అపోలో ఆసుపత్రిలో గత 23 రోజులుగా చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు
► మళ్లీ లండన్, ఎయిమ్స్ వైద్యుల రాక
► ఐదు రోజులు ఆస్పత్రిలోనే మకాం
► జయ ఆరోగ్యం కోసం ఇద్దరు ఆత్మాహుతి
► కొనసాగుతున్న పూజలు
► అపోలోకు ‘రిలయన్స్’ నీతూ అంబాని రాక
► సెల్‌ఫోన్లపై నిఘా
సాక్షి ప్రతినిధి, చెన్నై: అపోలో ఆసుపత్రిలో గత 23 రోజులుగా చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు మెరుగైన వైద్యసేవలను అందించేందుకు లండన్, ఎయిమ్స్ వైద్యుల బృందం గురువారం చెన్నైకి చేరుకుంది. అంతర్జాతీయ వైద్యనిపుణుడు డాక్టర్ రిచర్డ్ జాన్ బిలే, ఎయిమ్స్ వైద్యులు గిల్‌నానీ (ఊపిరితిత్తుల నిపుణుడు), అంజన్ టిరిక్కా (అనస్తీషియన్), నితీష్‌నాయక్ (హృద్రోగ నిపుణులు) అపోలోకు చేరుకుని వైద్య చికిత్సలు ప్రారంభించారు.
రెండు రోజుల క్రితమే లండన్‌కు వెళ్లిన డాక్టర్ రిచర్డ్‌ను మళ్లీ రప్పించారు. అలాగే ఈనెల 5వ తేదీన ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిమ్స్ వైద్యులు కొన్ని రోజులు చెన్నైలోనే ఉంటూ జయకు చికిత్స చేసి వెళ్లి పోయారు. ఎయిమ్స్ బృందం సైతం మళ్లీ చెన్నై అపోలోకు చేరుకుంది. వీరంతా ఐదు రోజులుపాటు చెన్నైలోనే ఉంటారు. జయ వేగంగా కోలుకునేందుకు వైద్య బృందం తీవ్రంగా కృషి చేస్తోంది.
మహిళ ఆవేదన
సీఎం జయ అనారోగ్యానికి గురైన నాటి నుంచి అన్నాడీఎంకే మహిళా నేతలు, కార్యకర్తలు అపోలో ఆసుపత్రి వద్దనే గడుపుతున్నారు. అమ్మ కోలుకుంటున్నారు, సంపూర్ణమైన ఆరోగ్యంతో తిరిగి ఇంటికి చేరుకుంటారని పార్టీ అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి ప్రతిరోజూ మీడియా వారి వద్ద వి శ్వా సం వ్యక్తం చేస్తున్నారు. అలాగే పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు అపోలో ఆసుపత్రి వద్దనే పడిగాపులు కాస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నేతలు అపోలో వద్దకు నేతలు తరలి వస్తున్నారు.
కోయంబత్తూరు సుగునాపు రం శక్తి మారియమ్మన్ ఆలయంలో 336 రకాల పూలతో మూడు రోజుల పాటూ భారీ ఎత్తున నిర్వహించే మహాయాగం గురువారం ప్రారంభమైంది. మంత్రి వేలుమణి నేతృత్వంలో ఈ మహాయాగం సాగనుంది. అలాగే రాష్ట్రంలోని 68 దర్గాల్లో ముస్లింలు ప్రార్థనలు చేశారు.నేడు మాజీ గవర్నర్ రోశయ్య రాక: తమిళనాడు మాజీ గవర్నర్ కే రోశయ్య ముఖ్యమంత్రి జయలలితను పరామర్శించేందుకు నేడు చెన్నైకి వస్తున్నట్లు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు తంగుటూరి రామకృష్ణ తెలిపారు.
సెల్‌ఫోన్ల నిఘా: ఇదిలా ఉండగా, అపోలో ఆసుపత్రి పరిసరాలకు వచ్చే అన్ని సెల్‌ఫోన్ల సంభాషణలపై పోలీసులు నిఘా పెట్టినట్లు గురువారం రాత్రి సమాచారం అందింది. జయ ఆరోగ్యంపై వదంతులు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆసుపత్రి నుం,ఊ ఎవరైనా సెల్‌ఫోన్ ద్వారా సమాచారం చేరవేస్తున్నారా అని పోలీ సులు అనుమానిస్తున్నారు. ఈ అనుమానంతోనే జయకు వైద్యం చేసే నర్సుల నుంచి సెల్‌ఫోన్‌లను సేకరించిన తరువాతనే లోనికి అనుమతిస్తున్నారు. సెల్‌ఫోన్ల సంభాషణలపై నిఘా పెట్టేందుకు పోలీసులు అపోలో ఆసుపత్రిలోనే ఒక కంట్రోలు రూంను ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. నిఘా విషయం తెలుసుకున్న అన్నాడీఎంకే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర పార్టీ నేతలు తమకు వచ్చే కాల్స్‌ను కట్‌చేస్తున్నట్లు సమాచారం. అంతేగాక తమ అనుచరులతో కూడా అపోలో పరిసరాల్లో సెల్‌ఫోన్ మాట్లాడవద్దని సూచించినట్లు తెలుస్తోంది.
గవర్నర్ స్పష్టం చేయాలి: తన ఆధీనంలోని శాఖలను మంత్రి పన్నీర్‌సెల్వంకు అప్పగించాల్సిందిగా ముఖ్యమంత్రి జయలలిత ఎలా సూచించారో గవర్నర్ విద్యాసాగర్‌రావు స్పష్టం చేయాలని పీఎం అధ్యక్షులు డాక్టర్ రాందాస్, డీఎండీకే అధ్యక్షులు విజయకాంత్ గురువారం వేర్వేరు ప్రకటనల్లో విజ్ఞప్తి చేశారు. జయకు చికిత్స జరుగుతున్న తరుణంలో గవర్నర్‌కు సూచించే పరిస్థితి ఎంతమాత్రం లేదని అపోలో ఆసుపత్రి నుంచి వెలువడుతున్న బులెటిన్‌లే తేటతెల్లం చేస్తున్నాయని అన్నారు. కాలు, చేయి కదపలేని స్థితిలో జయ ఉన్నట్లు అపోలో వైద్యులు చెబుతున్నారని వారు తెలిపారు.
జయ వద్దకు ఎవ్వరినీ అనుమతించని, కృత్రిమ శ్వాస అందిస్తున్న పరిస్థితుల్లో సంతకం చేయడమో, తాను మనస్సులో అనుకున్నది వ్యక్తం చేయడమో సాధ్యకాదని అన్నారు. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో పన్నీర్‌సెల్వంకు బాధ్యతలు అప్పగించాలని గవర్నర్‌కు ఎలా ఆమె సూచించగలగారని ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాలని వారు కోరారు. ఇదిలా ఉండగా, సీఎం జయ ఆరోగ్యంపై రాజకీయ పార్టీల్లో నెలకొన్న అనుమానాలను అధికార పక్ష నేతలు నివృత్తి చేయాలని తమిళ మానిల కాంగ్రెస్ అధ్యక్షులు జీకే వాసన్ డిమాండ్ చేశారు.
మరో ఇద్దరు అరెస్ట్: ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంపై వదంతులు సృష్టించిన కేసులో మరో ఇద్దరిని చెన్నై సెంట్రల్ క్రైంబ్రాంచ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.
గత 23 రోజులుగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీఎం గురించి ఫేస్‌బుక్, యూట్యూబ్, వాట్సాప్, ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాలలో అసత్య ప్రచారం జరిగి ఉద్రిక్తలకు దారితీసింది. సీఎం పరిస్థితిపై అవాస్తవాలను ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తప్పవని చెన్నై పోలీస్ కమిషనర్ జార్జ్ హెచ్చరించారు. ఈ రకంగా 52 కేసులు నమోదయ్యాయి. నామక్కల్‌కు చెందిన సతీష్‌కుమార్, మధురైకి చెందిన మాడస్వామిలను ఈనెల 10వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా ఫేస్‌బుక్, ట్వీట్టర్‌లో వదంతులు రేపిన చెన్నై పమ్మల్ ఎల్‌ఐసీ కాలనీకి చెందిన బాలసుందరం (42) ను బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. అలాగే తూత్తుకూడి జిల్లా ఒట్టబిడారానికి చెందిన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఉద్యోగి తిరుమణిసెల్వం (28)ను గురువారం అరెస్ట్ చేశారు. వదంతులపై ఇప్పటివరకు 53 కేసులు నమోదుకాగా వీరిలో నలుగురు అరెస్టయ్యారు.
ఇద్దరు ఆత్మాహుతి: జయ అనారోగ్యానికి గురయ్యారని కలత చెంది చెన్నై తాంబరానికి చెంది న సద్గుణం (31) బుధవారం రాత్రి నడిరోడ్డుపై నిలబడి జయ ఆరోగ్యంపై వాస్తవాలు ప్రకటిం చాలని నినాదాలు చేస్తూ అకస్మాత్తుగా ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పటించుకున్నాడు. చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి 11 గంటల సమయంలో మృతి చెందాడు. అలాగే మధురై జిల్లా పేరయ్యూరుకి చెందిన అన్నాడీఎంకే కార్యకర్త రాజవేల్ (21) ఈనెల 4వ తేదీన ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పుపెట్టుకున్నాడు. తీవ్రగాయాలకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి ప్రాణాలు విడిచాడు.