Hand Book
-
సమాజాన్ని చూసే తీరును నా కూతుళ్లు మార్చేశారు
న్యూఢిల్లీ: దివ్యాంగుల పట్ల, ముఖ్యంగా దివ్యాంగ బాలల పట్ల సమాజం వ్యవహరించే తీరులో మార్పు రావాల్సిన అవసరముందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. దివ్యాంగ బాలలు లైంగిక హింసకు సులువైన లక్ష్యాలుగా మారుతున్నారంటూ ఆవేదన వెలిబుచ్చారు. ఈ దారుణాల నుంచి కాపాడుకోవడం, వాటి బారిన పడేవారి పట్ల సహానుభూతితో వ్యవహరించడం మనందరి బాధ్యత అన్నారు. శనివారం ఆయన దివ్యాంగ బాలల హక్కుల పరిరక్షణపై 9వ జాతీయ సదస్సులో పాల్గొన్నారు. దివ్యాంగుల హక్కులపై సుప్రీంకోర్టు హాండ్‌బుక్‌ను విడుదల చేశారు. అనంతరం ప్రారంభోపన్యాసం చేశారు. ‘‘దివ్యాంగ బాలల భద్రత, సంక్షేమానికి నా హృదయంలో ప్రత్యేక స్థానముంది. నేను దివ్యాంగులైన ఇద్దరు ఆడపిల్లల తండ్రిని. సమాజం పట్ల నా దృక్కోణాన్ని నా కూతుళ్లు పూర్తిగా మార్చేశారు’’ అని చెప్పారు. నైపుణ్యం, సామర్థ్యాలతో నిమిత్తం లేకుండా బాలల హక్కులను పరిపూర్ణంగా పరిరక్షించే ఆదర్శ సమాజమే మనందరి లక్ష్యం కావాలని సూచించారు. ఇందుకోసం పలు కీలకాంశాలపై దృష్టి సారించాల్సిన అవసరముందన్నారు. ‘‘దివ్యాంగ బాలల సమస్యలను గుర్తించాలి. లైంగిక దాడుల వంటి హేయమైన నేరాల బారిన పడే దివ్యాంగ బాలికలను అక్కున చేర్చుకుని వారిలో ధైర్యం నింపాలి. పూర్తిగా కోలుకునేందుకు అన్నివిధాలా దన్నుగా నిలవాలి. పోలీస్‌స్టేషన్ మొదలుకుని కోర్టు దాకా ప్రతి దశలోనూ వారి పట్ల అత్యంత సున్నితంగా, సహానుభూతితో వ్యవహరించాలి. ఇందుకు అవసరమైన మేరకు బాలల న్యాయ వ్యవస్థకు, దివ్యాంగుల హక్కుల చట్టానికి మార్పులు చేయాలి. ఇందుకు అంతర్జాతీయ చట్టాల నుంచి స్ఫూర్తి పొందాలి. వారిపై అకృత్యాలను నివారించడంపై ప్రధానంగా దృష్టి సారించాలి. ఆ బాలలకు నాణ్యతతో కూడిన విద్య, అనంతరం మెరుగైన ఉపాధి తదితర అవకాశాలు కల్పించాలి. తద్వారా అడుగడుగునా అండగా నిలవాలి. ఈ విషయమై వారి తల్లిదండ్రులతో పాటు పోలీసులకు, లాయర్లకు, న్యాయమూర్తులకు కూడా మరింత అవగాహన కల్పించాలి’’ అని సీజేఐ పిలుపునిచ్చారు. -
కాలేజీ ఏదైనా ఒక సబ్జెక్టుకు ఓకే
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మార్పులకు అనుగుణంగా ఉన్నతవిద్యను ఆధునీకరించాలని అఖిలభారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) చర్యలు చేపడుతోంది. ఈ మేరకు పలు మౌలిక మార్పులకు ఆమోదం తెలుపుతూ తాజాగా హ్యాండ్‌బుక్ విడుదల చేసింది. నాణ్యతలేని కాలేజీల ఏర్పాటును అడ్డుకునేందుకు కఠిన నిబంధనలు పొందుపర్చింది. సాంకేతిక విద్యాకాలేజీల ఏర్పాటుకు పారిశ్రామిక భాగస్వామ్యం అవసరమని పేర్కొంది. విద్యార్థికి సరిహద్దుల్లేని అభ్యాసానికి వీలు కల్పించింది. వచ్చే విద్యాసంవత్సరం (2022–23) నుంచి