వీణా-వాణీల ఆ‘పరేషాన్’!
- లండన్ వైద్యులతో శస్త్రచికిత్సపై చేతులెత్తేసిన ఎయిమ్స్?
సాక్షి, హైదరాబాద్: అవిభక్త కవలలు వీణా-వాణీ (13)ల శస్త్రచికిత్స విషయంలో స్పష్టత కరువైంది. ఆపరేషన్ ద్వారా వారిని వేరు చేసేందుకు లండన్ గ్రేట్ ఆర్మండ్ స్ట్రీట్ ఆస్పత్రి వైద్యులు ముందుకొచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) చేతిలో పెట్టడం, లండన్ వైద్యులను ఢిల్లీకి రప్పించి ఆపరేషన్ చేయిస్తామని ఎయిమ్స్ హామీ ఇవ్వడం తెలిసిందే. అయితే ఆపరేషన్ ఖర్చుపై స్పష్టత కోరుతూ ఎయిమ్స్‌కు లేఖ రాసిన రాష్ట్ర ప్రభుత్వం...శస్త్రచికిత్స కోసం లండన్ వైద్యులు ఢిల్లీకి వచ్చేందుకు ముందుకొస్తారో లేదో తెలుసుకోవాలని కోరింది. ఈ ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగి 5 నెలలు దాటింది. ఇప్పటివరకు ముందడుగు పడలేదు. వైద్య ఆరోగ్యశాఖ వర్గాల సమాచారం ప్రకారం ఆపరేషన్ చేయించే విషయంలో ఎయిమ్స్ చేతులెత్తేసింది.
అందుకే ఈ విషయాన్ని ఎటూ తేల్చకుండా పెం డింగ్‌లో పెట్టిందని ఈ వ్యవహారాలు పరిశీలిస్తున్న నీలోఫర్‌కు చెందిన ఒక వైద్యాధికారి ‘సాక్షి’కి చెప్పారు. అవిభక్త కవలలను వేరు చేసిన అనుభవమున్న లండన్ ఆస్పత్రిలోనే వీణావాణీలకు ఆపరేషన్ చేయిస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏడాదిపాటు విడతల వారీగా ఆపరేషన్ చేయాల్సి వస్తుందని... ఇందుకు రూ. 10 కోట్లు ఖర్చవుతుందని లండన్ వైద్యులు చెప్పగా దీనిపైనే సర్కారు తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. వీణావాణీలకు ఏదైనా ప్రమాదం జరిగితే ఏమిటన్న ప్రశ్న కూడా తాత్సారానికి మరో కారణంగా చెబుతున్నారు. మరోవైపు వీణావాణీల వయసు పెరుగుతున్న దృష్ట్యా వారిని మహిళా వసతి గృహంలోకి మార్చాల్సి ఉందని నీలోఫర్ వైద్యులు అంటున్నారు. దీనిపై సర్కారు నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.