
వీణావాణీని వేరుచేస్తాం
అవిభక్త కవలలకు ఆపరేషన్‌పై ముందుకొచ్చిన లండన్ వైద్యులు
రెండు రోజులపాటు వైద్య పరీక్షల కోసం నేడు హైదరాబాద్‌కు రాక
అన్నీ సానుకూలంగా ఉంటే లండన్‌కు పిల్లల తరలింపు
ఏడాదిపాటు విడతలవారీగా ఆపరేషన్..
రూ. 25 కోట్ల నుంచి 50 కోట్లు ఖర్చవుతుందని అంచనా
సాక్షి, హైదరాబాద్: తలలు అతుక్కుని ఉన్న అవిభక్త కవలలు వీణ, వాణిని వేరు చేసేందుకు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన లండన్ వైద్యుల బృందం ముందుకొచ్చింది. అత్యంత ఆధునిక చికిత్సా పద్ధతులను ఉపయోగించి వీరికి శస్త్రచికిత్స అందిస్తామని అక్కడి గ్రేట్ ఆర్మండ్ స్ట్రీట్ ఆస్పత్రి వైద్యులు స్పష్టంచేశారు. 2011లో ఇదే ఆస్పత్రిలో సూడాన్‌కు చెందిన అవిభక్త కవలలు రిటాల్, రిటాగ్(ఏడాది వయసు)ను విజయవంతంగా వేరుచేశారు. ఈ పిల్లలు కూడా వీణ, వాణిలాగే తలలు అతుక్కుని పుట్టారు. 11 ఏళ్లుగా యాతన పడుతున్న తెలుగు బిడ్డలను పరీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వ విన్నపం మేరకు అక్కడి వైద్యులిద్దరు శనివారం హైదరాబాద్‌కు వస్తున్నారు. బాలికలను లండన్ వైద్య బృందం రెండు రోజుల పాటు ఇక్కడే క్షుణ్నంగా పరీక్షిస్తుంది. ఆపరేషన్‌తో వారిని విడదీసేందుకు అవకాశముంటుందా లేదా అన్న విషయాన్ని తేల్చుతుంది. అనంతరం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్‌చందా తదితర ఉన్నతాధికారులతో ఆ వైద్యులు చర్చలు జరుపుతారు. పిల్లల తల్లిదండ్రులతోనూ మాట్లాడతారు. విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించేందుకు అవకాశముంటే వీణ, వాణిలను మానసికంగా అందుకు సిద్ధం చేస్తారు. వారిని లండన్ తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతాయి. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించనుంది. సూడాన్ అవిభక్త కవలలకు ఆపరేషన్ కోసం రూ. 6 కోట్లు ఖర్చయింది. అప్పటికీ ఇప్పటికీ ఆధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. చికిత్స పద్ధతుల్లోనూ చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం రూ. 25 కోట్ల నుంచి రూ. 50 కోట్లు ఖర్చయ్యే అవకాశముందని వైద్య వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వారికి ఏడాదిపాటు విడతలవారీగా శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది.
పుట్టినప్పటి నుంచి నీలోఫర్‌లోనే..
వరంగల్ జిల్లాకు చెందిన వీణ, వాణి దాదాపుగా పుట్టినప్పటి నుంచి హైదరాబాద్‌లోని నిలోఫర్‌లోనే వైద్యుల పర్యవేక్షణలో ఉంటున్నారు. చాలా తెలివైన పిల్లలని వారిని చూస్తున్న డాక్టర్లు అంటుంటారు. ఎవరైనా వారిని చూడాలని అంటే ‘మీమేమైనా జంతు ప్రదర్శనశాలలో ఉండే జంతువులమా?’ అంటూ నిరాకరిస్తుంటారు. వారికి ఆసుపత్రి సిబ్బందే చదువు చెబుతున్నారు. ప్రత్యేకంగా టీచర్‌ను పెట్టించి చదువు చెప్పించేందుకు ప్రభుత్వానికీ ప్రతిపాదనలు పంపారు. కాగా, వీణ, వాణీలకు ఆపరేషన్ చేసేందుకు గతంలో అనేక ప్రయత్నాలు జరిగాయి. ముంబైలోని బ్రీచ్‌కాండీ ఆసుపత్రిలో, తర్వాత చెన్నైలోనూ పరీక్షలు నిర్వహించారు. కానీ శస్త్రచికిత్స కష్టమని తేల్చిచెప్పారు. ఆపరేషన్ చేసేందుకు సింగపూర్ డాక్టర్లు ముందుకు వచ్చారు. అన్ని ఏర్పాట్లు కూడా జరిగాయి. కానీ అక్కడి ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఒకవేళ ఆపరేషన్ విఫలమైతే అంతర్జాతీయంగా తమకు చెడ్డపేరు వస్తుందని అక్కడి ప్రభుత్వం ఆపరేషన్‌కు నిరాకరించిందని నీలోఫర్ వైద్యులు చెబుతున్నారు. ఇలా అనేక ప్రయత్నాల తర్వాత ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు తాజాగా లండన్ వైద్యులు ముందుకురావడం చర్చనీయాంశమైంది. కాగా, శారీరకంగా, మానసికంగానూ ఎదుగుతున్న వీణ, వాణి ప్రస్తుతం అన్నీ అవగాహన చేసుకునే స్థితిలో ఉన్నారు. దీంతో ఆపరేషన్‌పై వారి అభిప్రాయాలను కూడా లండన్ వైద్య బృందం తెలుసుకుంటుందని సమాచారం. అయితే ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తిచేస్తామన్న భరోసా వారిలో కల్పించాల్సి ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు. అందుకు వారిలో మానసిక స్థైర్యం నింపాల్సిన బాధ్యతను కొందరు ప్రముఖ మానసిక వైద్యులకు అప్పగించే అవకాశాలున్నాయి.