చేయాల్సిన మార్పులను ఇందులో స్పష్టం చేసింది. ఎక్కడైనా ఓ కోర్సు ఒక్కోకాలేజీలో ఒక్కో కోర్సుకు ప్రత్యేకత ఉంటుంది. ఒక్కో చోట మౌలిక వసతులు, లైబ్రరీ సదుపాయం వంటివి అత్యంత ప్రాధాన్యంగా కన్పిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో విద్యార్థి ఏ కాలేజీలో చేరినా, మరో నచ్చిన కాలేజీలో ఒక సబ్జెక్టు పూర్తిచేసే అవకాశం కల్పించింది. ఈ కాలేజీలు సంబంధిత యూనివర్సిటీ పరిధిలో, ఒకే నెట్‌వర్క్‌లో ఉండాలని పేర్కొంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి గతేడాది ఈ తరహా ప్రయోగం చేసింది. హైదరాబాద్‌లోని కొన్ని కాలేజీల నెట్‌వర్క్‌లో ఒక సబ్జెక్టు పూర్తి చేసే అవకాశం కల్పించింది. ఏఐసీటీసీ కూడా ఈ దిశగానే ఆలోచిస్తోంది. దీంతో విద్యార్థులు నాణ్యమైన బోధన అందుకోవచ్చు. ఆన్లైన్ కోర్సులకూ ఆమోదం అఖిల భారత సాంకేతిక విద్యామండలి విద్యార్థులకు మరో అవకాశం కల్పించింది. విస్తృత ఆన్లైన్ బోధన వ్యవస్థను సొంతం చేసుకునే దిశగా మార్పులు చేసింది. ఇంజనీరింగ్ కోర్సులు చేస్తున్న అభ్యర్థులకు భవిష్యత్‌లో ఉపాధి అవకాశాలు పెంచే ఇతర కోర్సును ఆన్లైన్లో పూర్తి చేసేందుకు అనుమతించింది. ఆ కోర్సు దేశ, విదేశాల్లో ఎక్కడున్నా నేర్చుకోవచ్చు. గుర్తింపుపొందిన సంస్థ ద్వారా కోర్సు పూర్తి చేస్తే.. ఆ సర్టిఫికెట్ చెల్లుబాటు అయ్యేలా ఉంటుందని స్పష్టం చేసింది. గణితం లేకున్నా... బ్రిడ్జ్ కోర్సు తప్పనిసరి సాధారణంగా ఇంజనీరింగ్‌లో చేరే విద్యార్థులు ఇంటర్మీడియట్‌ను గణితం సబ్జెక్ట్‌తో పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే, ఇతర రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో గణితం లేకుండా సైన్స్ గ్రూపులు కొనసాగుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇంటర్లో గణితం లేకున్నా బయాలజీ, బయోటెక్నాలజీ, బిజినెస్ స్టడీస్, ఇంజనీరింగ్ గ్రాఫిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పూర్తి చేసినవారు ఇంజనీరింగ్‌లో చేరవచ్చు. ఆర్కిటెక్చర్, బయోటెక్నాలజీ, ఫ్యాషన్ టెక్నాలజీ వంటి డిగ్రీ కోర్సులు చేయడానికి ఇంటర్లో గణితం అక్కర్లేదని పేర్కొంది. అయితే, ఇలాంటి విద్యార్థులు ఇంజనీరింగ్‌లో చేరినా, మరే ఇతర కోర్సుల్లో చేరినా ఒక సెమిస్టర్ విధిగా బ్రిడ్జి కోర్సు చేయాలి. దీన్ని ఆయా కాలేజీలే అందించాలి. అయితే ఈ విధానం ప్రస్తుతం తెలుగురాష్ట్రాల్లో అమలయ్యే అవకాశం కన్పించడంలేదని అధికారులు అంటున్నారు. కాగా, ఇంజనీరింగ్‌లో ప్రతీ బ్రాంచ్‌లోనూ రెండు సీట్లను కాలేజీ యాజమాన్యాలు పెంచుకునే స్వేచ్ఛను ఏఐసీటీఈ కల్పించింది. దీనికి ఎలాంటి అనుమతులు అక్కర్లేదని స్పష్టం చేసింది. -
ఎలక్ట్రికల్ వెహికల్ చార్జింగ్ సదుపాయాలపై నీతి ఆయోగ్ సలహాలు!
న్యూఢిల్లీ: విద్యుత్‌తో నడిచే వాహనాలకు చార్జింగ్ సదుపాయాల ఏర్పాటుకు సంబంధించి సహాయకారిగా ఉండే ఒక హ్యాండ్‌బుక్‌ను నీతి ఆయోగ్ విడుదల చేసింది. విధానాల రూపకల్పన విషయంలో రాష్ట్రాలు, స్థానిక పాలక మండళ్లకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని నీతి ఆయోగ్ తెలిపింది. ప్రణాళికల రూపకల్పన, ఈవీ చార్జింగ్ సుదుపాయాల ఏర్పాటు విషయంలో సమగ్ర విధానాన్ని అనుసరించేందుకు కావాల్సిన సమాచారం ఇందులో ఉన్నట్టు తెలిపింది. వివిధ సంస్థలు, శాఖలతో కలిసి నీతి ఆయోగ్ సంయుక్తంగా ఈ హ్యాండ్‌బుక్‌ను రూపొందించాయి. -
తుఫాన్‌ను ఎదుర్కొన్న తీరు భేష్
సాక్షి, విశాఖపట్నం: కనివినీ ఎరుగని విధ్వంసాన్ని సృష్టించిన హుద్‌హుద్ తుఫాన్‌ను ఎదుర్కొన్న తీరుపై హ్యాండ్‌బుక్ రూపొందించాలని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ తరుణ్‌బజాజ్ సూచించారు. ఎదుర్కొన్న తీరు అభినందనీయమన్నారు. హుద్‌హుద్ తుఫాన్ సమయంలో 220 కిలోమీటర్ల వేగంతోనే గాలులు వీచాయని, 400 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా తట్టుకునేలా దెబ్బతిన్న వ్యవస్థలను పునరుద్ధరించాలని ఆయన సూచించారు. బజాజ్ నేతృత్వంలోని ప్రపంచ బ్యాంకు, ఏషియన్ బ్యాంకు అధికారుల బృందం గురువారం జిల్లాలో తుఫాన్ వల్ల దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు. ఉదయం 8 గంటలకు ఢిల్లీ నుంచి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఈ బృందంలో బజాజ్‌తో పాటు ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు అపర్ణ బాటియా, ఒన్నో రుహి, సౌరబ్ దాని, దీపక్ సింగ్, ఎం.తేరిసా ఖో, ఆండ్రూ జెఫ్రీస్, పుష్కర్ శ్రీవాత్సవ, అనీల్ మొత్వానిలకు జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ స్వాగతం పలికారు. తొలుత ఎయిర్‌పోర్టులో ఏర్పాటు చేసిన ఫొటోఎగ్జిబిషన్‌ను తిలకించి టెర్మినల్‌కు జరిగిన నష్టాన్ని పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్‌కు చేరుకుని ఉత్తరాంధ్రలో తుఫాన్ వల్ల జరిగిన నష్టంపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను కూడా తిలకించి కలెక్టరేట్లో అధికారులతో సమావేశమయ్యారు. తుఫాన్ నష్టాలపై బృందం సభ్యులకు కలెక్టర్ యువరాజ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం ఆర్కే బీచ్‌లోని జీవీఎంసీ-యూఎల్బీ రోడ్, రాజీవ్ స్మృతి భవన్, ఎపీఐఐసీలోని ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సింహపురి కాలనీలోని దెబ్బతిన్న అర్బన్ హౌసెస్, జీవీఎంసీ స్వర్ణభారతి ఆడిటోరియాన్ని పరిశీలించారు. సర్క్యూట్‌హౌస్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. సాయంత్రం మునగపాక మండలం వాడ్రాపల్లిలో వ్యవసాయ పంటలకు జరిగిన నష్టాన్ని పరిశీలించారు. ఉదయం జరిగిన సమీక్ష సమావేశంలో బజాజ్ మాట్లాడుతూ ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే చిత్తశుద్ధి అవసరమన్నారు. జీవీఎంసీకి జరిగిన నష్టాన్ని ఇన్చార్జి కమిషనర్ ప్రవీణ్‌కుమార్, విద్యుత్ రంగానికి జరిగిన నష్టాన్ని ఏపీ ఈపీసీడీఎల్ సీఎండీ శేషగిరిబాబులు వివరించారు. ఈ సమావేశంలో అటవీశాఖ చీఫ్ క న్జర్వేటర్ భరత్‌కుమార్, సోషల్ ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ కె. సూర్యనారాయణ, ఏజేసీ డి.వి.రెడ్డి, డీఎఫ్‌వో రామ్మోహనరావు, డీఆర్వో నాగేశ్వరరావు, వ్యవసాయశాఖ జేడీ లీలావతి, ఉద్యానవన శాఖ ఏడీ ప్రభాకరరావు, తుఫాన్ హెచ్చరికల కేంద్రం డెరైక్టర్ రామచంద్రరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ తోట ప్రభావకరావు పాల్గొన్నారు.