
నేడు చెన్నైకి లండన్ వైద్యులు
• జయలలితకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకే..
• అన్నాడీఎంకే అధినేత్రిని పరామర్శించిన జైట్లీ, అమిత్‌షా
• అమ్మ కోలుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా పూజలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు మెరుగైన చికిత్స అందించేందుకు లండన్ నుంచి వైద్యుల బృందం మళ్లీ గురువారం చెన్నైకి రానుంది. అనారోగ్యానికి గురైన జయలలిత గత నెల 22 నుంచి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. కాగా, సెప్టెంబర్ నెలాఖరులో ఒకసారి, ఈనెల 4న మరోసారి లండన్‌కు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ రిచర్డ్ జాన్ బిలే చెన్నైకి వచ్చి జయకు చికిత్స చేసి వెళ్లారు. జయలలిత మరికొన్ని రోజులు ఆస్పత్రిలోనే ఉండాలని అపోలో వైద్యులు ప్రకటించిన నేపథ్యంలో డాక్టర్ రిచర్డ్ జాన్ బిలే బృందం గురువారం మళ్లీ చెన్నైకి రానున్నట్లు సమాచారం. వీరు ఐదు రోజుల పాటు చెన్నైలోనే ఉండి జయకు వైద్య సేవలు అందించనున్నారు.
ప్రముఖుల పరామర్శ
జయలలితను పరామర్శించేందుకు బుధవారం పలువురు ప్రముఖులు అపోలో ఆస్పతికి వచ్చారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఆస్పత్రి వైద్యులను అడిగి చికిత్స వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడకుండానే వారు చెన్నై నుంచి తిరిగి వెళ్లిపోయారు. కాగా, జయలలిత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ అరుణ్‌జైట్లీ ట్వీట్ చేశారు. సినీనటుడు కార్తీక్ కూడా ఆస్పత్రికి వచ్చి వెళ్లారు.
వదంతుల వెనుక నేతలు: కేంద్ర మంత్రి పొన్
సీఎం జయలలిత అనారోగ్యంపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతుల వెనుక కొందరు రాజకీయ నేతలున్నారని కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ అన్నారు. ప్రత్యేక పోలీసు బృందం విచారణ జరిపితే వారి పేర్లు బయటకు వస్తాయని పేర్కొన్నారు. కాగా, ఇప్పటికే ఇద్దరు యువకులను అరెస్ట్ చేసిన పోలీసులు.. వాట్సాప్ ద్వారా జయపై అసత్య ప్రచారం చేసిన బెంగళూరుకు చెందిన యువతిని అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇదిలాఉండగా, జయలలితకు చికిత్స కొనసాగుతున్నందునఆమె వద్దకు వైద్యులు, నర్సులు మినహా ఎవ్వరినీ అనుమతించడం లేదు. జయకు చికిత్స జరుగుతున్న అపోలో ఆస్పత్రి రెండో అంతస్తులో రెండంచెల భద్రతను ఏర్పాటు చేశారు.
పూజలు, హోమాలు..
జయలలిత కోలుకోవాలని అన్నాడీఎంకే శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ప్రార్థనలు కొనసాగిస్తున్నారు. నటుడు వివేక్ కాంచీపురం కామా క్షి ఆలయంలో పూజలు నిర్వహించారు. తిరునెల్వేకి చెందిన మాడస్వామి అనే పార్టీ నేత ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలోని వల్లియ మురుగన్ ఆలయం వరకు మోకాలిపై నడిచాడు. కోవైలో 25 వేల మంది పాల కలశాలతో శక్తిమారియమ్మన్ ఆలయం వరకు ఊరేగింపు నిర్వహించారు. మదురై, చెన్నైలలో కూడా పాల కలశాలతో భారీ ర్యాలీలు జరిపా రు. కొట్టివాక్కంలో మహాగణపతి హోమాన్ని నిర్వహించారు. చెన్నై కన్నగినగర్‌లో అమ్మ కోలువాలని క్రైస్తవులు ప్రార్థనలు చేశారు.