క్రమంగా ఇంజనీరింగ్ సీట్ల కోత! | Gradually cuttings engineering seats! | Sakshi
Sakshi News home page

క్రమంగా ఇంజనీరింగ్ సీట్ల కోత!

Published Tue, May 24 2016 12:27 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM

క్రమంగా ఇంజనీరింగ్ సీట్ల కోత! - Sakshi

క్రమంగా ఇంజనీరింగ్ సీట్ల కోత!

- రెండేళ్లలో తగ్గిన సుమారు 70 వేల సీట్లు
- నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే...
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు క్రమంగా తగ్గుతున్నాయి. నాణ్యత ప్రమాణాలు లేకపోవడం, అర్హతగలఫ్యాకల్టీ కొరత, మెరుగైన విద్యను అందిస్తేనే సహిస్తామంటున్న ప్రభుత్వ విధానాల నేపథ్యంలో రెండేళ్లుగా ఇంజనీరింగ్ సీట్లు త గ్గిపోతున్నాయి. రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో కొన్ని సీట్లను యాజమాన్యాలే తగ్గించుకుంటుండగా మరికొన్నింటికి వర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇచ్చేప్పుడు కోత పెడుతున్నాయి. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఇంకొన్నింటికి అనుమతులను నిలిపేస్తోంది. దీంతో రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్ల సంఖ్య తగ్గిపోతోంది. 2014-15 విద్యా సంవత్సరంలో 2,09,530 సీట్లకు అనుమతులిచ్చిన ఏఐసీటీఈ...కొన్ని కాలేజీల్లో లోపాల కారణంగా అనుమతులు నిరాకరిస్తూ 2015-16 విద్యా సంవత్సరంలో 1,80,583 సీట్లకే అనుమతులిచ్చింది. త్వరలో ప్రారంభం కానున్న 2016-17 విద్యా సంవత్సరంలో సీట్ల సంఖ్యను 1,41,513కే పరిమితం చేసింది. అంటే గత రెండు విద్యా సంవత్సరాల్లో దాదాపు 70 వేల సీట్లకు కోత పెట్టింది.

 అనుబంధ గుర్తింపు క్రమంలో భారీగా కోత
 రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో నాణ్యత ప్రమాణాలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. ప్రమాణాలు పాటించే కాలేజీలకే అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు పక్కా చర్యలు చేపడుతోంది. ఫ్యాకల్టీ, లేబొరేటరీలు, కంప్యూటర్లు తదితర సౌకర్యాలు ఉన్న కాలేజీలకే అనుమతులిచ్చే ప్రక్రియను పకడ్బందీగా అమలు చేస్తోంది. గత రెండేళ్లుగా ఈ చర్యలను ముమ్మరం చేసింది. దీంతో చాలా కాలేజీలు గాడిన పడ్డాయి. లోపాలను సరిదిద్దుకోని కాలేజీల్లో అనుబంధ గుర్తింపునిచ్చే యూనివర్సిటీలే భారీ మొత్తంలో సీట్లకు కోత పెట్టడం ప్రారంభించాయి. సదుపాయాల మేరకే అనుమతులిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో 95 శాతం ఇంజనీరింగ్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే (అఫిలియేషన్) హైదరాబాద్ జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించింది.

2014-15 విద్యా సంవత్సరంలో 326 కాలేజీల్లో 1,86,240 సీట్లకు అనుమతిచ్చిన జేఎన్‌టీయూహెచ్ 2015-16 విద్యా సంవత్సరంలో కాలేజీల సంఖ్యను 266కు కుదించడంతోపాటు వాటిల్లో సీట్లను 1,26,468కి కుదించింది. అయినా గత విద్యా సంవత్సరం ప్రవేశాల సందర్భంగా 50 వేల సీట్లు మిగిలిపోయాయి. కన్వీనర్ కోటాలో 55 వేల సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇక మేనేజ్‌మెంట్ కోటాలో మరో 20 వేల సీట్లను కలిపి మొత్తంగా 75 వేల సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఈసారైతే రాష్ట్రంలో ప్రవేశాలకు అనుమతులు లభించే సీట్ల సంఖ్య 90 వేలలోపే ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

ఇప్పటికే ఏఐసీటీఈ గుర్తింపు నిరాకరణ, బ్రాంచీల రద్దు వల్ల 10 వేల వరకు సీట్లు రద్దు కాగా, మరో 10 వేల సీట్లకు 58 కాలేజీల యాజమాన్యాలే అనుబంధ గుర్తింపు కోసం జేఎన్‌టీయూహెచ్‌కు దరఖాస్తు చేసుకోలేదు. మరోవైపు లోపాలున్న 250 కాలేజీలకు జేఎన్‌టీయూహెచ్ నోటీసులు జారీ చేయడంతో వాటిల్లోనూ భారీగా సీట్లకు కోత పడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అయితే మరో పది రోజుల్లో ఎన్ని సీట్లు అందుబాటులోకి వస్తాయన్నది అధికారికంగా వెల్లడి కానుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement