london doctors
-
కొనసాగుతున్న చికిత్స ప్రక్రియ
సాక్షి ప్రతినిధి, చెన్నై:అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు మంగళవారం కూడా యథావిధిగా చికిత్స కొనసాగుతోంది. అమ్మకు జరుగుతున్న చికిత్స గురించి తెలుసుకునేందుకు పలువురు ప్రముఖులు అపోలోకు వచ్చి వెళ్లారు. వదంతుల నేపథ్యంలో రాష్ట్రంలో సాగుతున్న అరెస్టులను మాజీ న్యాయమూర్తి మార్కం డేయ కట్జు తీవ్రంగా ఖండించడంతోపాటు అరెస్టులు ఆపకుంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేలా పోరాడుతానని హెచ్చరించారు. చికిత్స నిమిత్తం గత నెల 22వ తేదీ అర్ధరాత్రి అపోలోకు చేరుకున్న సీఎం జయలలిత పూర్తిస్థాయిలో కోలుకునేందుకు వైద్యపరంగా అన్నికోణాల్లో కృషి జరుగుతోంది. లండన్ వైద్యులు డాక్టర్ రిచర్డ్, ఎయిమ్స్ వైద్యులు, సింగపూరు నుంచి వచ్చిన మహిళా ఫిజియోథెరపిస్టుల నిరంతర పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. ఫిజియోథెరపీపైనే ప్రస్తుతం పూర్తిస్థాయిలో కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. రోజు రోజుకూ అమ్మ కోలుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం వస్తున్నా ఈనెల 9వ తేదీ నుంచి అపోలో నుంచి హెల్త్బులెటిన్లు మాత్రం విడుదల కావడం లేదు. సీఎంను పరామర్శించేందుకు ప్రధాని నరేంద్రమోదీ వస్తారని ఆశిస్తుండగా, అపోలో ఆసుపత్రిలో ప్రధాని, జయ సంభాషిస్తున్న ఫొటోను, బులెటిన్‌ను విడుదల చేసే అవకాశం ఉందని ఊహాగానాలు సాగుతున్నాయి. ఇదిలా ఉండగా, సీఎంకు జరుగుతున్న చికిత్సపై ప్రజలు మాట్లాడుకుంటే అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని మాజీ న్యాయమూర్తి మార్కండేకట్జు ఫేస్బుక్లో విమర్శలు చేశారు. మంత్రి పన్నీర్‌సెల్వం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ ఇతర పోలీసు ఉన్నతాధికారులను ఆయన తప్పుపట్టారు. అరెస్టులు ఆపకుంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు నశించాయని కారణం చూపి రాష్ట్రపతి పాలన విధించేలా రాష్ట్రపతిని కోరుతానని, అంతేగాక అరెస్టులకు పాల్పడిన వారిని శిక్షకు గురిచేస్తానని హెచ్చరించారు. కాగా ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ కుమారుడు కరణ్ అదానీ, సినీనటుడు రాధారవి అపోలోకు వచ్చి జయ క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు. అమ్మ కోసం ద్రవిడ దేశం ప్రార్థనలు: సీఎం జయలలిత త్వరిత గతిన కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి చేరుకోవాలని మంగళవారం సైతం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ప్రార్థనలు సాగాయి. సీఎం జయ త్వరగా కోలుకుని పూర్వస్థాయిలో మరలా ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వర్తించాలని ఆకాంక్షిస్తూ తిరువత్తియూరు వడవుడి అమ్మన్ ఆలయంలో ద్రవిడ దేశం అధ్యక్షులు వీ కృష్ణారావు విశేషపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యవసాయ శాఖా మంత్రి దురైకన్ను, అంబత్తూరు ఎమ్మెల్యే అలెగ్జాండరు, తిరువత్తియూరు మాజీ శాసనసభ్యులు కే కుప్పన్ పలువురు పార్టీ ప్రముఖులు పాల్గొన్నారు. చెన్నై దక్షిణంలో పార్టీ లీగల్‌సెల్ అధ్వర్యంలో 200 మందికిపైగా మహిళలు సాయిబాబా ఆలయంలో పాలాభిషేకం, అన్నదానం నిర్వహించారు. మైలాపూరు కపాలీశ్వరర్ ఆలయంలో బంగారురథాన్ని లాగారు. నక్కీరర్ నగర్‌లోని అన్నై ఆరోగ్యమాత ఆలయంలో క్యాండిళ్లు వెలిగించి ప్రార్థనలు చేశారు. కౌన్సిలర్ ఎమ్ఏ మూర్తి నేతృత్వంలో వేలాచ్చేరీ సెల్లియమ్మన్ ఆలయంలో పాలాభిషేకం జరిగింది. కొడంగయ్యూరు ముత్తమిళ్ నగర్లో ఎమ్మెల్యే వెట్రివేల్ అధ్వర్యంలో 2008 మంది మహిళలు పాలకళశాలతో ఊరేగింపు జరిపారు. విరుగంబాక్కం గాంధీనగర్‌లోని ముత్తుమారియమ్మన్ ఆలయంలో మాజీ మంత్రి వలర్మతి, పలువురు ఎమ్మెల్యేలు దీపాలు వెలిగించి ప్రార్థనలు చేశారు. నుంగబాక్కం అగస్తీశ్వరన్ ఆలయంలో మాజీ ఎమ్మెల్యే కలైరాజన్ పూజలు నిర్వహించారు. మధురై మీనాక్షి ఆలయంలో మంత్రి సెల్లూరు రాజా దీపాలు చేతబూని ప్రార్థనలు చేశారు. కారైపాక్కం గంగైయమ్మన్ ఆలయంలో మూడువేల నేతిదీపాలు వెలిగించి పూజలు చేశారు. కరైపాక్కంలో 3వేల మహాదీపాలను వెలిగించి అన్నదానం చేశారు. తిరువత్తియూరు సాత్తుమా నగర్‌లోని శక్తివినాయక ఆలయంలో ప్రార్దనలు నిర్వహించారు. మంత్రి బెంజిమెన్ అధ్వర్యంలో సుఖజీవ జెప కూటంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మాజీ మంత్రి గోకుల ఇందిర పలువురు మహిళా కార్యకర్తలతో కలిసి మహాశివునికి అపోలో ఆసుపత్రి ముందు పూజలు చేశారు. ఎంజీఆర్ మన్ర ం అధ్వర్యంలో వంద మంది పురుష, మహిళా కార్యకర్తలు నెత్తిపై కుండలు వాటిలో మంటలతో అపోలో ఆసుపత్రి ముందు ఊరేగింపు చేస్తూ ప్రార్థనలు జరిపారు. -
కోలుకో మాయమ్మ!
► మళ్లీ లండన్, ఎయిమ్స్ వైద్యుల రాక ► ఐదు రోజులు ఆస్పత్రిలోనే మకాం ► జయ ఆరోగ్యం కోసం ఇద్దరు ఆత్మాహుతి ► కొనసాగుతున్న పూజలు ► అపోలోకు ‘రిలయన్స్’ నీతూ అంబాని రాక ► సెల్ఫోన్లపై నిఘా సాక్షి ప్రతినిధి, చెన్నై: అపోలో ఆసుపత్రిలో గత 23 రోజులుగా చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు మెరుగైన వైద్యసేవలను అందించేందుకు లండన్, ఎయిమ్స్ వైద్యుల బృందం గురువారం చెన్నైకి చేరుకుంది. అంతర్జాతీయ వైద్యనిపుణుడు డాక్టర్ రిచర్డ్ జాన్ బిలే, ఎయిమ్స్ వైద్యులు గిల్‌నానీ (ఊపిరితిత్తుల నిపుణుడు), అంజన్ టిరిక్కా (అనస్తీషియన్), నితీష్‌నాయక్ (హృద్రోగ నిపుణులు) అపోలోకు చేరుకుని వైద్య చికిత్సలు ప్రారంభించారు. రెండు రోజుల క్రితమే లండన్‌కు వెళ్లిన డాక్టర్ రిచర్డ్‌ను మళ్లీ రప్పించారు. అలాగే ఈనెల 5వ తేదీన ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిమ్స్ వైద్యులు కొన్ని రోజులు చెన్నైలోనే ఉంటూ జయకు చికిత్స చేసి వెళ్లి పోయారు. ఎయిమ్స్ బృందం సైతం మళ్లీ చెన్నై అపోలోకు చేరుకుంది. వీరంతా ఐదు రోజులుపాటు చెన్నైలోనే ఉంటారు. జయ వేగంగా కోలుకునేందుకు వైద్య బృందం తీవ్రంగా కృషి చేస్తోంది. మహిళ ఆవేదన సీఎం జయ అనారోగ్యానికి గురైన నాటి నుంచి అన్నాడీఎంకే మహిళా నేతలు, కార్యకర్తలు అపోలో ఆసుపత్రి వద్దనే గడుపుతున్నారు. అమ్మ కోలుకుంటున్నారు, సంపూర్ణమైన ఆరోగ్యంతో తిరిగి ఇంటికి చేరుకుంటారని పార్టీ అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి ప్రతిరోజూ మీడియా వారి వద్ద