక అర్ధనగ్నంగా, రక్తమోడుతూ ఉజ్జయిని వీధుల్లో రెండున్నర గంటలపాటు సాయం కోరుతూ ఇల్లిల్లూ తిరిగినా పట్టించుకోకపోవడం అమానవీయమని ఎస్పీ సచిన్ శర్మ అన్నారు. ‘నా వెనుక ఎవరో వస్తున్నారు. నేను ప్రమాదంలో ఉన్నాను’అని ప్రాధేయపడిందే తప్ప ఆమె డబ్బులు అడగలేదన్నారు. ‘కొందరు ఛీత్కరించినా, కొందరు రూ.50, రూ.100 వరకు ఇచ్చారు. అదేదారిలో ఉన్న టోల్‌ప్లాజా సిబ్బంది కొంత డబ్బు, బట్టలు ఇచ్చారు. చివరికి ఆశ్రమంలో ఆశ్రయం పొందింది. వారామెను దగ్గరకు తీసి, మాకు సమాచారం అందించారు’అని ఎస్పీ వివరించారు.. -
మసూద్‌కు సైనిక ఆస్పత్రిలో చికిత్స
న్యూఢిల్లీ: ఉగ్ర సంస్థలకు, పాక్ సైన్యానికి ఉన్న సంబం ధం మరోసారి తేటతెల్లమైంది. ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ అధినేత మసూద్ అజార్‌కు ఏకంగా రావల్పిండిలోని సైనిక ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని ఆ దేశ అధికారులే స్వయంగా ఒప్పుకున్నారు. కరుడు గట్టిన ఉగ్రవాది, జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజార్(50) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మూత్ర పిండాల వ్యాధితో అతడికి రావల్పిండిలోని సైనిక ఆస్పత్రిలో ప్రతిరోజూ డయాలసిస్ జరుగుతోందని పాక్ అధికారులు వెల్లడించారు. మసూద్ తమ దేశంలోనే ఉన్నట్లు ఒప్పుకోవడంతోపాటు తమకు టచ్‌లోనే ఉన్నాడనే విషయాన్ని కూడా పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మూద్ శుక్రవారం స్వయంగా అంగీకరించిన విషయం తెలిసిందే. ‘మూత్ర పిండాలు పనిచేయకపోవడంతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రధాన సైనిక కార్యాలయం రావల్పిండిలోని సైనిక ఆస్పత్రిలో రోజూ ఆయనకు డయాలసిస్ జరుగుతోంది’అని అధికారులు తెలిపారు. పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మూద్ శనివారం ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలు వెల్లడించారు. పుల్వామా ఘటనకు బాధ్యుడైన మసూద్‌పై చర్యలు ఎందుకు తీసుకోలేదన్న ప్రశ్నకు మంత్రి.. ఆ ఆరోపణను జైషే మొహమ్మద్ సంస్థ కొట్టిపారేసిందంటూ బదులిచ్చారు. అయితే, పుల్వా మా ఘటన వెనుక తామే ఉన్నామంటూ ఆ సంస్థ ప్రకటించింది కదా అని పేర్కొనగా ఆ సంస్థ పాత్ర ఉందనే విషయం గట్టిగా చెప్పలేమనీ, దానిపై కొన్ని అనుమానాలున్నాయన్నారు. అవిఏమిటనే ప్రశ్నకు మంత్రి ఖురేషి.. తమ ప్రభుత్వం జైషే నాయకులతో మాట్లాడగా వారు ఖండించారని వివరించారు. నిషేధిత సంస్థ నాయకులతో ఎవరు మాట్లాడారన్న ప్రశ్నకు ఆయన.. ‘ఇక్కడి ప్రజలు, వారిని గురించి తెలిసిన వారు’ అంటూ చెçప్పుకొచ్చారు. ఇలా ఉండగా, కరుడు గట్టిన ఉగ్రవాది జైషే మొహమ్మద్ అధినేత ఇంట్లో నుంచి కూడా బయటకు రాలేని అనారోగ్య స్థితికి చేరుకున్నారని పాక్ అధికారులు వెల్లడించారు. ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు శుక్రవారం మంత్రి ఖురేషి తెలిపిన విషయం తెలిసిందే. జీహాద్ ప్రచారంలో దిట్ట మజూద్ అజార్ నేతృత్వంలోని జైషే మహ్మద్ సంస్థ కశ్మీర్ యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షిస్తోంది. 2001లో భారత పార్లమెంట్‌పై దాడికి యత్నించింది. 