India Council for Technical Education
-
కాలేజీ ఏదైనా ఒక సబ్జెక్టుకు ఓకే
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మార్పులకు అనుగుణంగా ఉన్నతవిద్యను ఆధునీకరించాలని అఖిలభారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) చర్యలు చేపడుతోంది. ఈ మేరకు పలు మౌలిక మార్పులకు ఆమోదం తెలుపుతూ తాజాగా హ్యాండ్‌బుక్ విడుదల చేసింది. నాణ్యతలేని కాలేజీల ఏర్పాటును అడ్డుకునేందుకు కఠిన నిబంధనలు పొందుపర్చింది. సాంకేతిక విద్యాకాలేజీల ఏర్పాటుకు పారిశ్రామిక భాగస్వామ్యం అవసరమని పేర్కొంది. విద్యార్థికి సరిహద్దుల్లేని అభ్యాసానికి వీలు కల్పించింది. వచ్చే విద్యాసంవత్సరం (2022–23) నుంచి చేయాల్సిన మార్పులను ఇందులో స్పష్టం చేసింది. ఎక్కడైనా ఓ కోర్సు ఒక్కోకాలేజీలో ఒక్కో కోర్సుకు ప్రత్యేకత ఉంటుంది. ఒక్కో చోట మౌలిక వసతులు, లైబ్రరీ సదుపాయం వంటివి అత్యంత ప్రాధాన్యంగా కన్పిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో విద్యార్థి ఏ కాలేజీలో చేరినా, మరో నచ్చిన కాలేజీలో ఒక సబ్జెక్టు పూర్తిచేసే అవకాశం కల్పించింది. ఈ కాలేజీలు సంబంధిత యూనివర్సిటీ పరిధిలో, ఒకే నెట్‌వర్క్‌లో ఉండాలని పేర్కొంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి గతేడాది ఈ తరహా ప్రయోగం చేసింది. హైదరాబాద్‌లోని కొన్ని కాలేజీల నెట్‌వర్క్‌లో ఒక సబ్జెక్టు పూర్తి చేసే అవకాశం కల్పించింది. ఏఐసీటీసీ కూడా ఈ దిశగానే ఆలోచిస్తోంది. దీంతో విద్యార్థులు నాణ్యమైన బోధన అందుకోవచ్చు. ఆన్లైన్ కోర్సులకూ ఆమోదం అఖిల భారత సాంకేతిక విద్యామండలి విద్యార్థులకు మరో అవకాశం కల్పించింది. విస్తృత ఆన్లైన్ బోధన వ్యవస్థను సొంతం చేసుకునే దిశగా మార్పులు చేసింది. ఇంజనీరింగ్ కోర్సులు చేస్తున్న అభ్యర్థులకు భవిష్యత్‌లో ఉపాధి అవకాశాలు పెంచే ఇతర కోర్సును ఆన్లైన్లో పూర్తి చేసేందుకు అనుమతించింది. ఆ కోర్సు దేశ, విదేశాల్లో ఎక్కడున్నా నేర్చుకోవచ్చు. గుర్తింపుపొందిన సంస్థ ద్వారా కోర్సు పూర్తి చేస్తే.. ఆ సర్టిఫికెట్ చెల్లుబాటు అయ్యేలా ఉంటుందని స్పష్టం చేసింది. గణితం లేకున్నా... బ్రిడ్జ్ కోర్సు తప్పనిసరి సాధారణంగా ఇంజనీరింగ్‌లో చేరే విద్యార్థులు ఇంటర్మీడియట్‌ను గణితం సబ్జెక్ట్‌తో పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే, ఇతర రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో గణితం లేకుండా సైన్స్ గ్రూపులు కొనసాగుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇంటర్లో గణితం లేకున్నా బయాలజీ, బయోటెక్నాలజీ, బిజినెస్ స్టడీస్, ఇంజనీరింగ్ గ్రాఫిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పూర్తి చేసినవారు ఇంజనీరింగ్‌లో చేరవచ్చు. ఆర్కిటెక్చర్, బయోటెక్నాలజీ, ఫ్యాషన్ టెక్నాలజీ వంటి డిగ్రీ కోర్సులు చేయడానికి ఇంటర్లో గణితం అక్కర్లేదని పేర్కొంది. అయితే, ఇలాంటి విద్యార్థులు ఇంజనీరింగ్‌లో చేరినా, మరే ఇతర కోర్సుల్లో చేరినా ఒక సెమిస్టర్ విధిగా బ్రిడ్జి కోర్సు చేయాలి. దీన్ని ఆయా కాలేజీలే అందించాలి. అయితే ఈ విధానం ప్రస్తుతం తెలుగురాష్ట్రాల్లో అమలయ్యే అవకాశం కన్పించడంలేదని అధికారులు అంటున్నారు. కాగా, ఇంజనీరింగ్‌లో ప్రతీ బ్రాంచ్‌లోనూ రెండు సీట్లను కాలేజీ యాజమాన్యాలు పెంచుకునే స్వేచ్ఛను ఏఐసీటీఈ కల్పించింది. దీనికి ఎలాంటి అనుమతులు అక్కర్లేదని స్పష్టం చేసింది. -
రీ ‘ఇంజనీరింగ్’!
- ఇంజనీరింగ్ కోర్సుల కరిక్యులమ్‌లో సమూల మార్పులు... - అఖిల భారత సాంకేతిక విద్యా మండలి నిర్ణయం - మోడల్ కరిక్యులమ్ సిద్ధం చేస్తున్న ఏఐసీటీఈ - ప్రాజెక్టులకే అధిక ప్రాధాన్యం.. విద్యార్థులపై తగ్గనున్న ఒత్తిడి సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కోర్సుల విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకురావాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) నిర్ణయించింది. ఇందులో భాగంగా మోడల్ కరిక్యులమ్‌ను సిద్ధం చేస్తోంది. త్వరలోనే దీన్ని ఖరారు చేయనుంది. ప్రాజెక్టు కార్యకలాపాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చేలా సిలబస్‌లో సమూల మార్పులు తీసుకురాబోతోంది. థియరీ విభాగాన్ని తగ్గించి ప్రాజెక్టులు, ప్రాక్టికల్స్‌ను ఎక్కువగా ప్రవేశపెట్టడం ద్వారా విద్యార్థులపైనా ఒత్తిడిని తగ్గించవచ్చని యోచిస్తోంది. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు పెరిగేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని భావిస్తోంది. దేశవ్యాప్తంగా దాదాపు 7 వేల ఇంజనీరింగ్ కాలేజీల్లో ఏటా 15 లక్షల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నా ఉద్యోగ అవకాశాలు మాత్రం 40 శాతానికి మించడం లేదు. విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్‌తోపాటు సబ్జెక్టు పరమైన జ్ఞానం పెద్దగా లేకపోవడమే ఇందుకు కారణంగా ఏఐసీటీఈ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇచ్చేలా కొత్త సిలబస్‌ను తీసుకువచ్చేందకు చర్యలు చేపట్టింది. ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరే విద్యార్థులకు ఇండక్షన్ ట్రైనింగ్‌ను ప్రవేశ పెట్టేందుకు చర్యలు చేపట్టింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి.. దేశవ్యాప్తంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి కరిక్యులమ్‌లో మార్పులను పక్కాగా అమలు చేసేందుకు ఏఐసీటీఈ కసరత్తు చేస్తోంది. థియరీ పరీక్షల్లోనూ క్రెడిట్స్‌ను (మార్కులకు పాయింట్లు) తగ్గించి, ప్రాజెక్టులకే క్రెడిట్స్‌ను పెంచేలా కొత్త కరిక్యులమ్‌ను సిద్ధం చేస్తోంది. ఇది ట్రైనింగ్ ఓరియెంటెడ్‌గా, డిజైన్ ఓరియెంటెడ్‌గా ఉంటుంది. ఈ మేరకు సమగ్ర వివరాలను త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు ఏఐసీటీఈ ఏర్పాట్లు చేస్తోంది. విశ్లేషణ సామర్థ్యాలు పెంపు, ల్యాబ్‌లలో శిక్షణ, ప్రాక్టికల్స్, డిజైన్, డెవలప్మెంట్ యాక్టివిటీస్ ప్రధానంగా కొత్త కరిక్యులమ్‌ను ప్రస్తుతం వివిధ సబ్జెక్టుల్లో 12 కమిటీలు రూపొందిస్తున్నాయి. రాష్ట్రాలకు 20% వెసులుబాటు జాతీయ స్థాయిలో ఒకేలా సిలబస్ ఉండేలా ఏఐసీటీఈ చర్యలు చేపట్టినా, రాష్ట్రాలకు 20 శాతం వెసులుబాటు కల్పించేందుకు ఆలోచనలు చేస్తోంది. రాష్ట్రాల్లో పరిస్థితులు, స్థానిక అవసరాలకు అనుగుణంగా కరిక్యులమ్‌లో మార్పులు చేసుకునే వీలు కల్పించేలా చర్యలు చేపడుతోంది. కొన్ని రాష్ట్రాల్లో అగ్రికల్చర్‌కు సంబంధించిన అంశాల్లో ప్రాధాన్యం ఉండగా, కొన్ని రాష్ట్రాల్లో ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఇంకొన్ని రాష్ట్రాల్లో టెక్స్టైల్ టెక్నాలజీకి ప్రా«ధాన్యం ఉంది. ఆయా రాష్ట్రాలు ఆయా రంగాలకు సంబంధించిన సిలబస్‌లో 20 శాతం వరకు మార్పులు చేసుకునే వీలు కల్పించాలని నిర్ణయించింది. -
క్రమంగా ఇంజనీరింగ్ సీట్ల కోత!
- రెండేళ్లలో తగ్గిన సుమారు 70 వేల సీట్లు - నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే... సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు క్రమంగా తగ్గుతున్నాయి. నాణ్యత ప్రమాణాలు లేకపోవడం, అర్హతగలఫ్యాకల్టీ కొరత, మెరుగైన విద్యను అందిస్తేనే సహిస్తామంటున్న ప్రభుత్వ విధానాల నేపథ్యంలో రెండేళ్లుగా ఇంజనీరింగ్ సీట్లు త గ్గిపోతున్నాయి. రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో కొన్ని సీట్లను యాజమాన్యాలే తగ్గించుకుంటుండగా మరికొన్నింటికి వర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇచ్చేప్పుడు కోత పెడుతున్నాయి. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఇంకొన్నింటికి అనుమతులను నిలిపేస్తోంది. దీంతో రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్ల సంఖ్య తగ్గిపోతోంది. 2014-15 విద్యా సంవత్సరంలో 2,09,530 సీట్లకు అనుమతులిచ్చిన ఏఐసీటీఈ...కొన్ని కాలేజీల్లో లోపాల కారణంగా అనుమతులు నిరాకరిస్తూ 2015-16 విద్యా సంవత్సరంలో 1,80,583 సీట్లకే అనుమతులిచ్చింది. త్వరలో ప్రారంభం కానున్న 2016-17 విద్యా సంవత్సరంలో సీట్ల సంఖ్యను 1,41,513కే పరిమితం చేసింది. అంటే గత రెండు విద్యా సంవత్సరాల్లో దాదాపు 70 వేల సీట్లకు కోత పెట్టింది. అనుబంధ గుర్తింపు క్రమంలో భారీగా కోత రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో నాణ్యత ప్రమాణాలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. ప్రమాణాలు పాటించే కాలేజీలకే అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు పక్కా చర్యలు చేపడుతోంది. ఫ్యాకల్టీ, లేబొరేటరీలు, కంప్యూటర్లు తదితర సౌకర్యాలు ఉన్న కాలేజీలకే అనుమతులిచ్చే ప్రక్రియను పకడ్బందీగా అమలు చేస్తోంది. గత రెండేళ్లుగా ఈ చర్యలను ముమ్మరం చేసింది. దీంతో చాలా కాలేజీలు గాడిన పడ్డాయి. లోపాలను సరిదిద్దుకోని కాలేజీల్లో అనుబంధ గుర్తింపునిచ్చే యూనివర్సిటీలే భారీ మొత్తంలో సీట్లకు కోత పెట్టడం ప్రారంభించాయి. సదుపాయాల మేరకే అనుమతులిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో 95 శాతం ఇంజనీరింగ్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే (అఫిలియేషన్) హైదరాబాద్ జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించింది. 2014-15 విద్యా సంవత్సరంలో 326 కాలేజీల్లో 1,86,240 సీట్లకు అనుమతిచ్చిన జేఎన్టీయూహెచ్ 2015-16 విద్యా సంవత్సరంలో కాలేజీల సంఖ్యను 266కు కుదించడంతోపాటు వాటిల్లో సీట్లను 1,26,468కి కుదించింది. అయినా గత విద్యా సంవత్సరం ప్రవేశాల సందర్భంగా 50 వేల సీట్లు మిగిలిపోయాయి. కన్వీనర్ కోటాలో 55 వేల సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇక మేనేజ్మెంట్ కోటాలో మరో 20 వేల సీట్లను కలిపి మొత్తంగా 75 వేల సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఈసారైతే రాష్ట్రంలో ప్రవేశాలకు అనుమతులు లభించే సీట్ల సంఖ్య 90 వేలలోపే ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఏఐసీటీఈ గుర్తింపు నిరాకరణ, బ్రాంచీల రద్దు వల్ల 10 వేల వరకు సీట్లు రద్దు కాగా, మరో 10 వేల సీట్లకు 58 కాలేజీల యాజమాన్యాలే అనుబంధ గుర్తింపు కోసం జేఎన్టీయూహెచ్కు దరఖాస్తు చేసుకోలేదు. మరోవైపు లోపాలున్న 250 కాలేజీలకు జేఎన్టీయూహెచ్ నోటీసులు జారీ చేయడంతో వాటిల్లోనూ భారీగా సీట్లకు కోత పడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అయితే మరో పది రోజుల్లో ఎన్ని సీట్లు అందుబాటులోకి వస్తాయన్నది అధికారికంగా వెల్లడి కానుంది.