ఎవరికి ఫిర్యాదు చేయాలి..! | To whom should the complaint ..! | Sakshi
Sakshi News home page

ఎవరికి ఫిర్యాదు చేయాలి..!

Published Thu, Sep 24 2015 2:44 AM | Last Updated on Sun, Sep 3 2017 9:51 AM

To whom should the complaint ..!

బాలల హక్కుల కమిషన్‌కు కష్టకాలం

♦ ఆఫీసులో వసతులు కరువు.. సిబ్బంది అసలే లేరు
♦ పది నెలలుగా సభ్యుల జీతాలు, నిధులు నిలిపివేత
♦ ఇప్పటికే ముగ్గురు సభ్యుల రాజీనామా
కొత్త కమిషన్ ఏర్పాటుకు ‘టీ’ సర్కారు నోటిఫికేషన్
♦ చెల్లదంటున్న ప్రస్తుత సభ్యులు
 
 సాక్షి,సిటీబ్యూరో : సమాజంలోని చిన్నారుల హక్కులకు అన్యాయం జరిగితే బాలల హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తారు. కానీ అదే కమిషన్‌కు వచ్చిన కష్టాలను మాత్రం పట్టించుకున్నవారు లేరు. బాలల హక్కుల పరిరక్షణ కోసం 2014లో ఏర్పాటైన కమిషన్ నిధుల కొరత, అధికార యంత్రాంగం సహాయ నిరాకరణతో విలవిల్లాడుతోంది. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ పునర్విభజన చట్టంలోని 10వ షెడ్యూల్‌లో ఉమ్మడిగా ఉంటుందని పేర్కొన్నప్పటికీ ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు సిబ్బంది, నిధుల కేటాయింపు విషయంలో మొండికేశాయి. దీతో కమిషన్‌లోని మమతా రఘువీర్, రియాజుద్దీన్ ఇప్పటికే తమ పదవుల నుంచి తప్పుకున్నారు.

మిగిలిన సభ్యుల్లో సుమిత్ర, బాలరాజు చాలా కాలంగా విధులకు దూరంగా ఉండగా చివరకు ఇద్దరు సభ్యులే మిగిలారు. జీఓ ఎంఎస్ నెంబర్ 11 (19.2.2014) మేరకు రిటైర్డ్ ఐఏఎస్ సుజాతారావు చైర్‌పర్సన్‌గా ఆయా రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న మరో ఆరుగురు సభ్యులతో బాలల కమిషన్ ఏర్పాటు చేశారు. అయితే, కార్యాలయం, ఇతర వసతుల పరిస్థితి చూశాక సుజాతారావు విధుల్లోనే చేరలేదు. బాధ్యతలు తీసుకున్న ఆరుగురు సభ్యులు ఇక్కడి పరిస్థితిపై పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తే కేవలం ఆర్నెల్లు మాత్రమే అరకొర నిధులు విదిల్చారు. 2014 నవంబర్ నుంచి ఒక్క పైసా విడుదల చేయకపోవటంతో సభ్యులు సొంత ఖర్చులతో కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

 బాబోయ్.. ఆ పదవులు వద్దు..
 ఈ కమిషన్‌లో ఏడుగురు సభ్యుల్లో ప్రస్తుతానికి సీరియస్‌గా పనిచేస్తున్నది కేవలం ఇద్దరే. మిగిలినవారు మనస్థాపంతో పదువులకు రాజీనామా చేయగా, కొందరు కార్యాలయం మెట్లెక్కడానికి ఇష్టపడడం లేదు. ఇప్పటికే సామాజిక కార్యకర్త, కమిషన్ సభ్యురాలు మమతా రఘువీర్ జూలైలో రాజీనామా చేశారు. అంతకు ముందే మరో సభ్యులు రహీమొద్దీన్ కూడా పదవిని వదులుకున్నారు. మిగిలిన సభ్యులు మొక్కపాటి సుమిత్ర, బాలరాజు కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. సొంత ఖర్చులతో పోచంపల్లి అచ్యుతరావు, ఎస్.మురళీధర్‌రెడ్డి మాత్రమే విధుల్లో పాల్గొంటున్నారు. ఈ విషయమై మురళీధర్‌రెడ్డి స్పందిస్తూ ‘సొంత ఖర్చులతో పనిచేస్తున్నాం..ప్రభుత్వం సహకరించకపోయినా మా కర్తవ్యం మే నిర్వహిస్తాం’ అని పేర్కొన్నారు.

 వివాదాస్పదం అవుతోన్న ‘టీ’ నోటిఫికేషన్
 తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు కొత్త కమిటీని ఏర్పాటు చేసేందుకు ఈనెల 17న టీ- ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేస్తూ దరఖాస్తులను ఆహ్వానించింది. అయితే 10వ షెడ్యూల్‌లో పేర్కొన్న మేరకు.. ఈ కమిషన్ పదేళ్ల వరకు ఉమ్మడిగా నిర్వహించాలని నిర్ణయించడంతో పాటు, ప్రస్తుత కమిటీ సభ్యుల మూడేళ్ల పదవీ కాలం ముగిసేంత వరకు కొత్త కమిటీని నియమించడానికి వీల్లేదని చట్టం చెబుతోంది. ఖాళీ అయిన పోస్టులను మాత్రమే భర్తీ చేయాల్సి ఉంటుంది. కానీ తాజా నోటిఫికేషన్‌లో చైర్‌పర్సన్ సహా అన్ని పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వటం న్యాయపరమైన చిక్కులు తలెత్తేందుకు ఆస్కారముంది.
 
 వేచి చూసి విసిగిపోయాం..
 బాలల హక్కుల పరిరక్షణ కోసం ఉత్సాహంగా పనిచేశాం. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందలేదు. ఐఏఎస్ మొదలుకుని ముఖ్యమంత్రి వరకు ముప్పై విజ్ఞాపన పత్రాలు అందజేశా. కానీ ఎలాంటి స్పందనా లేదు. అందుకే రాజీనామా చేసి, సొంతంగా బాలల హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తున్నా.       
- మమతా రఘువీర్, మాజీ సభ్యురాలు
 
 
 ఈ నోటిఫికేషన్ చెల్లదు..
  10వ షెడ్యూల్‌లో ఉన్న కమిషన్‌ను విభజించడం చెల్లదు. అంతే కాకుండా ప్రస్తుత సభ్యుల పదవీ కాలం మూడేళ్లుగా నిర్ధారించారు. ఇంకా మాకు ఒకటిన్నర సంవత్సర కాలం మిగిలే ఉంది. గడువు పూర్తి కాకుండానే రాజీనామా చేస్తే తప్ప, మమ్మల్ని తొలగించే అధికారం లేదు. అధికారులు సీఎంను తప్పుదోవ పట్టిస్తున్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తాం.
 - అచ్యుతరావు, బాలల హక్కుల కమిషన్ సభ్యుడు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement