కాలేజీ ఏదైనా ఒక సబ్జెక్టుకు ఓకే  | India Council For Technical Education Taking Steps To Modernize Higher Education | Sakshi
Sakshi News home page

కాలేజీ ఏదైనా ఒక సబ్జెక్టుకు ఓకే 

Published Fri, Apr 1 2022 1:45 AM | Last Updated on Fri, Apr 1 2022 10:40 AM

India Council For Technical Education Taking Steps To Modernize Higher Education - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ మార్పులకు అనుగుణంగా ఉన్నతవిద్యను ఆధునీకరించాలని అఖిలభారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) చర్యలు చేపడుతోంది. ఈ మేరకు పలు మౌలిక మార్పులకు ఆమోదం తెలుపుతూ తాజాగా హ్యాండ్‌బుక్‌ విడుదల చేసింది. నాణ్యతలేని కాలేజీల ఏర్పాటును అడ్డుకునేందుకు కఠిన నిబంధనలు పొందుపర్చింది. సాంకేతిక విద్యాకాలేజీల ఏర్పాటుకు పారిశ్రామిక భాగస్వామ్యం అవసరమని పేర్కొంది. విద్యార్థికి సరిహద్దుల్లేని అభ్యాసానికి వీలు కల్పించింది. వచ్చే విద్యాసంవత్సరం (2022–23) నుంచి చేయాల్సిన మార్పులను ఇందులో స్పష్టం చేసింది.  

ఎక్కడైనా ఓ కోర్సు 
ఒక్కోకాలేజీలో ఒక్కో కోర్సుకు ప్రత్యేకత ఉంటుంది. ఒక్కో చోట మౌలిక వసతులు, లైబ్రరీ సదుపాయం వంటివి అత్యంత ప్రాధాన్యంగా కన్పిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో విద్యార్థి ఏ కాలేజీలో చేరినా, మరో నచ్చిన కాలేజీలో ఒక సబ్జెక్టు పూర్తిచేసే అవకాశం కల్పించింది. ఈ కాలేజీలు సంబంధిత యూనివర్సిటీ పరిధిలో, ఒకే నెట్‌వర్క్‌లో ఉండాలని పేర్కొంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి గతేడాది ఈ తరహా ప్రయోగం చేసింది. హైదరాబాద్‌లోని కొన్ని కాలేజీల నెట్‌వర్క్‌లో ఒక సబ్జెక్టు పూర్తి చేసే అవకాశం కల్పించింది. ఏఐసీటీసీ కూడా ఈ దిశగానే ఆలోచిస్తోంది. దీంతో విద్యార్థులు నాణ్యమైన బోధన అందుకోవచ్చు.  

ఆన్‌లైన్‌ కోర్సులకూ ఆమోదం 
అఖిల భారత సాంకేతిక విద్యామండలి విద్యార్థులకు మరో అవకాశం కల్పించింది. విస్తృత ఆన్‌లైన్‌ బోధన వ్యవస్థను సొంతం చేసుకునే దిశగా మార్పులు చేసింది. ఇంజనీరింగ్‌ కోర్సులు చేస్తున్న అభ్యర్థులకు భవిష్యత్‌లో ఉపాధి అవకాశాలు పెంచే ఇతర కోర్సును ఆన్‌లైన్‌లో పూర్తి చేసేందుకు అనుమతించింది. ఆ కోర్సు దేశ, విదేశాల్లో ఎక్కడున్నా నేర్చుకోవచ్చు. గుర్తింపుపొందిన సంస్థ ద్వారా కోర్సు పూర్తి చేస్తే.. ఆ సర్టిఫికెట్‌ చెల్లుబాటు అయ్యేలా ఉంటుందని స్పష్టం చేసింది.  

గణితం లేకున్నా... బ్రిడ్జ్‌ కోర్సు తప్పనిసరి 
సాధారణంగా ఇంజనీరింగ్‌లో చేరే విద్యార్థులు ఇంటర్మీడియట్‌ను గణితం సబ్జెక్ట్‌తో పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే, ఇతర రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో గణితం లేకుండా సైన్స్‌ గ్రూపులు కొనసాగుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇంటర్‌లో గణితం లేకున్నా బయాలజీ, బయోటెక్నాలజీ, బిజినెస్‌ స్టడీస్, ఇంజనీరింగ్‌ గ్రాఫిక్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ పూర్తి చేసినవారు ఇంజనీరింగ్‌లో చేరవచ్చు. ఆర్కిటెక్చర్, బయోటెక్నాలజీ, ఫ్యాషన్‌ టెక్నాలజీ వంటి డిగ్రీ కోర్సులు చేయడానికి ఇంటర్‌లో గణితం అక్కర్లేదని పేర్కొంది. అయితే, ఇలాంటి విద్యార్థులు ఇంజనీరింగ్‌లో చేరినా, మరే ఇతర కోర్సుల్లో చేరినా ఒక సెమిస్టర్‌ విధిగా బ్రిడ్జి కోర్సు చేయాలి. దీన్ని ఆయా కాలేజీలే అందించాలి. అయితే ఈ విధానం ప్రస్తుతం తెలుగురాష్ట్రాల్లో అమలయ్యే అవకాశం కన్పించడంలేదని అధికారులు అంటున్నారు. కాగా, ఇంజనీరింగ్‌లో ప్రతీ బ్రాంచ్‌లోనూ రెండు సీట్లను కాలేజీ యాజమాన్యాలు పెంచుకునే స్వేచ్ఛను ఏఐసీటీఈ కల్పించింది. దీనికి ఎలాంటి అనుమతులు అక్కర్లేదని స్పష్టం చేసింది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement