సీజేఐ చంద్రచూడ్ వ్యాఖ్యలు
దివ్యాంగుల పట్ల మన తీరు మారాలి
లైంగిక దాడికి వాళ్లు సులువైన లక్ష్యాలు
బాధితులకు వ్యవస్థే అండగా నిలవాలి
న్యూఢిల్లీ: దివ్యాంగుల పట్ల, ముఖ్యంగా దివ్యాంగ బాలల పట్ల సమాజం వ్యవహరించే తీరులో మార్పు రావాల్సిన అవసరముందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. దివ్యాంగ బాలలు లైంగిక హింసకు సులువైన లక్ష్యాలుగా మారుతున్నారంటూ ఆవేదన వెలిబుచ్చారు. ఈ దారుణాల నుంచి కాపాడుకోవడం, వాటి బారిన పడేవారి పట్ల సహానుభూతితో వ్యవహరించడం మనందరి బాధ్యత అన్నారు.
శనివారం ఆయన దివ్యాంగ బాలల హక్కుల పరిరక్షణపై 9వ జాతీయ సదస్సులో పాల్గొన్నారు. దివ్యాంగుల హక్కులపై సుప్రీంకోర్టు హాండ్‌బుక్‌ను విడుదల చేశారు. అనంతరం ప్రారంభోపన్యాసం చేశారు. ‘‘దివ్యాంగ బాలల భద్రత, సంక్షేమానికి నా హృదయంలో ప్రత్యేక స్థానముంది. నేను దివ్యాంగులైన ఇద్దరు ఆడపిల్లల తండ్రిని. సమాజం పట్ల నా దృక్కోణాన్ని నా కూతుళ్లు పూర్తిగా మార్చేశారు’’ అని చెప్పారు.
నైపుణ్యం, సామర్థ్యాలతో నిమిత్తం లేకుండా బాలల హక్కులను పరిపూర్ణంగా పరిరక్షించే ఆదర్శ సమాజమే మనందరి లక్ష్యం కావాలని సూచించారు. ఇందుకోసం పలు కీలకాంశాలపై దృష్టి సారించాల్సిన అవసరముందన్నారు. ‘‘దివ్యాంగ బాలల సమస్యలను గుర్తించాలి. లైంగిక దాడుల వంటి హేయమైన నేరాల బారిన పడే దివ్యాంగ బాలికలను అక్కున చేర్చుకుని వారిలో ధైర్యం నింపాలి. పూర్తిగా కోలుకునేందుకు అన్నివిధాలా దన్నుగా నిలవాలి. పోలీస్‌స్టేషన్ మొదలుకుని కోర్టు దాకా ప్రతి దశలోనూ వారి పట్ల అత్యంత సున్నితంగా, సహానుభూతితో వ్యవహరించాలి.
ఇందుకు అవసరమైన మేరకు బాలల న్యాయ వ్యవస్థకు, దివ్యాంగుల హక్కుల చట్టానికి మార్పులు చేయాలి. ఇందుకు అంతర్జాతీయ చట్టాల నుంచి స్ఫూర్తి పొందాలి. వారిపై అకృత్యాలను నివారించడంపై ప్రధానంగా దృష్టి సారించాలి. ఆ బాలలకు నాణ్యతతో కూడిన విద్య, అనంతరం మెరుగైన ఉపాధి తదితర అవకాశాలు కల్పించాలి. తద్వారా అడుగడుగునా అండగా నిలవాలి. ఈ విషయమై వారి తల్లిదండ్రులతో పాటు పోలీసులకు, లాయర్లకు, న్యాయమూర్తులకు కూడా మరింత అవగాహన కల్పించాలి’’ అని సీజేఐ పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment