జయ మృతి: ఇప్పుడెందుకీ వివరణ??
దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై వస్తున్న అనుమానాలను నివృత్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నిర్వహించిన డాక్టర్ల ప్రెస్‌మీట్‌పై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా శశికళ నియామకం అయిన మరునాడే వైద్యులు విలేకరులకు ముందుకొచ్చి.. పలు అనుమానాల నివృత్తికి ప్రయత్నించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
జయలలితకు చికిత్స అందించిన, ఆమె ఆరోగ్యాన్ని పర్యవేక్షించిన వైద్యబృందం సోమవారం ప్రెస్‌మీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. దాదాపు గంటపాటు సాగిన ఈ ప్రెస్‌మీట్‌లో లండన్‌కు చెందిన వైద్యనిపుణుడు రిచర్డ్ బాలే కూడా పాల్గొన్నారు. జయలలిత చికిత్సను ఆయన దగ్గరుండి పర్యవేక్షించిన సంగతి తెలిసిందే. జయలలితకు అత్యుత్తమ వైద్యం అందించామని, ఆమె మృతిపై అనుమానాలు సరికాదని బాలే స్పష్టం చేశారు. ఆమె మృతదేహాన్ని వెలికితీసి.. మళ్లీ పరీక్షలను నిర్వహించాలన్న డిమాండ్‌ను ఆయన 'మూర్ఖమైనది'గా పేర్కొంటూ తోసిపుచ్చారు. అనుమానాలను నివృత్తి చేసేందుకే తాము ప్రెస్‌మీట్ పెట్టామని వైద్యులు చెప్తుండగా.. ఈ సమయంలోనే ఎందుకు పెట్టారని మిగతావారు ప్రశ్నిస్తున్నారు.
'శశికళ వెనువెంటనే సీఎం పదవిని చేజిక్కించుకోవడంపై తీవ్ర ప్రతిఘటన వస్తున్నదనే విషయం వారికి అర్థమైంది. ఈ ప్రెస్‌మీట్ ద్వారా ప్రజల సముదాయించాలని వారు భావించారు' అని డీఎంకే అధికార ప్రతినిధి శరవణన్ పేర్కొన్నారు. ఈ సమయంలో ప్రెస్‌మీట్ పెట్టడం కనీస ఇంగితజ్ఞానమున్న ప్రతి ఒక్కరికీ సందేహం కలిగిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, ఈ ఆరోపణలను అధికార అన్నాడీఎంకే నేతలు తోసిపుచ్చుతున్నారు. జయలలిత మృతిపై అనుమానాలు తొలగించేందుకు ఈ ప్రెస్‌మీట్‌ను వైద్యులు నిర్వహించారని, దీనివెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని వారు అంటున్నారు.