![Deepthi Appikatla: From local stage to DelhI](/styles/webp/s3/article_images/2025/02/16/Deepthi-2.jpg.webp?itok=51LgKQyn)
కళ
వీణ రాగాల వెన్నెలలో పులకించిపోయిన దీప్తికి– వీణ పాఠమేప్రాణమై పోయింది. వీణ విహంగ రెక్కలపై ఆమె కొత్త ప్రపంచాలను చూసింది. ‘ఈ తరం అమ్మాయిలు కూడా వీణ నేర్చుకుంటున్నారా!’ అనేది కొందరి ఆశ్చర్యం. నేర్చుకుంటే ఎంత బాగుంటుందో దీప్తిలాంటి అమ్మాయిలు తమ విజయాల ద్వారా నిరూపిస్తున్నారు...
తాను ఒకటి తలిస్తే వీణ ఒకటి తల్చింది!
అవును.. మచిలీపట్నానికి చెందిన మొదలి చంద్రశేఖర్ దగ్గర గాత్రం, కీబోర్డు నేర్చుకుందామని వెళ్లిన అప్పికట్ల దీప్తి అంతలోనే మనసు మార్చుకుంది. వీణపై ఆసక్తి పెంచుకుంది. పాఠాలు నేర్చుకోవడం మొదలు పెట్టింది. సాధారణంగా చాలామందికి నేర్చుకోవడంలో ఆరంభ శూరత్వం ఉంటుంది. అయితే దీప్తి విషయంలో అలా జరగలేదు. ‘ఇంకా ఏదో నేర్చుకోవాలి’ అనే తపనతో ఎప్పటికప్పుడు ఉత్సాహంగా పాఠాలు నేర్చుకునేది. దీప్తి ప్రస్తుతం విజయవాడ కేఎల్ యూనివర్సిటీలో బీటెక్ సీఎస్‌ఈ మూడో సంవత్సరం చదువుతోంది.
‘ఇంజినీరింగ్ చదివే అమ్మాయికి వీణలెందుకు.. చదువు దెబ్బతింటుంది కదా!’ అనేది కొందరి సందేహం. ‘చదువు దెబ్బతినదు. మరింత చదువుకోవాలనిపిస్తుంది’ అంటుంది దీప్తి. ఎందుకంటే వీణరాగాల సాధనలో ఒత్తిడి తగ్గి మనసు తేలిక అవుతుంది. ఏకాగ్రత అంతకంతకూ పెరుగుతుంది. ఏది చదివినా ఇట్టే గుర్తుండి పోతుంది అంటుంది దీప్తి. నాలుగు సంవత్సరాలపాటు కర్ణాటక సంగీత సంప్రదాయ వీణ కోర్సును చదివి ఫస్ట్ క్లాస్‌లో సర్టిఫికెట్‌ను సాధించిన దీప్తి ఆ తరువాత పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో వీణలో డిప్లమో చేసింది.
నేర్చుకోవడం ఒక ఎత్తయితే, ప్రేక్షకులు మెచ్చేలా ప్రదర్శన ఇవ్వడం మరో ఎత్తు. మొదటిసారిగా సంగీత కళాకచేరిలో మంచి మార్కులు కొట్టేసింది. ఆంధ్రా యూనివర్సిటీలో నిర్వహించిన ‘యువభేరి’ లో బహుమతులు సాధించింది. ఎన్నో పోటీల్లో మొదటి బహుమతి గెలుచుకుంది. తెలంగాణ రాజ్‌భవన్ లో వీణ వాద్య కచేరి చేసి గవర్నర్ జిష్ణు దేవ్‌వర్మ ప్రశంసలు అందుకుంది.
వీణ వాద్య ప్రతిభతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లతో పాటు త్రివిధ దళాధిపతుల ప్రశంసలు అందుకుంది. ‘రాష్ట్రపతి భవన్ లో వీణ ప్రదర్శన ఇవ్వడం, ప్రముఖులను దగ్గరి నుంచి చూడడం, వారి ఆశీర్వాదం అందుకోవడం మరచిపోలేని అనుభూతి’ అంటుంది దీప్తి. చదువూ, సంగీతంలోనే కాదు కరాటేలోనూ రాణిస్తున్న దీప్తి మరిన్ని కళలలో విజయాలు సాధించాలని ఆశిద్దాం.
ధ్యానం లాంటి వీణ
వీణ అనేది కేవలం కచేరీల కోసం కాదు. నా దృష్టిలో వీణ వాద్య సాధన అనేది ఒకలాంటి ధ్యానం. వీణరాగాల వెలుగులో మనసు ఉత్తేజితం అవుతుందన్నది కాదనలేని సత్యం.
– అప్పికట్ల దీప్తి
– అంబటి శేషుబాబు
సాక్షి, మచిలీపట్నం
Comments
Please login to add a commentAdd a comment