వి శ్వా సం వ్యక్తం చేస్తున్నారు. అలాగే పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు అపోలో ఆసుపత్రి వద్దనే పడిగాపులు కాస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నేతలు అపోలో వద్దకు నేతలు తరలి వస్తున్నారు. కోయంబత్తూరు సుగునాపు రం శక్తి మారియమ్మన్ ఆలయంలో 336 రకాల పూలతో మూడు రోజుల పాటూ భారీ ఎత్తున నిర్వహించే మహాయాగం గురువారం ప్రారంభమైంది. మంత్రి వేలుమణి నేతృత్వంలో ఈ మహాయాగం సాగనుంది. అలాగే రాష్ట్రంలోని 68 దర్గాల్లో ముస్లింలు ప్రార్థనలు చేశారు.నేడు మాజీ గవర్నర్ రోశయ్య రాక: తమిళనాడు మాజీ గవర్నర్ కే రోశయ్య ముఖ్యమంత్రి జయలలితను పరామర్శించేందుకు నేడు చెన్నైకి వస్తున్నట్లు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు తంగుటూరి రామకృష్ణ తెలిపారు. సెల్ఫోన్ల నిఘా: ఇదిలా ఉండగా, అపోలో ఆసుపత్రి పరిసరాలకు వచ్చే అన్ని సెల్ఫోన్ల సంభాషణలపై పోలీసులు నిఘా పెట్టినట్లు గురువారం రాత్రి సమాచారం అందింది. జయ ఆరోగ్యంపై వదంతులు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆసుపత్రి నుం,ఊ ఎవరైనా సెల్‌ఫోన్ ద్వారా సమాచారం చేరవేస్తున్నారా అని పోలీ సులు అనుమానిస్తున్నారు. ఈ అనుమానంతోనే జయకు వైద్యం చేసే నర్సుల నుంచి సెల్ఫోన్లను సేకరించిన తరువాతనే లోనికి అనుమతిస్తున్నారు. సెల్ఫోన్ల సంభాషణలపై నిఘా పెట్టేందుకు పోలీసులు అపోలో ఆసుపత్రిలోనే ఒక కంట్రోలు రూంను ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. నిఘా విషయం తెలుసుకున్న అన్నాడీఎంకే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర పార్టీ నేతలు తమకు వచ్చే కాల్స్‌ను కట్చేస్తున్నట్లు సమాచారం. అంతేగాక తమ అనుచరులతో కూడా అపోలో పరిసరాల్లో సెల్‌ఫోన్ మాట్లాడవద్దని సూచించినట్లు తెలుస్తోంది. గవర్నర్ స్పష్టం చేయాలి: తన ఆధీనంలోని శాఖలను మంత్రి పన్నీర్‌సెల్వంకు అప్పగించాల్సిందిగా ముఖ్యమంత్రి జయలలిత ఎలా సూచించారో గవర్నర్ విద్యాసాగర్‌రావు స్పష్టం చేయాలని పీఎం అధ్యక్షులు డాక్టర్ రాందాస్, డీఎండీకే అధ్యక్షులు విజయకాంత్ గురువారం వేర్వేరు ప్రకటనల్లో విజ్ఞప్తి చేశారు. జయకు చికిత్స జరుగుతున్న తరుణంలో గవర్నర్‌కు సూచించే పరిస్థితి ఎంతమాత్రం లేదని అపోలో ఆసుపత్రి నుంచి వెలువడుతున్న బులెటిన్లే తేటతెల్లం చేస్తున్నాయని అన్నారు. కాలు, చేయి కదపలేని స్థితిలో జయ ఉన్నట్లు అపోలో వైద్యులు చెబుతున్నారని వారు తెలిపారు. జయ వద్దకు ఎవ్వరినీ అనుమతించని, కృత్రిమ శ్వాస అందిస్తున్న పరిస్థితుల్లో సంతకం చేయడమో, తాను మనస్సులో అనుకున్నది వ్యక్తం చేయడమో సాధ్యకాదని అన్నారు. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో పన్నీర్‌సెల్వంకు బాధ్యతలు అప్పగించాలని గవర్నర్‌కు ఎలా ఆమె సూచించగలగారని ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాలని వారు కోరారు. ఇదిలా ఉండగా, సీఎం జయ ఆరోగ్యంపై రాజకీయ పార్టీల్లో నెలకొన్న అనుమానాలను అధికార పక్ష నేతలు నివృత్తి చేయాలని తమిళ మానిల కాంగ్రెస్ అధ్యక్షులు జీకే వాసన్ డిమాండ్ చేశారు. మరో ఇద్దరు అరెస్ట్: ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంపై వదంతులు సృష్టించిన కేసులో మరో ఇద్దరిని చెన్నై సెంట్రల్ క్రైంబ్రాంచ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. గత 23 రోజులుగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీఎం గురించి ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్, ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాలలో అసత్య ప్రచారం జరిగి ఉద్రిక్తలకు దారితీసింది. సీఎం పరిస్థితిపై అవాస్తవాలను ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తప్పవని చెన్నై పోలీస్ కమిషనర్ జార్జ్ హెచ్చరించారు. ఈ రకంగా 52 కేసులు నమోదయ్యాయి. నామక్కల్‌కు చెందిన సతీష్‌కుమార్, మధురైకి చెందిన మాడస్వామిలను ఈనెల 10వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా ఫేస్బుక్, ట్వీట్టర్లో వదంతులు రేపిన చెన్నై పమ్మల్ ఎల్ఐసీ కాలనీకి చెందిన బాలసుందరం (42) ను బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. అలాగే తూత్తుకూడి జిల్లా ఒట్టబిడారానికి చెందిన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఉద్యోగి తిరుమణిసెల్వం (28)ను గురువారం అరెస్ట్ చేశారు. వదంతులపై ఇప్పటివరకు 53 కేసులు నమోదుకాగా వీరిలో నలుగురు అరెస్టయ్యారు. ఇద్దరు ఆత్మాహుతి: జయ అనారోగ్యానికి గురయ్యారని కలత చెంది చెన్నై తాంబరానికి చెంది న సద్గుణం (31) బుధవారం రాత్రి నడిరోడ్డుపై నిలబడి జయ ఆరోగ్యంపై వాస్తవాలు ప్రకటిం చాలని నినాదాలు చేస్తూ అకస్మాత్తుగా ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పటించుకున్నాడు. చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి 11 గంటల సమయంలో మృతి చెందాడు. అలాగే మధురై జిల్లా పేరయ్యూరుకి చెందిన అన్నాడీఎంకే కార్యకర్త రాజవేల్ (21) ఈనెల 4వ తేదీన ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పుపెట్టుకున్నాడు. తీవ్రగాయాలకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి ప్రాణాలు విడిచాడు. -
నేడు చెన్నైకి లండన్ వైద్యులు
-
నేడు చెన్నైకి లండన్ వైద్యులు
• జయలలితకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకే.. • అన్నాడీఎంకే అధినేత్రిని పరామర్శించిన జైట్లీ, అమిత్‌షా • అమ్మ కోలుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా పూజలు సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు మెరుగైన చికిత్స అందించేందుకు లండన్ నుంచి వైద్యుల బృందం మళ్లీ గురువారం చెన్నైకి రానుంది. అనారోగ్యానికి గురైన జయలలిత గత నెల 22 నుంచి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. కాగా, సెప్టెంబర్ నెలాఖరులో ఒకసారి, ఈనెల 4న మరోసారి లండన్‌కు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ రిచర్డ్ జాన్ బిలే చెన్నైకి వచ్చి జయకు చికిత్స చేసి వెళ్లారు. జయలలిత మరికొన్ని రోజులు ఆస్పత్రిలోనే ఉండాలని అపోలో వైద్యులు ప్రకటించిన నేపథ్యంలో డాక్టర్ రిచర్డ్ జాన్ బిలే బృందం గురువారం మళ్లీ చెన్నైకి రానున్నట్లు సమాచారం. వీరు ఐదు రోజుల పాటు చెన్నైలోనే ఉండి జయకు వైద్య సేవలు అందించనున్నారు. ప్రముఖుల పరామర్శ జయలలితను పరామర్శించేందుకు బుధవారం పలువురు ప్రముఖులు అపోలో ఆస్పతికి వచ్చారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఆస్పత్రి వైద్యులను అడిగి చికిత్స వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడకుండానే వారు చెన్నై నుంచి తిరిగి వెళ్లిపోయారు. కాగా, జయలలిత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ అరుణ్‌జైట్లీ ట్వీట్ చేశారు. సినీనటుడు కార్తీక్ కూడా ఆస్పత్రికి వచ్చి వెళ్లారు. వదంతుల వెనుక నేతలు: కేంద్ర మంత్రి పొన్ సీఎం జయలలిత అనారోగ్యంపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతుల వెనుక కొందరు రాజకీయ నేతలున్నారని కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ అన్నారు. ప్రత్యేక పోలీసు బృందం విచారణ జరిపితే వారి పేర్లు బయటకు వస్తాయని పేర్కొన్నారు. కాగా, ఇప్పటికే ఇద్దరు యువకులను అరెస్ట్ చేసిన పోలీసులు.. వాట్సాప్ ద్వారా జయపై అసత్య ప్రచారం చేసిన బెంగళూరుకు చెందిన యువతిని అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇదిలాఉండగా, జయలలితకు చికిత్స కొనసాగుతున్నందునఆమె వద్దకు వైద్యులు, నర్సులు మినహా ఎవ్వరినీ అనుమతించడం లేదు. జయకు చికిత్స జరుగుతున్న అపోలో ఆస్పత్రి రెండో అంతస్తులో రెండంచెల భద్రతను ఏర్పాటు చేశారు. పూజలు, హోమాలు.. జయలలిత కోలుకోవాలని అన్నాడీఎంకే శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ప్రార్థనలు కొనసాగిస్తున్నారు. నటుడు వివేక్ కాంచీపురం కామా క్షి ఆలయంలో పూజలు నిర్వహించారు. తిరునెల్వేకి చెందిన మాడస్వామి అనే పార్టీ నేత ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలోని వల్లియ మురుగన్ ఆలయం వరకు మోకాలిపై నడిచాడు. కోవైలో 25 వేల మంది పాల కలశాలతో శక్తిమారియమ్మన్ ఆలయం వరకు ఊరేగింపు నిర్వహించారు. మదురై, చెన్నైలలో కూడా పాల కలశాలతో భారీ ర్యాలీలు జరిపా రు. కొట్టివాక్కంలో మహాగణపతి హోమాన్ని నిర్వహించారు. చెన్నై కన్నగినగర్‌లో అమ్మ కోలువాలని క్రైస్తవులు ప్రార్థనలు చేశారు. -
వీణా-వాణీల ఆ‘పరేషాన్’!
-
వీణా-వాణీల ఆ‘పరేషాన్’!
- లండన్ వైద్యులతో శస్త్రచికిత్సపై చేతులెత్తేసిన ఎయిమ్స్? సాక్షి, హైదరాబాద్: అవిభక్త కవలలు వీణా-వాణీ (13)ల శస్త్రచికిత్స విషయంలో స్పష్టత కరువైంది. ఆపరేషన్ ద్వారా వారిని వేరు చేసేందుకు లండన్ గ్రేట్ ఆర్మండ్ స్ట్రీట్ ఆస్పత్రి వైద్యులు ముందుకొచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) చేతిలో పెట్టడం, లండన్ వైద్యులను ఢిల్లీకి రప్పించి ఆపరేషన్ చేయిస్తామని ఎయిమ్స్ హామీ ఇవ్వడం తెలిసిందే. అయితే ఆపరేషన్ ఖర్చుపై స్పష్టత కోరుతూ ఎయిమ్స్‌కు లేఖ రాసిన రాష్ట్ర ప్రభుత్వం...శస్త్రచికిత్స కోసం లండన్ వైద్యులు ఢిల్లీకి వచ్చేందుకు ముందుకొస్తారో లేదో తెలుసుకోవాలని కోరింది. ఈ ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగి 5 నెలలు దాటింది. ఇప్పటివరకు ముందడుగు పడలేదు. వైద్య ఆరోగ్యశాఖ వర్గాల సమాచారం ప్రకారం ఆపరేషన్ చేయించే విషయంలో ఎయిమ్స్ చేతులెత్తేసింది. అందుకే ఈ విషయాన్ని ఎటూ తేల్చకుండా పెం డింగ్‌లో పెట్టిందని ఈ వ్యవహారాలు పరిశీలిస్తున్న నీలోఫర్‌కు చెందిన ఒక వైద్యాధికారి ‘సాక్షి’కి చెప్పారు. అవిభక్త కవలలను వేరు చేసిన అనుభవమున్న లండన్ ఆస్పత్రిలోనే వీణావాణీలకు ఆపరేషన్ చేయిస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏడాదిపాటు విడతల వారీగా ఆపరేషన్ చేయాల్సి వస్తుందని... ఇందుకు రూ. 10 కోట్లు ఖర్చవుతుందని లండన్ వైద్యులు చెప్పగా దీనిపైనే సర్కారు తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. వీణావాణీలకు ఏదైనా ప్రమాదం జరిగితే ఏమిటన్న ప్రశ్న కూడా తాత్సారానికి మరో కారణంగా చెబుతున్నారు. మరోవైపు వీణావాణీల వయసు పెరుగుతున్న దృష్ట్యా వారిని మహిళా వసతి గృహంలోకి మార్చాల్సి ఉందని నీలోఫర్ వైద్యులు అంటున్నారు. దీనిపై సర్కారు నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. -
వీణావాణీలకు ఎయిమ్స్‌లో శస్త్రచికిత్స
లండన్ వైద్యులతో చేయించేందుకు ఎయిమ్స్ సంసిద్ధత సాక్షి, హైదరాబాద్: అవిభక్త కవలలు వీణా వాణీల శస్త్రచికిత్సకు ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ముందుకు వచ్చింది. లండన్ గ్రేట్ ఆర్మండ్స్ట్రీట్ ఆస్పత్రి వైద్యులను దేశానికి రప్పించి శస్త్రచికిత్స చేయిస్తామని ఎయిమ్స్ స్పష్టం చేసింది. వీణా వాణీ ల శస్త్రచికిత్స విషయమై దేశంలో ఉన్న అవకాశాలపై సలహా కోరుతూ తెలంగాణ ప్రభుత్వం నెల క్రితం ఎయిమ్స్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. తమ వద్దనే శస్త్రచికిత్సకు అవసరమైన అత్యాధునిక వైద్య సదుపాయాలు సమకూర్చి వీణావాణీలను విజయవంతంగా వేరు చేయడంలో కృషి చేస్తామని వెల్లడించింది. ఇది లా ఉండగా ఇక్కడకు వచ్చి శస్త్రచికిత్స చేయడానికి లండన్ వైద్యులు అంగీకరిస్తారా లేదా అన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. లండన్ వైద్యులు హైదరాబాద్ నిలోఫర్‌కు వచ్చి వీణా వాణీలను పరీక్షించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వారికి విజయవంతంగా శస్త్రచికిత్స చేస్తామని లండన్ వైద్యులు వెల్లడించారు. ఆరు విడతలుగా చేసే ఈ ఆపరేషన్‌కు ఏడాది సమయం పడుతుందని స్పష్టం చేశారు. అందుకు రూ. 10 కోట్లు ఖర్చు కాగలదని ప్రభుత్వానికి నివేదిక పంపారు కూడా. లండన్ వైద్యుల నివేదిక అనంతరం తెలంగాణ సర్కారు శస్త్రచికిత్స విషయమై ఎయిమ్స్ సలహా కోరుతూ లేఖ రాసింది. అయితే, ఎయిమ్స్‌లో శస్త్రచికిత్సకు అంగీకరించిన ఆ సంస్థ ఎంత ఖర్చు అవుతుందన్న విషయాన్ని మాత్రం పేర్కొనలేదు. ఈ నేపథ్యంలో ఖర్చుపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం ఎయిమ్స్‌కు మరో లేఖ రాయాలని నిర్ణయించింది. అలాగే ఢిల్లీలోని ఎయిమ్స్‌లో శస్త్రచికిత్స చేయడానికి లండన్ వైద్యులు ముందుకు వస్తారా లేదా కూడా తెలుసుకోవాలని ప్రయత్నిస్తోంది. ఆ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం మీద పెట్టి బ్రిటన్ ప్రభుత్వాన్ని ఒప్పించేలా చేయాలని కూడా భావిస్తోంది. -
వీణ-వాణిలను వేరు చేయొచ్చు: లండన్ వైద్యులు