2016లో పఠాన్‌కోట్‌లోని వైమానిక స్థావరంతోపాటు, ఉడిలోని సైనిక క్యాంపుపై దాడికి పాల్పడింది. కశ్మీర్లో బలగాలపై దాడులకు పాల్పడేందుకు ఉగ్రవాదులకు బాలాకోట్, ఖైబర్ ఫక్తున్వాల్లో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపే ఆధారాలను భారత ప్రభుత్వం ఇటీవల పాక్‌కు అందజేసింది కూడా. ఈ సంస్థను అగ్ర దేశాలు నిషేధించాయి. అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌కు సన్నిహితుడైన మసూద్‌ను భారత్ కస్టడీ నుంచి విడిపించుకునేందుకు ఉగ్రవాదులు ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని 1999లో కాందహార్‌కు దారి మళ్లించిన విషయం తెలిసిందే. జైలు నుంచి బయటకు వచ్చాక అతడు జైషే మొహమ్మద్‌ను స్థాపించాడు. 1979–1989 సంవత్సరాల మధ్య అఫ్గానిస్తాన్‌లో తిష్టవేసిన సోవియెట్ రష్యా సేనలకు వ్యతిరేకంగా జరిగిన పోరులో మసూద్ గాయపడ్డాడు. అనంతరం కరడుగట్టిన చాందసవాదిగా మారిన అతడు ఉగ్ర సంస్థ హర్కతుల్ అన్సార్ కీలక నేతగా మారాడు. మంచి వక్త కూడా అయిన మసూద్ జీహాద్(పవిత్ర యుద్ధం)ను ప్రపంచవ్యాప్తం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఫిబ్రవరి 14వ తేదీన పుల్వామాలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మృతికి కారణమైన ఆత్మాహుతి దాడి కూడా తన సభ్యులేనంటూ ఈ సంస్థ ప్రకటించుకుంది. దీంతో అజార్ బావమరిది మౌలానా యూసఫ్ అజార్ నేతృత్వంలో నడుస్తున్న బాలాకోట్‌లోని జైషే మొహమ్మద్ సంస్థ స్థావరంపై భారత వైమానిక దళం మెరుపుదాడులు చేపట్టి, తీవ్ర నష్టం కలిగించిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. భారత్‌తో యుద్ధం ఆగదు..: జైషే భారత్–పాక్ దేశాల మధ్య సంబంధాలకతీతంగా భారత్‌కు వ్యతిరేకంగా పవిత్ర యుద్ధం (జీహాద్) కొనసాగుతుందని జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ తీర్మానించిందని భారత నిఘా వర్గాల నివేదికలు వెల్లడించాయి. 2017 నవం బర్ 17న పాక్‌లోని ఒకారాలో జరిగిన సమావేశంలో జైషే ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పుల్వామా ఆత్మాహుతి దాడి కుట్రదారుడు, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ సారథ్యం లో నిర్వహిస్తోన్న ఉగ్రవాద కార్యకలాపాల పట్ల సమావేశంలో పాల్గొన్న సభ్యులు పొగడ్తల వర్షం కురిపించారని భారత నిఘా వర్గాలు తెలిపాయి. సరిహద్దుల్లో సేకరించిన సమాచారాన్ని బట్టి జైషే మహ్మద్ సంస్థ తన ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగిస్తూ, ఘజ్వా–ఎ–హింద్ (భారత్‌పై ఆఖరి పోరాటం) సాగించాలని ఆ సమావేశాల్లో తీర్మానించింది. జైషే మహ్మద్ సంస్థ నాయకులు అబ్దుల్ రవూఫ్ అస్ఘర్, మహ్మద్ మసూద్, అబ్దుల్ మాలిక్ తాహీర్‌లు ఈ ఉగ్రవాద సమావేశాలను ఉద్దేశించి మాట్లాడినట్టు కూడా నిఘా సంస్థలు వెల్లడించాయి. 2018లో ఆరు రోజుల పాటు జైషే మహ్మద్ ‘షోబే తారఫ్’(డిపార్టమెంట్ ఆఫ్ ఇంట్రడక్ష న్) 65 మంది ఉలేమా (మతగురువు)లతో సహా 700ల మంది ప్రతినిధులతో 13 సమావేశాలు నిర్వహించినట్టు నిఘావర్గాల నివేదికలు బయటపెట్టాయి. మత గురువుల హర్షం...: జైషే సంస్థ 2018, మార్చిలో షోబ–ఎ–తారిఫ్ ఉగ్రవాద సంస్థ ప్రతినిధులు సియాల్ కోట్ జిల్లాలో 4 రోజుల పాటు 1,500ల మందితో 17 సమావేశాలు నిర్వహించినట్లు తెలిసింది. వీటికి హాజరైన 50 మంది మతగురువులు సమావేశాల పట్ల హర్షంవ్యక్తం చేసినట్టు సమాచారం. -
నిలకడగా కరుణ ఆరోగ్యం
సాక్షి ప్రతినిధి, చెన్నై: డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యం నిలకడగా ఉంది. చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. ఆదివారం రాత్రి కరుణానిధి ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంతో ఒక్కసారిగా కుటుంబసభ్యులు, అభిమానుల్లో ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. వైద్యుల చికిత్సతో ఆయన ఆరోగ్యం మెరుగైందని ఆ కాసేపటికి ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించడంతో కొంతవరకు ఆందోళనలు తగ్గాయి. ప్రస్తుతం కరుణ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన కుమారుడు, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ ప్రకటించారు. సోమవారం రాత్రి ఆసుపత్రి వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. ‘నిన్న రాత్రి ఆసుపత్రి యాజమాన్యం నాన్న ఆరోగ్యంపై ప్రకటన విడుదల చేసినప్పటి పరిస్థితే ఇప్పటికీ కొనసాగుతోంది. డాక్టర్లు ఇంటెన్సివ్ కేర్‌లో చికిత్స అందిస్తున్నారు’ అని తెలిపారు. కరుణానిధి ఆరోగ్యం ఒక్కసారిగా విషమించిందని, అయితే, వెంటనే తక్షణ చికిత్స అందించడంతో సాధారణ స్థాయికి వచ్చిందని ఆదివారం అర్ధరాత్రి కావేరీ ఆసుపత్రి ఒక ప్రకటన విడుదల చేయడం తెలిసిందే. సీఎం పరామర్శ మూడురోజుల పర్యటన నిమిత్తం సేలం జిల్లాకు వెళ్లిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి అర్ధాంతరంగా పర్యటన ముగించుకుని హడావుడిగా చెన్నైకి చేరుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, మరికొందరు మంత్రులు వెంటరాగా సోమవారం ఉదయం కావేరి ఆస్పత్రికి వెళ్లి స్టాలిన్‌ను కలుసుకుని కరుణ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం ఎడపాడి మీడియాతో మాట్లాడుతూ, కరుణకు చికిత్స జరుగుతోందని, కోలుకుంటున్నారని చెప్పారు. ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ సోమవారం చెన్నైకి వచ్చి కరుణను చూసి స్టాలిన్‌ను కలుసుకున్నారు. శ్రీలంక అధ్యక్షుడు, ప్రధాని తరఫున నలుగురు ప్రతినిధులు కావేరి ఆస్పత్రికి వచ్చారు. ఆగిన అభిమానుల గుండెలు తమ అభిమాన నేత కరుణానిధిని తలచుకుంటూ ఆవేదనకు గురై 8 మంది అభిమానుల గుండెలు ఆగిపోయాయి. ఓ అభిమాని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో వ్యక్తి బలవన్మరణానికి ప్రయత్నించాడు. కొందరు డీఎంకే కార్యకర్తలు కరుణ కోలుకోవాలంటూ కావేరి ఆస్పత్రి ముందు గుండు కొట్టించుకుని దేవుళ్లకు మొక్కుకున్నారు. అనేకచోట్ల ప్రత్యేక ప్రార్థనలు చేశారు. -
కొనసాగుతున్న చికిత్స ప్రక్రియ
సాక్షి ప్రతినిధి, చెన్నై:అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు మంగళవారం కూడా యథావిధిగా చికిత్స కొనసాగుతోంది. అమ్మకు జరుగుతున్న చికిత్స గురించి తెలుసుకునేందుకు పలువురు ప్రముఖులు అపోలోకు వచ్చి వెళ్లారు. వదంతుల నేపథ్యంలో రాష్ట్రంలో సాగుతున్న అరెస్టులను మాజీ న్యాయమూర్తి మార్కం డేయ కట్జు తీవ్రంగా ఖండించడంతోపాటు అరెస్టులు ఆపకుంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేలా పోరాడుతానని హెచ్చరించారు. చికిత్స నిమిత్తం గత నెల 22వ తేదీ అర్ధరాత్రి అపోలోకు చేరుకున్న సీఎం జయలలిత పూర్తిస్థాయిలో కోలుకునేందుకు వైద్యపరంగా అన్నికోణాల్లో కృషి జరుగుతోంది. లండన్ వైద్యులు డాక్టర్ రిచర్డ్, ఎయిమ్స్ వైద్యులు, సింగపూరు నుంచి వచ్చిన మహిళా ఫిజియోథెరపిస్టుల నిరంతర పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. ఫిజియోథెరపీపైనే ప్రస్తుతం పూర్తిస్థాయిలో కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. రోజు రోజుకూ అమ్మ కోలుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం వస్తున్నా ఈనెల 9వ తేదీ నుంచి అపోలో నుంచి హెల్త్బులెటిన్లు మాత్రం విడుదల కావడం లేదు. సీఎంను పరామర్శించేందుకు ప్రధాని నరేంద్రమోదీ వస్తారని ఆశిస్తుండగా, అపోలో ఆసుపత్రిలో ప్రధాని, జయ సంభాషిస్తున్న ఫొటోను, బులెటిన్‌ను విడుదల చేసే అవకాశం ఉందని ఊహాగానాలు సాగుతున్నాయి. ఇదిలా ఉండగా, సీఎంకు జరుగుతున్న చికిత్సపై ప్రజలు మాట్లాడుకుంటే అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని మాజీ న్యాయమూర్తి మార్కండేకట్జు ఫేస్బుక్లో విమర్శలు చేశారు. మంత్రి పన్నీర్‌సెల్వం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ ఇతర పోలీసు ఉన్నతాధికారులను ఆయన తప్పుపట్టారు. అరెస్టులు ఆపకుంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు నశించాయని కారణం చూపి రాష్ట్రపతి పాలన విధించేలా రాష్ట్రపతిని కోరుతానని, అంతేగాక అరెస్టులకు పాల్పడిన వారిని శిక్షకు గురిచేస్తానని హెచ్చరించారు. కాగా ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ కుమారుడు కరణ్ అదానీ, సినీనటుడు రాధారవి అపోలోకు వచ్చి జయ క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు. అమ్మ కోసం ద్రవిడ దేశం ప్రార్థనలు: సీఎం జయలలిత త్వరిత గతిన కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి చేరుకోవాలని మంగళవారం సైతం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ప్రార్థనలు సాగాయి. సీఎం జయ త్వరగా కోలుకుని పూర్వస్థాయిలో మరలా ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వర్తించాలని ఆకాంక్షిస్తూ తిరువత్తియూరు వడవుడి అమ్మన్ ఆలయంలో ద్రవిడ దేశం అధ్యక్షులు వీ కృష్ణారావు విశేషపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యవసాయ శాఖా మంత్రి దురైకన్ను, అంబత్తూరు ఎమ్మెల్యే అలెగ్జాండరు, తిరువత్తియూరు మాజీ శాసనసభ్యులు కే కుప్పన్ పలువురు పార్టీ ప్రముఖులు పాల్గొన్నారు. చెన్నై దక్షిణంలో పార్టీ లీగల్‌సెల్ అధ్వర్యంలో 200 మందికిపైగా మహిళలు సాయిబాబా ఆలయంలో పాలాభిషేకం, అన్నదానం నిర్వహించారు. మైలాపూరు కపాలీశ్వరర్ ఆలయంలో బంగారురథాన్ని లాగారు. నక్కీరర్ నగర్‌లోని అన్నై ఆరోగ్యమాత ఆలయంలో క్యాండిళ్లు వెలిగించి ప్రార్థనలు చేశారు. కౌన్సిలర్ ఎమ్ఏ మూర్తి నేతృత్వంలో వేలాచ్చేరీ సెల్లియమ్మన్ ఆలయంలో పాలాభిషేకం జరిగింది. కొడంగయ్యూరు ముత్తమిళ్ నగర్లో ఎమ్మెల్యే వెట్రివేల్ అధ్వర్యంలో 2008 మంది మహిళలు పాలకళశాలతో ఊరేగింపు జరిపారు. విరుగంబాక్కం గాంధీనగర్‌లోని ముత్తుమారియమ్మన్ ఆలయంలో మాజీ మంత్రి వలర్మతి, పలువురు ఎమ్మెల్యేలు దీపాలు వెలిగించి ప్రార్థనలు చేశారు. నుంగబాక్కం అగస్తీశ్వరన్ ఆలయంలో మాజీ ఎమ్మెల్యే కలైరాజన్ పూజలు నిర్వహించారు. మధురై మీనాక్షి ఆలయంలో మంత్రి సెల్లూరు రాజా దీపాలు చేతబూని ప్రార్థనలు చేశారు. కారైపాక్కం గంగైయమ్మన్ ఆలయంలో మూడువేల నేతిదీపాలు వెలిగించి పూజలు చేశారు. కరైపాక్కంలో 3వేల మహాదీపాలను వెలిగించి అన్నదానం చేశారు. తిరువత్తియూరు సాత్తుమా నగర్‌లోని శక్తివినాయక ఆలయంలో ప్రార్దనలు నిర్వహించారు. మంత్రి బెంజిమెన్ అధ్వర్యంలో సుఖజీవ జెప కూటంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మాజీ మంత్రి గోకుల ఇందిర పలువురు మహిళా కార్యకర్తలతో కలిసి మహాశివునికి అపోలో ఆసుపత్రి ముందు పూజలు చేశారు. ఎంజీఆర్ మన్ర ం అధ్వర్యంలో వంద మంది పురుష, మహిళా కార్యకర్తలు నెత్తిపై కుండలు వాటిలో మంటలతో అపోలో ఆసుపత్రి ముందు ఊరేగింపు చేస్తూ ప్రార్థనలు జరిపారు.