data science
-
టెకీలకు గుడ్‌న్యూస్.. 2 లక్షల మందికి ట్రైనింగ్
క్లౌడ్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఇతర ఎమర్జింగ్ టెక్నాలజీలలో భారత్‌లోని 2 లక్షల మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఒరాకిల్ ప్రకటించింది. ఇందులో భాగంగా ఒరాకిల్, తమిళనాడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆ రాష్ట్రంలోని విద్యార్థులకు ఉపాధి ఆధారిత శిక్షణను అందించడానికి ‘నాన్ ముదల్వన్’ కింద ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించాయి.పెరుగుతున్న యువ జనాభా ఉన్న భారత్‌లోని టాప్ 12 రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. యువత, యువ ప్రొఫెషనల్స్ తమను తాము మెరుగుపరుచుకోవడానికి, కెరీర్ లక్ష్యాలను సాధించడానికి ఒక వేదికను అందించే బాధ్యతలో భాగంగా నాన్ ముదల్వన్ను ప్రారంభించినట్లు టీఎన్ఎస్డీసీ ఎండీ జె ఇన్నోసెంట్ దివ్య చెప్పారు.ఒరాకిల్ సర్టిఫికేషన్‌ను ప్రొఫెషనల్స్‌కు ఇండస్ట్రీ స్టాండర్డ్‌గా గుర్తిస్తారని, ఇది జ్ఞానాన్ని పెంచడమే కాకుండా, కంపెనీలు కోరుకునే నైపుణ్యాలను కూడా ధ్రువీకరిస్తుందని ఒరాకిల్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ప్రాంతీయ ఎండీ శైలేందర్ కుమార్ అన్నారు. దీంతో ఉద్యోగ అవకాశాలు, స్థిరత్వం పెరుగుతాయన్నారు. -
9 ఏళ్లలో 75 కాలేజీలు మూత!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్య ప్రతి ఏటా తగ్గుతోంది. జిల్లాల్లోని కాలేజీల్లో విద్యార్థులు చేరడానికి ఆసక్తి చూపకపోవడంతో మూతపడుతున్నాయి. కొన్ని రాజధాని పరిసర ప్రాంతాలకు మారుతున్నాయి. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో ఈ ఏడాది ఎన్ని కాలేజీలు ఉంటాయనేది అధికార వర్గాలే స్పష్టత ఇవ్వడం లేదు. కనీస స్థాయి విద్యార్థుల ప్రవేశాలు లేని కాలేజీలు కౌన్సెలింగ్‌లో నిలబడటం కష్టమనే వాదన వినిపిస్తోంది. ప్రతి ప్రైవేటు కాలేజీకి సంబంధిత విశ్వవిద్యాలయాలు అనుబంధ గుర్తింపు ఇవ్వాలి. ఈ సంవత్సరం ఈ ప్రక్రియ ఇంతవరకూ మొదలవ్వలేదు. ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ద్వారా కాలేజీల తనిఖీలు చేపట్టాలనే యోచనలో ఉంది. దీంతో యూనివర్సిటీలు అఫ్లియేషన్ విధానాన్ని మొదలు పెట్టలేదు. మరోవైపు ఎక్కువ కాలేజీలు డిమాండ్ లేని బ్రాంచీల్లో సెక్షన్లు, సీట్ల తగ్గింపునకు దరఖాస్తు చేసుకున్నాయి. మౌలిక సదుపాయాలు అన్నీ ఉంటేనే గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఈ సంవత్సరం రాష్ట్రంలో ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు, ఎన్ని సీట్లు ఉంటాయనేది ఇప్పటివరకు స్పష్టత కరువైంది. ఏటా తగ్గుతున్న కాలేజీలు... హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని ఇంజనీరింగ్ కాలేజీలు మినహా, జిల్లాల్లోని కాలేజీలు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. దీంతో అనివార్యంగా మూతపడే పరిస్థితి కన్పిస్తోంది. 2014లో రాష్ట్రంలో 234 ఇంజనీరింగ్ కాలేజీలుంటే, 2023 కౌన్సెలింగ్ నాటికి ఈ సంఖ్య 159కి పడిపోయింది. తొమ్మిదేళ్ల కాలంలోనే దాదాపు 75 ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడ్డాయి. 2017 నుంచి కాలేజీలు కనుమరుగవ్వడం ఎక్కువైంది. నిజామాబాద్, నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో కంప్యూటర్ సైన్స్ సీట్లల్లో తప్ప, ఇతర బ్రాంచీల్లో పది మంది కూడా చేరే పరిస్థితి కనిపించడం లేదు. పలు జిల్లాలకు చెందిన కాలేజీ యాజమాన్యాలు దాదాపు 15 కాలేజీలను హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మార్చుకునేందుకు దరఖాస్తులు పెట్టాయి. మరో పది కాలేజీలు ఈసారి అఫ్లియేషన్ నిబంధనలకు దూరంగా ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. విద్యార్థుల విముఖతే సమస్య.. జిల్లాల్లోని ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు ఎక్కువగా ఇష్టపడటం లేదు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ), డేటాసైన్స్, ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులపైనే ఆసక్తి చూపుతున్నారు. ఈ సీట్లను పెంచుకునేందుకు జిల్లా కాలేజీలకు అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. మౌలిక సదుపాయాలు సమకూర్చుకోవడం, డిమాండ్ ఉన్న కోర్సుల్లో అధ్యాపకుల కొరత సమస్య కాలేజీలను వేధిస్తోంది. మేనేజ్మెంట్ కోటా సీట్లకు రాజధాని పరిసర ప్రాంతాల్లో ఉన్న డిమాండ్ జిల్లాల్లో ఉండటం లేదు. ఈ కారణంగా కాలేజీల నిర్వహణ అతికష్టంగా ఉందని యాజమాన్యాలు అంటున్నాయి. దీనికి తోడు విద్యార్థులు కూడా ఇంజనీరింగ్ తర్వాత తక్షణ ఉపాధి కోరుకుంటున్నారు. ఆలోచనల్లో మార్పు విద్యార్థులు ఎక్కువగా కంప్యూటర్ కోర్సులను ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం వీటికే మార్కెట్ ఉందని భావిస్తున్నారు. దీంతోపాటు హైదరాబాద్‌లో ఉంటే ఇంజనీరింగ్ తర్వాత ఉద్యోగాలు తెచ్చుకోవడం సులభమనే ఆలోచనలతో ఉన్నారు. ఈ పరిణామాలు గ్రామీణ ప్రాంతాల్లో ఇంజనీరింగ్ కాలేజీల నిర్వహణను కష్టంగా మారుస్తున్నాయి. అన్ని బ్రాంచీల్లోనూ సరికొత్త సాంకేతిక బోధన విధానం తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. –ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి (ఉన్నత విద్యా మండలి చైర్మన్) -
చదువు పూర్తయిందా.. ఉద్యోగం కావాలా..? ఇదే బెస్ట్ ఛాయిస్..
ఇంజినీరింగ్ పూర్తయిన వెంటనే ఉద్యోగం సంపాదించాలని అనుకుంటారు. కానీ ఎంచుకున్న రంగంలో ఏ విభాగంలో డిమాండ్ ఉందో తెలుసుకోలేక నష్టపోతుంటారు. పెరుగుతున్న టెక్నాలజీ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఏ విభాగంలో ఎక్కువ కొలువులు రానున్నాయో నిపుణులు కొన్ని సూచనలు ఇస్తున్నారు. చదువు అయిపోయాక ఉపాధి అవకాశాలు లభించాలంటే విద్యను అభ్యసిస్తున్నపుడే సృజనాత్మక ఆలోచనలు, కృత్రిమమేధ, డేటాసైన్స్ సబ్జెక్టులపై పట్టు సాధించాలని నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలో ఏటా 1.10 లక్షల మంది ఇంజినీరింగ్ పట్టా తీసుకుంటుండగా... ఇందులో చాలా శాతం మంది ఉద్యోగాలు సాధించడం లేదు. సొంతంగా అంకుర సంస్థలను స్థాపించేందుకు కొద్దిమందే ముందుకొస్తున్నారు. కృత్రిమ మేధ, డేటా సైన్స్‌లో పరిశోధనలు.. విదేశాల్లో కృత్రిమ మేధ, డేటా సైన్స్, ఆటోమేషన్ అంశాలపై అధికంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అందులో విభిన్నమైన ఉత్పత్తులను తయారుచేస్తున్నారు. ఓ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల సంస్థ కొద్ది నెలల కిందట కృత్రిమ మేధతో అనుసంధానమైన స్మార్ట్‌ఫ్రిజ్‌ను అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, ఐరోపా దేశాల్లో ఆవిష్కరించింది. ఇదీ చదవండి: 4వేలకు పైగా కార్లు వెనక్కి.. సమస్య ఏమిటంటే.. ఒక సాంకేతిక పరికరాన్ని ఫ్రిజ్‌లో అమర్చితే చాలు అందులోని కూరగాయలు ఏ రోజు వండుకోవాలో చెబుతుంది. పండ్లు, ఇతర సామగ్రి ఖాళీ అవుతున్నప్పుడు దానంటదే ఆన్లైన్లో ఆర్డర్ చేస్తుంది. ఇలాంటి ఆలోచనలు, సాఫ్ట్వేర్లు ఇతర రంగాలకూ అవసరం. వీటితో పాటు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ద్వారా చాలా మార్పులు రానున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి టెక్నాలజీకి సంబంధించిన అంశాలను విద్యను అభ్యసిస్తున్నపుడే నేర్చుకుంటే చదువు అయిపోయాక వెంటనే కొలువు దొరికే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. -
హైదరాబాద్‌లో స్విమ్‌లేన్ కేంద్రం ప్రారంభం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సేవలందించే స్విమ్‌లేన్.. హైదరాబాద్‌లో ప్రాంతీయ సైబర్‌సెక్యూరిటీ ఇన్నోవేషన్‌తోపాటు ఆర్ అండ్ డీ సెంటర్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రారంభించిన ప్రొడక్ట్ డెవలప్మెంట్ హబ్ ‘కొత్త లొకేషన్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఫంక్షన్లకు వ్యూహాత్మక హబ్‌గా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇంజినీరింగ్, కస్టమర్లకు ప్రత్యేక సేవలు అందించేలా ఈ సెంటర్‌ను నెలకొల్పినట్లు’ స్విమ్‌లేన్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఫ్రాన్స్ జేవియర్ అన్నారు. ఈ సెంటర్లో ప్రస్తుతం 75 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా, వచ్చే ఏడాది చివరినాటికి సిబ్బంది సంఖ్యను 200కి పెంచేలా లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. హైదరాబాద్ సెంటర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సామర్ధ్యంతో సామర్థ్యాలతో స్విమ్‌లేన్ టర్బైన్ తక్కువ-కోడ్ సెక్యూరిటీ ఆటోమేషన్ ప్లాట్‌ఫారమ్‌ను మరింత అభివృద్ధి చేస్తుంది. సెక్యూరిటీ అలర్ట్ , డేటా ఓవర్‌లోడ్, దీర్ఘకాలిక సిబ్బంది కొరతను అధిగమించేలా ప్రపంచవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ బృందాలకు సహాయం చేస్తున్నట్లు ఆ సంస్థ సీఈవో ఫ్రాన్స్ జేవియర్ వెల్లడించారు. పెరిగిపోతున్న డిమాండ్‌కు అనుగుణంగా భారత్ అన్నీ రంగాల్లో అభివృద్ది పథం వైపు దూసుకెళ్తుంది. అపారమైన నైపుణ్యం కలిగిన వనరులకు కొదువలేదని ఫ్రాన్స్ జేవియర్ కొనియాడారు. 2027 నాటికి భారత్‌లో సైబర్సైక్యూరిటీ మార్కెట్ 3.5 బిలియన్ డాలర్లకు చేరుకుంటున్నదన్న అంచనాతో ఇక్కడ మరో ఆర్ అండ్ డీ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని గతంలోనే నిర్ణయించినట్టు తెలిపారు. -
చాట్ జీపీటీ విద్యారంగం పూర్తిగా మారబోతుంది..
-
డేటా సైన్స్ నిపుణులకు తీవ్ర కొరత
ముంబై: దేశంలో డేటాసైన్స్ నిపుణులకు తీవ్ర కొరత నెలకొంది. ఎడ్టెక్ కంపెనీ ‘గ్రేట్ లెరి్నంగ్’ ఒక అధ్యయనం నిర్వహించగా.. కంపెనీల హైరింగ్ మేనేజర్లలో (నియామకాలను చూసేవారు) 92 శాతం మంది డేటా సైన్స్ నిపుణుల విషయంలో డిమాండ్–సరఫరా మధ్య భారీ అంతరం ఉన్నట్టు చెప్పారు. 57 శాతం మంది ప్రారంభస్థాయి నిపుణుల విషయంలో అంతరం ఉందని చెప్పగా.. 27 శాతం మంది మేనేజర్లు మధ్యస్థాయి ఉద్యోగాలైన టీమ్‌లీడ్ (బృంద నాయకులు), ప్రాజెక్ట్ మేనేజర్ నిపుణుల విషయంలో కొరత ఉన్నట్టు తెలిపారు. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (ఎన్ఎల్పీ) నైపుణ్యాలకు కొరత ఉందని 15 శాతం మంది హైరింగ్ మేనేజర్లు తెలిపారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ నిపుణుల కొరత ఉందని 12 శాతం మంది మేనేజర్లు చెప్పారు. ఆ తర్వాత ఆటోమేషన్, కంప్యూటర్ విజన్, అనలైటిక్స్ నిపుణుల సరఫరా తగినంత లేదని మేనేజర్లు పేర్కొన్నారు. 100కు పైగా కంపెనీలకు చెందిన హెచ్ఆర్ మేనేజర్ల అభిప్రాయాలను ఈ అధ్యనంలో భాగంగా గ్రేట్ లెరి్నంగ్ తెలుసుకుంది. ‘‘ప్రతీ పరిశ్రమ డిజిటల్ దిశగా మారిపోతోంది. డేటా సైన్స్ కార్యకలాపాల్లో భాగమైన ఎన్ఎల్పీ, ఏఐఎంఎల్, బిగ్‌డేటా, ఆటోమేషన్‌కు డిమాండ్ అధిక స్థాయిల్లో ఉంది. ఈ నూతన అవకాశాలను సొంతం చేసుకునేందుకు వీలుగా మన విద్యా ప్రమాణాలను మెరుగుపరచుకోవడంతోపాటు.. ఉద్యోగులకు శిక్షణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది’’ అని గ్రేట్ లెరి్నంగ్ సహ వ్యవస్థాపకుడు హరి కృష్ణన్ నాయర్ తెలిపారు. డేటా సైన్స్ నిపుణుల నియామకాల్లో బెంగళూరు టాప్‌లో ఉండగా.. తర్వాత హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. -
బీఎస్సీ డేటా సైన్స్ ఈ కోర్సు కిరాక్
సాక్షి, హైదరాబాద్: ఇటీవలి కాలంలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో డేటా సైన్స్ కోసం విద్యార్థులు విపరీతంగా పోటీ పడుతున్నారు. మెరుగైన ఉపాధి కల్పించే కోర్సుగా దీనిని భావిస్తుండటమే ఇందుకు కారణం. తాజాగా చేపట్టిన మొదటి దశ ఎంసెట్ కౌన్సెలింగ్‌లో 3,229 డేటా సైన్స్ సీట్ల భర్తీకి దాదాపు 20 వేల మందికి పైగా ఆప్షన్లు ఇవ్వడం దీని డిమాండ్‌ను స్పష్టం చేస్తోంది. దీంతో ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు సీటుకు రూ.10 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఇంజనీరింగ్ డేటా సైన్స్ కన్నా బీఎస్సీ డేటా సైన్స్ మెరుగైనదని ఉన్నత విద్యామండలి స్పష్టం చేస్తోంది. గతేడాదే డిగ్రీలో దీన్ని ప్రవేశపెట్టగా ఈ సంవత్సరం దీనికి మరిన్ని మెరుగులు దిద్దారు. అప్పట్లోనే దాదాపు 7 వేల సీట్లు అందుబాటులోకి వచ్చాయి. కానీ సరైన ప్రచారం లేకపోవడంతో విద్యార్థులు ఈ కోర్సును పట్టించుకోవడం లేదని, ప్రాధాన్యతను గుర్తించడం లేదని అధికారులు చెబుతున్నారు. ఇంజనీరింగ్‌పై తరగని మోజు కూడా ఇందుకు కారణమవుతోందని అంటున్నారు. రూ.లక్షలు వెచ్చించి ఇంజనీరింగ్ చేసే బదులు బీఎస్సీ డేటా సైన్స్ చేస్తే మెరుగైన ఉపాధి పొందవచ్చని స్పష్టం చేస్తున్నారు. ఎంఎన్సీల ప్రత్యేక శిక్షణ ఇంజనీరింగ్ డేటా సైన్స్ నాలుగేళ్ల కోర్సు అయితే బీఎస్సీ డేటా సైన్స్ మూడేళ్ల కోర్సే. ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసిన తర్వాత విద్యార్థి మార్కెట్‌కు తగినవిధంగా ఇతర అప్లికేషన్లు నేర్చుకోవాల్సి ఉంటుంది. క్యాంపస్ రిక్రూట్మెంట్ సాధ్యం కాకపోతే ఈ దిశగా విద్యార్థి కొంత శ్రమ పడాల్సి ఉంటుంది. బీఎస్సీ డేటా సైన్స్ కోర్సులో మొదటి సంవత్సరం నుంచే బహుళజాతి సంస్థల ప్రతినిధులు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఈ మేరకు పలు సంస్థలతో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఒప్పందం కుదుర్చుకుంది. టీసీఎస్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ సహా మొత్తం 25 కంపెనీలు కన్సార్షియంగా ఏర్పడ్డాయి. ఆ సంస్థల్లో పనిచేసేందుకు ఎలాంటి శిక్షణ కావాలో ఆ శిక్షణను విద్యార్థి దశ నుంచే ఆయా కంపెనీలు అందిస్తాయి. మార్కెట్ ట్రెండ్‌ను అనుసరించి మాడ్యూల్స్ మార్కెట్ ట్రెండ్‌ను అనుసరించి సరికొత్త మాడ్యూల్స్‌ను కార్పొరేట్ కంపెనీలు రూపొందించి బీఎస్సీ డేటా సైన్స్ విద్యార్థులకు పంపుతాయి. జావా, పైతాన్‌తో పాటు పలు రకాల టూల్స్‌ను ఆయా సంస్థలు నేర్పిస్తాయి. వీటిపై లేబొరేటరీల్లో ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహిస్తారు. దీంతో పాటు సంస్థల నేతృత్వంలోనే మూడేళ్ళ పాటు మినీ ప్రాజెక్టులు చేపడతారు. దీంతో బీఎస్సీ డేటా సైన్స్ కోర్సు పూర్తయ్యే నాటికే విద్యార్థికి పూర్తి స్థాయి నైపుణ్యం ఉంటుందని ఉన్నత విద్యా మండలి తెలిపింది. కంపెనీల అవసరాలకు సరిపడే కోర్సు బీఎస్సీ డేటా సైన్స్ కోర్సును కంపెనీల అవసరాలకు అనుగుణంగా రూపొందిం చాం. డిగ్రీని చులకన చేసే పరిస్థితులను మార్చాలన్నదే లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న సాంకేతిక మార్పులను గుర్తించి, వాటిపై బహుళజాతి కంపెనీలు ఎప్పటికప్పుడు శిక్షణ ఇస్తాయి. దీంతో డిగ్రీ పూర్తవ్వడంతోనే మెరుగైన వేతనాలతో విద్యార్థులు స్థిరపడే వీలుంది. – లింబాద్రి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ బీఎస్సీ విద్యార్థుల్లో విశ్వాసం పెరిగింది గతంతో పోలిస్తే బీఎస్సీ డేటా సైన్స్ విద్యార్థుల్లో విశ్వాసం పెరిగింది. తొలిదశ నుంచే పైతాన్, జావాతో పాటు అనేక కొత్త అప్లికేషన్లపై అవగాహన పెంచుకుంటున్నారు. కంప్యూటర్ ఇంజనీరింగ్ విద్యార్థులతో ఏమాత్రం తీసిపోని రీతిలో సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకుంటున్నారు. – ప్రొఫెసర్ శ్యామల, కంప్యూటర్ సైన్స్ అధ్యాపకురాలు, ఓయూ క్యాంపస్ నియామకాల్లో వీళ్లకే చోటు బీఎస్సీ డేటా సైన్స్ విద్యార్థులను కన్సార్షియం సంస్థలు పూర్తిగా తాము తయారు చేసుకున్న మానవ వనరులుగానే భావిస్తాయి. ఉమ్మడి ప్రణాళికతో తమ అవసరాలకు అనుగుణంగా సాంకేతిక శిక్షణ ఇవ్వడం వల్ల ఉమ్మడిగా జాతీయ స్థాయిలో పరీక్ష నిర్వహిస్తారు. ఈ ఒక్క పరీక్షలో ర్యాంకు సాధిస్తే 25 కంపెనీల్లో ఇతర పరీక్షలు లేకుండా ఉపాధి పొందే వీలుంది. డిగ్రీ విద్యార్థులు స్థిరంగా ఒకే కంపెనీలో ఎక్కువ కాలం ఉండే వీలుందని ఇటీవలి విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి. దీన్ని పరిగణనలోనికి తీసుకుని క్యాంపస్ నియామకాల్లో ఇంజనీరింగ్ డేటా సైన్స్ కన్నా, బీఎస్సీ డేటా సైన్స్ పూర్తి చేసిన వారికే ప్రాధాన్యం ఇవ్వాలని కంపెనీల ప్రతినిధులు భావిస్తున్నారు. -
డేటా అనలిస్టులకు ఎంఎన్సీల బంపర్ ఆఫర్స్
డేటా సైన్స్.. బిగ్ డేటా.. డేటా అనలిటిక్స్.. ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైన విభాగాలు! కారణం.. డేటాకు ఎనలేని ప్రాధాన్యం పెరగడమే!! నేటి ఈ కామర్స్ ప్రపంచంలో డేటా భారీగా తయారవుతోంది. ఈ డేటా తిరిగి మళ్లీ బిజినెస్ నిర్ణయాలకు దోహదపడుతోంది. విస్తృతమైన డేటాను విశ్లేషించి.. ఉపయుక్తమైన ప్యాట్రన్స్ గుర్తించి.. దాని ఆధారంగా కంపెనీలు కీలకమైన వ్యాపార నిర్ణయాలు తీసుకుంటున్నాయి. దాంతో డేటా విశ్లేషణ నైపుణ్యం ఉన్న నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. ఫలితంగా ఐటీ, కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్ అభ్యర్థులకు డేటా అనలిటిక్స్ అద్భుతమైన కెరీర్ అవకాశంగా మారుతోంది. ఈ నేపథ్యంలో.. డేటా అనలిస్టుల విధులు, అవసరమైన అర్హతలు, నైపుణ్యాలు, అందుబాటులో ఉన్న ఉద్యోగావకాశాలపై ప్రత్యేక కథనం... అపరిమితమైన, విస్తృతంగా ఉండే సమాచారాన్ని బిగ్ డేటా అంటారు. ఇది చాలా సంక్షిష్టంగా ఉంటుంది. రోజురోజుకూ భారీగా పోగవుతున్న ఇలాంటి టెరాబైట్ల డేటా నుంచి బిజినెస్ నిర్ణయాలకు అవసరమైన ఉపయుక్త సమాచారాన్ని, ప్యాట్రన్స్(నమూనాలు)ను గుర్తించి,సంగ్రహించే టెక్నిక్ లేదా టెక్నాలజీనే డేటా అనలిటిక్స్ అంటున్నారు. డేటా అనలిటిక్స్ నిపుణులు.. క్లిష్టమైన భారీ స్థాయిలో ఉండే డేటాను విశ్లేషించి.. అందులోంచి ఉపయోగకరమైన సమాచారాన్ని వెలికి తీసి.. ఆయా కంపెనీలు సరైన వ్యాపార నిర్ణయం తీసుకునేలా సహకరిస్తారు. డేటా అనలిస్ట్‌లు డేటా సేకరణ, సంగ్రహణ, విశ్లేషణను విజయవంతంగా, ఖచ్చితత్వంతో పూర్తిచేసే నైపుణ్యాలు కలిగి ఉంటారు. సేకరణ.. విశ్లేషణ ► గూగుల్, ఫేస్బుక్, అమెజాన్ వంటి టాప్ కంపెనీలెన్నో డేటాను భద్రపరిచేందుకు డేటా సెంటర్స్ నిర్వహిస్తున్నాయి. కస్టమర్స్ ఎలాంటి వస్తువులు కొంటున్నారు.. వేటికోసం ఆన్లైన్లో వెతుకుతున్నారు.. వారి ఆసక్తులు, అభిరుచులు.. ఇలాంటి సమాచారాన్ని సంస్థలు సేకరించి భద్రపరుస్తుంటాయి. అవసరమైనప్పుడు మళ్లీ ఈ డేటాను బయటకు తీసి.. సాంకేతిక పద్ధతుల ద్వారా విశ్లేషించి.. వినియోగదారుల అవసరాలు, అంచనాలకు తగ్గ వస్తు,సేవలను అందించేందుకు ప్రయత్నిస్తాయి. తద్వారా వ్యాపార విస్తరణలో ముందుంటాయి. ► డేటా అనలిటిక్స్ నిపుణులు.. భద్రపరిచిన డేటా నుంచి ఉపయుక్తమైన ప్యాట్రన్లను గుర్తించి విశ్లేషిస్తారు. తద్వారా కంపెనీలు మరింత సమర్థమైన వ్యాపార నిర్ణయాలు తీసుకునేందుకు దోహదపడతారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఉపయుక్తమైన డేటాను గుర్తించడం, సేకరించడం, విశ్లేషించడం, విజువలైజ్ చేయడం, కమ్యూనికేట్ చేయడంతోపాటు మార్కెట్‌ని అధ్యయనం చేయడం బిగ్ డేటా అనలిస్ట్ ప్రధాన బాధ్యతలుగా చెప్పొచ్చు. విభిన్న నైపుణ్యాలు బిగ్ డేటా నిపుణుడు ఏకకాలంలో వివిధ పాత్రలను పోషించాల్సి ఉంటుంది. నిత్యం అధ్యయనం చేయడం.. వివిధ రంగాల్లో, వివిధ రూపాల్లో ఉన్న డేటాను సేకరించడం(డేటా మైనింగ్).. డేటాను స్టోర్ చేయడం.. అవసరమైనప్పుడు సదరు డేటాను విశ్లేషించే నైపుణ్యం ఎంతో అవసరం. వినియోగదారులను ఆకట్టుకునేలా ఓ వ్యాపారాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో డేటా ఆధారితంగా ఆలోచించి, తార్కికంగా ప్రజెంట్ చేయగలగాలి. అందుకోసం డేటా అనలిస్టులకు సమస్యా పరిష్కార నైపుణ్యాలు ఉండాలి. వీటితోపాటు ప్రోగ్రామింగ్ నాలెడ్జ్, క్వాంటిటేటివ్ అండ్ డేటా ఇంటర్‌ప్రెటేషన్ స్కిల్స్, చక్కటి కమ్యూనికేషన్ నైపుణ్యాలు, విభిన్న టెక్నాలజీలపై పట్టు అవసరం. ప్రోగ్రామింగ్‌పై పట్టు డేటా అనలిస్టులుగా పనిచేయాలంటే.. మొదట కొన్ని సాఫ్ట్వేర్ స్కిల్స్‌పై పట్టు పెంచుకోవాలి. ముఖ్యంగా ఎంచకున్న విభాగంలో ఏ పని చేస్తున్నారో అందుకు అవసరమైన టూల్స్‌పై శిక్షణ పొందాలి. సంబంధిత టూల్స్‌ను ముందుగానే నేర్చుకోవడం ద్వారా.. ‘ఆన్ ది జాబ్ ప్రాజెక్ట్’ను ఆత్మవిశ్వాసంతో పూర్తి చేయగలరు. డేటా అనలిస్ట్‌లకు ప్రధానంగా పైథాన్, సీ++, ఎస్‌క్యూల్, పెర్ల్, ఆర్, జావాస్క్రిప్ట్, హెచ్‌టీఎంఎల్ వంటి ప్రోగ్రామింగ్ స్కిల్స్ తెలిసుండాలి. అనలిస్ట్ కావడం ఎలా ► ఐటీ, కంప్యూటర్ సైన్స్, మ్యాథ«మెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్‌లో డిగ్రీ/పీజీ చేసినవారికి డేటా అనలిస్టు కెరీర్ అనుకూలంగా ఉంటుంది. ఆసక్తిని బట్టి సంబంధిత సర్టిఫికేషన్ కోర్సులు పూర్తి చేసినవారు ఎలాంటి నేపథ్యం నుంచి వచ్చినా ఈ విభాగంలో రాణించవచ్చు. ముఖ్యంగా డేటాపై ఇష్టం ఉండాలి. ఈ రంగం వేగంగా అభివృద్ధి చెందడంతోపాటు ఎప్పటికప్పుడు మార్పులకు లోనవుతోంది. కాబట్టి మార్పులకు అనుగుణంగా సరికొత్త టూల్స్‌ను నేర్చుకుంటూ,అప్డేట్గా ఉండాలి. ► ప్రస్తుతం చాలామంది సాఫ్ట్వేర్ నిపుణులు తమ కెరీర్‌ను మార్చుకునేందుకు అవసరాన్ని బట్టి ఆయా సర్టిఫికేషన్ కోర్సులు పూర్తి చేసి.. డేటా అనలిస్టులుగా రాణిస్తున్నారు. ఇందులో హడూప్ అండ్ స్పార్క్ బిగ్ డేటా ఫ్రేమ్ వర్క్స్‌ను కవర్ చేయడంతోపాటు రియల్ టైమ్ డేటా అండ్ ప్యారలల్ ప్రాసెసింగ్, ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అండ్ స్పార్క్ అప్లికేషన్స్ ఉంటాయి. వీటిల్లో పట్టు సాధించాలంటే.. మొదట అభ్యర్థులకు కోర్ జావా, పైథాన్, ఎస్‌క్యూఎల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌పై అవగాహన ఉండాలి. సర్టిఫైడ్ డేటా ఇంజనీర్ ప్రపంచ వ్యాప్తంగా డేటా అనలిస్టులకు డిమాండ్ పెరుగుతోంది. దాంతో చాలామంది సర్టిఫికెట్ కోర్సులు చేసి కెరీర్ ప్రారంభిస్తున్నారు. వాస్తవానికి డేటా అనలిటిక్స్‌లో రాణించాలంటే.. డేటాపై ఆసక్తితోపాటు ప్రోగ్రామింగ్ స్కిల్స్ నేర్చుకోవాలనే తపన ఉండాలి. ఐబీఎం లాంటి సంస్థలు సర్టిఫైడ్ బిగ్ డేటా ఇంజనీర్స్ కోసం ప్రత్యేకంగా మాస్టర్స్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నాయి. ఇందులో భాగంగా బిగ్‌డేటా అప్లికేషన్స్‌లో హడూప్తోపాటు మ్యాప్ డిప్, హైవ్, స్క్రూప్, ఫ్రేమ్ వర్క్, ఇంపాలా, పిగ్, హెచ్‌బేస్, స్పార్క్, హెచ్‌డీఎఫ్‌ఎస్, యార్న్, ఫ్లూమ్ వంటి వాటిపై అవగాహన కల్పిస్తారు. ఇలాంటి కోర్సులతోపాటు కొంత రియల్ టైమ్ అనుభవం పొందినవారు డేటా అనలిటిక్స్‌లో మెరుగైన అవకాశాలు అందుకునే వీలుంది. పెరుగుతున్న మార్కెట్ ప్రస్తుతం డేటా అనలిటిక్స్ అనేది చక్కటి కెరీర్‌గా మారింది. డేటా అనలిస్టులకు మంచి డిమాండ్ ఉంది. అలైడ్ మార్కెట్ రీసెర్చ్ ప్రకారం–డేటా అనలిటిక్స్ మార్కెట్.. 2021 చివరి నాటికి 84.6 బిలియన్ డాలర్లను చేరుతుందని అంచనా. ఇంటర్నేషనల్ డేటా కార్ప్ అండ్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ ప్రకారం–ప్రపంచవ్యాప్తంగా ఈ రంగం 2022 నాటికి 274.3 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఒక్క అమెరికాలోనే లక్షన్నర మంది డేటా అనలిస్టుల అవసరం ఉందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. మన దేశంలోనూ ప్రస్తుతం ఈ రంగంలో నిపుణుల కొరత ఉంది. కాబట్టి ఆయా నైపుణ్యాలు పెంచుకుంటే అవకాశాలు అందుకోవచ్చు. బిగ్ డేటా అనలిస్ట్ వేతనాలు ఏదైనా కెరీర్ ఎంచుకునే ముందు వేతనంతోపాటు భవిష్యత్ ఎలా ఉంటుందని ఆలోచిస్తారు. భవిష్యత్‌లోనూ డేటా అనలిస్ట్‌లకు చక్కటి అవకాశాలు ఉంటాయని నిపుణుల అంచనా. డేటా అనలిస్టులకు ఎంట్రీ లెవెల్లో సగటు వార్షిక వేతనం రూ.6.5 లక్షలుగా ఉంది. అనుభవం ఉన్నవారికి సుమారు రూ.10 లక్షల వరకు చెల్లిస్తున్నారు. -
Engineering Special: బీటెక్ తర్వాత.. కెరీర్ ఆప్షన్స్
ఇంటర్మీడియెట్(ఎంపీసీ) విద్యార్థుల కలల కోర్సు.. ఇంజనీరింగ్(బీటెక్/బీఈ). నేటి యువత క్రేజీ కెరీర్ ఇది. దేశవ్యాప్తంగా ఏటా లక్షల మంది ఇంజనీరింగ్‌లో చేరుతున్నారు. నాలుగేళ్ల ఇంజనీరింగ్ కోర్సు పూర్తయ్యాక ఏం చేయాలి?! అనే ప్రశ్న ఎదురవుతోంది. ఉద్యోగమా.. ఉన్నత విద్యా.. ఏ మార్గం ఎంచుకోవాలి.. వాస్తవానికి బీటెక్ ఉత్తీర్ణులైన విద్యార్థుల ముందు అనేక ఉన్నత విద్య, ఉద్యోగ మార్గాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు భవిష్యత్ గురించి ఆందోళన చెందకుండా.. తమ కెరీర్ లక్ష్యాలకు ఏది అనుకూలమో అది ఎంచుకోవడం మేలు అంటున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో.. బీటెక్ తర్వాత ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలపై ప్రత్యేక కథనం.. బీటెక్ పూర్తయ్యాక ఇంజనీరింగ్ కోర్ విభాగంలోనే కొనసాగాలనుకుంటే.. ఎంటెక్‌లో చేరొచ్చు. లేదా మేనేజ్మెంట్ వైపు వెళ్లాలనుకుంటే.. ఎంబీఏలో అడుగుపెట్టొచ్చు. ఇటీవల కాలంలో ఎంబీఏను ఎంచుకునే ఇంజనీరింగ్ అభ్యర్థుల సంఖ్య పెరుగుతోంది. మరికొందరు ప్రభుత్వ రంగ సంస్థల్లో(పీఎస్‌యూ) ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు. ఇంకొందరు సివిల్ సర్వీసెస్‌కు సన్నద్ధమవుతున్నారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ బీటెక్ కోర్సు పూర్తికాగానే ఉద్యోగంలో చేరాలనుకునే ఇంజనీరింగ్ విద్యార్థులకు వరం.. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్. నిజానికి ప్లేస్‌మెంట్స్ డ్రైవ్స్ ద్వారా ఉద్యోగం పొందడం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కు అందుబాటులో ఉన్న ఉత్తమ మార్గంగా చెప్పొచ్చు. ప్రముఖ కంపెనీలు, స్టార్టప్ సంస్థలు.. ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రతి ఏటా ప్లేస్‌మెంట్స్ డ్రైవ్స్ నిర్వహిస్తుంటాయి. ఈ ప్లేస్‌మెంట్స్ ప్రక్రియలో పాల్గొనాలనుకునే విద్యార్థులు అందుకోసం ముందుగానే కసరత్తు ప్రారంభించాలి. రిక్రూటర్లను ఆకట్టుకునేలా రెజ్యూమ్ని రూపొందించుకొని సిద్ధంగా ఉంచుకోవాలి. అలాగే బీటెక్ మొదటి ఏడాది నుంచే సబ్జెక్ట్‌ల్లో మంచి స్కోరు వచ్చేలా చూసుకోవాలి. అంతేకాకుండా కంపెనీల్లో ఇంటర్న్‌షిప్‌తోపాటు బీటెక్ ప్రాజెక్ట్ వర్క్‌పైనా పట్టు సాధించాలి. కాలేజీలో జరిగే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో పాల్పంచుకోవడం మేలు చేస్తుంది. ప్లేస్‌మెంట్స్ ప్రక్రియలో విజయం సాధించేందుకు సబ్జెక్టు నైపుణ్యాలతోపాటు, ప్రాక్టికల్ స్కిల్స్, మంచి కమ్యూనికేషన్, కంపెనీలు, మార్కెట్లు, తాజా టెక్నాలజీపై అవగాహన పెంచుకోవాలి. ఉన్నత విద్య.. ఎంటెక్/ఎంబీఏ ► ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఉన్నత చదువుల గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. స్వదేశంలో ఎంటెక్ లేదా విదేశాల్లో ఎంఎస్ చేయాలని ప్రణాళికలు వేసుకుంటారు. దేశలోని టాప్ కాలేజీల్లో ఎంటెక్‌లో చేరేందుకు చక్కటి మార్గం.. ‘గేట్’(గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్). బీటెక్ సబ్జెక్టులపై సమగ్ర అవగాహన, బేసిక్ కాన్సెప్ట్లపై గట్టి పట్టు, ప్రశ్నల ప్రాక్టీస్ ద్వారా గేట్లో మంచి ర్యాంకు సాధించొచ్చు. ► గత కొన్నేళ్లుగా ఇంజనీరింగ్ అభ్యర్థులు మేనేజ్మెంట్ కోర్సులను ఎంచుకుంటున్నారు. బీటెక్+ఎంబీఏ.. గొప్ప కెరీర్ కాంబినేషన్‌గా గుర్తింపు పొందింది. వీరికి కార్పొరేట్ సంస్థలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. అందుకే చాలామంది విద్యార్థులు బీటెక్ తర్వాత ఎంబీఏలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. టాప్ బిజినెస్ స్కూల్స్ ఐఐఎం(ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్)ల్లో పీజీ కోర్సుల్లో చేరాలంటే..క్యాట్(కామన్ ఆప్టిట్యూడ్ టెస్ట్)లో ప్రతిభ చూపాల్సి ఉంటుంది. క్యాట్‌తోపాటు మ్యాట్,సీమాట్, ఐసెట్, జీమ్యాట్ వంటి ఎంట్రెన్స్‌ల ద్వారా ఎంబీఏలో చేరేందుకు అవకాశం ఉంది. పీఎస్‌యూల్లో ఉద్యోగం బీటెక్ అభ్యర్థులకు మరో మంచి అవకాశం.. ప్రభుత్వ రంగ సంస్థల్లో(పీఎస్‌యూ) ఉద్యోగం. వీరు గేట్లో టాప్ ర్యాంకు ద్వారా సదరు పీఎస్‌యూలకు దరఖాస్తు చేసుకోవచ్చు. బీహెచ్ఈఎల్, హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్, నాల్కో, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఓఎన్జీసీ వంటి వాటిల్లో ఆకర్షణీయమైన వేతనాలతో ఉద్యోగం దక్కించుకోవచ్చు. గేట్ స్కోరుతో సంబంధం లేకుండా.. డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారా కూడా ప్రభుత్వ రంగ సంస్థల్లో కొలువు సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, ఎన్ఎండీసీ, బార్క్, ఇస్రో వంటి ప్రముఖ సంస్థల్లో ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఉద్యోగాలు లభిస్తాయి. సివిల్స్, ఈఎస్ఈ పరిపాలన విభాగంలో చేరాలనుకునే బీటెక్ అభ్యర్థులకు చక్కటి మార్గం.. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. ఇందుకోసం యూపీఎస్సీ ఏటా విడుదల చేసే నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలి. మూడంచెల సివిల్ సర్వీసెస్ ఎంపిక ప్రక్రియలో విజయం సాధించేందుకు సన్నద్ధమవ్వాలి. ఇది దేశంలో అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటి. అలాగే ఇంజనీరింగ్ అభ్యర్థుల కోసం యూపీఎస్సీ విడుదల చేసే మరో ప్రతిష్టాత్మక నోటిపికేషన్..ఈఎస్ఈ(ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్). దీని ద్వారా కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో గ్రూప్ ఏ స్థాయి పోస్టులు భర్తీ చేస్తారు. అలాగే యూపీఎస్సీ విడుదల చేసే మరో ఉన్నత నోటిఫికేషన్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్ఎస్)కు కూడా బీటెక్ అభ్యర్థులు పోటీ పడొచ్చు. దేశ సేవకు ‘డిఫెన్స్’ భారత సైన్యానికి అత్యంత నైపుణ్యం కలిగిన సాంకేతిక విభాగం ఉంది. దీంతో భారత సైన్యంలోని టెక్నికల్ వింగ్స్‌లో ఇంజనీర్లకు అవకాశాలు లభిస్తున్నాయి. టెక్నికల్ ఎంట్రీ లెవెల్‌తో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఆర్మీ/నేవీ/ఎయిర్‌ఫోర్స్‌ల్లో చేరొచ్చు. బీటెక్ తర్వాత యూనివర్సిటీ ఎంట్రీ స్కీమ్(యూఈఎస్), ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్(ఏఎఫ్ క్యాట్), షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్ఎస్సీ), కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్(సీడీఎస్ఈ) వంటి వాటి ద్వారా త్రివిధ దళాల్లో చేరొచ్చు. టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు(టీజీసీ)కు దరఖాస్తు చేసుకొని.. ఇండియన్ మిలటరీ అకాడమీలో చేరొచ్చు. రక్షణ దళాల్లో ఉద్యోగం అంటే.. అత్యంత గౌరవప్రదమైన కెరీర్స్‌లో ఒకటిగా చెప్పొచ్చు. ఇందులో చేరిన అభ్యర్థులకు మంచి వేతనం, ఉద్యోగ భద్రత, సౌకర్యాలతోపాటు దేశానికి సేవ చేస్తున్నామని సంతృప్తి సైతం లభిస్తుంది. ప్రైవేట్ రంగంలో కొలువు బీటెక్ ఉత్తీర్ణులకు ప్రపంచ వ్యాప్తంగా కార్పొరేట్ రంగంలో ఉద్యోగాలకు కొదవలేదు. నైపుణ్యాలుంటే.. ప్రభుత్వ రంగం కంటే ఎన్నో రెట్లు అధిక వేతనాలు కార్పొరేట్ కంపెనీల్లో లభిస్తున్నాయి. బీటెక్ గ్రాడ్యుయేట్లను ఇంజనీర్లుగానే కాకుండా.. పరిశోధకులుగా, కన్సల్టెంట్లుగా, సాఫ్ట్వేర్ డవలపర్లుగా నియమించుకుంటున్నారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ డెవలపర్, సివిల్/ఎలక్ట్రికల్ ఇంజనీర్, సిస్టమ్ అనలిస్ట్, ఐటీ కో ఆర్డినేటర్, అప్లికేషన్ డెవలపర్ వంటి జాబ్స్ ఐటీ రంగంలో దక్కించుకోవచ్చు. అలాగే క్వాలిటీ ఇంజనీర్, ప్రాసెస్ ఇంజనీర్, ఇండస్ట్రియల్ మేనేజర్, ప్లాంట్ ఇంజనీర్, క్వాలిటీ కంట్రోల్ టెక్నీషియన్ వంటి కొలువులు సైతం తయారీ రంగంలో సొంతం చేసుకోవచ్చు. సీ, సీ++, జావా, ఎస్‌క్యూఎల్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్, సాఫ్ట్వేర్ టెస్టింగ్, రోబోటిక్స్, నానో టెక్నాలజీ, నెట్వర్కింగ్, ఐవోటీ, బ్లాక్‌చైన్ టెక్నాలజీ, ఎంబెడెడ్ టెక్నాలజీ, డేటాసైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి నైపుణ్యాలు పెంచుకుంటే వివిధ విభాగాల్లో కొలువులు లభించే అవకాశం ఉంటుంది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇటీవల ఎక్కువ మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని, కొత్త ఆలోచనతో స్టార్టప్ స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నారు. విద్యార్థులు ప్రారంభించిన పలు స్టార్టప్స్ విజయవంతం కావడం.. ఇంజనీరింగ్ అభ్యర్థులకు ప్రేరణగా నిలుస్తోంది. కాని సొంత వ్యాపారం అనే మార్గంలో అనేక సవాళ్లు ఎదురవుతుంటాయి. వాటిని అధిగమించేందుకు ఎంతో ఓపిక, సహనం అవసరం!! -
ఇంజనీరింగ్ కోర్సులకు ఏఐసీటీఈ కొత్త నిబంధన
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్ కాలేజీల్లో వివిధ కోర్సులకు అనుమతులపై అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) నిబంధనలను కఠినతరం చేసింది. ఈ మేరకు 2021–22 విద్యా సంవత్సరానికి కాలేజీలు, కొత్త కోర్సులకు సంబంధించిన నిబంధనల హ్యాండ్‌బుక్‌లో పలు అంశాలు పొందుపరిచింది. ఇంజనీరింగ్ కాలేజీల్లోని వివిధ కోర్సుల్లో ఏఐసీటీఈ అనుమతించిన ఇన్‌టేక్ (మొత్తం) సీట్లలో 50 శాతానికి మించి విద్యార్థుల చేరికలు ఉంటేనే కొత్త కోర్సులకు అనుమతి ఇవ్వనున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ఎక్కువ డిమాండ్ ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటా సైన్స్ వంటి కోర్సులను ఆయా సంస్థల్లో తగిన సదుపాయాలు, ఇతర వనరులు ఉంటేనే అనుమతిస్తారు. ఈ కోర్సులను ప్రవేశపెట్టాలంటే ఈ సదుపాయాలతోపాటు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్బీఏ) గుర్తింపు ఉండాలని ఏఐసీటీఈ నిబంధన విధించింది. ఎలాంటి సదుపాయాలు కల్పించకుండా ఆషామాషీగా కోర్సులకు అనుమతులు తీసుకొని అడ్మిషన్లు నిర్వహిస్తున్న కాలేజీల వల్ల ప్రమాణాలు దిగజారిపోతుండడంతో ఈసారి అనుమతుల విషయంలో పలు మార్పులు చేసింది. దీని ప్రకారం.. ► ఆర్కిటెక్చర్ కోర్సుల నిర్వహణకు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనుమతి తప్పనిసరి. అలాగే ఫార్మసీ కోర్సులకు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతి తప్పనిసరి. ► ప్రైవేటు కాలేజీల తనిఖీ కోసం వసూలు చేసే టీఈఆర్ చార్జీల నుంచి ప్రభుత్వ ఆర్థిక సాయంతో నడిచే సంస్థలకు మినహాయింపు ఉంటుంది. ఇతర సంస్థలు ఒక దఫాకు రూ.లక్ష చెల్లించాలి. గతంలో ఇది రూ.2 లక్షలుగా ఉండేది. ► డిప్లొమా స్థాయి కోర్సులను డిగ్రీ స్థాయి కోర్సులుగా మార్చుకునేందుకు అవకాశం. ► ప్రస్తుత ఇంజనీరింగ్ టెక్నాలజీ కాలేజీల్లో కొత్త ప్రోగ్రాములకు మల్టీ డిసిప్లినరీ విభాగాల్లో మాత్రమే అనుమతిస్తారు. ► విద్యార్థులు, బోధన సిబ్బంది అంతర్గత బదలాయింపులను అనుమతించరు. ఒకే మాతృ సంస్థ పరిధిలోని సంస్థల విలీనమైతే మాత్రం అక్కడి మౌలిక సదుపాయాలు, ఇతర అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ బదలాయింపును అనుమతిస్తారు. ► విదేశీ విద్యార్థులు, ప్రవాస భారతీయులు, గల్ఫ్ దేశాల్లోని భారతీయ కార్మికుల పిల్లల కోసం సూపర్ న్యూమరరీ సీట్లను అనుమతిస్తారు. ► ప్రాంతీయ భాషల్లో నిర్వహించే సంప్రదాయ ఇంజనీరింగ్ కోర్సుల ఇన్‌టేక్‌ను పెంచుకునేందుకు అవకాశం. ► సంబంధిత విద్యాసంస్థలో మొత్తం ఇన్‌టేక్ సీట్ల (2019–20)లో 50 శాతానికి పైగా భర్తీ అయితే కొత్త కోర్సులకు అనుమతి. ► విదేశీ యూనివర్సిటీలు, విద్యాసంస్థలతో కలిసి ట్విన్నింగ్ తదితర ప్రోగ్రామ్స్ నిర్వహించాలంటే క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో ఆ సంస్థలు టాప్ 500ల్లో ఉండాలి. దేశంలోని సంస్థలు నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) ర్యాంకింగ్‌లో టాప్ 100లో ఉండాలి. అంతేకాకుండా ఎన్బీఏ అక్రిడిటేషన్ కలిగి ఉండాలి. ఆంధ్రప్రదేశ్‌లో ముందు నుంచే ఉన్నత విద్య ప్రవేశాల్లో సంస్కరణలు కాగా.. రాష్ట్రంలో విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నత విద్యా సంస్థల్లో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పేలా తొలి నుంచి అనేక చర్యలు చేపట్టారు. ఉన్నత విద్యా పర్యవేక్షణ నియంత్రణ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఉన్నత విద్యామండలిని మరింత పటిష్టపరిచారు. ప్రమాణాలు లేని, పూర్తి చేరికలు లేక తూతూమంత్రంగా నిర్వహించే కాలేజీలను గుర్తించి.. వారికి లోపాలను సవరించుకునేందుకు ఉన్నత విద్యామండలి కొంత సమయం ఇచ్చింది. లోపాలు సరిదిద్దుకోని వాటిలో ప్రవేశాలను నిలిపేసింది. ఇంజనీరింగ్, ఫార్మసీ, డీఫార్మా కోర్సుల్లో జీరో అడ్మిషన్లున్న 53 కాలేజీలకు, నిర్ణీత రుసుములు చెల్లించని 82 కాలేజీలకు 2020–21 విద్యాసంవత్సరం అడ్మిషన్లను ఆపేసింది. అలాగే నాన్ ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించి ప్రమాణాలు పాటించని కాలేజీలపైనా చర్యలు తీసుకుంది. జీరో నుంచి 25 శాతంలోపు అడ్మిషన్లున్న 48 కాలేజీల అనుమతులను ఉపసంహరించారు. కొన్నిటిలో కోర్సుల అనుమతులను రద్దు చేశారు. చదవండి: మతి చెడగొడుతున్న సెల్‌ఫోన్ ఏపీ: ప్రకాశం జిల్లాలో 34 బ్యాక్లాగ్ ఖాళీలు -
ఇంజనీరింగ్‌లో కొత్త కోర్సులు
టెక్నాలజీ పరంగా విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయి. ఇది అది అనే తేడా లేకుండా.. అన్ని రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇందులో భాగంగానే విద్యా రంగంలోనూ మార్పులు వస్తున్నాయి. దేశంలో ఇంజనీరింగ్ విద్యను పర్యవేక్షించే.. ఆల్ ఇండియా కౌన్సెల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ).. బీటెక్ స్థాయిలో సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్, బ్లాక్‌చైన్ టెక్నాలజీ,ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కొత్త కోర్సులను ప్రవేశపెట్టింది. ఆ వివరాలు... ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ రకాల పరిశ్రమలు..మానవ వనరులను తగ్గించుకునేందుకు ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ను ఆయా రంగాల్లో ప్రవేశ పెడుతున్నాయి. ఇవే కాకుండా వ్యాపార అభివృద్ధి సులభతరం చేసుకునే విధంగా డేటాసైన్స్ వంటి టెక్నాలజీ కూడా అందుబాటులోకి వస్తోంది. ఇలాంటి తరుణంలో ఆయా రంగాల్లో సరిపడ సంఖ్యలో సమర్థవం తమైన నిపుణులు ఉన్నారా.. అంటే లేరనే చెప్పాలి. ఈ కొరతను అధిగమించడానికి గత కొంతకాలంగా ఆన్లైన్ మార్గాల ద్వారా ఏఐ,డేటాసైన్స్ లాంటి కోర్సులో పలు అవసరాలకు అనుగుణంగా శిక్షణన అందిస్తున్నాయి. తాజాగా ఆల్ ఇండియా కౌన్సెల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) ఇంజనీరింగ్ విద్యలో ఇలాంటి నూతన కోర్సులను ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చింది. తెలుగు రాష్టాల్లోనూ పలు కాలేజీల్లో బీటెక్ స్థాయిలో ఈ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. డేటా సైన్స్ నైపుణ్యం కలిగిన డేటా సైంటిస్టులను తయారు చేయడానికి ఇంజనీరింగ్ విద్యలో డేటాసైన్స్ కోర్సును అందుబాటులోకి తీసుకువచ్చారు. రంగం ఏదైనా.. జరగబోయే పరిణామాలను ముందే అంచనా వేసి.. కచ్చితత్వంతో కూడిన సమాచారాన్ని అందించేదే.. డేటాసైన్స్. విద్య, వైద్యం, వ్యాపార, సామాజిక ఆర్థిక, రాజకీయం.. ఇలా రంగం ఏదైనా గతంలో ఎదుర్కొన్న ఒడిదుడుకుల సమాచారాన్ని తెలుసుకొని.. భవిష్యత్తులో ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తే.. ఆయా రంగాల్లో విజయం సా«ధించడానికి వీలుంటుందో ఖచ్చితంగా అంచనా వేసి చెప్పే వారే.. డేటా సైంటిస్టులు. డేటా విశ్లేషణ: డేటాసైన్స్.. గణాంక సహిత సమాచారాన్ని విశ్లేషించడానికి ఉపయోగించే సాధనం. అల్గారిథం, మెషిన్‌లెర్నింగ్ సిద్ధాంతాలను ఉపయోగించి.. వ్యాపారానికి సంబంధించిన వస్తువులు ఏ సంవత్సరంలో ఎంత మొత్తంలో అమ్మకాలు జరిగా యి. ఆ సమయంలో డిమాండ్ –సప్లయ్ ఏ విధంగా ఉంది. ప్రస్తుతం అంత డిమాండ్ ఎందుకు లేదు. ఆయా వస్తువులపై వినియోగదారుల అభిప్రాయం ఏంటి? కొనుగోలు శక్తిలో వచ్చిన మార్పులు ఏంటి?!వంటివి అంచనా వేసి చెబుతారు. గతంలో ఉన్న డిమాండ్‌ను ప్రస్తుత డిమాండ్‌తో పోల్చి విశ్లేషించి..రానున్న కాలంలో ఎంత డిమాండ్ ఉండవచ్చు..ఆ సమయానికి వినియోగ దారులకు అందుబాటులో ఉంచాల్సిన ప్రొడక్ట్స్ సంఖ్యతో సహా కచ్చితమైన లెక్కలతో వివరిస్తారు డేటా నిపుణులు. కోర్సు స్వరూపం: డేటాసైన్స్ కోర్సు వ్యవధి నాలుగేళ్లు. ఎనిమిది సెమిస్టర్లుగా ఉంటుంది. ఈ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు.. డేటావిజువలైజర్స్, డేటాసైన్స్ కన్సల్టెంట్, డేటా ఆర్కిటెక్చర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్, డేటా ఇంజనీరింగ్ సహా వివిధ రకాల ఉద్యోగాలు పొందవచ్చు. వేతనాలు: డేటాసైన్స్ వి«భాగంలో ఉద్యోగాలు దక్కించుకున్న వారికి వార్షిక వేతనం దాదాపు రూ.5లక్షల వరకు ఉంటుంది. నైపుణ్యాలు,అనుభవం ఆధారంగా వేతనం పెరిగే అవకాశం ఉంటుంది. సైబర్ సెక్యూరిటీ నేటి డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ వినియోగం తప్పనిసరిగా మారింది. ప్రభుత్వ/ప్రైవేట్, వ్యాపార సంస్థలు సహా ప్రతీ రంగంలో లావాదేవీలన్నీ ఇంటర్నెట్ ఆధారంగానే జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయా లావాదేవీలు, సంబంధిత సమాచార భద్రత అనేది చాలా క్లిష్టంగా మారింది. ఇటువంటి విలువైన సమాచారాన్ని భద్రపరచడానికి రక్షణ కవచంగా వచ్చిందే..సైబర్ సెక్యూరిటీ. కోర్సు స్వరూపం: ఇంజనీరింగ్‌కు సంబంధించి సైబర్ సెక్యూరిటీ నాలుగేళ్ల కోర్సు. డేటా స్ట్రక్చర్, డిజిటల్ ప్రిన్సిపుల్స్, సిస్టమ్ డిజైన్, జావా ప్రోగ్రామింగ్, సిస్టమ్ సాఫ్ట్వేర్, అల్గారిథంలను రూపొందించడం వంటివి ఈ కోర్సులో భాగంగా నేర్చుకుంటారు. జాబ్ ప్రొఫైల్: ఈ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు సెక్యూరిటీ అనలిస్ట్, సెక్యూరిటీ ఆర్కిటెక్ట్, సెక్యూరిటీ సాఫ్ట్వేర్ డెవలపర్, క్రిప్టానలిస్ట్, సెక్యూరిటీ ఇంజనీర్ వంటి విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే టీసీఎస్, ఇన్ఫోసిస్, గూగుల్, ఫేస్బుక్, అమెజాన్, వంటి సంస్థల్లో ఉద్యోగావకాశాలు పొందే వీలుంటుంది. వేతనాలు : సంస్థను బట్టి సైబర్ సెక్యూరిటీ నిపుణులకు వార్షిక వేతనం రూ.8 లక్షల వరకు లభిస్తుంది. బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇంజనీరింగ్‌లో కొత్తగా ప్రవేశ పెట్టిన మరో కోర్సు.. బ్లాక్‌చైన్ టెక్నాలజీ. సైబర్ నేరాలను ఆరిక ట్టడానికి ఆయా వ్యవస్థలపై పనిచేసే నిపుణులు ఎప్పటికప్పడు నూతన పరిజ్ఞానాన్ని అందుబా టులోకి తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా వచ్చిందే బ్లాక్‌చైన్ టెక్నాలజీ. ఆర్థికపరమైన లావాదేవీలల్లో పారదర్శకతను పెంచేవిధంగా ఈ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు. ఆన్లైన్ ఆధారంగా జరుగుతున్న ఆర్థిక కార్యకలాపాలను సురక్షితంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు బ్లాక్‌చైన్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. రానున్న కాలంలో బ్లాక్ చైన్ టెక్నాలజీలో భారీ సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే: బ్లాక్‌చైన్ టెక్నాలజీ అనేది ఒక పట్టిష్టమైన సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ. వ్యక్తులు, వ్యవస్థల మధ్య జరిగే ఆర్థిక సహ ఇతర కార్యకలాపాల సమాచారానికి కట్టుదిట్టమైన భద్రను కల్పించే రక్షణ కవచం ఇది. ఎంతటి సైబర్ హ్యాకర్లైనా దొంగలించేందుకు వీలులేకుం డా ఉండే డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్ ఇది. దీని ద్వారా ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న సర్వర్లలో సమాచారం నిక్షిప్తం చేసి.. ఇతరులు దానిని దొంగిలించకుండా భద్రత కల్పిస్తారు. కోర్సు స్వరూపం: ఇంజనీరింగ్‌లో బ్లాక్‌చైన్ టెక్నాలజీ కోర్సు వ్యవధి నాలుగేళ్లుగా ఉంటుంది. కోర్సులో భాగంగా బ్లాక్చైన్టెక్నాలజీ, క్రిప్టో కరెన్సీ, బ్లాక్‌చైన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లపై లోతైన అవగాహన కల్పిస్తారు. అలాగే సాలిడిటీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ క్లౌడ్ ప్లాట్‌ఫాం,ఎథెరియం,బిట్ కాయిన్ క్రిప్టోకరెన్సీల గురించి అవగాహన కలిగించే విధంగా కోర్సు ఉంటుంది. జాబ్ ప్రొఫైల్: ఈ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు బ్లాక్‌చైన్ డెవలపర్, బ్లాక్‌చైన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, బ్లాక్‌చైన్ ఎస్ఐ పార్టనర్ డెవలప్మెంట్ మేనేజర్, బిట్‌కాయిన్ క్రిప్టోకరెన్సీ డెవలపర్, బ్లాక్‌చైన్ ప్రిన్సిçపల్ ప్రోగ్రామ్ మేనేజర్, బిజినెస్ అనలిటిక్స్ అసోసియేట్ వంటి ఉద్యోగాలు లభిస్తాయి. ఉద్యోగాలు: ఈ కోర్సు పూర్తిచేసిన వారు ఐబీఎం, మైక్రోసాఫ్ట్, యాక్సెంచర్, వీసా వంటి సంస్థల్లో ఉద్యోగావకాశాలు పొందవచ్చు. వేతనాలు: బ్లాక్‌చైన్ నిపుణులకు ప్రారంభంలో వార్షిక వేతనం రూ.5 లక్షల వరకు ఉంటుంది. అనుభవం, నైపుణ్యం ఆధారంగా ఆకర్షణీయ వేతనాలు లభిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక రంగంలో ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్. మానవ ఆలోచనలకు అనుగుణంగా కంప్యూటర్ ఆధారిత యంత్ర వ్యవస్థ పనిచేసేలా చేయడమే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల్లో ఇప్పుడు ఏఐ పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ఏఐలో స్పీచ్ రికగ్నిషన్, విజువల్ పర్సెప్షన్, లాజిక్ అండ్ డెసిషన్, మల్టీ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ లాంటి చాలా అంశాలుంటాయి. రోబోటిక్స్లోను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానం కీలకం. కోర్సు స్వరూపం: ఇంజనీరింగ్‌లో నాలుగేళ్ల బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (ఏఐ, మెషిన్ లెర్నింగ్) ఉంటుంది. ఈ కోర్సు లో భాగంగా విద్యార్థులకు కంప్యూటర్ లాంగ్వేజ్‌లను నేర్పిస్తారు. జావా, ప్రొలాగ్, లిస్ప్, పైథాన్ వంటి కోర్సులు ఇందులో నేర్చుకోవచ్చు. జాబ్ ప్రొఫైల్ : ఈ కోర్సును పూర్తిచేసిన అభ్య ర్థులకు డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్, డేటా ఇంజనీర్, ప్రిన్సిపుల్ డేటాసైంటిస్ట్, కంప్యూటర్ విజన్ ఇంజనీర్లుగా అవకాశాలు లభిస్తాయి. వేతనాలు : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగా లు పొందిన వారికి వార్షిక వేతనం రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉంటుంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని ఒక కుగ్రామంగా మార్చేసిన ఘనత ఇంటర్నెట్కు దక్కుతుంది. సమాచార వ్యవస్థలో వచ్చిన విప్లవాత్మ కతకు ముఖ్య కారణం ఇంటర్నెట్ అనడంలో సందేహం లేదు. దీని విస్తృతి మరింత పెరిగి.. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ) తెరపైకి వచ్చింది. ప్రస్తుతం డిమాండ్ ఉన్న కోర్సులో ఐఓటీ కూడా ఒకటి. ఐఓటీ అంటే: భవిష్యత్తులో ప్రపంచం మొత్తం ఒక స్మార్ట్ నగరం గా మారడానికి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ) ఉపయోగపడు తుంది. మనుషుల జీవితాలను మరింత సుఖమయం చేయడా నికి ఇది తోడ్పడుతుంది. మనుçషుల మాదిరిగానే యంత్రాలు, యంత్ర పరికరాలు అన్ని ఇంటర్నెట్ ఆధారంగా అనుసంధా నంగా ఉండి.. ఒక నెట్‌వర్క్‌గా ఏర్పడి పనిచేయడాన్ని ఇంటర్నెట్ ఆఫ్ «థింగ్స్ అంటారు. అంటే.. మనుషులు తమలో తాము ఎలాగైతే ఒకరితో ఒకరు మాట్లాడుకొని పనులు చేస్తారో.. యంత్రాలు కూడా ఒక దానితో ఒకటి సమాచార మార్పిడి చేసుకొని పనిచేస్తాయి. ప్రతి వస్తువు ఇంటర్నెట్తో అనుసం« దానంగా ఉండి.. వివిధ రకాల కార్యకలాపాలను కచ్చితమైన సమయంలో సమర్థవంతంగా పూర్తిచేస్తాయి. కోర్సు స్వరూపం: ఇంజనీరింగ్ స్థాయిలో నాలుగేళ్ల బీటెక్ ఇన్ ఐఓటీ అండ్ అప్లికేషన్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. జాబ్ ప్రొఫైల్: ఇంజనీరింగ్‌లో ఐఓటీ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు ఐఓటీ ఇంజనీర్, ఐఓటీ యాప్ డెవలపర్, ఐఓటీ సొల్యూషన్ ఆర్కిటెక్ట్, సిటిజన్ ఐఓటీ సైంటిస్ట్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్, ఐఓటీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్లుగా విధులు నిర్వహిస్తారు. బిజినెస్ అనలిటిక్స్ ఒకప్పుడు వ్యాపార సంస్థల మధ్య పోటీ తక్కువగా ఉండేది. కొన్ని సంస్థల గుత్తాధిపత్యం కొనసాగేది. కానీ ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేదు. ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ నేపథ్యంలో.. వ్యాపార సంస్థల మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది. దీంతో ఆయా వ్యాపారాలను లాభాల బాటలో తీసుకేళ్లేందుకు అందరూ బిజినెస్ అనలిటిక్స్ సహాయం తీసుకుంటున్నారు. అందుకే ప్రస్తుతం బడా కంపెనీల నుంచి చిన్న కంపెనీల వరకూ.. లక్షల్లో జీతాలు ఇచ్చి బిజినెస్ అనలిటిక్స్ నిపుణులను నియమించుకుంటున్నాయి. దీంతో బిజినెస్ అనలిటిక్స్‌కు బాగా డిమాండ్ ఏర్పడింది. పని తీరు మదింపు: స్టాటిస్టికల్, క్వాంటిటేటివ్, టెక్నికల్ çపరిజ్ఞానాన్ని ఉపయోగించి అందుబాటులో ఉన్న సమాచారాన్ని వివిధ రకాల పద్దతుల ద్వారా విశ్లేషించి.. ఒక కంపెనీ లేదా వ్యాపార సంస్థ పని తీరును మదించడమే బిజినెస్ అనలిటిక్స్. ఆయా సంస్థల వ్యాపారవృద్ధికి అవసరమైన ప్రణాళికలను రూపొందించేందుకు బిజినెస్ అనలిటిక్స్ ఉపయోగపడుతుంది. కోర్సు స్వరూపం: ఈ కోర్సులో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాలనకునే వారు బీటెక్ బిగ్ డేటా అనలిటిక్స్ కోర్సు చేయాల్సి ఉంటుంది. నాలుగేళ్ల ఈ కోర్సులో డేటా మైనింగ్, డేటా వేర్‌హౌసింగ్, డేటా విజువలైజేషన్ అధ్యయనం చేస్తారు. ఈ కోర్సు కూడా డేటా సైన్స్‌కు అనుబంధంగా ఉంటుంది. జాబ్ ప్రొఫైల్ : ఈ కోర్సును పూర్తిచేసిన విద్యార్థులు బిజినెస్ అనలిటిక్స్‌గా కెరీర్‌ను ప్రారంభించవచ్చు. వేతనాలు: బిజినెస్ అనలిటిక్స్ నిపుణులకు నైపుణ్యాలను బట్టి వార్షిక వేతనం రూ.ఆరు లక్షల నుంచి రూ.పది లక్షల వరకూ లభిస్తుంది. బయో మెడికల్ ఇంజనీరింగ్ బయోమెడికల్ ఇంజనీంగ్ ప్రస్తుతం ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తి చూపుతున్న కోర్సులో ఒకటి. ఆరోగ్య రంగానికి సాంకేతిక తోడ్పాటు అందించేందుకు ఈ విభాగం కృషి చేస్తోంది. బయోమెడికల్ ఇంజనీరింగ్ విభాగం ప్రధానంగా రోగ నిర్ధారణకు సంబంధించి ఉపయోగించే పరికరాలను తయారు చేస్తుంది. అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు రోగ నిర్ధారణ కోసం చేసే సిటీ స్కాన్, ఎంఆర్ఐలతో పాటు రోగా నిర్ధారణ పరిక్షల కోసం ఉపయోగించే ఇతర పరికరాలను తయారు చేసే వారే బయో మెడికల్ ఇంజనీర్లు. ఈ పరికరాలను తయారు చేయడానికి ఇంజనీరింగ్ పరిజ్ఞానం ఒక్కటే సరిపోదు. బయాలజీ, ఇంజనీరింగ్.. ఈ రెండింటిపై అవగాహన ఉండాలి. అందుకే ఈ రెండింటిని కలిపి ఉమ్మడిగా బయో మెడికల్ ఇంజనీరింగ్ కోర్సును రూపొందించారు. కోర్సు స్వరూపం: బయాలజీ, మెడిసిన్లకు సాంకేతికతను అన్వయించి మెడికల్ ఎక్విప్ మెంట్‌ను తయారు చేసేదే.. బయోమె డికల్ ఇంజనీరింగ్. నాణ్యమైన పరికరాలను తక్కువ ధరల్లో తయారు చేసేందు కు కృషి చేస్తారు. ఇది రానున్న కాలంలో మంచి డిమాండ్ ఉన్న రంగంగా మారుతుందని నిపుణుల అంచనా. జాబ్ ప్రొఫైల్: ఈ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు బయోమెడికల్ టెక్నిషియన్, బయో మెడికల్ ఇంజనీర్, బయో కెమిస్ట్‌గా విధులు నిర్వర్తిస్తారు. ఉద్యోగాలు: మెడికల్ కంపెనీలు, హాస్పిటల్స్, ఇన్స్ట్రుమెంట్ మ్యానుఫ్యా క్చరర్స్, డయాగ్నోస్టిక్ సెంటర్స్, ఇన్‌స్టాలెషన్ యూనిట్లల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వేతనాలు: ఈ రంగంలో ఉద్యోగాలు చేసే వారికి నెలకు రూ.30వేల నుంచి రూ.50వేల వరకు వేతనంగా లభిస్తుంది. అనుభవాన్ని బట్టి వేతనం పెరుగుతుంది. -
బీఎస్సీ డేటా సైన్స్
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా డిగ్రీలో పలు కొత్త కోర్సులు, కొత్త కాంబినేషన్లను ప్రవేశ పెట్టేందుకు ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టింది. ఈ విద్యా సంవత్సరం నుంచే వీటిని అందుబాటులోకి తేనుంది. ప్రస్తుతం విద్యారంగంలో అత్యధిక డిమాండ్ ఉన్న డేటా సైన్స్‌ను బీఎస్సీ డేటా సైన్స్ పేరుతో డిగ్రీ కాలేజీల్లో ప్రవేశపెట్టేందుకు ఉన్నత విద్యామండలి సన్నాహాలు చేస్తోంది. యూనివర్సిటీ ల్లోని కంప్యూటర్ సైన్స్, మ్యాథమేటిక్స్, స్టాటిస్టిక్స్ విభాగాలతోపాటు టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి పారిశ్రామిక రంగాలకు చెందిన నిఫుణుల సహకారంతో కోర్సు సిలబస్‌కు డిజైన్ చేసింది. టాప్ కోర్సు బీఎస్సీ డేటా సైన్స్ మార్కెట్లో పరిస్థితులు, ప్రస్తుత డిమాండ్‌కు అనుగుణంగా రూపుదిద్దుకున్న బీఎస్సీ డేటా సైన్స్ కోర్సును రాష్ట్రంలోని 80 ప్రైవేటు కాలేజీల్లో నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి అనుమతి ఇచ్చింది. కొన్ని కాలేజీల్లో ఒక సెక్షన్‌కు, ఇంకొన్ని కాలేజీల్లో రెండు మూడు సెక్షన్లకు అనుమతిచ్చింది. ఇక 26 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోనూ ఈ కోర్సు నిర్వహణకు కళాశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఒక్కో కాలేజీలో 60 సీట్లు ఉండనున్నాయి. హైదరాబాద్ బేగంపేటలోని ఉమెన్స్ డిగ్రీ కాలేజీ, ఖైరతాబాద్ డిగ్రీ కాలేజీ, సిటీ కాలేజీ, గద్వాలలోని మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ (కోఎడ్యుకేషన్), బాన్స్వాడ, కామారెడ్డి, ఎస్ఆర్ఆర్ కరీంనగర్, జీడీసీ (ఉమెన్) కరీంనగర్, ఎస్ఆర్బీజీఎన్ఆర్ ఖమ్మం, ఎమ్వీఎస్ మహబూబ్‌నగర్, ఎన్టీఆర్ (ఉమెన్) మహబూబ్‌నగర్, నారాయణపేట, కూకట్పల్లి, నాగార్జున కాలేజీ– నల్లగొండ, గిరిరాజ్ కాలేజీ–నిజమాబాద్, హయత్‌నగర్, సంగారెడ్డి, సిద్దిపేట, గజ్వేల్ (ఉమెన్), కేడీసీ హన్మకొండ, పింగలి ఉమెన్స్ కాలేజీ– హన్మకొండల్లో ఈ కోర్సును ప్రవేశ పెడుతోంది. వేటికవే విలక్షణం.. ఈ కోర్సులు ► బీకాం బిజినెస్ అనలటిక్స్ కోర్సును 24 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశపెట్టనున్నారు. ► బీకాం టాక్సేషన్ కోర్సు 27 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అందుబాటులోకి రానుంది. వీటిలో ఆదిలాబాద్, భద్రాచలం డిగ్రీ కాలేజీలున్నాయి. ► బీకాం ఫారిన్ ట్రేడ్ కోర్సును హైదరాబాద్‌లోని సిటీ కాలేజీ, బేగంపేట ఉమెన్స్ కాలేజీ, ఖైరతాబాద్ డిగ్రీ కాలేజీల్లో అందుబాటులోకి రానుంది. ►మొదటిసారి బీఏ మ్యాథమేటిక్స్‌ను ప్రవేశపెడుతున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఉపయోగపడేలా ఆర్ట్స్ కాంబినేషన్స్‌తో రూపుదిద్దిన ఈ కోర్సును ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశపెట్టేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. మ్యాథ్స్, హిస్టరీ, ఎకనమిక్స్ కాంబినేషన్‌తో పాటు పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్టుల కాంబినేషన్లతో ఈ కోర్సు రూపుదిద్దుకుంది. ► జమ్మికుంట డిగ్రీ కాలేజీలో మాత్రమే ఉన్న బీఏ ఆఫీస్ మేనేజ్మెంట్ కోర్సును తాజాగా 21 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశపెట్టనున్నారు. కమ్యూనికేటివ్ ఇంగ్లిష్, ఆఫీస్ మేనేజ్మెంట్, కంప్యూటర్ ఎడ్యుకేషన్‌తో కాంబినేషన్‌తో ఈ కోర్సును తీసుకువస్తున్నారు. ► ప్రస్తుతం ఇంటర్మీడియట్లో వొకేషనల్ కోర్సులు చదివిన విద్యార్థులకు మరిన్ని అవకాశాలు పెంచేలా బీఎస్సీ డెయిరీ సైన్స్, బీఎస్సీ అగ్రికల్చర్ క్రాప్ ప్రొడక్షన్ వంటి కోర్సులను కొత్తగా ప్రవేశపెడుతున్నారు. ► జువాలజీ, కెమిస్ట్రీ, డెయిరీ సైన్స్ కాంబినేషన్‌తో డెయిరీ సైన్స్, క్రాప్‌ప్రొడక్షన్, బోటనీ, కెమిస్ట్రీతో కాంబినేషన్‌తో బీఎస్సీ అగ్రికల్చర్ క్రాప్ ప్రొడక్షన్ కోర్సును తీసుకువస్తున్నారు. ►ఒకటీ రెండు కాలేజీలకే పరిమితమైన సెరీకల్చర్, ఫిషరీస్ వంటి కోర్సులను ఈసారి మరిన్ని కాలేజీలకు విస్తరించనున్నారు. -
ఇకపై ఆన్లైన్లో బీఎస్సీ డేటా సైన్స్ కోర్సు
చెన్నై: ప్రపంచ వ్యాప్తంగా డేటా సైన్స్‌కు రోజు రోజుకు ప్రాధాన్యత పెరుగుతుతోంది. 2026 నాటికి ఈ రంగంలో దాదాపు 11.5 మిలియన్ల ఉద్యోగాలు లభ్యమవుతాయని అంచన. దానిని దృష్టిలో పెట్టుకొని డేటాసైన్స్‌లో ఆన్లైన్ ద్వారా సమగ్రమైన ఒక డిగ్రీని అందించే కార్యక్రమానికి ఐఐటీ మద్రాస్ శ్రీకారం చుట్టింది. ప్రపంచంలో మొదటిసారి ప్రోగ్రామింగ్ అండ్ డేటాసైన్స్‌లో ఆన్లైన్ బీఎస్సీకోర్సును మంగళవారం కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి రమేష్ పొక్రియల్ నిశాంక్ ప్రారంభించారు. ఈ ఆన్లైన్ కోర్సును ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మద్రాస్ (ఐఐటీ, మద్రాస్) అందిస్తోంది. 12వ తరగతి పాస్ అయ్యి, 10వ తరగతిలో ఇంగ్లీష్, మ్యాథ్స్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. (ఐఐటీ–మద్రాస్ నెంబర్ 1) ఈ కోర్సును మూడు స్టేజ్లలో అందించనున్నారు. ఫౌండేషన్ ప్రోగ్రాం, డిప్లమా ప్రోగ్రాం, డిగ్రీ ప్రోగ్రాం. అయితే ఏ స్టేజ్‌లో కావాలన్నా కోర్సును మధ్యలో ఆపేయవచ్చు. దానికి సంబంధించిన సర్టిఫికేట్‌ను కూడా ఐఐటీ మద్రాస్ నుంచి పొందవచ్చు. (తాగునీటి శుద్ధికి జనుము + రాగి!) ఆసక్తి, అర్హత ఉన్న విద్యార్థులు క్వాలిఫయింగ్ పరీక్షను రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్ష అఫ్లికేషన్ ఫీజు రూ. 3000 ఉంటుంది. వారికి నాలుగు వారాల పాటు మ్యాథ్స్, ఇంగ్లీష్, స్టాటిస్టిక్స్, కంప్యూటేషనల్ థింకింగ్‌లో కోర్సు ఉంటుంది. వీరికి ఆన్లైన్లో విద్యాబోధన అందిస్తారు. వీరు ఆన్లైన్లో ఎసైన్మెంట్స్, నాలుగో వారం చివరిలో క్వాలిఫయింగ్ పరీక్షను రాయాల్సి ఉంటుంది. పరిమిత సంఖ్యలో సీట్లు ఉండటంతో 50శాతం పైగా ఉత్తీర్ణత సాధించిన వారిని ఈ ఫౌండేషన్ కోర్సుకు అర్హులుగా ఎంపిక చేస్తారు. (ప్రపంచం భారత్ వైపు చూస్తోంది!) -
‘ఐటీలో ఉద్యోగానికి ఈ కోర్సులు నేర్చుకోండి’
ముంబై: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాలపై పడింది. ముఖ్యంగా ఐటీ ప్రాజెక్టులు అధికంగా లభించే అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలలో వైరస్ విజృంభణ పతాక స్థాయికి చేరడంతో కొత్త ప్రాజెక్టులు లేక కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ప్రస్తుతం క్లౌడ్ కంప్యూటింగ్, డైటా సైన్స్ లాంటి కోర్సులకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ఉద్యోగాలు కోల్పోయిన వారికి క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్ తదితర కోర్సులను జాబ్ కన్సెల్టెన్సీలు ఆఫర్ చేస్తున్నాయి. అత్యాధునిక టెక్నాలజీలకు శిక్షణ ఇచ్చే జిగ్సా అకాడమీ సీఈఓ వోహ్రా స్పందిస్తూ.. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో కూడా వైవిధ్యమైన కోర్సుల్లో నైపుణ్యం పొందిన వారికి ఉద్యోగాలలో డోకా ఉండదని తెలిపారు. మరోవైపు టెక్నాలజీలకు పేరు పొందిన యుడెమీ సీఈఓ ఇర్విన్ ఆనంద్ స్పందిస్తూ.. వెబ్ డెవలప్మెంట్, డేటా సైన్స్ కోర్సులలో 60శాతంనుంచి 58శాతం వృద్ధి నమోదైందని పేర్కొన్నారు. కాగా లాక్డౌన్ వల్ల వీడియా లెర్నింగ్‌కు అధిక ప్రాధాన్యత పెరిగిందని స్ప్రింగ్ సీఈఓ రవి కాక్లసరి తెలిపారు. మరోవైపు సైబర్ సెక్యూరిటీ, కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటలిజన్స్) తదితర కోర్సులకు విపరీతమైన డిమాండ్ ఉందని సీనియర్ రీసెర్చ్ డైరెక్టర్ డీ.డీ మిశ్రా అభిప్రాయపడ్డారు.(చదవండి: కంపెనీ పెట్టండి..రాయితీ పట్టండి) -
హైదరాబాద్‌లో డేటా సైన్స్ కేంద్రం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐటీ రంగంలో దూసుకెళ్తున్న భాగ్యనగరి మరో రికార్డు నమోదు చేయబోతోంది. డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో పరిశోధన, ఆవిష్కరణలకై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు ముందడుగు పడింది. మంగళవారం ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం, నాస్కామ్ భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఇక్కడి హెచ్ఐసీసీలో జరుగుతున్న నాస్కామ్ ఇండియా లీడర్షిప్ ఫోరం–2018లో భాగంగా తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కె.తారక రామారావు సమక్షంలో నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్.చంద్రశేఖర్, ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం, నాస్కామ్ సంయుక్తంగా ఈ సెంటర్‌కు తొలుత రూ.40 కోట్లు వ్యయం చేస్తాయి. ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో తాత్కాలికంగా సెంటర్ ఏర్పాటు చేస్తారు. హైదరాబాద్ సమీపంలోని బుద్వేల్ వద్ద రానున్న ప్రతిపాదిత డేటా అనలిటిక్స్ పార్క్‌లో శాశ్వత కేంద్రాన్ని నెలకొల్పుతారు. లక్షన్నర మందికి: డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం భారత్‌లో 2025 నాటికి రూ.1,00,800 కోట్లు నమోదు చేయనుంది. 1,50,000 మందికి కొత్తగా ఉపాధి లభిస్తుందని కె.తారక రామారావు వెల్లడించారు. భవిష్యత్‌ను మార్చనున్న ఎనిమిది రకాల టెక్నాలజీల్లో డేటా సైన్స్, ఏఐ ఉన్నాయని చంద్రశేఖర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఐటీ పాలసీలో భాగంగా ప్రోత్సహించనున్న 10 విభాగాల్లో ఈ రెండు కూడా చోటు దక్కించుకున్నాయని జయేశ్ రంజన్ చెప్పారు. -
టెక్కీలు ఇవిచేస్తే.. 50 శాతం ఎక్కువ జీతం
బెంగళూరు : టెక్ ఇండస్ట్రీలో ఓ వైపు నుంచి ట్రంప్ షాక్ లు.. మరోవైపు ఆటోమేషన్ ముప్పు అసలు ఉద్యోగాలు వస్తాయో ఊడతాయో అర్థంకాని పరిస్థితుల్లో ఉద్యోగులు సతమతమవుతున్నారు. కానీ కొన్ని స్కిల్స్ ను నేర్చుకున్న టెక్కీలకు ఇండస్ట్రీలో భారీగా డిమాండ్ ఉంటుందట. డేటా విజులైజేషన్, డేటా సైన్సు, మిషన్ లెర్నింగ్ ప్రస్తుతం అత్యంత విలువైన టెక్నాలజీ రిక్రూటర్లుగా ఉన్నాయని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. ఇటీవల కాలంలో డిజిటల్ డేటా ఎక్కువగా జనరేట్ అవుతున్న క్రమంలో ఈ స్కిల్స్ నేర్చుకున్న టెక్నాలజీ నిపుణులకు డిమాండ్ ఏర్పడుతుందని తెలుస్తోంది. చాలామంది వర్కింగ్ ప్రొఫిషనల్స్ కూడా ఈ స్పెషల్ కోర్సులను నేర్చుకుంటున్నారని తెలిసింది. ఈ కోర్సులు పూర్తి చేసిన వారికి 20 శాతం నుంచి 50 శాతం మధ్యలో వేతనాల పెంపు కూడా ఉంటుందని ఆన్ లైన్ లెర్నింగ్ ప్లాట్ ఫామ్ సింప్లిలెర్న్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ కౌసిక్ దలాల్ చెప్పారు. గత మూడేళ్లుగా బిగ్ డేటా, అనాలిటిక్స్ కోర్సులకు మంచి వృద్ధి నమోదవుతుందని పేర్కొన్నారు. డేటా సైన్సు కూడా ఎక్కడా తగ్గకుండా పాపులర్ చెందుతుందని తెలిపారు. గత ఆరునెలలుగా మిషన్ లెర్నింగ్, విజులైజేషన్ టూల్స్ కోర్సులు అత్యంత ఆకర్షణీయమైనవిగా ఉన్నాయని చెప్పారు. 25 శాతం సింప్లిలెర్న్ అప్లికెంట్లు మిషన్ లెర్నింగ్ ను ఎంపికచేసుకున్నారని వెల్లడించారు. కాగ ఈ కోర్సుల వ్యవధి 4 నుంచి 9 నెలలు. మొత్తం ఈ కోర్సులకు అయ్యే ఖర్చు ఒక్కో మోడ్యుల్ బట్టి రూ.25వేల రూపాయల నుంచి 60 వేల రూపాయల వరకు ఉంటుందని తెలిసింది.