ఆస్పత్రిలో జయలలిత కోసం తిరుపతి లడ్డూ!
అన్నీ కొత్త నోట్లతో 170 కోట్ల నగదు, ఇంకా 130 కిలోల బంగారంతో పట్టుబడిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యుడు శేఖర్‌రెడ్డి పెద్ద పెద్ద వాళ్లతో మంచి పరిచయాలు మెయిన్‌టైన్ చేసేవాడని తెలుస్తోంది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు.. ఆయన స్వయంగా ఆస్పత్రికి వెళ్లి, తిరుపతి లడ్డూ కూడా తీసుకెళ్లారట. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఇక ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పన్నీర్ సెల్వంతో కూడా ఈయనకు మంచి సంబంధాలే ఉన్నట్లు తెలుస్తోంది. గత సంవత్సరం పన్నీర్ సెల్వం తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్లినప్పుడు కూడా ఆయన వెంటే ఉండి.. స్వయంగా ఆలయంలోకి తీసుకెళ్లింది సైతం ఈ శేఖర్ రెడ్డేనట. వీళ్లిద్దరికీ ఉన్న సంబంధం ఏంటని అన్నాడీఎంకే వర్గాలను ప్రశ్నించగా.. ఆయన టీటీడీ బోర్డు సభ్యుడి హోదాలో వచ్చారే తప్ప పన్నీర్ సెల్వంకు ఆయనతో సంబంధం ఏమీ లేదని పార్టీ నాయకులు చెబుతున్నారు. కానీ లోగుట్టు పెరుమాళ్లకెరుక!