అవిభక్త కవలలు వీణ - వాణిలను లండన్ నుంచి వచ్చిన వైద్యులు శనివారం పరిశీలించారు. వారిని వేరు చేయడానికి అవకాశాలు ఉన్నాయో లేవో క్షుణ్ణంగా చూశారు. తప్పకుండా వాళ్లిద్దరినీ వేరు చేయొచ్చని తెలిపారు. అయితే సంక్లిష్ట పరిస్థితుల దృష్ట్యా వాళ్లకు లండన్‌లోనే ఆపరేషన్ చేయాల్సి ఉంటుందన్నారు. దాదాపు ఐదు విడతల్లో సర్జరీలు చేయాల్సి ఉంటుందని, ఇందుకు 9 నుంచి 12 నెలల పాటు సమయం పట్టే అవకాశం ఉందని చెప్పారు. తాము ఇప్పటివరకు రెండుసార్లు అవిభక్త కవలలకు ఆపరేషన్లు చేశామని, వేరుపడ్డ ఆ నలుగురు కవలలు ఇప్పుడు క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారని వివరించారు. ఇప్పుడు వీణ - వాణిలను కూడా తాము వేరు చేయగలమని చెప్పారు. -
వీణ-వాణీలకు వైద్య పరీక్షలు
హైదరాబాద్ : అవిభక్త కవలలు వీణ, వాణిలను వేరు చేసేందుకు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన లండన్ వైద్యుల బృందం శనివారం నిలోఫర్ ఆస్పత్రికి చేరుకుంది. లండన్ నుంచి వైద్యులు డునావే, జిలానీ.. వీణ-వాణిలకు వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. అన్నీ సానుకూలంగా ఉంటే వీణా-వాణిలను లండన్‌కు తరలించి శస్త్రచికిత్స చేసే అవకాశముంది. ఈ ఆపరేషన్‌కు 25 కోట్ల నుంచి 50 కోట్లు ఖర్చవుతుందని అంచనా. లండన్ వైద్యులు రెండు రోజుల పాటు వీణా వాణీలను ఇక్కడే క్షుణ్నంగా పరీక్షించి ఆపరేషన్‌తో వారిని విడదీసేందుకు అవకాశం ఉంటుందా లేదా అన్న విషయాన్ని తేల్చనున్నారు. ఆ తర్వాత రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్‌చందా తదితర ఉన్నతాధికారులతో లండన్ వైద్య బృందం చర్చలు జరుపనుంది. అవిభక్త కవలలను వేరు చేయడంలో లండన్‌లోని గ్రేట్ ఆర్మండ్ స్ట్రీట్ ఆస్పత్రి పేరు పొందింది. 2011లో ఇదే ఆస్పత్రిలో సూడాన్‌కు చెందిన ఏడాది వయస్సున్న అవిభక్త కవలలు రిటాల్, రిటాగ్లను విజయవంతంగా వేరు చేశారు. అప్పట్లో ఈ ఆపరేషన్‌కు 6 కోట్లు ఖర్చయింది. ప్రస్తుతం 25 కోట్ల నుంచి 50 కోట్లు ఖర్చయ్యే అవకాశముందని సమాచారం. వరంగల్ జిల్లాకు చెందిన వీణ, వాణి పుట్టినప్పటి నుంచి హైదరాబాద్‌లోని నిలోఫర్‌లోనే వైద్యుల పర్యవేక్షణలో ఉంటున్నారు. -
వీణావాణీని వేరుచేస్తాం
-
వీణావాణీని వేరుచేస్తాం
అవిభక్త కవలలకు ఆపరేషన్‌పై ముందుకొచ్చిన లండన్ వైద్యులు రెండు రోజులపాటు వైద్య పరీక్షల కోసం నేడు హైదరాబాద్‌కు రాక అన్నీ సానుకూలంగా ఉంటే లండన్‌కు పిల్లల తరలింపు ఏడాదిపాటు విడతలవారీగా ఆపరేషన్.. రూ. 25 కోట్ల నుంచి 50 కోట్లు ఖర్చవుతుందని అంచనా సాక్షి, హైదరాబాద్: తలలు అతుక్కుని ఉన్న అవిభక్త కవలలు వీణ, వాణిని వేరు చేసేందుకు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన లండన్ వైద్యుల బృందం ముందుకొచ్చింది. అత్యంత ఆధునిక చికిత్సా పద్ధతులను ఉపయోగించి వీరికి శస్త్రచికిత్స అందిస్తామని అక్కడి గ్రేట్ ఆర్మండ్ స్ట్రీట్ ఆస్పత్రి వైద్యులు స్పష్టంచేశారు. 2011లో ఇదే ఆస్పత్రిలో సూడాన్‌కు చెందిన అవిభక్త కవలలు రిటాల్, రిటాగ్(ఏడాది వయసు)ను విజయవంతంగా వేరుచేశారు. ఈ పిల్లలు కూడా వీణ, వాణిలాగే తలలు అతుక్కుని పుట్టారు. 