మౌన దీక్ష
సాక్షి, చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమ అధినేత్రి జయలలితకు శిక్ష ఖరారు కావడంతో అన్నాడీఎంకే వర్గాల్లో ఆగ్రహం కట్టలు తెంచుకున్న విషయం తెలిసిందే. తీర్పును జీర్ణించుకోలేని పార్టీ వర్గాలు విధ్వంసాలకు దిగాయి. గవర్నర్ రోశయ్య రంగంలోకి దిగడంతో అధికార యంత్రాంగం కదిలింది. ఆందోళన కారులపై లాఠీలు ఝుళిపించారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. అయితే, అర్ధరాత్రి వేళ ఎలాంటి విధ్వంసాలకు పాల్పడతారోనన్న ఉత్కంఠ నెలకొంది. దీంతో రాత్రంతా భద్రతను కట్టుదిట్టం చేసి అప్రమత్తంగా పోలీసు యంత్రాంగం వ్యవహరించింది. అయితే, అధికారంలో ఉన్నది తమ ప్రభుత్వమేగా...తామే విధ్వంసాలకు పాల్పడితే చెడ్డ పేరు తప్పదన్న విషయాన్ని అన్నాడీఎంకే వర్గాలు గ్రహించి, శాంతియుత మార్గానికి సిద్ధమయ్యూయి.
మౌన ప్రదర్శన : ఆదివారం ఉదయాన్నే రాష్ట్రంలో కొన్ని చోట్ల పార్టీ కార్యాలయాల వద్ద నల్ల బ్యాడ్జీలను ధరించి, నల్ల రిబ్బన్లు నోటికి కట్టుకుని మౌనంగా నిరసన తెలియజేశారు. మరి కొన్ని చోట్ల ప్రదర్శనలు, రాస్తారోకోలు నిర్వహించారు. చెన్నైలో అయితే, వందలాది మంది మహిళలు, కార్యకర్తలు ఉదయాన్నే మెరీనా తీరానికి చేరుకున్నారు. దివంగత నేత, పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీయార్ సమాధి వద్ద బైఠాయించారు. తరలి వచ్చిన మహిళలు రోదిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మ(జయలలిత)ను నిర్బంధిచడంపై కన్నీటి పర్యంతమయ్యారు. జయలలిత చిత్ర పటాలను చేత బట్టి మౌన దీక్షలో సాయంత్రం వరకు కూర్చున్నారు.
శనివారం తీర్పు వెలువడటంతో నిర్మానుష్యంగా మారిన అన్నాడీఎంకే కార్యాలయంలో ఆదివారం ఉద్వేగ భరిత వాతావరణం నెలకొంది. ఆయా ప్రాంతాల నుంచి తరలి వచ్చిన నాయకులు బోరును విలపించారు. ఓ దశలో కార్యాలయం వెలుపలకు తరలి వచ్చిన కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి, డీఎంకే అధినేత ఎం కరుణానిధి, కోశాధికారి ఎంకే స్టాలిన్‌కు వ్యతిరేకంగా నినాదాల్ని హోరెత్తించారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారుల్ని శాంతింప చేశారు. దుకాణాల మూత: విధ్వంసాన్ని వీడి, శాంతియుత మార్గంలో నిరస బాటకు అన్నాడీఎంకే వర్గాలు సిద్ధమైనా, రాష్ట్రంలో అనేక నగరాలు, జిల్లా కేంద్రాల్లో అక్కడక్కడ దుకాణాలు మూతపడ్డారుు. ఆదివారం సెలవు దినం అయినా, సాధారణంగా తెరచి ఉండే దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. అయితే, జన జీవనానికి ఎలాంటి ఆటంకం కలగలేదు.
దక్షిణాది జిల్లాల్లో అనేక నగరాల్లో, జిల్లా కేంద్రాల్లోని రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. వాణిజ్య కేంద్రాల పరిసరాల్లో పాక్షికంగా బంద్ వాతావరణం నెలకొంది. చెన్నైలో అక్కడక్కడ దుకాణాలు మూతబడ్డాయి. నిత్యం రద్దీతో పద్మవ్యూహాన్ని తలపించే కొన్ని మార్గాలు నిర్మానుష్యంగా దర్శనిమిచ్చాయి. బస్సు సేవలు అంతంత మాత్రం కొనసాగారుు. ఇదే పరిస్థితి అన్ని జిల్లా కేంద్రాల్లోనూ నెలకొంది. మారుమూల గ్రామాలకు వెళ్లాల్సిన బస్సులు షెడ్లకే పరిమితమయ్యాయి. ఇక రాష్ట్రం నుంచి కర్ణాటకకు బస్సు సేవలు పూర్తిగా ఆగిపోయూరుు.
అదుపులో పరిస్థితి - జార్జ్ : రాజధాని నగరంలో భద్రతను కట్టుదిట్టం చేయడంతో పరిస్థితి అదుపులో ఉందని కమిషనర్ జార్జ్ తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ, నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీగా వ్యవహరిస్తున్నామన్నారు. జన సంచారం అత్యధికంగా ఉండే ప్రాంతాల్లో భద్రతను పెంచామని తెలిపారు. ఇతర పార్టీల నాయకుల ఇళ్లు, ఆ మార్గాల్ని భద్రతా వలయంలోకి తెచ్చామని వివరించారు. అన్నాడీఎంకే వర్గాలు అత్యధికంగా ఉండే ప్రాంతాల్లో భద్రతను పెంచామని తెలిపారు.
జాలర్ల నిరసన : జయలలితకు శిక్ష ఖరారు కావడంతో జాలర్లలో ఆగ్రహం రేగింది. ఉదయాన్నే నాగపట్నం, వేదారణ్యం జాలర్లు చేపల వేటను బహిష్కరించారు. పడవలను ఒడ్డుకు పరిమితం చేసి, రోడ్డెక్కారు. జయలలితను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో చేపట్టడంతో వాహనాలు ఎక్కడికక్కడ ఆగాయి. పోలీసులు రంగంలోకి దిగి బుజ్జగించినా, జాలర్లు మాత్రం తగ్గలేదు. చివరకు ఉన్నతాధికారుల జోక్యంతో రాస్తారోకో వీడి, నిరసన దీక్ష నిర్వహించారు. నాగై టోల్ గేట్ కూతవేటు దూరంలో గుర్తు తెలియని వ్యక్తులు ఓ వాహనానికి నిప్పు పెట్టడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
బస్సుకు నిప్పుతో కలకలం : శాంతియుతంగా నిరసనలు సాగుతున్న వేళ విరుదునగర్‌లో ఓ బస్సుకు నిప్పంటించడం కలకలం రేపింది. అయితే, ఇది తమ పని కాదంటూ అక్కడి అన్నాడీఎంకే వర్గాలు పేర్కొనడంతో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. విరుదునగర్ సమీపంలోని నడికుడి బస్టాండ్‌లో గుర్తు తెలియని వ్యక్తులు బస్సులోని కొందరు ప్రయాణికుల్ని దించేసి నిప్పు పెట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటల్ని అదుపు చేయడంతో బస్సు పాక్షికంగా కాలింది. అయితే, తమకు ఎలాంటి సంబంధం లేదంటూ అన్నాడీఎంకే వర్గాలు ప్రకటించడంతో ఈ బస్సుకు నిప్పు అంటించిన వారి భరతం పట్టేందుకు విరుదునగర్ పోలీసులు సిద్ధం అయ్యారు.