తుఫాన్‌ను ఎదుర్కొన్న తీరు భేష్ | World Bank, ADB team inspects cyclone damage in Vizag district | Sakshi
Sakshi News home page

తుఫాన్‌ను ఎదుర్కొన్న తీరు భేష్

Published Fri, Dec 5 2014 12:36 AM | Last Updated on Sat, Sep 2 2017 5:37 PM

World Bank, ADB team inspects cyclone damage in Vizag district

సాక్షి, విశాఖపట్నం: కనివినీ ఎరుగని విధ్వంసాన్ని సృష్టించిన హుద్‌హుద్ తుఫాన్‌ను ఎదుర్కొన్న తీరుపై హ్యాండ్‌బుక్ రూపొందించాలని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ తరుణ్‌బజాజ్ సూచించారు. ఎదుర్కొన్న తీరు అభినందనీయమన్నారు. హుద్‌హుద్ తుఫాన్ సమయంలో 220 కిలోమీటర్ల వేగంతోనే గాలులు వీచాయని, 400 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా తట్టుకునేలా దెబ్బతిన్న వ్యవస్థలను పునరుద్ధరించాలని ఆయన సూచించారు.

బజాజ్ నేతృత్వంలోని ప్రపంచ బ్యాంకు, ఏషియన్ బ్యాంకు అధికారుల బృందం గురువారం జిల్లాలో తుఫాన్ వల్ల దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు. ఉదయం 8 గంటలకు ఢిల్లీ నుంచి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఈ బృందంలో బజాజ్‌తో పాటు ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు అపర్ణ బాటియా, ఒన్నో రుహి, సౌరబ్ దాని, దీపక్ సింగ్, ఎం.తేరిసా ఖో, ఆండ్రూ జెఫ్రీస్, పుష్కర్ శ్రీవాత్సవ, అనీల్ మొత్వానిలకు జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ స్వాగతం పలికారు. తొలుత ఎయిర్‌పోర్టులో ఏర్పాటు చేసిన ఫొటోఎగ్జిబిషన్‌ను తిలకించి టెర్మినల్‌కు జరిగిన నష్టాన్ని పరిశీలించారు.

అనంతరం కలెక్టరేట్‌కు చేరుకుని ఉత్తరాంధ్రలో తుఫాన్ వల్ల జరిగిన నష్టంపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను కూడా తిలకించి కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశమయ్యారు. తుఫాన్ నష్టాలపై బృందం సభ్యులకు కలెక్టర్ యువరాజ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం ఆర్కే బీచ్‌లోని జీవీఎంసీ-యూఎల్‌బీ రోడ్, రాజీవ్ స్మృతి భవన్, ఎపీఐఐసీలోని ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సింహపురి కాలనీలోని దెబ్బతిన్న అర్బన్ హౌసెస్, జీవీఎంసీ స్వర్ణభారతి ఆడిటోరియాన్ని పరిశీలించారు.

సర్క్యూట్‌హౌస్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. సాయంత్రం మునగపాక మండలం వాడ్రాపల్లిలో వ్యవసాయ పంటలకు జరిగిన నష్టాన్ని పరిశీలించారు. ఉదయం జరిగిన సమీక్ష సమావేశంలో బజాజ్ మాట్లాడుతూ ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే చిత్తశుద్ధి అవసరమన్నారు. జీవీఎంసీకి జరిగిన నష్టాన్ని ఇన్‌చార్జి కమిషనర్ ప్రవీణ్‌కుమార్, విద్యుత్ రంగానికి జరిగిన నష్టాన్ని ఏపీ ఈపీసీడీఎల్ సీఎండీ శేషగిరిబాబులు వివరించారు.

ఈ సమావేశంలో అటవీశాఖ చీఫ్ క న్జర్వేటర్ భరత్‌కుమార్, సోషల్ ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ కె. సూర్యనారాయణ, ఏజేసీ డి.వి.రెడ్డి, డీఎఫ్‌వో రామ్మోహనరావు, డీఆర్‌వో నాగేశ్వరరావు, వ్యవసాయశాఖ జేడీ లీలావతి, ఉద్యానవన శాఖ ఏడీ ప్రభాకరరావు, తుఫాన్ హెచ్చరికల కేంద్రం డెరైక్టర్ రామచంద్రరావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ తోట ప్రభావకరావు  పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement