ఇంజనీరింగ్‌ కోర్సులకు ఏఐసీటీఈ కొత్త నిబంధన | AICTE Guidelines For Engineering Colleges, Tightens Norms | Sakshi
Sakshi News home page

ఇంజనీరింగ్‌ కోర్సులకు ఏఐసీటీఈ కొత్త నిబంధన

Published Fri, Mar 19 2021 7:20 PM | Last Updated on Fri, Mar 19 2021 7:25 PM

AICTE Guidelines For Engineering Colleges, Tightens Norms - Sakshi

సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్‌ కాలేజీల్లో వివిధ కోర్సులకు అనుమతులపై అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) నిబంధనలను కఠినతరం చేసింది. ఈ మేరకు 2021–22 విద్యా సంవత్సరానికి కాలేజీలు, కొత్త కోర్సులకు సంబంధించిన నిబంధనల హ్యాండ్‌బుక్‌లో పలు అంశాలు పొందుపరిచింది. ఇంజనీరింగ్‌ కాలేజీల్లోని వివిధ కోర్సుల్లో ఏఐసీటీఈ అనుమతించిన ఇన్‌టేక్‌ (మొత్తం) సీట్లలో 50 శాతానికి మించి విద్యార్థుల చేరికలు ఉంటేనే కొత్త కోర్సులకు అనుమతి ఇవ్వనున్నారు.

అంతేకాకుండా ప్రస్తుతం ఎక్కువ డిమాండ్‌ ఉన్న ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), డేటా సైన్స్‌ వంటి కోర్సులను ఆయా సంస్థల్లో తగిన సదుపాయాలు, ఇతర వనరులు ఉంటేనే అనుమతిస్తారు. ఈ కోర్సులను ప్రవేశపెట్టాలంటే ఈ సదుపాయాలతోపాటు నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ అక్రిడిటేషన్‌ (ఎన్‌బీఏ) గుర్తింపు ఉండాలని ఏఐసీటీఈ నిబంధన విధించింది. ఎలాంటి సదుపాయాలు కల్పించకుండా ఆషామాషీగా కోర్సులకు అనుమతులు తీసుకొని అడ్మిషన్లు నిర్వహిస్తున్న కాలేజీల వల్ల ప్రమాణాలు దిగజారిపోతుండడంతో ఈసారి అనుమతుల విషయంలో పలు మార్పులు చేసింది. దీని ప్రకారం..

► ఆర్కిటెక్చర్‌ కోర్సుల నిర్వహణకు కౌన్సిల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ అనుమతి తప్పనిసరి. అలాగే ఫార్మసీ కోర్సులకు ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా అనుమతి తప్పనిసరి.
► ప్రైవేటు కాలేజీల తనిఖీ కోసం వసూలు చేసే టీఈఆర్‌ చార్జీల నుంచి ప్రభుత్వ ఆర్థిక సాయంతో నడిచే సంస్థలకు మినహాయింపు ఉంటుంది. ఇతర సంస్థలు ఒక దఫాకు రూ.లక్ష చెల్లించాలి. గతంలో ఇది రూ.2 లక్షలుగా ఉండేది.

► డిప్లొమా స్థాయి కోర్సులను డిగ్రీ స్థాయి కోర్సులుగా మార్చుకునేందుకు అవకాశం.
► ప్రస్తుత ఇంజనీరింగ్‌ టెక్నాలజీ కాలేజీల్లో కొత్త ప్రోగ్రాములకు మల్టీ డిసిప్లినరీ విభాగాల్లో మాత్రమే అనుమతిస్తారు.
► విద్యార్థులు, బోధన సిబ్బంది అంతర్గత బదలాయింపులను అనుమతించరు. ఒకే మాతృ సంస్థ పరిధిలోని సంస్థల విలీనమైతే మాత్రం అక్కడి మౌలిక సదుపాయాలు, ఇతర అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ బదలాయింపును అనుమతిస్తారు.

► విదేశీ విద్యార్థులు, ప్రవాస భారతీయులు, గల్ఫ్‌ దేశాల్లోని భారతీయ కార్మికుల పిల్లల కోసం సూపర్‌ న్యూమరరీ సీట్లను అనుమతిస్తారు. 
► ప్రాంతీయ భాషల్లో నిర్వహించే సంప్రదాయ ఇంజనీరింగ్‌ కోర్సుల ఇన్‌టేక్‌ను పెంచుకునేందుకు అవకాశం.
► సంబంధిత విద్యాసంస్థలో మొత్తం ఇన్‌టేక్‌ సీట్ల (2019–20)లో 50 శాతానికి పైగా భర్తీ అయితే కొత్త కోర్సులకు అనుమతి. 

► విదేశీ యూనివర్సిటీలు, విద్యాసంస్థలతో కలిసి ట్విన్నింగ్‌ తదితర ప్రోగ్రామ్స్‌ నిర్వహించాలంటే క్యూఎస్‌ వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో ఆ సంస్థలు టాప్‌ 500ల్లో ఉండాలి. దేశంలోని సంస్థలు నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌) ర్యాంకింగ్‌లో టాప్‌ 100లో ఉండాలి. అంతేకాకుండా ఎన్‌బీఏ అక్రిడిటేషన్‌ కలిగి ఉండాలి.

ఆంధ్రప్రదేశ్‌లో ముందు నుంచే ఉన్నత విద్య ప్రవేశాల్లో సంస్కరణలు
కాగా.. రాష్ట్రంలో విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నత విద్యా సంస్థల్లో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పేలా తొలి నుంచి అనేక చర్యలు చేపట్టారు. ఉన్నత విద్యా పర్యవేక్షణ నియంత్రణ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఉన్నత విద్యామండలిని మరింత పటిష్టపరిచారు. ప్రమాణాలు లేని, పూర్తి చేరికలు లేక తూతూమంత్రంగా నిర్వహించే కాలేజీలను గుర్తించి.. వారికి లోపాలను సవరించుకునేందుకు ఉన్నత విద్యామండలి కొంత సమయం ఇచ్చింది. లోపాలు సరిదిద్దుకోని వాటిలో ప్రవేశాలను నిలిపేసింది.

ఇంజనీరింగ్, ఫార్మసీ, డీఫార్మా కోర్సుల్లో జీరో అడ్మిషన్లున్న 53 కాలేజీలకు, నిర్ణీత రుసుములు చెల్లించని 82 కాలేజీలకు 2020–21 విద్యాసంవత్సరం అడ్మిషన్లను ఆపేసింది. అలాగే నాన్‌ ప్రొఫెషనల్‌ కోర్సులకు సంబంధించి ప్రమాణాలు పాటించని కాలేజీలపైనా చర్యలు తీసుకుంది. జీరో నుంచి 25 శాతంలోపు అడ్మిషన్లున్న 48 కాలేజీల అనుమతులను ఉపసంహరించారు. కొన్నిటిలో కోర్సుల అనుమతులను రద్దు చేశారు. 

చదవండి:
మతి చెడగొడుతున్న సెల్‌ఫోన్‌

ఏపీ: ప్రకాశం జిల్లాలో 34 బ్యాక్‌లాగ్‌ ఖాళీలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement