సాక్షి ప్రతినిధి, చెన్నై:అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు మంగళవారం కూడా యథావిధిగా చికిత్స కొనసాగుతోంది. అమ్మకు జరుగుతున్న చికిత్స గురించి తెలుసుకునేందుకు పలువురు ప్రముఖులు అపోలోకు వచ్చి వెళ్లారు. వదంతుల నేపథ్యంలో రాష్ట్రంలో సాగుతున్న అరెస్టులను మాజీ న్యాయమూర్తి మార్కం డేయ కట్జు తీవ్రంగా ఖండించడంతోపాటు అరెస్టులు ఆపకుంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేలా పోరాడుతానని హెచ్చరించారు. చికిత్స నిమిత్తం గత నెల 22వ తేదీ అర్ధరాత్రి అపోలోకు చేరుకున్న సీఎం జయలలిత పూర్తిస్థాయిలో కోలుకునేందుకు వైద్యపరంగా అన్నికోణాల్లో కృషి జరుగుతోంది.
లండన్ వైద్యులు డాక్టర్ రిచర్డ్, ఎయిమ్స్ వైద్యులు, సింగపూరు నుంచి వచ్చిన మహిళా ఫిజియోథెరపిస్టుల నిరంతర పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. ఫిజియోథెరపీపైనే ప్రస్తుతం పూర్తిస్థాయిలో కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. రోజు రోజుకూ అమ్మ కోలుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం వస్తున్నా ఈనెల 9వ తేదీ నుంచి అపోలో నుంచి హెల్త్‌బులెటిన్లు మాత్రం విడుదల కావడం లేదు. సీఎంను పరామర్శించేందుకు ప్రధాని నరేంద్రమోదీ వస్తారని ఆశిస్తుండగా, అపోలో ఆసుపత్రిలో ప్రధాని, జయ సంభాషిస్తున్న ఫొటోను, బులెటిన్‌ను విడుదల చేసే అవకాశం ఉందని ఊహాగానాలు సాగుతున్నాయి.
ఇదిలా ఉండగా, సీఎంకు జరుగుతున్న చికిత్సపై ప్రజలు మాట్లాడుకుంటే అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని మాజీ న్యాయమూర్తి మార్కండేకట్జు ఫేస్‌బుక్‌లో విమర్శలు చేశారు. మంత్రి పన్నీర్‌సెల్వం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ ఇతర పోలీసు ఉన్నతాధికారులను ఆయన తప్పుపట్టారు. అరెస్టులు ఆపకుంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు నశించాయని కారణం చూపి రాష్ట్రపతి పాలన విధించేలా రాష్ట్రపతిని కోరుతానని, అంతేగాక అరెస్టులకు పాల్పడిన వారిని శిక్షకు గురిచేస్తానని హెచ్చరించారు. కాగా ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ కుమారుడు కరణ్ అదానీ, సినీనటుడు రాధారవి అపోలోకు వచ్చి జయ క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు.
అమ్మ కోసం ద్రవిడ దేశం ప్రార్థనలు:
సీఎం జయలలిత త్వరిత గతిన కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి చేరుకోవాలని మంగళవారం సైతం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ప్రార్థనలు సాగాయి. సీఎం జయ త్వరగా కోలుకుని పూర్వస్థాయిలో మరలా ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వర్తించాలని ఆకాంక్షిస్తూ తిరువత్తియూరు వడవుడి అమ్మన్ ఆలయంలో ద్రవిడ దేశం అధ్యక్షులు వీ కృష్ణారావు విశేషపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యవసాయ శాఖా మంత్రి దురైకన్ను, అంబత్తూరు ఎమ్మెల్యే అలెగ్జాండరు, తిరువత్తియూరు మాజీ శాసనసభ్యులు కే కుప్పన్ పలువురు పార్టీ ప్రముఖులు పాల్గొన్నారు. చెన్నై దక్షిణంలో పార్టీ లీగల్‌సెల్ అధ్వర్యంలో 200 మందికిపైగా మహిళలు సాయిబాబా ఆలయంలో పాలాభిషేకం, అన్నదానం నిర్వహించారు.
మైలాపూరు కపాలీశ్వరర్ ఆలయంలో బంగారురథాన్ని లాగారు. నక్కీరర్ నగర్‌లోని అన్నై ఆరోగ్యమాత ఆలయంలో క్యాండిళ్లు వెలిగించి ప్రార్థనలు చేశారు. కౌన్సిలర్ ఎమ్‌ఏ మూర్తి నేతృత్వంలో వేలాచ్చేరీ సెల్లియమ్మన్ ఆలయంలో పాలాభిషేకం జరిగింది. కొడంగయ్యూరు ముత్తమిళ్ నగర్‌లో ఎమ్మెల్యే వెట్రివేల్ అధ్వర్యంలో 2008 మంది మహిళలు పాలకళశాలతో ఊరేగింపు జరిపారు. విరుగంబాక్కం గాంధీనగర్‌లోని ముత్తుమారియమ్మన్ ఆలయంలో మాజీ మంత్రి వలర్మతి, పలువురు ఎమ్మెల్యేలు దీపాలు వెలిగించి ప్రార్థనలు చేశారు. నుంగబాక్కం అగస్తీశ్వరన్ ఆలయంలో మాజీ ఎమ్మెల్యే కలైరాజన్ పూజలు నిర్వహించారు.
మధురై మీనాక్షి ఆలయంలో మంత్రి సెల్లూరు రాజా దీపాలు చేతబూని ప్రార్థనలు చేశారు. కారైపాక్కం గంగైయమ్మన్ ఆలయంలో మూడువేల నేతిదీపాలు వెలిగించి పూజలు చేశారు. కరైపాక్కంలో 3వేల మహాదీపాలను వెలిగించి అన్నదానం చేశారు. తిరువత్తియూరు సాత్తుమా నగర్‌లోని శక్తివినాయక ఆలయంలో ప్రార్దనలు నిర్వహించారు. మంత్రి బెంజిమెన్ అధ్వర్యంలో సుఖజీవ జెప కూటంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మాజీ మంత్రి గోకుల ఇందిర పలువురు మహిళా కార్యకర్తలతో కలిసి మహాశివునికి అపోలో ఆసుపత్రి ముందు పూజలు చేశారు. ఎంజీఆర్ మన్ర ం అధ్వర్యంలో వంద మంది పురుష, మహిళా కార్యకర్తలు నెత్తిపై కుండలు వాటిలో మంటలతో అపోలో ఆసుపత్రి ముందు ఊరేగింపు చేస్తూ ప్రార్థనలు జరిపారు.
కొనసాగుతున్న చికిత్స ప్రక్రియ
Published Wed, Oct 19 2016 2:03 AM | Last Updated on Mon, Sep 4 2017 5:36 PM
Advertisement
Advertisement