11 ఏళ్లుగా యాతన పడుతున్న తెలుగు బిడ్డలను పరీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వ విన్నపం మేరకు అక్కడి వైద్యులిద్దరు శనివారం హైదరాబాద్‌కు వస్తున్నారు. బాలికలను లండన్ వైద్య బృందం రెండు రోజుల పాటు ఇక్కడే క్షుణ్నంగా పరీక్షిస్తుంది. ఆపరేషన్‌తో వారిని విడదీసేందుకు అవకాశముంటుందా లేదా అన్న విషయాన్ని తేల్చుతుంది. అనంతరం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్‌చందా తదితర ఉన్నతాధికారులతో ఆ వైద్యులు చర్చలు జరుపుతారు. పిల్లల తల్లిదండ్రులతోనూ మాట్లాడతారు. విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించేందుకు అవకాశముంటే వీణ, వాణిలను మానసికంగా అందుకు సిద్ధం చేస్తారు. వారిని లండన్ తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతాయి. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించనుంది. సూడాన్ అవిభక్త కవలలకు ఆపరేషన్ కోసం రూ. 6 కోట్లు ఖర్చయింది. అప్పటికీ ఇప్పటికీ ఆధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. చికిత్స పద్ధతుల్లోనూ చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం రూ. 25 కోట్ల నుంచి రూ. 50 కోట్లు ఖర్చయ్యే అవకాశముందని వైద్య వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వారికి ఏడాదిపాటు విడతలవారీగా శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. పుట్టినప్పటి నుంచి నీలోఫర్‌లోనే.. వరంగల్ జిల్లాకు చెందిన వీణ, వాణి దాదాపుగా పుట్టినప్పటి నుంచి హైదరాబాద్‌లోని నిలోఫర్‌లోనే వైద్యుల పర్యవేక్షణలో ఉంటున్నారు. చాలా తెలివైన పిల్లలని వారిని చూస్తున్న డాక్టర్లు అంటుంటారు. ఎవరైనా వారిని చూడాలని అంటే ‘మీమేమైనా జంతు ప్రదర్శనశాలలో ఉండే జంతువులమా?’ అంటూ నిరాకరిస్తుంటారు. వారికి ఆసుపత్రి సిబ్బందే చదువు చెబుతున్నారు. ప్రత్యేకంగా టీచర్‌ను పెట్టించి చదువు చెప్పించేందుకు ప్రభుత్వానికీ ప్రతిపాదనలు పంపారు. కాగా, వీణ, వాణీలకు ఆపరేషన్ చేసేందుకు గతంలో అనేక ప్రయత్నాలు జరిగాయి. ముంబైలోని బ్రీచ్‌కాండీ ఆసుపత్రిలో, తర్వాత చెన్నైలోనూ పరీక్షలు నిర్వహించారు. కానీ శస్త్రచికిత్స కష్టమని తేల్చిచెప్పారు. ఆపరేషన్ చేసేందుకు సింగపూర్ డాక్టర్లు ముందుకు వచ్చారు. అన్ని ఏర్పాట్లు కూడా జరిగాయి. కానీ అక్కడి ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఒకవేళ ఆపరేషన్ విఫలమైతే అంతర్జాతీయంగా తమకు చెడ్డపేరు వస్తుందని అక్కడి ప్రభుత్వం ఆపరేషన్‌కు నిరాకరించిందని నీలోఫర్ వైద్యులు చెబుతున్నారు. ఇలా అనేక ప్రయత్నాల తర్వాత ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు తాజాగా లండన్ వైద్యులు ముందుకురావడం చర్చనీయాంశమైంది. కాగా, శారీరకంగా, మానసికంగానూ ఎదుగుతున్న వీణ, వాణి ప్రస్తుతం అన్నీ అవగాహన చేసుకునే స్థితిలో ఉన్నారు. దీంతో ఆపరేషన్‌పై వారి అభిప్రాయాలను కూడా లండన్ వైద్య బృందం తెలుసుకుంటుందని సమాచారం. అయితే ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తిచేస్తామన్న భరోసా వారిలో కల్పించాల్సి ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు. అందుకు వారిలో మానసిక స్థైర్యం నింపాల్సిన బాధ్యతను కొందరు ప్రముఖ మానసిక వైద్యులకు అప్పగించే అవకాశాలున్నాయి.